Site icon Sanchika

భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 14: జటప్రోలు

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–14” వ్యాసంలో జటప్రోలులోని ‘మదన గోపాలస్వామి ఆలయం, శివాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

జటప్రోలు

[dropcap]మ[/dropcap]హబూబ్‌నగర్ జిల్లా యాత్రలన్నింటికీ బంధు మిత్రులతో కలసి వెళ్ళినా, చాలా మటుకు పొద్దున్న వెళ్ళి, సాయంకాలం వచ్చేసినవే గనుక (దగ్గరని) వరుసగా వివరాలు రాయలేదు. అలా రెండు రోజులు వుండటానికి ఈ జిల్లాకి వెళ్ళింది ఒకేసారి. 2012, జనవరి 21న నేను, మావారు వెంకటేశ్వర్లు, మిత్రులు పూర్ణ, రాధలతో కలసి ఒక డ్రైవర్‌ని తీసుకుని మధ్యాహ్నం 12-50కి బయల్దేరాము మా కారులో. రెండు రోజులలో వీలయినన్ని చూసి రావాలని. సాయంకాలం 4 గంటలకి మన్యంకొండ చేరాము. మన్యంకొండని తెలంగాణా తిరుపతి అని కూడా అంటారు. ఈ ఆలయం మేమిదివరకే చూసినా, మా స్నేహితులు చూడలేదుగనుక వారి కోసం మళ్ళీ ఈ ఆలయం దర్శించాము. ఇక్కడ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం గురించి ఇంతకు ముందు వివరంగా తెలియజేశాను. అందుకని ఇప్పుడు మళ్ళీ రాయటం లేదు. మన్యంకొండనుంచి సాయంకాలం 6-30కి బయల్దేరి మహబూబ్‌నగర్ చేరాం. ఇంక చీకటి పడుతోంది గనుక ఆ రాత్రికి అక్కడే వుండదల్చుకుని హోటల్ కోసం ఆరా తీసి ప్రశాంతి రెసిడెన్సీలో మొదటి అంతస్తులో 4 పడకలున్న పెద్ద గది తీసుకున్నాము. రూ. 850. రూమ్ విశాలంగా, బాగుంది. మేము బయల్దేరేటప్పుడు, పూరీలు, పులిహోర వగైరాలు తీసుకెళ్ళాము. ఆ రాత్రికి అవి తిని పడుకున్నాము.

మర్నాడు వీలయినంత పెందరాళే బయల్దేరుదాము అని తెల్లవారు ఝామున 4 గంటలకే లేచాము. కానీ స్నానానికి వేణ్ణీళ్ళు వచ్చేసరికి ఉదయం 7 గంటలు. అప్పుడు తయారయి 8 గంటలకల్లా బయల్దేరి కిందనే వున్న ప్రశాంతి దర్శనిలో ఉపాహారం చేసి బయల్దేరాము.

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలయాల గురించి మాకు సరైన అవగాహన లేదు. నెట్‌లో కూడా వివరాలు ఎక్కువ దొరకలేదు. ఇలాంటి సమయాలలో మేమనుకున్నదానికన్నా ఎక్కువ విశేషాలు చూసిన సందర్భాలు వున్నాయి, నిరాశతో తిరిగి వచ్చిన సందర్భాలు వున్నాయి. అందుకనే మిత్రులకి ముందే చెప్పాను.. ప్రాప్తమెంతో అంతే చూస్తాము. సరైన వివరాలు లేవు అని. మిత్రులు కూడా ఒక్క రోజే కదా బయట వుండేది అని సిధ్ధపడ్డారు. అంతకు ముందు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చాము. అప్పుడు వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. అందుకే మళ్ళీ మాతో రావటానికి సిధ్ధపడ్డారు.

మహబూబ్‌నగర్ నుంచి పెబ్బేరు – కొల్లాపూర్ రహదారిలో పెబ్బేరునుంచి 38 కి.మీ. దూరంలో జటప్రోలు వస్తుంది. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు ముంపుకు గురవగా, ఇక్కడికి తీసుకు వచ్చి భద్రపరచిన మదన గోపాలస్వామి ఆలయం, శివాలయాలు వున్నాయి.

ముందుగా ఇదివరకు సంస్ధానాధీశ్వరులు ఏలిన జటప్రోలు సంస్ధానం గురించి నేను తెలుసుకున్నది చెప్తాను. లేకపోతే చరిత్రలు కాలగర్భంలో కలసిపోయి రూపు మాసిపోతున్నాయి. నా ఈ యాత్రలలో నేను తెలుసుకున్న విషయం ఇది. పురాతన ఆలయాల గురించి పురాణాలలో చెప్పారని అనేక కథలు ఇప్పటివారు చెబుతున్నారుగానీ అవి ఎంత మటుకూ నిజమో ఆధారాలేవీ వుండవు. కొన్ని కథలయితే నమ్మేటట్లు కూడా వుండవు. అందుకే అవకాశం వున్నంతమటుకూ నాలాంటి వాళ్ళన్నా తెలుసుకున్న వివరాలను సరిగ్గా చెబుతూ వుంటే ఆసక్తి వున్నవారికి కొంత సమాచారం తెలుస్తుంది కదా.

జటప్రోలు సంస్థానం మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదీ తీరాన వెలిసిన అత్యంత ప్రాచీనమైన సంస్ధానం. ఈ సంస్థానాధీశులు కొల్లాపూరును రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని కొల్లాపూరు సంస్థానమనికూడా అంటారు. వీరు మొదట జటప్రోలు రాజధానిగా పాలించి తర్వాత కొల్లాపూర్, పెంట్లవెల్లి రాజధానులుగా పాలించారు. ఈ సంస్థానం కృష్ణానది ఒడ్డున ఉన్న సువిశాల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉండేది. వీరి పాలన ఎప్పుడు ప్రారంభమైందనే విషయం ఖచ్చింతంగా వెలుగులోకి రాలేదు. అయితే చారిత్రక పరిశోధకుల ప్రకారం క్రీ.శ.6-7వ శతాబ్దిలో వీరి పాలన ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పాలకులందరూ సురభి వంశస్థులే. అందుకే వీరిని సురభి సంస్థానాధీశులంటారు. ఈ సంస్థానములో క్రీ.పూ. 2వ శతాబ్దముకు చెందిన పురావస్తు సంపదల ఆనవాళ్లు ఉన్నాయి. 1500 సంవత్సరాలకు పూర్వము కట్టించిన అనేక వందల పురాతన దేవాలయములను నేటికీ ఇక్కడ చూడ వచ్చును. కృష్ణా నది ఒడ్డునే కల సోమశిల దేవాలయం ఈ సంస్థానానికే చెందినది. నిజాము యొక్క పరిపాలనలో జటప్రోలు సంస్థానము చెప్పుకోదగిన పాత్ర పోషించింది.

15వ శతాబ్దం చివరిలో పిల్లలమర్రి బేతంనాయుడు వంశానికి చెందిన మాదానాయుడు జటప్రోలు ప్రాంతానికి వచ్చి అక్కడ కోటను కట్టడం ప్రారంభించాడు. మూడు తరాల తర్వాత ఈయన వారసులలో ఒకడైన మల్ల భూపతినాయుడు 1507లో విజయనగర రాజులనుండి ఈ ప్రాంతాన్ని పాలించడానికి సనదు (ప్రభుత్వ ఉత్తర్వు)ను పొందాడు. కృష్ణదేవరాయల పట్టాభిషేకానికి వెలుగోటి నాయకునిగా విచ్చేసిన సామంతుడు ఈయనేనని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు ఈ సంస్థానాధీశులకు సైనిక పోషణకై పట్టాలిచ్చారు. కానీ ఆయా సామ్రాజ్యల పతనం చెందినప్పుడు సంస్థానాధీశులు చాకచక్యంతో తమ రాజ్యాన్ని నిలబెట్టుకొని దక్షిణాపథంలో కొత్తగా ఆవిర్భవించిన శక్తులతో మనగలిగారు. 1513లో అప్పుడే కొత్తగా ఏర్పడిన గోల్కొండ సామ్రాజ్యంపై దండయాత్రకు సన్నాహాలు చేస్తూ, కృష్ణదేవరాయలు యుద్ధబలగాలను బేరీజు వేయటానికి, ఇతర సామంతులతో పాటు జటప్రోలు రాజు వెలుగోటి యాచమ నాయుణ్ణి కూడా పిలిపించాడు. ఆ సంవత్సరం రాయచూరు అంతర్వేదిలో జరిగిన యుద్ధంలో జటప్రోలు సంస్థానము కూడా పాల్గొన్నది.

ఔరంగజేబు దక్షిణాపథంపై దండెత్తి కుతుబ్ షాహీలను ఓడించినప్పుడు స్థానిక రాజవంశాలను నిర్మూలించక, వాటిని తను నియమించిన దండనాయకుని ఆధీనంలో తన రాజ్యంలో సామంతులుగా విలీనం చేసుకున్నాడు. అప్పటి నుండి జటప్రోలు సంస్థానం యొక్క స్వాధికారత, ప్రాబల్యం పెరగటం ప్రారంభమైంది. అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు జటప్రోలు యొక్క ప్రాబల్యాన్ని దక్షిణాన జటప్రోలు నుండి ఉత్తరాన పానగల్ యల్జల్ల, వరకు విస్తరించి పటిష్ఠపరచాడు.

జటప్రోలు సంస్థానాన్ని సుమారు పదహారు తరాలుగా కొన్ని శతాబ్దాల పాటు పరిపాలన కొనసాగించిన ‘సురభి’ రాజులంటే కొల్లాపూర్ ప్రాంత జనులకు వల్లమాలిన అభిమానం. వీరి పరిపాలన 7, 8 వందల సంవత్సరాల క్రితం నుంచే ప్రారంభమైనట్లు చరిత్రకారులు చెబుతారు. జటప్రోలు సంస్థానాధీశుల కోటను మల్ల నాయుడు నిర్మించగా, జటప్రోలు మదన గోపాల స్వామి ఆలయాన్ని మాధవరాయులు నిర్మించారని తెలుస్తున్నది. ఆ మదన గోపాలస్వామి ఆలయం చూశాము ముందుగా. ఇప్పుడు మేము చూసిన ఆలయాల గురించి….

శ్రీ మదన గోపాలస్వామి ఆలయం, జటప్రోలు

ఉదయం 10-30 అయింది ఆలయం చేరేసరికి. ఎత్తయిన గోపురం దూరంనుంచే ఆలయ ఉనికిని చాటుతోంది. ఆలయం చిన్నదే. కానీ ముందున్న మండపం, దానిలో శిల్పాలు పెద్దవి. విశాలమైన ఆ మండపం, చల్లగా, హాయిగా అనిపించింది ఎండలోంచి వెళ్ళిన మాకు.

           

గర్భగుడిలో శ్రీ రుక్మిణీ, సత్యభామా సమేత మదన గోపాలస్వామిని దర్శించవచ్చు. నల్లరాతి విగ్రహాలు. స్వామి 4 అడుగుల ఎత్తున పక్కన శ్రీ రుక్మిణీదేవి, సత్యభామలతో కొలువు తీరి వున్నాడు. పక్కనే లక్ష్మీదేవి విగ్రహం.

పూజారిగారు శ్రీ నరసింహమూర్తిగారు చెప్పినదాని ప్రకారం, ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో చోళులు కట్టించారు. పాత వూరు 1982 లో శ్రీశైలం ప్రాజెక్టు సమయంలో కృష్ణానదిలో మునిగితే ఆ ఆలయాలు ఇక్కడ భద్రపరచారు. అంత శ్రమ తీసుకుని ఆ ఆలయాలను వున్నవాటిని వున్నట్లుగా ఇక్కడికి మార్చి, భద్రపరచటానికి చాలా శ్రమ పడి వుంటారుగానీ, అంత శ్రమ పడ్డవారు ఆ ఆలయాల గురించి వివరాలు పుస్తకాల ద్వారాగానీ, బోర్డులద్వారాగానీ అందుబాటులో వుంచలేదు. పురాతన ఆలయాలను ఆసక్తిగా చూసేవారికి ఇది పెద్ద లోటుగానే కనబడుతుంది.

దర్శన సమయాలు

ఉదయం 7 గం. నుంచీ 11-30 దాకా. ఒక వేళ వేరే ఊర్లనుంచి వెళ్ళేవారెవరన్నా పూజారిగారు శ్రీ నరసింహమూర్తిగారికి ఫోన్ చేస్తే, అవకాశాన్నిబట్టి స్వామి దర్శనం చేయించగలరు. వారి సెల్ నెంబరు 9963873108.

శివాలయాలు, జటప్రోలు

శ్రీ నరసింహమూర్తిగారు ఇచ్చిన సమాచారం ప్రకారం అక్కడనుండి బయల్దేరి దగ్గరలోనే వున్న శివాలయాలకి వెళ్ళాము.

  

ఇక్కడకూడా చిన్న చిన్న శివాలయాలు, మరికొన్ని ఆలయాల సమూహం ఇది. ఇక్కడ కూడా ఒకటి, రెండు ఆలయాలలోనే నిత్య పూజలు జరుగుతున్నాయి. జన సంచారం లేదు. ఫోటోలు చూడండి. ఆలయాలను దర్శించి తర్వాత మజిలీకి బయల్దేరాము.

Exit mobile version