Site icon Sanchika

భక్తియోగంతో కర్మాచరణ

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భక్తియోగంతో కర్మాచరణ’ అనే రచనని అందిస్తున్నాము.]

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే॥
[భగవద్గీత 5వ అధ్యాయం (కర్మయోగం) లోని 7 వ శ్లోకం]

[dropcap]భ[/dropcap]క్తియోగంతో కర్మలు చేసేవాడు, పరిశుద్ధాత్ముడు, ఇంద్రియములు, మనస్సును జయించినవాడు అయిన మానవుడు అందరికీ ప్రియుడై వుంటాడు. అందరి ఎడల ప్రేమను కలిగి వుంటాడు మరియు అట్టి సాధకుడు ఎల్లప్పుడూ భౌతిక కర్మలను చేస్తున్నా కూడా వటి పట్ల బద్ధుడు కాడని పై శ్లోకం అభిప్రాయం.

నిష్కామకర్మాచరణం, నిర్మలహృదయం, మనోజయం ఇంద్రియ నిగ్రహం కలిగి, సమస్త జీవులలో వుండే ఆత్మ, తన ఆత్మ ఒకటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసినా ఎలాంటి దోషమూ అంటదు అన్న అర్థం ద్వారా భగవానుడు మానవులు ఏ విధంగా కర్మలు ఆచరిస్తూ నిష్కామ జీవితం గడిపి తరించాలో చక్కగా మార్గ నిర్దేశనం చేశాడు.

మన జీవితంలో అనుక్షణం – భౌతికంగా, మానసికంగా, భావపరంగా లేదా శక్తి పరంగా – మనం ఏదో ఒక రకమైన చర్య చేస్తూనే ఉంటాము. ప్రతి చర్య ఒక విధమైన స్మృతిని కలుగజేస్తుంది. దానినే కర్మ అంటారు. కర్మ అంటే ‘కార్యాచరణ’, ‘స్మృతి’ రెండూనూ. కార్యాచరణ లేకుండా స్మృతి ఉండదు, అలాగే స్మృతి లేకుండా కార్యాచరణా ఉండదు. శారీరకంగా మనం చేసే కార్యకలాపాలు ఎటువంటివైనా సరే – వాటిని మనం పూర్తి నిమగ్నతతో, ఆనందంతో చేస్తే, మనమే ఒక కర్మ యోగి అవుతామని శాస్త్రం చెబుతోంది. అయితే ఫలితం ఆశించక, కర్మ చేస్తున్నామఏ భావన లేకుండా, తామరాకు మీద నీటి బొట్టులా దేనికీ అంటక వుండడాన్ని నిష్కామకర్మ అంటారు.

సుఖ దుఃఖ ఆసక్తిని పొందక, శీతోష్ణాది ద్వంద్వముల చేత కుంగక, జరా మృత్యు వార్థక్యరూపమైనటువంటి వాటి చేత కుంగక, పొంగక, యవ్వనాది విశేషముల చేత లాభింపక, శరీర ఇంద్రియ వ్యాపార సహితమైనటువంటి చర్యల యందు నిమగ్నము కాక, సంగత్వమును పొందక ఉండేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అంతే సూక్ష్మంగా మనల్ని అనుక్షణం పీడించే ద్వందాలనండి విముక్తుడై వుంటాడో అట్టి వాడు జ్ఞాని అని పిలువబడుతున్నాడు అని మనం తెలుసుకోవాలి.

ఇందుకోసం తీవ్ర సాధన అవసరం. అంతే కాని ద్వందాతీత స్థితిని పొందదం అసాధ్యం అయితే కాదు. తానైనటువంటి సహజ స్థితిలో తాను నిలకడగా వుండడం, అచలంగా, నిశ్చలంగా, అంతర్ముఖుడై సర్వవ్యాపితర్వాన్ని, సర్వ జీవ సమానత్వాన్ని అనుభవిస్తూ ఫలాపేక్ష రహితముగా సంగత్వ రహితంగా కర్మలు చేయడం ద్వారానే శాశ్వత బ్రహ్మానంద స్థితిని అనుభవించువచ్చునని, అదే మోక్షనికి ప్రథమ సోపానమని భగవానుడి ఉవాచ.

Exit mobile version