కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 35

0
2

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

[dropcap]ఒ[/dropcap]క నగరాన్ని ఎలా దర్శించాలో, దర్శనీయ ప్రదేశాలు ఏమిటో, మనము పరిపూర్ణంగా వాటిని చూడాలంటే కేవలము నడక ద్వారానే తెలుస్తుంది, నిజము. నడక ద్వారా ఆ ప్రదేశాల చరిత్రను కూలంకుషంగా పరిశీలించ వచ్చు. నెమ్మదిగా నడుస్తూ అన్ని గమనిస్తూ మనం ఆ నగరం విషయాలు తెలుసుకోవచ్చును.

మనము వెతికితే ఇలాంటి నడక టూరులు ప్రతి నగరములో కనపడుతాయి. కాశీ నగరములో కూడా వున్నాయి. వీటి మూలముగా మనకు సందుల గురించి, చరిత్ర గురించి కూలంకుషంగా తెలుస్తుంది. అలా నేను కాశీ నగరములో ఫుడ్‌ టూరు తీసుకున్నా. ఈ టూరు ఎక్కువగా విదేశీయులు తీసుకుంటారు.

ఆ నగరానికి ప్రత్యేకమైన రుచులను మనకు పరిచయం చేస్తారు ఆ టూర్‌లో. కాశీ నగరములో ఆహారపు అలవాట్లు నాకు కొంత వింతగా తోచాయి. అందుకే నేను ఫుడ్‌ టూరు తీసుకున్నాను. అందు వల్ల అక్కడి రుచులను చూసే అవకాశము కలుగుతుంది.

ఉదయమే మనము బ్రేక్‌ఫాస్టుగా ఏ ఇడ్లీనో, దోశనో తింటాము. లేదా బ్రెడ్‌ టోస్టు, రెండు పళ్ళు తింటాము. కాశీలో మాత్రము ఉదయమే చాటు రగడాలూ, జిలేబీలు తింటారు. ఉదయమే స్వీటు, లేదా చాట్ తినటము వారికి సామాన్యమైన విషయము.

అక్కడ సందులలో ఉదయమే వేడి వేడి జిలేబీలు మంచి రుచికరమైనవి దొరుకుతాయి.

ఉదయమే ఇచ్చే టీ మనకు మట్టి కప్పులలో ఇస్తారు. ఆ మట్టి కప్పుల టీ మనము త్రాగాక పడెయ్యటమే. “మంచి హైజీను” అనిపిస్తుంది చూస్తే.

అలాగే చాట్‌ కూడా చిన్న విస్తరాకుల దొన్నెలో ఇస్తారు. మనము తిని వాటిని చెత్తబుట్ట పాలు చెయ్యటమే.

జిలేబీ తిని, చాటు రగడా తిని ఉదయము కార్యక్రమము ప్రారంభించటమే.

కాశీ మిఠాయిలు ముధురాతి మధురమని పేరు. కాశీ మిఠాయి తిన్నవాడు తిననివాడు ఏడుస్తాడని సామెత. “తిన్నవాడు మళ్ళీ ఎప్పుడు తింటామో అని, తినని వాడు ఎప్పుడు తింటామో” అని.  కాశీలో పాలతో చేసే కోవా వంటి (మలై  అంటారు) పదార్థము ప్రసిద్ధి. వారణాసిలో మనము తప్పక ప్రయత్నించ వలసినవి ఈ  “మలై”. పాలను కాచి, వచ్చిన మీగడతో చేసే పదార్థం. పరమ మధురముగా వుంటుందది. దానిలో  బాదాము, పిస్తా, లేదా కుంకుమపువ్వు వంటి వివిధ సుగంధ ద్రవ్యాలతో కలిపి వుంచుతారు. చల్లబరిచి, మనకు మట్టి కప్పులలో ఇస్తారు. దాహం తీరుతుంది కూడా. చాలా రుచికరమైన ఆ మలై గంగ వడ్డున రామ్‌నగర్‌లో అతి మధురమైనది దొరుకుతుంది. దశాశ్వమేథ్ ఘాటు వెడుతుంటే కూడా మంచి మలై దొరుకుతుంది. కాశీ చాట్ బండారులో కొన్ని చాట్ పదార్థాలు కూడా చాలా పేరు పొందినవి. ఆ రెండస్తుల చిన్నచాట్ బండారులో సాయంత్రమయ్యేసరికి నిలబడటానికి కూడా మనకు జాగా దొరకదు. అంత జనాలతో నిండి వుంటుంది. అక్కడ వున్న ఆ ఐదుగురు రోజుకు డెభై వేల రూపాయల వ్యాపారము చేస్తారుట. అంత బిజీగా వున్నా రుచిలో ఎంత మాత్రం తేడా లేకుండా ఉత్తమమైన పదార్థాలను అందిస్తారు. కాబట్టి ఆ చాటు బండారు అంత హడావిడిగా వుంటుంది. దానికి ఎదురుగా వున్న మలై అమ్మే దుకాణములో మనకు రకరకాల మలై లు దొరుకుతాయి. మొత్తం వారు అరవై రకాల మలైలు అమ్ముతారు.

వారణాసిలో వున్న లోకల్ రెస్టారెంట్లలో తప్పక చూడవలసినది “భాటీ చోఖా రెస్టారెంటు”. ఆ రెస్టారెంటు వెడితే మనకు మరో లోకము వెళ్ళినట్లుగా వుంటుంది. మట్టి గోడలకు తెల్లని రంగు వేసి, గోడలకు పల్లెలలో కనపడే డిజన్లతో పల్లెల్లో ఇళ్ళను గుర్తు చేస్తాయి. పెద్ద గాడి పొయ్యి, ప్రక్కనే తిరగలి మొదలైనవి. లోపల టేబుళ్ళ మీద విస్తళ్ళు, చిన్న మట్టి కుండలలో నీరు. చాటలో మెనూ. వారి భోజనము భాటీ, పప్పు. మొదట భాటీ – పప్పు అక్కడే తిన్నాను.

భోజనము తరువాత కాశీ వాసులకు పాను/తాంబూలము తప్పనిసరి. తాంబూలము లేకపోతే వారి భోజనము పూర్తికాదు. అసలు పాన్ తినటానికి వారికి సమయమంటూ వుండదు. ఏ సమయమైనా సరియైన సమయమే.

అసలు ఉదయము మూడు గంటలకు విశ్వనాథునికి ఇచ్చే హారతిలో స్వామికి పెరుగన్నము, పాను నివేదిస్తారు. ఆ పాను మనము అడిగితే మనకు ఇస్తారు. ఎన్ని పానులు మరి నివేదిస్తారో తెలీదు. నేను ఉదయపు హారతికి నాలుగైదుసార్లు వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు రుద్రాక్షలు స్వామికి సమర్పిస్తున్నవి, మనము వారిని అడిగితే  మనకు అదృష్టముంటే దొరుకుతాయి. ఆ రుద్రాక్షలిచ్చే పూజారే నేను అడిగితే స్వామికి నివేదించిన ‘పాను’ ఇచ్చారు. అలా పాను తినే అలవాటు లేని నాకు ఉదయము నాలుగు గంటలకు పరకడుపున పరమశివుని ఉచ్ఛిష్ఠముగా  ఆ తాంబులము తినే భాగ్యము కలిగింది.

మీర్‌ఘాటు నుంచి పైకి వస్తే వున్న దుకాణాల మధ్య వున్న పాను షాపులో ఉత్తమమైన పాను దొరుకుతుంది.

మనకు దక్షణ భారతీయ దోశలు అక్కడక్కడ దొరుకుతాయి. మంచి భోజనము కొరకు మాత్రము మీకు ఆందధ్రాశ్రమము వెళ్ళవలసినదే.

మీర్‌ఘాటులో వున్న చిన్న రెస్టారెంటు, హోటల్- గణపతి రెస్టారంటు. అక్కడ రూపుటాపు లో కూర్చుంటే చక్కటి పరోటా, పెరుగు, టీ దొరుకుతాయి. మనము ఒక పుస్తకము చేత పట్టుకు కూర్చొని చదువుతూ, గంగ పై నుంచి వచ్చే చల్లని గాలిని అనుభవిస్తూ విశాంత్రి పొందవచ్చు.

ఇలా వారణాసిలో ఆహార అలవాట్లు కూడా నాకు వింతగా తోచాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here