“భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–12” వ్యాసంలో ఆలంపూర్ లోని “పాపనాశని ఆలయాల సమూహం” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి.
పాపనాశని ఆలయాల సమూహం, అలంపూర్
అలంపూలోనే జోగుళాంబా దేవి, నవ బ్రహ్మల ఆలయాల తర్వాత అద్భుత శిల్ప సంపదకు నిలయమైన కూడలి సంగమేశ్వరస్వామి ఆలయాన్ని చూశారు కదా. దానికి సమీపంలోనే వున్న ఇంకొక ఆలయ సమూహం పాపనాశని ఆలయాల సమూహం. కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం దాటాక కొంచెం దూరంలో మళ్ళీ ఎడమచేతి వైపే ఇంకొక బోర్డు వస్తుంది. ఆ దోవలో వెళ్తే ఈ ఆలయాల సమూహం వస్తుంది.

ఇవి కూడా శ్రీశైల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ముంపుకు గురవ్వటంవల్ల ఇక్కడికి తరలించి పునఃప్రతిష్ఠించారు. జోగుళాంబ ఆలయంనుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపే ఎడమవైపు వెళ్తే వస్తాయి ఈ ఆలయాలు. నవ బ్రహ్మల ఆలయాల తర్వాత నిర్మింపబడిన ఈ ఆలయాల నిర్మాతలు కూడా చాళుక్యులే.
ఇవి అనేక చిన్న చిన్న ఆలయాల సమూహం. ఈ ఆలయాలలో ముఖ్య దైవం శివుడు పాపనాశేశ్వరుడు పేరుతో పూజలందుకుంటున్నాడు.
మనుషులు తమ స్పర్శ, దర్శనాలతో తెలిసీ తెలియక చేసిన పాపాలను నాశనం చేసే శక్తిగల స్వామి ఈయన. ఒక చిన్న ఆలయంలో విష్ణుమూర్తి చేతిలో పిండంతో వున్నాడు. ఈ అరుదైన మూర్తి గురించి విశేషాలు తెలియలేదు. ఇంకా మహిషాసురమర్దని, సాక్షి గణపతి, సప్తమాతృకలు, విద్యా గణపతులకు చిన్న చిన్న ఆలయాలున్నాయి. పాపనాశనీ తీర్ధంనుంచి తీసుకువచ్చి పునర్నిర్మాణం గావింపబడిన ఆలయాలు గనుక రోడ్డు మొదట్లో పాపనాశనీ గ్రూప్ ఆఫ టెంపుల్స్ అని బోర్డు వుంటుంది కానీ ఇంకా వాటి గురించి తెలియజేసే వివరాలు ఏమీ లేవు. పురాతన ఆలయాలని ఒక చోట నుంచి మరొక చోటకి తరలించేటప్పుడు వాటి వివరాలు తెలియజేయటానికి ప్రభుత్వం ఇంకొంచెం శ్రధ్ధ చూపించి వుంటే బాగుండనిపించింది.
హైదరాబాదునుంచీ సొంత వాహనంలో ఉదయం బయల్దేరి, అలంపూర్ లోని అన్ని ఆలయాలూ చూసి అదే రోజు తిరిగి హైదరాబాదు వచ్చెయ్యచ్చు. ఈ మధ్యనే హరిత హోటల్ పెట్టారు ఈ ఆలయాలకెళ్ళే దోవలో. అత్యవసరాలకి ఇబ్బంది వుండదు.
















