Site icon Sanchika

భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 3: శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీ రంగాపురం

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 3” వ్యాసంలో శ్రీ రంగాపురం లోని “శ్రీ రంగనాథస్వామి ఆలయం” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ రంగనాథస్వామి ఆలయం, శ్రీ రంగాపురం

[dropcap]హై[/dropcap][dropcap][/dropcap]దరాబాదునుంచి 160 కి.మీ.ల దూరంలో, పెబ్బేరు – వనపర్తి మార్గంలో శ్రీ రంగాపురంలో వున్న శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని దర్శిద్దామివాళ.

శ్రీరంగాపురానికి పూర్వం పేరు కొఱివిపాడు. ఇక్కడ రంగనాయకస్వామి ఆలయం నిర్మింపబడిన తర్వాత ఆ స్వామి పేరుమీద ఈ ఊరు శ్రీరంగాపురమయింది.

అతి విశాలమైన ఆవరణలో, ప్రాంగణంలో అడుగు పెడుతుండగానే కనువిందు చేస్తూ, చల్లని గాలితో సేద తీర్చే రకరకాల మొక్కలతో, చుట్టూ విశాలమైన చెరువుతో (రంగ సముద్రం దీని పేరు) అత్యంత ఆకర్షణీయంగా వుంటుంది ఈ ఆలయం.

మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిధ్ధికెక్కిన ఈ ఆలయాన్ని నిర్మించింది వనపర్తి సంస్ధానీశులు. దీనికి స్ఫూర్తి శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం. క్రీ.శ. 1657 సం. నుండి క్రీ.శ. 1675 సం. వరకు వనపర్తి సంస్ధానాన్ని పాలించిన గోపాలరావు ఈ నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఈయన క్రీ.శ 1662 లో తీర్ధయాత్రలు చేస్తూ దక్షిణాన శ్రీరంగ క్షేత్రమును దర్శించారు. ఆ ఆలయ నిర్మాణానికి, శిల్ప సంపదకూ ముగ్ధుడైన గోపాలరావు అటువంటి ఆలయము తమ రాజ్యమునందు కూడా నిర్మించాలని సంకల్పించారు.

ఆ రోజు శ్రీరంగంలో నిద్రలోవున్న గోపాలరావుకి స్వప్నంలో శ్రీ రంగనాధుడు దర్శనమిచ్చి తను వారి సంస్ధానంలోనే వున్నానని, తాను గరుడ పక్షి రూపంలో చూపించిన ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేసి, తన విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించమని ఆదేశించాడు. గోపాలరావు తిరుగు ప్రయాణంలో తిరుపతి, కంచి మొదలగు ప్రాంతాలలో ప్రసిధ్ధులైన కవి, పండితులను తీసుకుని వచ్చి తమ రాజ్యంలో ఆశ్రయం కల్పించారు. ఆ విధంగా వనపర్తి సంస్ధానంలో కవి పండితుల కుటుంబాలకు ఆదరణ పెరిగింది.

గోపాలరావు తిరిగి వచ్చి రంగంపేట సమీపంలో స్వామి స్వప్నంలో చూపించిన ప్రదేశాన్ని గుర్తించారు. అక్కడవున్న పుట్టపై నీటిని పోసి జాగ్రత్తగా మట్టిని తొలిగించగా దాదాపు ఐదు అడుగుల పొడవున శేషశయనుడై శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, నాభి కమలములో చతుర్ముఖ బ్రహ్మలతో దేదీప్యమానమైన శ్రీరంగనాథస్వామి విగ్రహం కనిపించింది.

ఆ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలా అనే ఆలోచనతో జాగ్రత్తగా బండి ఎక్కించారు. స్వామి స్వప్నాదేశం ప్రకారం బండికి ముందు గరుడ పక్షి ఆకాశ మార్గాన పయనిస్తూ దారి చూపించసాగింది. చివరికి ఆ గరుడుడు ఇక్కడ ఒక గుట్టపై ఆగి, తర్వాత అంతర్ధానమయ్యాడు. ఆవిధంగా క్రీ.శ. 1670 సం.లో ఇక్కడ ఆలయ నిర్మాణ ప్రారంభమైంది.

     

గోపాలరావు తన దత్తపుత్రుడు వెంకటరెడ్డి పేరిట ఊరిలో తవ్వించిన తాగునీటి బావి నేటికీ గ్రామ ప్రజలకు ఉపయోగపడుతోంది. గోపాలరావు తర్వాత ఆలయ అభివృధ్ధికి కృషి చేసినది రాణీ శంకరమ్మగారు. ఈవిడ ఆలయ విమాన గోపురాన్ని, ముఖద్వారంపైగల గాలి గోపురాన్ని నిర్మింపచేశారు. దీనికోసం ఆవిడ తమిళనాడునుంచి శిల్పులను రప్పించి, వారికి సకల వసతులూ ఏర్పాటు చేశారు. దాదాపు ఇరవై అడుగుల ఎత్తుగల ముఖ ద్వారం, అరవై అడుగుల ఎత్తుగల గాలి గోపుర నిర్మాణం క్రీ.శ. 1804 సం. లో పూర్తయింది. అంతేకాదు. ఆవిడ ఆలయానికి మూడువైపులా వున్న చెరువును మరికొంత లోతుగా తవ్వించి సాగునీటి కుపయోగపడేటట్లు చేశారు.

గాలి గోపురం లోపలకి వెళ్తే నేలపై బోర్లా పడుకుని వున్న పురుషుని శిల్పం కనబడుతుంది. ఈ గాలి గోపురం నిర్మించిన శిల్పి కోయంబత్తూరు సుబ్బారావు, ఆలయంలోకి వచ్చే ప్రతి ఒక్కరి పాదధూళి తగిలి తన జన్మ ధన్యం కావాలనే ఉద్దేశ్యంతో, శంకరమ్మగారి అనుమతితో తన శిల్పాన్ని అలా మలచుకున్నాడుట. ఆ కాలంలోవారికి ఎంతటి భక్తి తత్పరతో కదా.

రాణీ శంకరమ్మగారి కుమారుడు రెండవ రామేశ్వరరావు కూడా ఈ ఆలయ అభివృధ్ధికి అపూర్వమైన కృషి చేశాడు. ఈయన రంగనాయకస్వామి గర్భగుడి పక్కనే చతుర్భుజ తాయారు (లక్ష్మీదేవి) ఆలయం, దాని ఎదురుగా స్వామివారి కళ్యాణ మంటపం, ఆళ్వార్లకు ఉపాలయం నిర్మించారు. ఇవి అద్భుత శిల్పకళా నిలయాలు.

భారత దేశ స్వాతంత్ర్యానంతరం సంస్ధానాలు లేకపోయినా వీరు చేసిన అభివృధ్ధి కార్యక్రమాలకు మాత్రం ఆటంకం రాలేదు. శ్రీ సీతారామాంజనేయస్వామి ఉపాలయం, అర్చకులకు వసతి గృహాలు, ఆలయంలో నీటి సౌకర్యం, ఆలయంలో వివాహాలు జరుపుకునేవారి సౌకర్యార్ధం వంటశాల, గ్యాస్ స్టౌలు, రక్షణకి ప్రహరీ గోడ మొదలగు అనేక అభివృధ్ధి కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో జరిగాయి. అంతేకాదు.. ఈ సంస్ధానీధీశులు అనేక విద్వత్ సభలు జరిపి కవి, పండితులను ఆదరించి పోషించారు.

పూజా విశేషాలు

స్వామికి మూడుపూటలా శాస్త్రోక్తంగా అన్ని పూజలూ నిత్యం జరుగుతాయి. ఇవిగాక ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, గోదా కళ్యాణం, దేవీ నవరాత్రులు, దీపావళి, ధనుర్మాసం, వైకుంఠ ఏకాదశి మొదలగు పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష దశమినుండి కృష్ణ పక్ష విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.

దర్శన సమయం

ఉదయం 8 గం. లనుంచి రాత్రి 8 గం.లదాకా.

Exit mobile version