భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా – 9: జోగుళాంబ ఆలయం, అలంపూర్

0
2

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–9” వ్యాసంలో అలంపూర్ లోని “జోగుళాంబ” ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

జోగుళాంబ ఆలయం, అలంపూర్

ఆదిశక్తి అవతరించిన అష్టాదశ శక్తి పీఠాల గురించి చాలా మందికి తెలిసే వుంటుంది. వాటిలో కనీసం కొన్నింటినైనా చాలామంది చూసే వుంటారు. మరి మన రాష్ట్రంలో వున్న ఏకైక శక్తి పీఠం జోగుళాంబా దేవి ఆలయాన్ని ఇప్పుడు దర్శిద్దామా?

జోగుళాంబ కొలువైన అలంపురం శక్తి పీఠాలలో ఐదవది. ఇది శ్రీశైలానికి దక్షిణ ద్వారమంటారు. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయంటారు. 7వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మింపబడిందనీ, 9వ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారనీ అంటారు. అయితే 14వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రలలో ఈ ఆలయం నేలమట్టమయింది. స్ధానికులు అమ్మవారి విగ్రహాన్ని, ద్వార పాలికలు చండి, ముండి విగ్రహాలను సమీపంలోనే వున్న బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఒక చిన్న గదిలో వుంచి పూజించారు. మిగతా దేవాలయాలు నాశనం కాకుండా విజయనగర చక్రవర్తి, రెండవ హరిహరరాయల కొడుకు – మొదటి దేవరాయలు రక్షించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇది క్రీ.శ. 1390లో జరిగింది. 600 సం. ల తర్వాత ఇదివరకు అమ్మవారి ఆలయం వున్న ప్రదేశంలోనే నూతన ఆలయం నిర్మింపబడింది. పాత విగ్రహాన్ని తిరిగి ఇక్కడ ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తున్నారు.

     

అమ్మవారు

ఈ దేవి కొంచెం వికృత రూపంతో వుంటుంది. ఈమె శవంమీద కూర్చుని వుంటుంది. ఈవిడ తలపై జుట్టులో బల్లి, కప్ప, పాము, గబ్బిలం వుంటాయి. నాలుక బయటకు జాపి వుంటుంది. అయితే ఆవిడకి జరిగే అలంకరణ వల్ల ఇవ్వన్నీ మనకి కనబడవు. అమ్మని మనం ప్రశాంతంగానే దర్శించుకోవచ్చు. ఆవిడ తలలో వుండే బల్లి, కప్ప, పాము, గబ్బిలాలని చూడాలనుకునేవారు గర్భాలయం ముందు వుండే ద్వార పాలికల తలమీద అవే రూపాలను చూడవచ్చు. కొంచెం పరీక్షగా చూస్తే అమ్మవారి బంగారు కిరీటంపైకూడా కనిపిస్తాయి.

జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో చుట్టూ వున్న కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం.

ఈవిడ యోగులకు సిధ్ధిని ప్రసాదించే దేవత. అందుకే యోగుల అమ్మ, జోగుళాంబ అయింది. ఈవిడని గృహచండి అనికూడా అంటారు. ఈవిడని సేవిస్తే గృహచ్ఛిద్రాలు, గృహంలో వాస్తు సంబంధమయిన దోషాలు తొలగిపోతాయిట.

అలంపురాన్ని పూర్వం హలంపురంగానూ, హటాంపురంగానూ వ్యవహరించేవారని క్రీస్తు శకం 1101 సంవత్సరం నాటి శాసనం తెలియజేస్తోంది. ఈ శాసనం పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్య-4 కాలం నాటిది.

ఇక్కడి జోగులాంబ, బ్రహ్మేశ్వరస్వామి వార్ల ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి చెందినవి.

సంగం

ఈ ఆలయానికి ముందే (కొన్ని మెట్లు ఎక్కి దిగాలి) తుంగభద్రా నది వున్నది. ఇక్కడ కృష్ణ, తుంగ భద్ర నదులు కలుస్తాయి. అందుకే దీనిని దక్షిణ కాశీగా చెబుతారు. భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడి ఆలయాలను దర్శిస్తారు.

మార్గము

అలనాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలుకు 27 కిలో మీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్‌కి 90 కిలోమీటర్ల దూరంలోనూ, హైదరాబాద్‌కి 200 కిలో మీటర్ల దూరంలోనూ వుంది. అన్ని చోట్లనుంచి బస్ సౌకర్యం వుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here