[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 1” వ్యాసంలో ఉత్తర రామేశ్వరం లోని “శ్రీ రామలింగేశ్వరాలయం” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
మిత్రులారా, 2019లో గుంటూరు జిల్లా యాత్ర చేశారు కదా. ఈ కొత్త సంవత్సరం మన తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో నేను చూసిన ఆలయాల గురించి చెబుతాను. వీటిని నేను అప్పుడప్పుడూ చూశాను కనుక ఒక వరుసలో రావు. మీరు కూడా మీకు వీలయినప్పుడు చూసెయ్యండి మరి. అయితే మేప్ చూసుకుని దగ్గర దగ్గరగా వున్న ఆలయాలు రెండు ఆలయాలు ఒకే రోజు చూడవచ్చు కూడా.
ఉత్తర రామేశ్వరం.. ఈ పేరెప్పుడైనా విన్నారా మీరు? ఇది ఎక్కడో లేదండీ… మనకి కూసంత దూరంలోనే వుంది. దాదాపు 40 ఏళ్ళ క్రితం మా వారు ఈ ప్రదేశం చూశారండీ. అప్పుడు కొన్నాళ్ళు దాని గురించి కధలు చెప్పేవాళ్ళు. పచ్చని పొలాల మధ్య చిన్న శివాలయం, దానిముందే చిన్న కొలను, ఆ కొలనులో రోజూ ఒకే తామర పువ్వు పూస్తుందిట.. అది శివుడికే. ఆ ప్రదేశం ఎంత బాగున్నదో.. నిన్ను తీసుకెళ్తానులే అని వూరించీ, వూరించీ కొన్నాళ్ళకి దాని గురించి మరచిపోయారు.
ఆ మధ్య మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువ తిరుగుతున్నప్పుడు దాని గురించి గుర్తొచ్చి వెళ్ళొచ్చాము.
అర్చన చేయించవచ్చు అన్నారు కానీ టికెట్లు అమ్మేవారెవరూ లేరు. గుడి లోపల కూడా చిన్న చిన్న వసారాల్లాగా గదులు వున్నాయి. అక్కడ కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు. దర్శనం చేసుకున్నాం. శివలింగం కొంచెం పెద్దదే. ఆలయం గురించి విశేషాలు చెప్పండి అని పూజారిని అడిగాను. రామ ప్రతిష్ఠ, 300 ఏళ్ళ క్రితం ఆలయం అన్నారు. ఆ రోజు జనం ఎక్కువగా వుండటంతో ఆయనకి వివరాలు చెప్పే సమయం లేదు.
చుట్టూ రూముల్లాగా వున్నాయన్నాను కదా దాని పైకి వెళ్ళటానిక మెట్లు వున్నాయి. పైకి వెళ్ళి చూస్తుండగా ఇంకొకతను వచ్చాడు. మా ఆయనలాగానే అతనూ అక్కడ పరిసరాలన్నీ మారిపోయాయని పైకే అనుకుంటున్నాడు. చుట్టూ పొలాలుండేవి.. ఇప్పుడు లేవు.. గుడి ముందే కోనేరు వుండేది లేదు అని. పాపం మా ఆయనలాగానే అతనూ డిజప్పాయింట్ అయ్యాడనుకున్నా. మావారుకూడా గుడి చూడగానే దానిముందు కోనేరు ఏమైపోయిందా అనే ఆరా తీశారు. అది పూడ్చేశారుట. ఆ కోనేరు చాలా అందంగా వుండేది.. అది పూడ్చేశారా అని బాధ పడ్డారు. ప్రస్తుతం కొంచెం దూరంలో ఒక చిన్న కోనేరు వుంది.
కొంచెం దూరంలో గుట్టమీద పార్వతీదేవి ఆలయం వున్నదని బోర్డు చూశాము. ఇది కూడా కొత్తదే. ఇదివరకు ఆ ఆలయం లేదు అని మావారు నొక్కి వక్కాణించారు. ఆయనకి ఆ ప్రదేశం ఇదివరకు చూసింది అలాగే గుర్తుండటంవల్ల అంత బాధ పడ్డారుకానీ, 40 ఏళ్ళ క్రితం పరిసరాలు అలాగే వుండాలంటే వుంటాయా!!?
సరే పక్కనున్న సన్న సందులో కొంతదూరం నడిచి, చిన్న గుట్ట ఎక్కి పార్వతీదేవి ఆలయానికి వెళ్ళాము. హమ్మయ్య. అక్కడ పూజారి కొంచెం ఖాళీగా వున్నారు. మధ్య మధ్యలో వచ్చే భక్తులకు తీర్థం ఇస్తూనే మాకు ఆలయం గురించి కొంత సమాచారం ఇచ్చారు.
ఆ ఆలయం అతి పురాతనమైనదనీ, శివలింగం శ్రీరామచంద్రుడి ప్రతిష్ఠ అనీ, దానికి గుర్తుగా రామబాణం లింగం మీద వుంటుంది, చూడవచ్చనీ, లింగం వెనుక వైపు మనిషి వీపులాగా వుంటుందనీ, లింగానికి అలా ఎక్కడా వుండదనీ అదిక్కడ విశేషమనీ చెప్పారు. అలాగే లింగం పెరుగుతూ వుంటుందని కూడా అన్నారు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం కనుక ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండీ 5 గంటల దాకా సామూహిక సత్యన్నారాయణ వ్రతాలు జరుగుతాయి. శివాలయంలో సత్యన్నారాయణ వ్రతం జరగటం కూడా ఇక్కడి విశేషమే.
ఆ ఆమ్మవారు అక్కడ వెలవటానికి కూడా ఒక కథ చెప్పారు. పూర్వం ఒకాయన షాద్‌నగర్ పరిగి రోడ్డులోని ఎలికట్ట అనే గ్రామంనుంచీ భవానీదేవిని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామితో కళ్యాణం చేసేవారుట. కొంతకాలం తర్వాత వృధ్ధాప్యం వల్ల అంత దూరంనుంచీ అమ్మని తీసుకురావటం శ్రమ అవుతోందని అన్నారుట ఆయన. అమ్మ నువ్వంత శ్రమపడవద్దు నేనే ఇక్కడకొస్తానని ప్రస్తుతం అమ్మవారి ఆలయంవున్న ప్రదేశంలో ఒక కొండరాయి కింద కూర్చున్నట్లు వెలిసిందిట.
ఆయన అంత కథ చెప్పారు కదాని మళ్లీ శివాలయానిక వెళ్ళి రామబాణం గుర్తు చూపించండని అడిగాము. పూజారి అభిషేకం సమయంలో అయితే కనబడుతుందన్నారు. ఉదయం 6 గంటల నుంచీ 12 గంటల దాకా ప్రతి రోజూ స్వామికి అభిషేకం మనం చేసుకోవచ్చు. టికెట్ రూ.101 (ఇప్పుడు పెరిగి వుండవచ్చు). కావలసిన పూజా సామాగ్రి మనమే తీసుకెళ్ళాలి. మీకు ఆలయ విశేషాలు చెప్పాలన్నా ఆ సమయంలోనే రావాలి.. ఇప్పుడీ జనంలో చెప్పటం కష్టమన్నారు.
దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచీ 7-30 గంటల దాకా. శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజు, శ్రావణ, కార్తీక మాసాల్లో జనం బాగా వస్తారు. శివరాత్రి రోజు లక్షల్లో వస్తారుట భక్తులు. మేము వెళ్ళినప్పుడుకూడా 200 మంది పైనే వున్నారు.
మార్గం
హైదరాబాద్ – బెంగుళూరు రహదారిలో హైదరాబాద్ నుంచి 54 కి.మీ. వెళ్ళాక, షాద్‌నగర్ దాటాక (షాద్‌నగర్ ఊళ్ళోకి వెళ్ళక్కరలేదు.. రహదారిలోనే) టోల్ గేట్‌కి దగ్గర దగ్గర ఒక కిలో మీటరు ఇవతల కుడివైపు రోడ్డు వస్తుంది. రోడ్డు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. ఆ రోడ్డులో 4 కి.మీ. వెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. ఆలయం చిన్నదే. శిల్ప కళ ఏమీ వుండదు.
అక్కడనుంచి బయల్దేరి ఇదివరకు భవానీమాతని ఎలికట్టనుంచి తెచ్చేవారుటకదా, దోవే కదా చూద్దామనుకున్నాము. బెంగుళూరునుంచి వచ్చేదోవలో షాద్‌నగర్ – పరిగి రోడ్డులో వుందన్నారు. షాద్‌నగర్ దాటగానే సోలీపూర్ గ్రామం, ఫరూఖ్ నగర్ మండలంలో ఒక ఆలయం కనబడితే అదేమోనని వెళ్ళాము. అది వీరాంజనేయస్వామి ఆలయం. అది కూడా చాలా పురాతనమైన ఆలయం.. వ్యాసరాయల ప్రతిష్ఠట.
ఎలికట్ట భవానీ దేవి ఆలయం ఆర్చి కనుక్కున్నాముగానీ బాగా చీకటి పడింది.. దోవ కూడా సరిగ్గా కనబడలేదు. అందుకే తిరిగి వచ్చేశాము.
వచ్చేవారం ఇంకొక పుణ్య క్షేత్రం.