భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 8: ఉమా మహేశ్వరం

0
2

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–8” వ్యాసంలో అచ్చంపేట మండలం లోని “ఉమా మహేశ్వరం” ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

ఉమా మహేశ్వరం

[dropcap]కొం[/dropcap]డలలో నెలకొన్న ఆలయం ఇది. శ్రీశైలం సొంత వాహనాల్లో వెళ్ళేవాళ్ళు తేలికగా వెళ్ళి రావచ్చు. చూసే మనసుకి కళ్ళుండాలే గానీ రాళ్ళూ రప్పలలో, కొండా కోనలలో కూడా ప్రకృతి విరజిమ్మిన అందాలెన్నో కనిపిస్తాయి. అలాంటి అందమైన ప్రదేశమే ఇది.

ఉమామహేశ్వరం మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామపంచాయతీలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. శివుడు పార్వతీదేవితో కొలువు దీరిన ప్రాంతంగా ఇది ప్రఖ్యాతి చెందింది. ఈ దేవాలయం కొండలో మిళితమై ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలోని పవిత్ర శైవక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ప్రకృతి రమణీయత అద్భుతం.

శ్రీశైలానికి నాలుగు ముఖ ద్వారాలుగా నాలుగు పుణ్యక్షేత్రాలని చెబుతారు కదా. అవి తూర్పులో త్రిపురాంతకం. ఇక్కడ త్రిపురాంతకేశ్వరుడు, బాలా త్రిపుర సుందరి కొలువుతీరి వున్నారు. దక్షిణాన సిధ్ధవటం.. ఇక్కడ సిధ్ధేశ్వరుడు. పశ్చిమాన శక్తిపీఠాలలో ఒకటైన అలంపురం. మహా శక్తి స్వరూపిణి జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి నెలకొని వున్న పుణ్య స్ధలమిది. ఇంక ఉత్తరాన ఉమామహేశ్వరం. మహేశ్వరుడు స్వయంభూగా అవతరించి, ఉమాదేవితో పూజలందుకుంటున్న ప్రదేశమిది.

ఈ క్షేత్రం హైదరాబాదుకు దాదాపు 100 కి.మీ.ల దూరంలో వున్నది. శ్రీశైలం వెళ్ళే దోవలో కొంచెం పక్కకి తిరిగి వెళ్ళాలి. అన్నట్లు ఈ దోవలో వెళ్ళేటప్పుడు నల్లటి పెద్ద రాతి నంది కనబడుతుంది… చూడండి. మండంల కేంద్రం అచ్చంపేటకి 12 కి.మీ. ల దూరంలో వుంది ఈ క్షేత్రం.

ఈ క్షేత్రంలో పూర్వం పార్వతీదేవి శివుడికోసం తపస్సు చేసిందట. అనేకమంది మహర్షులు పురాణకాలంనుంచీ వందల సంవత్సరాలపాటు తపస్సు చేసిన మహత్తర పుణ్య క్షేత్రమిది. స్కంద పురాణంలో దీని ప్రశస్తి పేర్కొనబడింది. అయితే ఇక్కడ శివుడు ఎప్పుడు ఆవిర్భవించాడు అనే వివరాలు తెలియటం లేదు.

    

ఈ దేవాలయాన్ని క్రీ.శ. 1232లో కాకతీయులు నిర్మించారని చెబుతారు. కాకతీయుల కాలంనాటి పండితారాధ్య చరిత్ర అనే గ్రంధంలో ఈ క్షేత్రం గురించి వివరించబడింది. క్రీ.శ 14 వ శతాబ్దంలో మాదానాయుడు కొండపైకి వెళ్ళేందుకు మెట్లని నిర్మించాడు. ఈ కొండ అర్ధ చంద్రాకారంలో వుంటుంది. ఆలయం కొండలోనే మలచబడింది. ఒక పక్క బారులు తీరిన కొండలలో దేవాలయం, తీర్ధం, మరోపక్క అద్భుతమైన ప్రకృతి సౌందర్యం… మధ్యలో పలకరించే మన ఆత్మీయ స్నేహితులు.. అవేనండీ కోతులు.. చల్లగా హాయిగొలిపే వాతావరణం.. కొంచెంసేపు అక్కడ గడపకుండా రాలేరు ఎవరూ. మరి ఈ కొండ ఎక్కాలంటే 600 మెట్లు ఎక్కాలి. ఎక్కగలరా?? అయ్యబాబోయ్ అనేస్తున్నారు కదా. అందుకేనండీ, మనలాంటి వాళ్ళ కోసమే చక్కని రాజ మార్గం వేశారు. ఇంచక్కా గుడిదాకా కారులో వెళ్ళచ్చు. హమ్మయ్య! కదా!!

 

ఆలయానికి కొంచెం ముందుకెళ్తే కొంచెం ఎత్తుగా కొండమీద చిన్న నీటి గుంట. దీనిలోకి నీరు 200 మీటర్ల పైనున్న పాపనాశని జలపాతంనుంచి వస్తుంది. ఈ గుంటలో నీరు ఎంత తీసినా తరగదు. ఈ పాప నాశనిలో స్నానం చేసి స్వామిని దర్శిస్తే సకల పాపాలూ పోతాయట. మేము వెళ్ళినప్పుడు ఒకాయన ఆ గుంటలోంచే నీళ్ళు తీసుకుని స్నానం చేస్తున్నారు.

ఇక్కడ ఇంకొక విశేషం కూడా చూశాను. చిన్న చిన్న రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చబడి వున్నాయి. అవి ఏమిటని అడిగితే ఇల్లు కట్టుకోవాలనుకున్నవాళ్ళు మనసులో ఆ కోరిక స్వామికి చెప్పి అక్కడ అలా రాళ్ళు పేరుస్తారుట. అలా చేస్తే త్వరలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని నమ్మకం.

ఇక్కడికి వచ్చే భక్తులకి నమ్మకాలు కూడా చాలా ఎక్కువ. శివరాత్రి పర్వదినాన సర్వ దేవతా గణం ఇక్కడికి వస్తారుట. ఇక్కడ పట్టెడన్నం దానం చేస్తే లెక్కలేనంత ఫలితాన్నిస్తుందట. ఒక రాత్రి ఇక్కడ నిద్రిస్తే కాశీ, ప్రయాగాది పుణ్య క్షేత్రాలలో లక్షల సంవత్సరాలు నివసించిన ఫలితం వస్తుందిట. కానీ అంత నివాస యోగ్యంగా నాకనిపించలేదు.

ఇక్కడ ఆలయంలోనేకాక బయట కూడా కొండ ఛాయలో శివ లింగాలు దర్శనమిస్తాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. శ్రీశైలం వెళ్ళేవారు తప్పక దర్శించాల్సిన క్షేత్రం ఉమామహేశ్వరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here