[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]
“సాండ్, సీడీ, సన్నాసీ
ఉస్‌సీ బచోసే రహీ హై కాశీ”
[dropcap]ఆం[/dropcap]బోతులను, మెట్లను సన్యాసులను తప్పించుకు తిరిగే శక్తి వుంటేనే కాశీలో నినసించు అని అర్థము.
వారణాసిలో వున్న సందులు ఎంతో కంగారు పుట్టిస్తాయి. దానికి తోడు ఇంతకు మునుపు ఆ సందులలో ఆవులు తెగ తిరిగేవిట. అందుకే ఇలా చెప్పేవారు. ప్రస్తుతము ఆవులు అంత లేవు. మెట్లు మాత్రము శిఖరముగా కనపడుతూ కంగారు పుట్టిస్తాయి. వాటికి మనము ముందుగా సిద్ధమవ్వాలి. చూడవలసిన పుణ్యధామాలు అంతటా, కాని ప్రతీ దానికి ఎన్నో మెట్లు ఎక్కటము దిగటములా వుంటుంది. కాశీలో సన్యాసులు చాలా అలకరించుకొని మనము ఇంటర్‌నెట్‌లో చూచే పోటోలలా వుంటారు. కాని డబ్బు చాలా ఆశిస్తారు. వంద లోపు ఇస్తే తీసుకోరు, మనలను వదలరు.
కాశీ పట్టణమున దేశీయభాష యందు, తినుబండారాలందు, సంగీతములో, మనుష్యుల వేషమందు చాలా మాధుర్యముంటుంది.
వారణాసి హింది కూడా చాలా స్పష్టమైనదని పేరుంది. అక్కడ సంగీతము కూడా ఉత్తమమైనదిగా పేరుంది. ప్రపంచ ప్రసిద్ద షెహనాయి విద్వాంసులైన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ వారణాసి నగరము వారే. ఆయనను ఎక్కడికి రమ్మన్నా గంగానదిని, విశ్వనాథుని తెస్తే తాను వస్తానని చెప్పేవారుట.
పండిట్ రవిశంకర్, విదుషి గిరిజాదేవి, పండిట్ జోతిక్ భట్టాచార్య, కిషన్ మహారాజ్ వంటి మహానీయులంతా బెనారస్ నుంచి వచ్చి హిందుస్తానీ సంగీతాన్ని పరిపుష్ఠి చేశారు.
కాశీ మహానగరము అపరకర్మలు చెయ్యటానికి కూడా పేరుపడింది. మోక్షప్రదాయిని కాబట్టి వారణాసికి వచ్చి పెద్దలకు పిండప్రదానాలు చెయ్యటము అన్నది అనాదిగా వున్న సంప్రదాయము. మీర్ ఘాటులో ఒక తెలుగువారి భవనము వుంది. అక్కడ ప్రతిరోజూ ఇలా వచ్చి పిండప్రదానము చేసి, అన్నదానము చేసే సౌకర్యాలు వున్నాయి. ఇవి తెలుగు బ్రాహ్మలు నడిపేవి. తెలుగువారు అక్కడే వారి కార్యక్రమాలు చెయ్యటము నేను గమనించాను.
కాశీ నగరము భారతీయ ఆధ్యాత్మికతకే కాక లౌకిక సంపదకు కూడా ప్రసిద్ధి. కాశీ విశ్వనాథుని మందిరము అనేకసార్లు ధ్వంసం అయి తిరిగి కట్టబడింది. ఆ రకంగా భారతీయ ధర్మానికి, హైందవజాతికి ఆ మందిరము చిహ్నంగా నిలబడింది. భారతీయ ధర్మం అతి సనాతనమైనది. ఎంతో పురాతనమైన ధర్మమిది. ఎన్నో మార్లు తాకిడికి గురైనా, తాత్కాలికంగా దెబ్బ తగిలినా, కొన్నాళ్ళకు ఉజ్జీవితమై మరింత తలెత్తుకు తిరుగుతుంది.
కాశీ అద్వైత, వైష్ణవ, సౌర, గాణాపత్య, కపాలికా సాధకులకే కాక, జైన, బౌద్ధ, సిక్కు, జొరాష్ట్రియులకూ చాలా ప్రత్యేకమైనది. అన్ని రకాల హిందువులకూ కాశీ ఒక గమ్యం, తుది మజిలి. జైన తీర్థంకరులలో 11వ తీర్థంకరుడు, 23వ తీర్థంకరుడు కాశీలోనే జన్మించారు. బుద్ధుని జాతక కథలలో కాశీ నగర ప్రస్థావన చాలా వుంటుంది. సారనాథ్ లోనే బౌద్ధము మొదలైయినది. కాశీ ఇలా ఏ విధంగా చూచినా ప్రథాన కేంద్రం.
కాశీ నగరములో వింతలకు లెక్క వుండదు. పూర్వకాలము నుంచి విద్యా కేంద్రం. మహాపండితులకు నిలయము కాశీ. పూర్వము కాశీ నుంచి విద్య నేర్చుకు వచ్చారంటే వారికి బ్రహ్మరథం పట్టేవారు. తెలుగువారు ఎందరో కాశీ చదువుకై వెళ్ళి అక్కడే స్థిరపడినవారు కోకొల్లలు.
కాశీ యాత్ర చెయ్యటమన్నది కూడా అనాదిగా తెలుగువారికున్న ఉత్తమైన లక్ష్యాలలో ఒకటిగా వున్నది. కాశీ నగరము అన్ని రకాలవారికీ వారు కోరినవిచ్చే నెలవు, కల్పతరువు. మోక్షకాముల నుంచి వింతలు చూడ వచ్చే విదేశీయుల వరకూ కాశీ మహానగరము గమ్యం.
ప్రతి సనాతనవాదికి అంతిమ లక్ష్యం. మోక్షప్రదాయిని నమ్మి నడిపిస్తున్న జగదంబ కృప వలన నాకు లభించిన వరమీ నగర ప్రవేశము, నెల రోజల నగరవాసము.
నా సాధనలో భాగముగా నేను కార్తీకమాస పుణ్య దినాలలో ఈ నగరములో వుండటమన్నది కేవలము దివ్యజనని అనుగ్రహము, అంది వచ్చిన వరము. నాకు తెలిసినవీ, తెలుసుకున్నవీ, చూచినవీ, విన్నవీ ఇలా పంచుకొమ్మని నాకు మిత్రులు, హితులు శ్రీ మురళీకృష్ణగారు ఇచ్చిన సదవకాశము. మాంసనేత్రాలకు కనపడని, మనోనేత్రాలకు గోచరమయ్యే పరమశివుడు మిత్రులైన మురళీకృష్ణగారి రూపములో రాయించిన దివ్య అనుభవాల కదంబమీ యాత్రానుభవము. ఇది జగదంబ అనుగ్రహము. కాశీలో నివసించటము ఎంతటి ఆనందకరమో, ఆ అనుభవాలను రాస్తూ, తిరిగి అక్కడ మరల మరల ఊహలలో నివసించటము మరింత సంతోషకరము. దీనికి బాహ్యముగా మురళీగారికి, అంతరముగా పరమాత్మకు సదా కృతజ్ఞతలు. మనఃపూర్వక వందనములు.
ఽఽస్వస్తిఽఽ