కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-4

0
2

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

ద్వాదశ ఆదిత్యులు

[dropcap]ప్ర[/dropcap]తీవారు ఒక్కసారైనా దర్శించాలని కలలు కనే ఈ కాశీ మహాపట్టణములో ఏముంది?

ఇక్కడ గంగ ఉత్తర ముఖంగా ప్రవహిస్తుంది. ఉత్తర ముఖమంటే, మనము గంగకు ఎదురుగా వుంటే దక్షిణామూర్తికి ఎదురుగా వున్నట్లు.

దక్షిణామూర్తి దక్షిణము వైపు ముఖము చేసి వుంటాడు కదా. మనము ఉత్తర ముఖముతో వున్నామంటే, జ్ఞానానికి మొదటి మెట్టు. అంతర్ముఖంగా అవటానికి చేసే ప్రయత్నము, తొలి ప్రస్థానము కాశీ. సాధనకు సాఫల్యామిచ్చే మహాదేవుడు కరుణించే ప్రదేశము కాశీ పురమే.

హిందువులు పూర్వ ఋషులను అనుసరించినందున లభించిన వరము కాశీ. ఋషులు తపస్సు చేసి ఈ శక్తివంతమైన పట్టణాన్ని మానవజాతికి అందించారు.

ఈ నగరము ఒక మహా శక్తి కూటమి. కాశీలో ప్రతి చోటూ విపరీతమైన శక్తిని విరజిమ్ముతూ వుంటుంది. ఇక్కడ చేసే జపం, తపము, దానము ఫలితము మెండు. సిద్ధి త్వరగా లభిస్తుంది.

కాశీ నగరము ఒక జ్ఞాన భాండాగారము. కాశీ లోని శక్తి కేంద్రాలపై దేవాలయాలు ప్రతిష్ఠించారు పూర్వులు. ఆ దేవాలయాలలో నేటికి చేసే ధ్యానము వెంటనే ఫలిస్తుంది. ఆ దేవాలయాలన్నీ ప్రకటితమైనవి కావు. అందులో కొన్ని గుప్తమైనవి కూడా. ఆ గుప్తదేవాలయాలలో కొన్ని ద్వాదశ ఆదిత్యుల దేవాలయాలు. ఈ ఆలయాలలో ఒక్కో ఆలయము ఒక్కో రాశికి సంబంధించినది. సూర్యుడు ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ ఆలయము విపరీతమైన కాస్మిక్‌ ఎనర్జీతో నిండి వుంటుంది. ఆ ఆలయాలను దర్శించి అక్కడ గనుక మనము ధ్యానము చేస్తే ఫలితము అద్భుతంగా వుంటుంది.

ఈ సంగతి కాశీ ఖండములో కూడా వివరించారు. ఇదే విషయాన్ని రెండు సంవత్సరాలు పరిశోధించిన కొలరాడోకు చెందిన అమెరికా శాస్త్రవేత్త ఆధారాల సహితముగా ఒక రిపోర్టు కూడా ప్రచురించారు. ఈ రహస్య సూర్య దేవాయాల గురించి ‘శ్రీ నండూరి శ్రీనివాసు’ యూట్యాబు వీడియోలో చూసి ఆ ప్రదేశాలు చూడాలన్నది మా అక్క.

మా కాశీ యాత్రలో తను వున్నది మూడు రోజులే కాబట్టి మూడవ రోజు వాటిని చూద్దామని అనుకున్నాము. ఇక్కడ ఇంటరు నెట్‌ లేదు. ఇండియా ఫోనులో రాదు. కొద్దిగా కుస్తీ పడి ఆయన వీడియోలో మ్యాపు మాత్రం ఫోటో తీసుకున్నాము. ఇంక ఎలా వెళ్ళగలమో తెలియదు. అవి అన్నీ వేరు వేరు చోట్ల వున్నాయి. కొన్నింటికి ఆటో వెళ్ళదు. నడవాలి. కొన్నింటికి బోటులో వెళ్ళాలి. వీటన్నిటి మీద మా వద్ద సరిఅయిన దారి చూపే పటము కూడా లేదు. అందుకే ఒక (అడ్వెంచర్స్) సాహస యాత్రలా సాగింది ఈ ఆలయాల సందర్శన.

ఒక ఆటో అతనికి ఆ పేర్లు చదివితే ముందుగా ‘లోలార్క ఆదిత్యు’నుది ప్రక్కనే అని అక్కడికి పట్టుకువెళ్ళాడు. కాశీలో ఆదిత్యుని దేవాలయమంటే ఇక్కడికే పట్టుకు వస్తారు ఆటోవారు. లోలార్క కుండమని ఒక దిగుడుబావి. ఆ బావి గట్టున వున్న చిన్న గూటిలో ఆదిత్యుడు, మహాశక్తివంతుడు, బావి పైన శివాలయము వున్నాయి. చర్మవ్యాధులు, తగ్గని రోగాలు వుంటే ఆ కుండంలో స్నానం చేసి ఆదిత్యుని అర్చించి, శివునకు ప్రదక్షిణలు చేసి తగ్గించుకుంటారుట. అక్కడ కుండంలో ప్రోక్షణ చేసుకొని ఆదిత్యుని దగ్గర ధ్యానము చేసి రెండవ ఆదిత్యుని కోసం బయలుచేరాము. అది జంగమవాడి మఠము ముందర సందుట. విడియో పూర్తిగా రాలేదు. జంగమవాడి అని ఆగిపోయింది (YouTube). అక్కడ కనుక్కొని, ఎదురు సందులో వెతికి పట్టుకున్నాము. కాశీలో సందులు చాలా చిన్నవిగా సన్నగా వుంటాయి. అందులో టూవీలర్లు, వోపెనుగా వున్న మురికి కాలువలు, రోడ్డు మీద పేడతో పులుముకుపోయి అదో వాసనతో వర్ధిల్లుతూ వుంటాయి.

మేము ఆ సన్న సందులలో తిరిగి విమలాదిత్యుడి గుడిని చేరాము. చిన్నగుడి చాలా శుభ్రంగా వుంది. చాలా తేజస్సుతో వుంది. కూర్చొని కళ్ళు మూసుకుంటే తీవ్రమైన ధ్యానము కలుగుతోంది. అక్కడ ధ్యానము అర్చనము, దానము చేసుకున్నాము. తరువాత మూడవ ఆదిత్యుడైన సాంబుని వద్దకు సాగాము. దారి చూపే వీడియో రాలేదు. కాబట్టి సూరజ్‌కుండ్‌ అని మాత్రము తెలుసు. అన్నిటికి వెళ్ళలేరని, కొంత మనకు రాసి వుండాలని నండూరి శ్రీనివాసు ఉపోద్ఘాతములో చెప్పేవున్నారు. మాకు ఎన్ని కుదిరితే అన్ని చూద్దాము అని మాకు మేము చెప్పుకున్నాము. అందుకే అలా వెతుకుతూ సాగాము.

సూరజ్‌కుండ వద్ద సాంబాదిత్యుని చూసి నమస్కరించి, ప్రార్థించి, కుండము వద్దకెళ్ళాము. వడ్డున వున్న గుడి హనుమంతునిది, బావుంది ప్రశాంతముగా. కుండంలో మాత్రము మునగలేము. నీరు బాలేదు. అక్కడ్నుంచి బిర్లా హస్పిటలు వద్ద రెండు వున్నాయని మ్యాపు చెబుతోంది. అక్కడ బళ్ళ వారిని అడిగితే శివాలయము గుర్తు చెప్పారు. నడుస్తూ చిన్న సందులలో దూరి వెతుకుతూ వెతుకుతూ, ఆ సందులలో ఇళ్ళ అందమైన ద్వారబంధాలు, ఆ సొగసులు చూసి ఆశ్చర్యమైయ్యింది. ప్రతి సందులో రెండు చిన్నో – పెద్దో శివాలయాలు, హనుమంతుల వారిదో గుడి, పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ గట్టు వున్నాయి. గుడులు అన్నీ వాడుకలో వున్నాయని చూస్తే అర్థమవుతోంది.

ప్రతి ఇంటి మీద గణపతి బొమ్మలు అతికించి వున్నాయి. కొన్ని సందులు చాలా శుభ్రంగా వున్నాయి. చూస్తుంటే వేరే లోకములో నడుస్తున్నట్లుగా వుంది. ఇవే కదా మన హిందు మతాన్నీ కాపాడింది. ఇందుకు కదా హైందవ ధర్మానికి పట్టుకొమ్మ – కాశీ అని ఈ నగరము మీద మరింత భక్తి, కాశీ వాసుల భక్తి ప్రపత్తులపై గౌరవము కలిగాయి.

మేము తిరిగి తిరిగి అరుణాదిత్యుని దేవాలయము చేరాము. ఆదిత్యుడు శివాలయము వెనుక భాగములో గణపతి విగ్రహము క్రింద ఎర్రటి రాయి రూపములో వున్నాడు. దాని ముందు కూర్చొని ధ్యానము యధావిధిగా జరిపి గుడిలో శక్తి వంతమైన ఆ మహాదేవునకు జలము అర్పించి, దక్షణ సమర్పించి బయలు చేరాము. రెండు సందుల దూరములోని ఖఖోల్కాధిత్యుని గుడి. వెళ్ళె సరికే మూస్తున్నారు అప్పుడే. బ్రతిమిలాడి లోపలికెళ్ళి ఆ స్వామి ముందు కూర్చున్నాముగా. అంతే ఎంత తేజస్సో వర్ణించలేము. తీవ్రమైన తాకిడి, ఆ తేజస్సుకు నమస్కరించి బయట కొచ్చేశాము.

మా ఆటోవాలాకు ఆకలిట. మేము ఈ వెతుకులాటలో ఆకలిదప్పులు మరచాము..ఆ మధ్యాహ్నము వేళ ఆదికేశవ గుడిలో కేశవాదిత్యుని వద్దకు చేరాము.

ఆ గుడి ‘వారణ’- ‘ఆసి’ కలిసే సంగమములో వుంది. నది వడ్డున. కట్టడము బావుంది ఎత్తులో. చల్లటి గాలి నది మీదుగా వీస్తున్నది. రథసప్తమికి గుడి పూర్తిగా చార్జు కాబడి వుంటుందిట. ఆ సమయములో కోరిన కోరికలు, ప్రార్థనలు ఫలిస్తాయి. మేము ధ్యానము చేసుకొని కొంత తడవు, బయటకు వచ్చేసరికే ఆటో డ్రైవరు దగ్గుతో ఇక తోలలేనని, దగ్గరలోని పంచగంగా ఘాటు వద్ద వదిలి వెళ్ళిపోయాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here