[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
కాశీలో అన్నదానము
[dropcap]అ[/dropcap]క్షయమైన కాశీ
అక్షయపాత్ర కాశీ
అన్నపూర్ణ నిలయమై
సతతము పూర్ణమై భాసించునది కాశీ.
“భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ”
అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా భావించారు మన పూర్వ ఋషులు, పెద్దలు. అన్నము గురించి తైతిరీయోపనిషత్ ఎంతో వివరించింది. ఆనందవల్లిలోని ఆ శాంతి మంత్రము ఇలా సాగుతుంది:
“అన్నా ద్వై ప్రజాః ప్రజాయన్తే। యాః కాశ్చ పృథివీగ్ం శ్రితాః। అథో అన్నే నైవ జీవన్తి। అథైనదసి యన్త్యన్తతః। అన్నగ్ం హి భూతానాం జ్యేష్ఠమ్। తస్మా థ్సర్వౌషధ ముచ్యతే। సర్వం వైతేఽన్న మాప్నువన్తి। యేఽన్నం బ్రహ్మోపాసతే। అన్నగ్ం హి భూతానాం జ్యేష్ఠం। తస్మాథ్ససర్వౌషధ ముచ్యతే।”
వివరణ: అన్నము నుంచి ప్రజలు పుడుతున్నారు. అంతేకాదు ఈ పృథివిని ఆశ్రయించినవన్నీ అన్నము నుంచే పుడుతున్నాయి. అన్నముచే జీవించి అన్నము నందే లీనమగును. అందుకే సకల ప్రాణులకు అన్నము ఔషదము వంటిది. ఈ విధముగా అన్న బ్రహ్మమును ఉపాసించువారు అన్న జాతమును పొందుదురు. అన్నము అన్ని భూతము(ప్రాణు) లకన్నా శ్రేష్ఠము. జ్యేష్ఠము.
ప్రజ అనగా చక్కగా పుట్టినది అని అర్థము. సృష్టి ప్రక్రియలో వేరు. ప్రజా సంసర్గము వేరు. (Creation and Production are two different things) భౌతిక పదార్థముల అవసరము ప్రజాసంసర్గములో కావలెను. స్థావర, జంగమాత్మమగు ప్రజా సమూహము పూర్తిగా ద్రవ్యాత్మకమైనది. సూక్ష్మము నుండి స్థూలమునకు జరుగు ప్రక్రియలో చివరి స్థితి పృథ్వీ తత్త్వమే. అంటే అన్నమయకోశమునకు సంబంధించినది. అందుకే పుట్టుట, పెరుగుట చివరకు లీనమగుటా అన్నము లోనికే అని తెలుసుకోవాలి.
అందుకే అన్ని దానాలలో అన్నదానము పరమోత్తమమైనది. ఎందుకంటే మానవులను జీవించి వుంచేది ఆహారము. ఆహారము మనిషికి ప్రాణం నిలుపునది. అన్నమంటే ప్రాణమే. అన్నదానమంటే ప్రాణదానమే. ఆ విధంగా అన్నదానము ఉత్తమమైనది.
కాశీ వంటి పుణ్యధామములో సాక్షాత్తూ జగన్మాత ‘అన్నపూర్ణేశ్వరి’గా వెలసి మనకు భిక్షగా అన్నము, ప్రాణము ఇచ్చే నగరములో, మనము చేసే పనికి ఎన్నో రెట్ల ఫలితము వుంటుంది. అన్నదానానికి కూడా ఫలితము పదింతలై మనకు చేరుతుందని చెబుతారు పూజ్యులు. అందుకే కాశీలో అన్నదానము తప్పక చెయ్యాలంటారు.
కాశీలో మనము చేసిన అన్నదాన ఫలము మనకు మోక్షదాయకమని ప్రవచనకారులు కూడా చెబుతారు.
ఎలాంటి దానమైనా తీసుకున్న వారు తృప్తితో ‘చాలు, చాల’నరు కానీ, అన్నదానానికి మాత్రం “ఇక చాలు” అంటారు. కడుపు నిండాక తృప్తిగా దీవిస్తారు.
మనము చేసే అన్నదానము భక్తుల రూపములో సాక్షాత్త్ ఆ పరమశివుడే స్వీకరిస్తాడు. అలా కాశీఖండములో వివరించబడింది కూడా.
భిక్షువై కాశీ పురవీధులలో స్వామి తిరుగుతాడని, ముక్కోటి దేవతలు, దేవగణాలు, ఋషులు మధ్యహ్నం కాశీ క్షేత్రంలో భిక్షకొస్తారని పురాణాలు చెబుతున్నాయి. మరి అటు వంటి చోట్ల మనము అన్నదానము చేసి మన కాశీ యాత్రను పరిపుష్ఠి చేసుకోవాలి.
కాశీలో అన్నదానము దేవాలయాలలో, సత్రాలలో అంతటా చేస్తూ వుంటారు.
అన్నదానము విశ్వనాథుని దేవాలయంలో చెయ్యవచ్చు. అన్నపూర్ణా మాత ఆలయములో కూడా చెయ్యవచ్చు. మన తెలుగు ఆశ్రమాలలో చెయ్యవచ్చు.
అన్నపూర్ణ మాతా ఆలయములో చేస్తే మనలను కూడా భోజనానికి రమ్మంటారు. మనము కుదిరితే అక్కడి ఉచిత భోజనము అమ్మ ప్రసాదముగా స్వీకరించగలిగితే బావుంటుంది. వారి వద్ద “శాశ్వత భోజన పథకము, ఒక్కరోజు భోజనము” వంటి పథకాలు వున్నాయి. మన వీలును బట్టి మనము అన్నదానము అన్నపూర్ణ దేవాలయములో చెయ్యవచ్చు.
కాశీలో కనీసము ఒక్కరికైనా భోజనము పెట్టమని శాస్త్రంలో చెబుతారు.
విశ్వనాథుని దేవాలయములో ఒక ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమం వుంది. అది “సాదుసంత్ భోజనము”.
మధ్యాహ్నం దాదాపు వంటి గంటకు ప్రతిరోజూ స్వామికి నివేదన వుంటుంది. ఆ నివేదన తరువాత గర్భగుడి ప్రక్కగా వున్న హాల్లో వరుసగా కూర్చున్న సాధువులకు ఆ ప్రసాదము పంచుతారు. కాశీలో వున్న సాధువులలో ఈ సంతర్పణకు కాశీ విశ్వనాథ పీఠానికి చెందిన వారు ఎక్కవగా వుంటారు. దేవాలయాలలో స్వామికి హారతులప్పుడు ఒక ప్రక్కగా కూర్చునే సాధు మహారాజ్ కూడా కాశీ పీఠానికి చెందిన వారే.
వీరందరికీ మహాదేవునకు సమర్పించిన నివేదనను పెడతారు. భక్తులు ఈ నివేదనను స్పాన్సర్ చెయ్యవచ్చు. అలా చేసిన వారికి కూడా ప్రసాదము ఇస్తారు. వారు ఈ సాధువులకు కొంత దక్షణ ఇచ్చి నమస్కరించటము నేను కూడా చూశాను. దేవాలయము వారి ఆఫీసులో వివరాలు అడిగి, నేనూ రెండుసార్లు ఈ సంతర్పణకు కట్టాను. కాని ఒక్క సారి మాత్రము ప్రత్యక్షంగా వెళ్ళగలిగాను. మరొకసారికి నా ఆరోగ్యం బాగులేక వెళ్ళలేక పోయాను.
తెలుగువారి ఆశ్రమాలలో కూడా అన్నదానం ఘనంగా జరుగుతుంది. మనము అక్కడ అన్నదానానికి డబ్బు కట్టవచ్చు. శాశ్వత అన్నదానమునకు కట్టగలిగితే మనకు వారు వసతి కలిపిస్తారు. మనము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి కాశీలో పది రోజులు వుండటానికి వీలవుతుంది. ఆంధ్ర ఆశ్రమములో కొంత పైకము నే మునుపు కట్టాను. నే కట్టినది శాశ్వత ఆన్నదానము కాదు కాబట్టి నాకు ఆంధ్రాశ్రమములో వుండే వీలు కలగలేదు. ఎవ్వరైనా, ఎక్కడ వున్నా ఆంధ్రాశ్రమము వెళ్ళి ఉచితముగా భోజనము చేసి రావచ్చు. అలా నాకు తెలిసిన వారు ఎంతో మంది చేశారు కూడా. అందుకే దాతలు కాశీ క్షేత్రంలో అన్నదానమునకు ఎక్కువగా కడతారు. కాశీ వంటి పుణ్యధామాలకు భక్తులు ఉత్తమమైన మనసుతో వస్తారు. మోక్షకాములై వుంటారు కాబట్టి, అటు వంటి వారికి అన్నదానం చేస్తే మనకు ఫలమధికమే కదా!!
నే వున్న వసతిలో కూడా వారు అన్నదానము చేసేవారు. కాని అది అక్కడ వున్న వారికే. బయటవారు వచ్చింది లేదు.
మొత్తానికి అన్నపూర్ణ మాత నిలయమైన కాశీ మహాక్షేత్రంలో అన్నము దానము చెయ్యటము కూడా మన పూర్వ జన్మల అదృష్టము. మనమున్న చోటు నుంచే ఈ పని చేసే వీలు నేటి రోజులలో ఇంటరునెట్ వల్ల కలుగుతోంది. మనము మన ఇంటి వద్ద నుంచే ఆ దానము చేసి ఫలము పొందవచ్చు.
(సశేషం)