భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 13: ఆంజనేయస్వామి ఆలయం, బీచుపల్లి

0
2

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–13” వ్యాసంలో బీచుపల్లి లోని ‘ఆంజనేయస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ఆంజనేయస్వామి ఆలయం, బీచుపల్లి

[dropcap]పూ[/dropcap]ర్వం కృష్ణానది, తుంగభద్రా నదుల మధ్య వున్న అలంపూర్, గద్వాల ప్రాంతాలను నడిగడ్డగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు, సుల్తానులు పరిపాలించారు. క్రీ.పూ. 902లో చోడబల్లి దేవుడు అనే రాజు విశ్వనాథ దేవుడు అనే వ్యక్తికి ఈ ప్రాంతాన్ని దానంగా ఇచ్చినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ విరాజిల్లుతున్న పురాతన ఆలయం ఆంజనేయస్వామిది. ప్రశాంతంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి 200 మీటర్ల దూరంలో వున్నది ఈ ఆలయం. వందల సంవత్సరాలనుంచీ విరాజిల్లుతున్న ఈ స్వామిని అతి మహిమాన్వితుడుగా నమ్మి కొలుస్తారు. స్వామి దర్శనంతో దీర్ఘ వ్యాధులన్నీ మటుమాయం అవుతాయని భక్త జన విశ్వాసం. ఈ ప్రాంతం ప్రజలకి ఈ స్వామి కులదైవం.

7వ నెంబరు జాతీయ రహదారి (హైదరాబాద్ – బెంగుళూరు) పక్కనే వున్నది ఈ ఆలయం. అందువల్లనేమో ఇక్కడ ఎప్పుడూ భక్తుల సంఖ్య అధికంగానే వుంటుంది. పైగా కృష్ణానది సమీపాన వుండటంవల్ల నదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తూ వుంటారు. ముఖ్యంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కృష్ణానది పుష్కరాలకి ఇక్కడికి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేసి స్వామిని దర్శించుకుని వెళ్తారు.

15వ శతాబ్దంలో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన గురువు వ్యాస రాయలవారు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తూ, శిష్యులతో ఒకసారి ఇక్కడ విశ్రాంతి తీసుకొన్నారు… ఈ ప్రదేశం బాగా నచ్చి ఇక్కడ శ్రీ ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. తన ఆలోచనలనన్నిటితో ఒక సుందర ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేయించారు. తాను ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాక ఈ మూర్తిని ఎవరు అర్చిస్తారు అనే అనుమానం రాగా, ఆ రాత్రి కలలో ఆంజనేయస్వామి కన్పించి దానికి పరిష్కారం చెప్పాడు. ఉదయం స్వామికి మొదటి పూజ ఎవరు చేస్తారో, వారే అక్కడి అర్చకులు అని… అంతే. మంచి ముహూర్తంలో వ్యాస రాయలవారు శ్రీ ఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. మర్నాడు ఉదయం వ్యాస రాయలవారు నిద్ర లేవగానే ఒక గిరిజన బాలుడు తాను ప్రతిష్ఠించిన స్వామి విగ్రహానికి పూజ చేస్తూ కనిపించాడు. ఆ కుర్రాడి పేరు బీచుపల్లి. బోయ జాతి కుర్రాడైన బీచుపల్లిని ఆలయ అర్చకునిగా వ్యాస రాయలవారు నియమించారు. అప్పటి నుంచి ఆ జాతివారే ఆలయ అర్చకులు. అతని పేరుతోనే ఆ ప్రాంతం బీచుపల్లి అయింది. స్వామిని ‘బీచుపల్లి రాయుడు’ అని ఆప్యాయంగా పిలుచుకొంటారు. వ్యాస రాయలు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామికి ఇరువైపులా శంఖ, చక్రాలుంటాయి.

ఇక్కడ ఆంజనేయస్వామికి ప్రతి రోజూ తమలపాకుల పూజ, పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమి నాడు హనుమజ్జయంతిని, వైశాఖ శుద్ధ చతుర్దశినాడు నృసింహ జయంతిని ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో వివాహ ఉపనయనాలు చేసుకొంటారు. ఉత్సవాల రోజున దేశం నలు మూలల నుంచి వేలాది భక్తజనం వచ్చి క్రిష్ణాస్నానం చేసి ఈ స్వామిని సేవిస్తారు. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. కనుక ధ్యానానికి అత్యంత అనుకూలం.

శివాలయం

ఇక్కడ కృష్ణానది పక్కనే ప్రాచీనమైన చిన్న శివాలయం వున్నది. నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు మొదటగా దర్శించుకొనేది ఇక్కడి పరమేశ్వరుడినే. ఈ పరమేశ్వరుడిని హనుమద్దాసులు వారు ప్రతిష్ఠించారని అంటారు.

శ్రీ కోదండరామ స్వామి ఆలయం

2004లో భక్తులు విరాళాలను పోగుచేసి, 50 లక్షల రూపాయలతో కృష్ణానదికి అతి సమీపాన శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించారు. చినజీయర్ స్వామితో పూజలు చేయించి, విగ్రహ ప్రతిష్ఠ చేయించారు. ఎంతో అందంగా నిర్మించబడిన ఈ ఆలయ గోపురంపై దశావతారాల శిల్పాలు ఆకట్టుకుంటాయి.

కడిమి చెట్టు

ఆంజనేయస్వామి ఆలయ సమీపాన ఒక పుట్టపై కడిమిచెట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మహర్షి తపస్సు చేసుకున్నాడని, ఇక్కడే సమాధి అయ్యాడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ చెట్టును అతి మహిమాన్వితమైనదిగా భావించి పూజలు చేస్తారు.

బ్రిడ్జ్

మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ కు సుమారు 30 కిలోమీటర్ల దిగువన బీచుపల్లిలో ప్రవహిస్తున్న కృష్ణా నదిమీదుగా బ్రిడ్జ్ కట్టి నేషనల్ హై వేకు కలిపారు. దీనివలన తెలంగాణా, రాయల సీమలకు చక్కని రవాణా సౌకర్యమేర్పడింది.

బీచుపల్లి మంచి పర్యాటక కేంద్రం కూడా. కృష్ణవేణి, కృష్ణానది వంతెన, ఆంజనేయస్వామి దేవాలయం, శ్రీకోదండరామస్వామి ఆలయం, శివాలయం, కడిమి చెట్టు పుట్ట, నిజాం కోటకొండ, ఉద్యానవనం మొదలైనవి ఇక్కడ దర్శించదగ్గ ప్రదేశాలు. కృష్ణానది మీద వున్న వంతెన దాటుతున్నప్పుడు రోడ్డుమీదనుంచే ఈ దృశ్యాలను కొన్నిటిని చూడవచ్చు.

మార్గం

గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలో వున్నది బీచుపల్లి గ్రామం. గద్వాల, పెబ్బేరు వెళ్ళే బస్సులన్నీ బీచుపల్లిమీదనుంచే వెళ్తాయి. గద్వాల సమీప పట్టణం. (18 కి.మీ.ల దూరం) ఇక్కడనుంచి, లోకల్ బస్సులు, షేర్డ్ ఆటోలు కూడా వుంటాయి.

*(ఆలయం ఫొటో ఇంటర్‌నెట్ నుంచి సేకరణ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here