Site icon Sanchika

భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 16: సోమశిల

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–16” వ్యాసంలో సోమశిల లోని ‘శివాలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

సోమశిల

కొల్లాపూర్ నుంచి మధ్యాహ్నం 12-10కి బయల్దేరాము అక్కడికి 8 కి.మీ.ల దూరంలో వున్న సోమశిలకి. కొల్లాపూర్ చౌరస్తానుంచి సరాసరి వెళ్ళాలన్నారు. దోవ సన్నగా వున్నది. 12-30కల్లా సోమశిల చేరాము. ముందుగా కృష్ణానది ఒడ్డుకి వెళ్ళాము.. కృష్ణలో స్నానం చెయ్యాలనే సంకల్పంతో. నీళ్ళు లోపలకి వున్నాయి. ఒడ్డంతా రాళ్ళు చాలా కోసుగా వుండి నీళ్ళదాకా వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డాము. కృష్ణలో స్నానం చెయ్యాలనే ఉత్సాహంతో అలాగే కష్టపడుతూ వెళ్ళాము. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. కృష్ణలో దిగితే అంతా బురదగా వున్నది. అంతకు ముందు బాగున్న నీళ్ళు కూడా మేము కాళ్ళు పెట్టేసరికి అడుగున వున్న బురద అంతా పైకి వచ్చి నీళ్ళు బాగా మురికిగా అయ్యాయి. ఆ ఒండ్రు మట్టి మమ్మల్ని ఎక్కడ లాగేస్తుందోనని భయం కూడా వేసింది. అలాగే స్నానం అయిందనిపించి బయటకి వచ్చి బట్టలు మార్చుకున్నాము.

నిన్న మేము తెచ్చుకున్న పూరీ, పులిహోర ఇంకా మిగిలినవి కేరియర్లల్లో వున్నాయి. ఆకలి వేసి వాటినే తిన్నాము. ఆ చుట్టు పక్కల మనిషే లేరు, ఇంక తినటానికి ఏమి దొరుకుతాయి. మేము తింటుండగా ఒకతను వచ్చాడు. స్నానానికి వేరే ఘాట్ వుంది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడంతా ఒండ్రు అన్నాడు. ఏం చేస్తాం నాయనా, చెప్పేవాళ్ళు లేక మేము ఆ ఒండ్రు నీళ్ళల్లోనే స్నానం చేశాము అనుకుని, అయినా దేనికైనా భక్తి ప్రధానంకానీ మిగతావేవీ కాదని మాకు మేమే సమాధాన పడ్డాము. మేము తెచ్చుకున్నవి వుంటే పెట్టమన్నాడు. మేము నిన్నటివి అని సందేహించాము. అతను మాకు మల్లే వున్నదే చాలని సంతోషంగా తిన్నాడు. ఆకలి బాధ, ఆహారం విలువ ఇలాంటప్పుడే తెలుస్తాయనిపించింది.

మధ్యాహ్నం 2-20కి బయల్దేరి సోమశిలలోని శివాలయానికి వెళ్ళాము. ఈ ఆలయం పేరు శ్రీ లలితా సోమేశ్వరస్వామి దేవస్ధానం. అసలు ఇది 7వ శతాబ్దంలో నిర్మింపబడిందిని చెబుతారు. శ్రీశైలం ప్రాజెక్టు వల్ల కృష్ణానదిలో మునిగిపోకుండా పాత సోమశిల గ్రామంనుంచి కదిల్చి, గట్టున పునర్నిర్మాణం చేశారు. ఈ గుడి 15 దేవాలయాల సముదాయం. జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధమైన ద్వాదశజ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఈ గుడిలో ప్రతిష్ఠించారు. ఈ గుళ్ళలోని అన్ని గర్భగుళ్ళకి పైన గజలక్ష్మి వుండడం విశేషం. పశ్చిమ చాళుక్యుల దేవాలయాలకు గజలక్ష్మి వుండడం ఆచారంగా కనపడుతుంది. అదే సంప్రదాయం కాకతీయుల దాకా కొనసాగింది. ఇక్కడ వున్న ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు, లలితా అమ్మవారు, వీర భద్రుడు, ఆంజనేయస్వామి ఇంకా కొన్ని శివాలయాలు. గుడి ముందర రెండు శాసనస్తంభాలు ఉన్నాయి. అందులో ఒకటి కళ్యాణి చాళుక్య చక్రవర్తి త్రైలోక్యమల్లు ఒకటవ సోమేశ్వరుని పాలనాకాలంలో క్రీ.శ.1055 అక్టోబరు 21న హైహయ వంశీకుడు మహామండలేశ్వరుడు రేచరస, నాళియబ్బె చేసిన దానశాసనం. శాసనస్తంభం బాగా శిథిలం కావడం వల్ల పూర్తి శాసనపాఠం లభించలేదు. (Inscriptions of AP-Mahabubnagar Dist. Vol.I,No.66…pg no.87) రెండవ శాసనం కాకతీయ మహారాజు రెండవ ప్రతాపరుద్రుని పాలనాకాలంలో.. క్రీ.శ.1297 జనవరి 24నాటి దాన శాసనం.

                      

ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి ఉత్సవాలు బాగా జరుగుతాయిట.

ఆలయాలు అన్నీ తీసే వున్నాయి. పూజలు జరుగుతున్నాయి కానీ మనుష్యులు లేరు. బహుశా పూజారులు కూడా పొద్దున్న వచ్చి పూజ చేసి వెళ్తారేమో. మండపాలు చల్లగా, ప్రశాంతంగా, హాయిగా వున్నాయి. మా రాధ చాలా బాగా పాడుతుంది. ఆ ప్రశాంత వాతావరణంలో కూర్చుని శివ స్తుతులు మొదలు పెట్టింది. ఎంత హాయిగా వుందో. జీవితంలో అప్పుడప్పుడూ అలాంటి ప్రశాంతతని అనుభవించాలనిపించింది.

కానీ మనల్ని నియంత్రించే సమయం ఒకటి వున్నది కదా. ఆ రోజు ఇంటికి చేరాలి. సాయంత్రం 3-55కి బలవంతాన అక్కడనుండి బయల్దేరాము ఈ ప్రయాణంలో మా ఆఖరి మజిలీ సింగోటంకి.

ఇక్కడికి దగ్గరలోనే సంగమేశ్వరస్వామి ఆలయం వున్నదిట. మాకు తెలియక వెళ్ళలేదు. మీకవకాశంవుంటే చూడండి.

Exit mobile version