Site icon Sanchika

కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-8

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

గంగాహారతులు

గంగా హారతులు కాశీలో వున్న మరొక గొప్ప, పెద్ద ఆకర్షణ. వారణాసి వెడుతున్నామంటే గంగా హారతి దర్శించండి అంటారు మిత్రులు.

ఈ గంగా హారతులు మనకు రిషీకేష్‌ వద్ద మొదలవుతాయి. హరిద్వారులో కూడా వున్నాయి. వారణాసిలో ప్రసిద్ధి చెందాయి. వారణాసిలో మూడు ఘాట్‌లలో ఈ హారతులు ఇస్తారు. దశాశ్వమేథ్‌లో, రాజేంద్రప్రసాద్ ఘాటులో, ఆసీఘాటులో.

గంగ మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న దైవము, జీవనది. భారతదేశపు ఎద చప్పుడు, హరుని లాస్యవిలాసము గంగ. నదులను ప్రకృతిని పరమాత్మ స్వరూపముగా పూజించే సంస్కృతి మనది. పురాణాలలో మనకు గంగాదేవి దేవలోకపు నివాసిగా, దేవతగా కనపడుతుంది. నదులను పూజించటము కృతజ్ఞత తెలపటమూ మన సత్సాంప్రదాయము.

కాశీలో ఈ హారతులు ఎప్పుడు మొదలెట్టారో రికార్డులో లేదు కానీ 1900 దశకము ముందు నుండి వుందంటారు పెద్దలు. గంగకు షోడశ ఉపచారములు చేసి నక్షత్ర హారతీ, నాగహారతీ ఇచ్చి, ధూపమూ, దీపము సమర్పించి వందనము చెయ్యటము ఈ హారతి ప్రధానముగా కనపడుతుంది.

గంగకు ఈ హారతి సేవను భక్తులు చెయ్యవచ్చు. గుడిలో దేవుని చేసే సేవల వలే ఇది కూడా ఒక ఆర్జితసేవ. ఒడ్డున వున్న ఆఫీసులో డబ్బు కట్టి భక్తులు ఆ సేవలో పాల్గొనవచ్చు. అలా డబ్బు కట్టిన వారికి హారతి ముందర సంకల్పములో వారి నామగోత్రాలు చెప్పి నదీమతల్లికి నమస్కారం చేయిస్తారు.

ముందుగా తీరము వెంబడి పరచిన బల్లలపై గంగాహారతి టీము, (వీరిని సేవకులంటారు)సమస్త సామాగ్రిని అమరుస్తారు. అక్కడ మధ్య పీటపై ఒక గణపతిని పెట్టి, మందుగా గణపతిని ఈ హారతి కార్యక్రమము సజావుగా సాగాలని ప్రార్థిస్తారు.

తరువాత నది వద్దకు వెళ్ళి గంధ పుష్ప అక్షతలు పసుపు కుంకుమ నదికి సమర్పించి నమస్కారము చేసుకుంటారు.

రాజేంద్రప్రసాదు ఘాటులో ఐదుగురు, దశాశ్వమేథ్ ఘాట్లో ఎనిమిది మంది, అసీ ఘాటులో పది మంది ఈ కార్యక్రమమును జరుపుతారు.  వీళ్ళంతా ఒకే రంగు బట్టలతో, చేస్తున్న క్రియలలో కూడా ఒకే సారి క్రమ పద్ధతిలో కదులుతూ చూపరులకు ఆనందాశ్చర్యాలను కలగచేస్తారు.

ముందు భజనతో మొదలైన హారతి అందుకొని అందరిచే కొంత భజన చేయిస్తారు, సంకల్పము తరువాత.

శంఖారావముతో నదీమతల్లికి ఆహ్వానము పలుకుతారు. ఇక వీరి హారతి కార్యక్రమము మొదలయ్యినట్టే. అగరుబత్తులు గుత్తిగా వెలిగించి ఒక కాలుపై కూర్చోని (మన హనుమంతుల వారి వలె) ధూపము పట్టి, తరువాత లేచి మళ్ళీ ధూపము ఇస్తారు గంగకు. ఇలా తూర్పు వైపు మొదలెట్టి, గంగకు అభిముఖముగా ప్రారంభించి అటుపై దక్షిణ ముఖముగా అదే సేవ, అంటే అగరుధూపమిచ్చి, పడమర తిరిగి అగరు ధూపము పడమర దేవతలకు ఇచ్చి, ఉత్తక ముఖముగా తిరిగి ఆ సేవ చేసి మరల చేసి నదీ ముఖంగా తిరిగుతారు.

ఇలా చేయ్యటానికి దాదాపు ఒక భజనపాట పూర్తి అవుతుంది. అంటే దాదాపు 6 నిముషములు. ఒక ఆత్మప్రదక్షిణలా చేస్తారన్నమాట! ఇలా నాలుగు దిక్కులకు అర్చన చేస్తారు గంగతోపాటు. ఇలా చెయ్యటము వలన భక్తులు ఏ వైపు కూర్చున్నా వీరిని పూర్తిగా స్పష్టముగా చూడవచ్చు.

అగరు ధూపము అవుతుండగా సేవకులు అసలు ధూపమును సిద్ధము చేస్తారు. పిడకలకు నిప్పి పెట్టి వాటి మీద సాంబ్రాణి ధూపము చల్లి ఆ ధూపహారతిని సిద్ధంగా పెడతారు. ఈ సాంబ్రాణి శివునకు పరమ ఇష్టమని, ఆ ధూప ప్రియత్వం వలన గంగకు కూడా ఆ ధూపము ఇస్తారు. అంటే గంగతో పాటు శివుడు పరోక్షంగా నదీమతల్లిలో వున్నాడన్న భావన కనపడుతుంది.

ఈ ధూప కార్యక్రమము జరుగుతూ వుండగానే తరువాతి కార్యక్రమమైన నక్షత్రహారతి సిద్ధం చేస్తారు. నెయ్యిలో నాన్చిన వత్తులను ఏడంచుల నక్షత్ర హరతి పళ్ళంలో సర్దుతారు ముందుగానే.

రాజేంద్రప్రసాదు ఘాటులో సేవకులు

  ఈ నక్షత్ర హారతి దీపాలను బల్ల వెనక క్రింద కూర్చున్న భక్తులను వెలిగించమన్నారు. దశాశ్వమేథ్‌లోనైతే వారే వెనకకు తీసుకుపోయి వెలిగించి తెచ్చి సిద్ధంగా వుంచారు.

మీరు కనుక రాజేంద్రప్రసాద్‍ ఘాటులో హారతి కార్యక్రమములో పాల్గొంటే మీరూ ఆ హారతి వెలిగించే అవకాశము కలుగుతుంది.

ఈ నక్షత్రహారతి మొత్తము కార్యక్రమములో కలికుతురాయి.

వారి కదలికలు ఆ జ్యోతులతో సమముగా ఎంతో పద్ధతిగా వుంటాయి. ఆ గంగా హరతికి ఆ జ్యోతులకు గంగ పొంగి ఆనంద తాండవము చేస్తుంది. భక్తులందరు అప్పటికే భజనలతో, ఆ ధూపముతో మత్తెక్కి భక్తితో వుంటారు.

ఆ నక్షత్ర జ్యోతులను వీరు మొదట పైకెత్తి ఆకాశానికి ఇస్తారు. అలా కొంతసేపు ఆకాశానికి ఇస్తూ వుండిపోతారు. ఇలా అంతటి బరువైన ఆ నక్షత్ర హరతిని పైకెత్తి నిట్టనిట్టారుగా పెట్టి , ఫ్రీజ్‌ అన్నట్లుగా కొద్దిసేపు నిశ్చలముగా వున్నప్పుడు మిన్నంటే భజన కూడా పైపైకిగా పోతూ వుంటుంది. ఇలా ఆకాశానికిస్తున్నట్లుగా పైకెత్తి పెట్టినప్పుడు మనము చూసి తరించవలసినదే కానీ కాళిదాసుకైనా వర్ణించ తరమా? అని అనిపిస్తుంది. అక్కడి ఆ వాతావరణములో వున్న భక్తి విద్యుత్తు భక్తజనులను సంభ్రమములో ముంచెత్తుతుంది. గంగ ప్రత్యక్షముగా, పరమశివుడు పరోక్షముగా అక్కడ నిలచి ఆ హారతి అందుకుంటున్న భావన ఆ హారతిలో పాల్గున్న ప్రతి భక్తుని హృదయములో కలుగుతుంది.

అవి ఎన్ని వీడియోలలో చూచినా, ప్రత్యక్షముగా చూచిన అనుభవముతో సరికాదు. ఈ ఒక్క అనుభవము చాలా అపూర్వమైనది. దీని కోసమైనా కాశీ తప్పక దర్శించవలెనంటే అది అతిశయోక్తికాదు. కాబట్టే కాశికి వచ్చిన వారు తప్పక చూసే వాటిలో ఈ హారతులు కూడా ఎంతో ముఖ్యమైనవి.

నక్షత్రహారతి తరువాత మహాదేవుడు నాగాభరుణుడు కాబట్టి నాగహారతినిస్తారు. ఈ హారతీ కూడా ముందు ఆకాశానికి చూపి, అటుపై నాలుగు దిక్కులకు ఇస్తారు.

వైవేద్యము సమర్పణ, తరువాత చిన్న వస్త్రంలో తుడటము, వింజామరలతో వీచటము ఇత్యాదివి ఉపచారములు చేస్తారు. తుదకు గంగకు తర్పణములిస్తారు. వెనకకు వచ్చి సాష్టాంగము చేస్తారు. ఈ హారతి ఇచ్చే బ్రాహ్మణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇస్తారు. ఎన్నో వందల వేల కెమేరాలు వాళ్ళను చూస్తున్నా, వారు పరమాత్మ నామము ఉచ్చరిస్తూ వారి లోకములో వారుగా వినయముగా వుంటారు. భక్తులతో వారు ఎలాంటి కనెక్షను వుండకుండా కేవలము వారి చూపును అనంతములో నిలిపి పరమాత్మను చూస్తున్న భావన కలిగిస్తారు.

తరువాత భక్తులకు ప్రసాదము పంపకము, డొనేషన్లకై అడగటము వంటివి ఈ సేవకులన్నవారు చేస్తారు.
ఇక్కడ ముఖ్యముగా ఆకట్టుకునేది భక్తులను హారతి ఇచ్చే బ్రాహ్మణ పూజారుల కదలికలు. ఆ హరతి పళ్ళాలు చాలా పెద్దవిగా వుండి దాదాపు ఐదు ఆరు కిలోల బరువుతో వుండి వుంటాయి. అలాంటివి వాళ్ళు ఒక్క చేతో ఎత్తి, పట్టుకు హారతిని గుండ్రముగా తిప్పటము ఆకర్షిస్తుంది. దానిపై ఒక్కచేతో చెయ్యటము. రెండే చేతితో పూర్తిగా గంట వాయిస్తునే వుంటారు. దానికి ఎంత సాధన అవసరమో కదా।

అలా ఒక చేత్తో హారతి పట్టుకు త్రిప్పుతూ, మరో చేతో ఆపకుండా గంట మ్రోగించటము సామాన్యముగా కుదరదు. దానికి ఎంతో సాధన అవసరము.

ఈ హారతి మొత్తము గంటన్నర సమయము పడుతుంది. ఆరున్న నుంచి ఎనిమిది వరకూ. మనము ఎక్కడ నిలబడ్డా కనపడుతుంది. కాని పూర్తి వివరాలతో చూడాలంటే మంచి ఎత్తైన స్థలము దొరకపట్టుకోవాలి. ఆరు గంటలకల్లా అన్నీ కుర్చీలు నిండిపోతాయి. అక్కడ వున్న హోటళ్ళ వారు కుర్చీలు వేసి విఐపీ సీట్లు అని అమ్ముతారు. వారి హోటళ్ళు కొన్ని అక్కడ వున్నందున. కుర్చీలు వేసి వాళ్ళ అతిథులకు, లేదా వారి విదేశీ యాత్రికులకు ఇస్తారు.

దాదాపు బోట్లవాళ్ళందరూ వారి బోటు మీద కూర్చొని చూడమని ఆహ్వానిస్తారు. ప్రతి మనిషికి వంద చొప్పున వసూలు చేస్తారు. జనాలు లేకపోతే ముందు వరసలో కూర్చోబెట్టి చూపెడతారు. మనము వెళ్ళిన టైము బట్టి ఇచ్చే డబ్బు బట్టి కూర్చోబెడతారు. కొన్ని రెండచ్చెల బోటులలో పైన కూర్చోటానికి రెండు వందలు…ఇలా అన్నమాట! కానీ బోటులో కన్నా గంగ ఒడ్డున కూర్చోని హారతి తిలకించము మంచి పద్ధతి. ఎందుకంటే గంగాహారతిని మనం అందుకున్నట్లుగా అవదు. లేకపోతే మనము హరతికి ఎదురెళ్ళినట్లుగా అవుతుంది కదా!

ఈ హారతి ఉదయము పూట ప్రతి ఘాటులో ఒక్కొక్కరు ఇస్తూ కనపడుతారు. ఆ హారతి కూడా అన్నీ ఉపచారాలతో కూడి వుంటుంది. భారతీయులు ఆ ఉదయపు హారతికి ఎందుకో పెద్దగా స్పందించటము నే చూడలేదు. కేవలము విదేశీయులే తెగ ఫోటోలు తీస్తూ కనిపించారు.

కానీ అసీ ఘాటులో ఉదయపు హారతి మాత్రము మళ్ళీ ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

అక్కడ ఉదయము భజన, శివ నామస్మరణ, హారతి ఇత్యాదివి వున్నాయి. అటు తరువాత బోట్ల వద్దకు టీ తెచ్చి అమ్ముతారు. సమయము ఆరు గంటలవుతుంది. ప్రశాంతమైన ఆ నది మీద, సూర్యుని దర్శనానికి ముందు ఎరుగు రంగవల్లులతో ఆకాశము, వాతవరణములో భక్తి గంగా ప్రవాహములా ప్రవహిస్తూ వుంటుంది. నాస్తికులు సైతం ఆ భూమికి, ఆ నదికి, ఆ ఉదయాలకు నమస్కరించకుండా వుండలేరు. అంతటి అద్బుతమైన వాతావరణము అసీఘాట్లలోని ఉదయాలలో కనపడుతుంది.

ఈ హారతి దినదినానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకొని విశ్వనాథ దర్శనము తరువాతి స్థానం సంపాదించుకుంది అనవచ్చు. వచ్చిన వారు తప్పక ఒక్కసారైనా దర్శిస్తారు హారతిని. నా ఈ యాత్రలో నేను చాలా సార్లు దర్శించినది విశ్వనాథుని తరువాత గంగాహరతే అంటే అతిశయోక్తి కాదు.

అసీ ఘాటు ఉదయపు పడవ ప్రయాణాలతో పాటు గంగాహారతి మనసులో ముద్రించున్న అపూర్వమైన అనుభవాలలో ఒకటి.

(సశేషం)

Exit mobile version