కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు – 9

0
2

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

వారాహీ దేవాలయము – వారణాసి

“ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం
క్రూరాం కిరాతవారాహీం
వందేహం కార్యసిద్ధయే” ఇది వారాహి ధ్యాన శ్లోకము.

“వారాహీ వీర్యవందితా” అని అమ్మ లలితా నామాలలో మనము చదువుతాం. ‘వీరుల చేత వందనములు తీసుకునేదని’, వీరత్వం కోరి వందనము అర్పిస్తే వీరత్వం అంటే విజయము లభిస్తుందని,బాహ్య అర్థము.

విజయ కాంక్షతో వారాహిణిని ఆరాధిస్తే విజయము తథ్యమని అంతరార్థము.

అమ్మవారు బండాసురునిపై చేసిన యుద్ధములో విశుక్రుణ్ణి వధించిన శక్తిగా మనకు లలితా నామాలలో కనబడుతుంది వారాహి మాత. సప్తమాతృకలలో ఒక తల్లిగా కూడా ఈమెను కొలుస్తారు. ఈమె పంచమీ తిథి శక్తి. సదాశివుని భార్యగా ‘ప’ వర్గ మాతృవర్ణాలకు చెందిన శక్తిగా మనకు చెబుతారు. కిరి చక్ర అధిష్ఠానదేవత కూడా ఈమే.

చాలా పురాణాలలో వారాహి మాత ప్రసక్తి వుంది. మార్కండేయ పురాణములో వారాహి మాత ప్రసక్తి వుంటుంది. శుంభ – నిశుంభ వధ సందర్భములో ఈ మాత కూడా వారిని వధించిన శక్తి స్వరూపిణిలలో ఒకరు. ఈ పురాణమే అమ్మవారిని అపార కరుణామూర్తిగా, వరప్రదాయినిగా, ఉత్తర దిక్కుకు అధిదేవతగా వర్ణించింది.

వరాహపురాణములో కూడా ఈ తల్లి ప్రస్థావన వుంది. రక్తబీజుడిని చంపిన శక్తిగా వర్ణిస్తుంది ఈ పురాణము.

దేవీమహాత్యంలో శక్తి స్వరూపిణి అయిన తల్లి మిగిలిన శక్తులతో పాటు వారాహీ మాతను సృష్టించినట్లుగా చెబుతుంది. మత్స్య పురాణము వారాహి మాత అంధకాసురుణి వధించటానికి ఉద్భవించిన శక్తిగా కొనియాడింది.

వరాహా ముఖముతో, స్త్రీ శరీరముతో వుండే ఈ తల్లి విజయానికి, అత్యంత్త మహోన్నతమైన శక్తికి గుర్తుగా భక్తు లందరి చేత కొలువబడుతుంది.

ఈ తల్లి చతుర్భజాలతో వుంటుంది. పైన చేతులలో ఒక చేత నాగలి, మరో చేతిలో దండము, క్రింది రెండు చేతులూ అభయ, వర ముద్రలతో వుంటుంది. దున్నపోతు వాహనంపై సంచరిస్తూ వుంటుంది.

తాంత్రిక పూజలలో శక్తిగా ఎక్కువగా కొలవబడే ఈ వారాహి దేవి భక్తులకు శత్రువుల బాధ తగ్గిస్తుంది. హిరణ్యాక్షుడు వేదాల నెత్తుకు పోతుంటే మహావిష్ణువు వరహావతారమెత్తి నప్పుడు ఆయనకు శక్తి నందిస్తుంది ఈ తల్లి. అందుకే వారాహి మాత ను వైష్ణవులు కూడా పూజించే దేవత!

ఇలా శైవులకు, వైష్ణవులకూ, శాక్తేయులకూ కూడా వారాహీ మాత పూజ్యరాలు.

కాశీలో మీర్ ఘాటు ప్రక్కగా వున్న త్రిపురా ఘాటులో ఈ అమ్మ వారి దేవాలయము వుంది. ఆ దేవాలయము చాలా పురాతనమైనది. శక్తి వంతమైనది. చాలా చిన్న దేవాలయము ఇది. అమ్మవారు ఇక్కడ సెల్లారులో నిలువెత్తునా నిలబడి వుంటుంది. అందుకే ఈమెను ‘పాతళ వరాహి’ అని కూడా అంటారు. ఆమె ఎదురుగా నిలబడి, ఆమె ఉగ్రరూపము మానవులు చూడలేరుట, కేవలము తపఃసంపన్నులు తప్ప. అందుకే మనము వెళ్ళి నేల మీద వున్న రెండు రంధ్రాల గుండా నేల మాళిగ లోకి చూసి మాత్రమే దర్శనము చేసుకోవాలి. ఒక రంధ్రము నుంచి పాదాలు ఒక రంధ్రము నుంచి ముఖము దర్శించుకోవచ్చు. ఆమె ముందు నిలబడి ప్రత్యక్షముగా దర్శించుకోలేము. ఆమె చిన్న విగ్రహము ఈ రంధ్రాల ముందర గోడ మీద వుంది. భక్తులు ఈ మూర్తిని పూర్తిగా సందర్శించుకోవచ్చును.

ఉదయము పూజారి అమ్మవారిని సేవించి వచ్చేస్తారు. మళ్ళీ ఎవరూ క్రిందకు వెళ్ళరని చెబుతారు. ఇక్కడ ప్రచారములో వున్న కథ, ఒక భక్తుడు మూర్ఖముగా, పూజారి ఎంత చెప్పినా వినక, క్రిందికి వెళ్ళి అమ్మవారిని చూచి, దడచుకొని పిచ్చివాడైపోయాడుట. ఇది ఈ మధ్య కాలములో జరిగినదని చెబుతారు.

ఆ తల్లి కాశీ నగర గ్రామ దేవత కూడా. రాత్రి సమయాలలో కాశీ నగరానికి కాపలా తిరుగుతుందిట. కాశీలో ఏ విధమైన దుష్టశక్తులను రానీయ్యదని ప్రతీతి. అందుకే ఆమె విశ్రాంతి కోసము పగలు ఆ దేవాలయము మూసి వేస్తారు. ఉదయము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు అంటే రెండు గంటలు మాత్రమే దర్శనానికి తెరిచి వుంటుంది. ఆ సమయములోనే మనము దర్శనము చేసుకోవాలి.

అమ్మవారు శక్తి ప్రచండమైనది. ఈమెను కొలిస్తే, దుష్టశక్తులు మన వంక చూడలేవని ప్రతీతి.

వారాహి మాత రాత్రి సంచరించే దేవత కాబట్టి ఆమెను ‘ధృమ వారాహి, ‘ధృమవతి’ అని కూడా అంటారు.

తాంత్రిక పూజలు చేసేవారు సాధారణముగా రాత్రులే పూజలు చేస్తారు. సూర్యాస్తమయము తరువాత మొదలెట్టి, సూర్యోదయం లోపల అమ్మవారి పూజ నిర్వహిస్తారు.

వారు ఈ వారాహి తల్లిని పూజించి విజయము పొందుతుంటారు. వారాహి అనుగ్రహాష్టకము అమ్మవారి కృప కోసము, వారాహి నిగ్రహష్టకము శత్రువులను జయించటానికి పఠించే స్త్రోత్రాలు.

ఈ వారాహిని నేపాలులో కూడా బ్రహ్మీ అన్న పేరుతో కొలుస్తారు. బౌద్ధులు ఈ తల్లిని వజ్రవారాహి అన్న పేరుతో కొలుస్తారు. ఈమె హిందూ దేవత వారాహియే. విజయం కోసం బౌద్ధులు వజ్రవారాహి అర్చనలు చేస్తారు.

తమిళనాట మనకు ఈ వారాహి తల్లి దేవాలయాలు, పూజలు ఎక్కువగా కనపడుతాయి. తమిళరాజులు ఈ తల్లిని పూజించి ఆమె అనుగ్రహముతో శత్రువుల మీద విజయం సాధించేవారుట.

ఈ అమ్మవారికి భారతదేశములో ముఖ్యమైన నాలుగు దేవాలయములు వున్నాయి. ఒరిస్సాలో, చెన్నైలో దేవాలయం కాక కాశీ లోని వారాహి దేవాలయము ఎంతో శక్తివంతమైనది. ప్రముఖమైనది.

తమిళనాట వున్న వారాహీ మాత దేవాలయము ఉగ్రవారాహి. ఆ తల్లిని దర్శింటానికి కూడా భక్తులు భయపడుతూ వుండేవారుట. ఆదిశంకరులు ఆ తల్లిని శ్రీచక్ర విధానములో అర్చించి, ఆమె ఎదురుగా గణపతిని ప్రతిష్ఠించారుట. ఆనాటి నుంచి ఆమె మాతృమూర్తిగా భక్తులను కరుణిస్తున్నదని చెబుతారు.

కాశీ గ్రామదేవతగా వుండి కాశీలో ఎలాంటి అరాచకము లేకుండా ఈ తల్లి కనిపెట్టుకు వుంటుంది. కాశీ యాత్రలో తప్పక చూడవలసిన దేవాలయాలలో ఈ వారాహి దేవాలయము ముఖ్యమైనది. ఈ దేవాలయము సన్నని సందులో వుంటుంది. మీరు మీర్‌ ఘాటు లో అడిగితే చూపెడతారు. గోడమీద ‘వారాహి దేవాలయ’మని తెలుగులో రాసి కూడా వుంటుంది. ఈ దేవాలయము మనము లోపలికి వెళ్ళే వరకూ తెలియదు. కాబట్టి జాగ్రత్తగా చూసి వెళ్ళాలి.

“మాతర్జగద్రచన-నాటక-సూత్రధార
స్త్వద్రూపమాకలయితుం పరమార్థతోయమ్।
ఈశోప్యమీశ్వరపదం సముపైతి తాదృక్
కోన్యః స్తవం కిమివ తావకమాదధాతు॥”

అంటూ వారాహి అనుగ్రహాష్టకము మొదలవుతుంది.

వారాహి మంత్రజపము చేసే వారికి అపజయమన్నది వుండదు. కాని సరి అయిన గురువు ద్వారానే ఆ మంత్రము పొందాలి. అప్పుడే ఫలితాలు కనపడుతాయి.

కాశీలోని వారాహిని దర్శించి నమస్కరించుకున్న వారికి అన్నింటా విజయము తథ్యము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here