[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–15” వ్యాసంలో కొల్లాపూర్ లోని ‘మాధవస్వామి ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
కొల్లాపూర్
జటప్రోలు శివాలయాల నుంచి బయల్దేరి అక్కడికి 14 కి.మీ.ల దూరంలో వున్న కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం చేరేసరిగి మధ్యాహ్నం 12 గంటలయింది. ఆలయం తెరిచి వుంటుందో లేదో అనుకుంటూ వెళ్ళాము. మా అనుమానమే నిజమైంది. ఆలయం మూసి వుంది. లోపల ఆలయం చిన్నగా వున్నా విశాలమైన ఆవరణ వున్నట్లున్నది. చుట్టూ ప్రహరీ గోడ వున్నది. ఆలయం చుట్టూ శుభ్రంగా వున్నది. ఆలయం 12 గంటలకి మూసేశారేమోననుకున్న మా అనుమానం తీరుస్తూ ఆలయం ముందు బోర్డులో దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 9-30 దాకా, తిరిగి సాయంత్రం 5-30 నుంచీ 8-30 దాకా అని సూచించారు.
శ్రీశైలం ముంపుకు గురైన ఆలయాలను పునర్నిర్మించారుగానీ అన్నింటికీ వాటిని ఎక్కడనుంచీ తీసుకు వచ్చారు, ఏ కాలం నాటివి, ఎవరు నిర్మించారు, వగైరా వివరాలు తెలిపే బోర్డులు పెట్టి అందరికీ తెలియజేసే ప్రయత్నం చేసి వుంటే బాగుండేది. కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం దగ్గర మాత్రం కొంత సమాచారం, దర్శన సమయాలతో పెట్టబడి వుంది.
సురభి వంశస్తుల పాలనలో కొల్లాపూర్ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. వీరు కొల్లాపూర్ రాజధానిగా కూడా కొంతకాలం పరిపాలించారని కిందటి వారం చెప్పుకున్నాము కదా. వీరు 1871లో ఇక్కడ ఒక రాజ బంగ్లాను నిర్మించారు. దీనిని చంద్ర మహల్, మంత్ర మహల్, రాణి మహల్‌గా విభజించి సుందరంగా నిర్మించారు. కొల్లాపూర్ లోని న్యాయ దర్బార్‌గా పిలిచే గుండు బంగ్లా, జైలు ఖానాలను సురభి రాజులు వారి పాలనలో నిర్మించారు. మాకు ముందు తెలియక పోవటంవల్ల వీటిని మేము చూడలేదు. ఇక్కడ చారిత్రక భవనాలు, దేవాలయాలు అనేకం రాజ వంశీయులు నిర్మించినవే. దాదాపు 150 సంవత్సరాల క్రితం నాటి మునసబ్ కోర్టు జిల్లాలోనే ప్రథమ న్యాయస్థానమట.
కొల్లాపూర్ పట్టణంలో విశాలమైన రహదారులు, రహదారులకిరు వైపులా చెట్లు, డ్రైనేజీ వ్యవస్థ ఆనాడే ఏర్పాటు చేసారు. జనరేటర్ ఉపయోగించి విద్యుత్తును వినియోగించిన ఘనత కూడా వారికే దక్కుతుంది. త్రాగునీటి సరఫరా పైపులైను ఏర్పాటు చేసి కుళాయిలు ఆనాడే ఏర్పాటు చేసారు. 18 వ శతాబ్దం కాలంలోనే జటప్రోలు సంస్థానాధీశుల అధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ధర్మాసుపత్రిని కూడా ఏర్పాటు చేసారు. హైటెక్ పరిజ్ఞాన వినియోగంలో సురభి వంశస్థులదే అందె వేసిన చేయి. సురభి వంశస్థులు ప్రపంచ విపణిలో ఏ కొత్త వస్తువు వచ్చినా వాటిని వినియోగించుకునేవారు. వీరికి ఒక సొంత విమానం కూడా ఉండేదని. దానికి ఎయిర్‌పోర్టుగా కొల్లాపూర్ పట్టణంలోని జఫర్ మైదానాన్ని ఉపయోగించినట్లుగా చెబుతారు.
కొల్లాపూర్‌లో చూసేందుకు ఇంకే విశేషాల గురించీ మాకు తెలియలేదు గనుక నిరుత్సాహంగా ముందుకు సాగాము.
తర్వాత సేకరించిన మాధవస్వామి ఆలయ విశేషాలు…..
శ్రీ మాధవస్వామి ఆలయం జటప్రోలు రాజు శ్రీ సురభి మాధవరాయలు 16వ శతాబ్దంలో కృష్ణానది ఎడమ ఒడ్డున మంచాలకట్టలో నిర్మించారు. దీనిలోని శిల్ప సౌందర్యం అద్భుతంగా వుంటుంది. ఈ ఆలయ గోడల మీద శ్రీ మహావిష్ణు గాథలు అందంగా చెక్కబడి వున్నవి. ఆలయం ముందు మండపం స్తంభాలు, గరుడాలయం కూడా చాలా అందంగా తీర్చి దిద్దారుట.
ఈ ఆలయం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు వారి అధీనంలో వున్నది. కొల్లాపూర్ రాజ సంస్ధానం దీని నిర్వహణ చూస్తున్నది.