Site icon Sanchika

భానుమతికి బ్రహ్మదేమునిపై కోపం వచ్చింది

[dropcap]భా[/dropcap]నుమతి అందరిలాగే ఒక మధ్య తరగతి సగటు భారతీయ మహిళ. సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగిన అందగత్తె, ఏదో డిగ్రీ వరకు చదివిన ఆమెకు పెళ్లి చేసి భర్తతో కొత్త కాపురానికి పంపేశారు.

అందరిలాగే ఆమె జీవితంలో సరదాలు, సంబరాలు, చికాకులు, భాద్యతలు, వెరసి అన్ని గందరగోళాలు ఉన్నాయి. ఎంత కష్టపడినా ఎదగలేకపోవటం, గుర్తింపు లేకపోవటం, అనుకున్న స్థాయికు చేరలేకపోవటం ఇలాంటి మలుపులు ఆమె జీవితంలో ఉన్నాయి. స్థిరత్వం లేని మనస్తత్వం, చీటికీ, మాటికీ ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మారిపోయే భావాలు, అసూయ, ఆనందం, నిరుత్సాహం, వైరాగ్యం, ఇవి అన్నీ కలగబోసి. ఒక మధ్యతరగతి సగటు మహిళ ఎలా ఉంటుందో మనం ఈ భానుమతి పాత్రలో చూడబోతున్నాం.

మరి భానుమతి ఇంటిలోకి కాసేపు తొంగిచూద్దామా….

***

‘అబ్బబ్బ!…. చచ్చిపోతున్నా సర్దలేక, పనికిమాలిన సన్నాసులు, నిద్ర లేచి దుప్పటి కూడా మడత పెట్టి ఒద్దికగా పెట్టాలని, కనీసపు ఇంగిత జ్ఞానం లేదు. లేవటమే బారెడు పొద్దెక్కిన తరువాత, ఎవ్వరి ఇంటికయినా వెడితే, ఏం పెంపకంరా బాబూ అంటూ మమ్మల్ని తిట్టుకుంటారు. ఛీ! ఖర్మ!’ అని దుప్పట్లు మడతబెడుతూ, తన పిల్లల్లను తిట్టుకోవటం మొదలు పెట్టింది భానుమతి.

అప్పుడే బ్రష్ చేసుకుని, బాత్రూం నుండి బయటకు వద్దామని అనుకున్న పుత్రరత్నం, తల్లి దండకం విని భయపడి, ‘మా అమ్మకు చాదస్తం, నేను సర్దేలోపే తానే సర్దేసి, పైగా మీకు శ్రద్ధ లేదు అని తిడుతుంది. ప్రొద్దున్నే ఈవిడతో దెబ్బలాట ఎందుకు’ అని గొణుక్కుంటూ, ఆమె ఆ గదిలోనుంచి బయటకు వెళ్ళేదాకా వాడు బాత్రూంలో ఉండిపోయాడు.

అక్కడ పని అవగానే గబగబా నడుచుకుంటూ మళ్ళీ వంటింట్లోకి చేరింది. “మరీ యాంత్రిక జీవితం అయిపొయింది, ఒక్క సుఖం లేదు, సరదా లేదు, ఇద్దరు పిల్లలు ఎదిగి ఉన్నారు, కానీ, ఎందుకూ పనికిరారు. పెళ్లయిన దగ్గరనుండి చూస్తున్న, ఈయన వల్ల నాకు కాస్త సాయం కూడా లేదు” అంటూ పనిలో పనిగా మొగుడిని కూడా తిట్టుకుంటూ వంటపనిలో నిమగ్నమయింది భానుమతి.

భానుమతి మాటలు వింటున్న వాళ్ళ ఆయన పరంధామయ్య, పిల్లలు, ఇప్పుడు ఆవిడకు ఎదురెళ్లి దెబ్బలాడేకన్నా కాస్త తప్పించు తిరగడమే మంచిదని, ఎవ్వరూ ఎదురు చెప్పకుండా, కుక్కిన పేనులా పడి ఉన్నారు. ఒకవేళ ఎదురు వెళ్లి ఏదో చెబుదామన్నఆవిడకు ఒక పట్టాన నచ్చదు, పైగా ఏమి చేయాలో చెప్పకుండా, మీకు ఏమీ రాదు అంటూ మరో క్లాస్ పీకుతుంది. అందువల్ల ఇలాంటి సమయాల్లో “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” అంటూ అలవాటు చేసుకున్నారు.

అలా మూలుక్కుంటూనే భానుమతి ఆ రోజు పనులు, వంట అన్నీచేసి మధ్యాహ్నం భోజనాలకు రమ్మనమని అందరికీ ఆర్డర్ వేసింది. సెలవు రోజు కావటంతో అందరూ ఇంట్లోనే ఉండటం, ఒకేసారి అందరూ తినేస్తే పని కలసి వస్తుందని ఆమె భావన.

“అమ్మా. ఏం వండావ్, నాకు నచ్చింది ఏమీ చేయలేదా, నేను అప్పుడే తినను” అంటూ పుత్రరత్నం, “అబ్బా! రోజూ ఇదేనా, ఇంకేం వెరైటీ ఏమీ ఉండదా” అంటూ పుత్రికారత్నం, “కాస్త వీటితో పాటు వడియాలు, అప్పడాలు వేయించి ఇవ్వచ్చుగా” అంటూ పరంధామయ్య వరుసగా అడుగుతుంటుంటే పిచ్చి కోపంతో మండిపోయింది భానుమతికి.

“మీరు ఎవ్వరూ కొంచెం సహాయం కూడా చేయరుగాని, చేసినదానికి ఇన్ని వంకలు పెడతారా, అసలు కూరలు ఏమి దొరుకుతున్నాయో, ఎంత ఖరీదో ఏనాడయినా తెలుసుకున్నారా? ఏనాడయినా మీలో ఎవరన్నా తెచ్చారా? అసలే మన కాలనీలో కూరలు రావటం లేదు, పెద్ద మార్కెట్‌కు వెళ్లే ఓపిక నాకు లేదు, మీ సహాయం ఎలాగూ లేదు, ఇది కావాలి, అది కావాలి” అంటూ ఆర్డర్లు అంటూ విరుచుకుపడిపోయిన భానుమతి చూచి మారు మాట్లాడకుండా, నచ్చక పోయినా తినేశారు.

అలా భోజనాలు అయ్యాక, వంటిల్లు సర్దుకుని, కూసంత సేద తీరటానికి తన గదిలోకి వచ్చి మంచం మీద వాలింది. ఈ లోపల పరంధామయ్య కునుకు కూడా తీసేసి, పెళ్ళాం ఏమైనా కాస్త టీ నీళ్లు పడేస్తుందేమో అని వచ్చాడు. అప్పుడే సేద తీరుతున్న భానుమతి చూసి అడిగే ధైర్యం చేయలేక, “అమ్మో ఇప్పుడు దీనిని అడిగితే ఏమైనా ఉందా, తలతీసి తద్దినం పెట్టేయదూ” అనుకుంటూ నిద్రపోతున్న ఆమె పక్కకు నెమ్మదిగా వచ్చి కూర్చున్నాడు.

అలా సుమారు ఒకగంట అయినా తరువాత, నెమ్మదిగా భానుమతిని దువ్వటం మొదలుపెట్టాడు. “భాను! బాగా అలసినట్టున్నావు, పనిభారం నీకు ఎక్కువైంది కదా, ఏదో సెలవల వల్ల ఇంట్లోనే ఉండటం, బయట ఏమీ తినటం లేని కారణంగా, నిన్ను అది కావాలి, ఇది కావాలి అంటూ మేము అందరం ఇబ్బంది పెడుతున్నాం. అంతకన్నా మరోటి లేదు. నీకు ఏమి కావాలో ఒక్క చిటెక వెయ్యి, నిముషాల్లో చేసేస్తాం, అంతేకానీ నువ్వు ఒక్కొత్తవే, ఇలా విసిగిపోతే ఎలా” అంటూ కాస్త లాలనగా భానుమతిని అడిగాడు.

ఇంకేముంది ఎంతైనా మధ్య తరగతి మహిళ కదా, వెంటనే కరిగిపోయి, “అదేం కాదండి, ఏం చేయను, ఎంతని చేయను, ఎవ్వరూ సహకరించటం లేదు. ఒకవేళ మీరు ఎవ్వరైనా సహకరించి, ఏదైనా పనిచేసినా, ఆ తరువాత సర్దుకోవటం ఉందే అది మహా నరకం, భరించలేని విషయం.”

“మొన్నటికి మొన్న, మన అమ్మాయి, మధ్యాహ్నం టీ పెడతాను అంటూ, టీ పెట్టింది, ఎన్ని గిన్నెలు చేసిందో, పెట్టవలసింది నలుగురికి అయితే, పది మందికి పైగా సరిపోయేలా పెట్టింది, ఏదైనా బాగుందా అంటే, చచ్చాం తాగలేక. ఏమైనా అంటే విసుగులు, కోపాలు, ఏడుపులు. ఈ తరం చెబితే వినరు, వాళ్లకు స్వతహాగా అర్థం కాదు” అంటూ ముక్తాయింపు ఇచ్చింది.

“సరే లేవోయ్, పిల్లలు నెమ్మదిగా నేర్చుకుంటారు, కూరలు, కిరాణా నాకు గాని, మన అబ్బాయికి గాని, చెప్పొచ్చుగా, నువ్వు ఒక్కత్తివే ఆ నొప్పిగా ఉన్న కాలుతో వెళ్లకపోతే. ఏం, ఆ మాత్రం మాకు రాదా ఏమిటి? అన్నీ నువ్వే చెయ్యాలి, చేస్తున్నట్టు ఫీల్ అవుతావు,” అంటున్న పరంధామయ్యను చూచి ఒకింత చికాగ్గా

“చాలు, చాల్లేండి, మీకు, మీ పుత్రరత్నానికి కూరలు, కిరాణా, మంచివి తేవటం కూడా వచ్చా? వీలు కుదిరినన్ని పుచ్చులు, ముదిరిపోయినవి తీసుకు వస్తారు. కూరలవాడి దగ్గర కాస్తంత కరివేపాకు కూడా ఫ్రీగా తీసుకు రాలేరు. ఒకవేళ కూరలు, తెమ్మన్నా ఒకేసారి గోరుచిక్కుడు కాయలు, చిక్కుడు కాయలు, బీన్స్, లేదా గోంగూర, మెంతికూర, ఇలా మూస పోసినట్టు ఒకే సంచీలో తెచ్చేయటమే, కాస్త కూడా బుర్ర పెట్టరు. ఏదో నా కాలు నొప్పి అయినా ఈడ్చుకుంటూ వెడుతున్నా, నేను లేకుంటే మీ ఇల్లు గుల్లయి పోతుంది. మనదా రెక్కాడితే గాని డొక్కాడని చిన్న సంసారం, మీకు వచ్చే ఆ నెలజీతంతో సర్దుకోవాలి” అంటూ క్లాస్ పీకింది.

దాంతో భయంవేసి పరంధామయ్య కాస్త ఆగి, సర్దుకుని మళ్ళీ అనునయంగా “భాను!… నీవు లేకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుందే, నాకు తెలియదా నీ విలువ, నీకు ఇప్పుడు ఏమి కావాలో నాకు చెప్పు, చక్కగా చేసుకు వస్తాను, ఈసారి చూద్దువుగాని” అనడంతో మళ్లీ కరిగిపోయిన భానుమతి…. “ఉండండి, మీకు టీ తీసుకు వస్తాను” అంటూ వంటిల్లు వైపు అడుగులు వేసింది.

టీ తాగి, పరంధామయ్య బయటకు కూరలు, కిరాణా తేవటానికి వెళ్ళాడు. అదే సమయంలో భానుమతి తన ఫ్లాట్ బాల్కనీలో కూర్చొని టీ తాగుతోంది. ఇంతలో ఎదురు ఫ్లాట్‌లో ఉన్న దుబాయ్ లక్ష్మి కనిపించి పలకరింపుగా చెయ్యి ఊపింది.

“హలో భానుమతి, ఎలా ఉన్నావ్?…..” అంది దుబాయ్ లక్ష్మి.

దుబాయ్ లక్ష్మిని చూడగానే మనసులో అదో రకమయిన భావన. దుబాయ్ లక్ష్మి మొగుడు కూడా ఇదివరకు పరంధామయ్య కంపెనీలో పనిచేసేవాడు, కాకుంటే రెండు సంవత్సరాల క్రితం రిస్క్ తీసుకుని ఈ ఉద్యోగానికి పదవీ విరమణ చేసి, డబ్బులు ఇంకా సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు. ప్రతీ ఆరువారాల కల్లా ఒకసారి వచ్చి, వారం రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడు. దుబాయ్ వెళ్లిన దగ్గర నుండి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడి, పరంధామయ్య స్థితిగతులను దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది.

అప్పటి నుండి మామూలు లక్ష్మి….. దుబాయి లక్ష్మి అయ్యింది. భానుమతికి, దుబాయి లక్ష్మికి అంతరం పెరిగింది. దుబాయి లక్ష్మి వాళ్ళ ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఒక విలువైంది తేవటం, ఒక్క క్షణం ఆగకుండా భానుమతికి చూపించి వీరానందం పొందటం పరిపాటు అయ్యింది, ఈ మధ్యే ఇంకో ఫ్లాట్ కూడా తీసుకున్నారు. దాంతో దుబాయి లక్ష్మి డాబు భరించలేక, బాగుంది అంటూ భానుమతి పై, పైకి అన్నా లోపల ఉడుక్కు చచ్చేది. ఇలా వాళ్ళ మధ్య పలకరింపు కూడా ఏదో తెలియని అక్కసుతోనే నడుస్తోంది.

“ఏం భానుమతి! ఏమిటీ అలా ఉన్నావ్, పలకరిస్తే పలకరించడం లేదు” అంటున్న దుబాయి లక్ష్మిని చూచి వాస్తవంలోకి వచ్చింది.

“ఏం లేదు వదినా. ఏదో ఆలోచనలో ఉన్నాను, అంతే, అంతకన్నా ఏమీ లేదు, ఇంతకూ అన్నయ్య గారు వచ్చారా. ఈ వారంలో రావాలి అనుకుంటా” అంది భానుమతి రాని పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా.

“అవును భానుమతి, అదేదో మాయ రోగం వచ్చిందటగా, విమానాలు అన్నీ కాన్సిల్ చేసేసారు, ఇప్పుడు వస్తే వెంటనే వెళ్ళలేనని మా ఆయన అక్కడే ఉండి పోయారు. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదని తెలిసింది, పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది, ఏదో నాలుగు రాళ్లు వెనుక వేద్దామని వెళ్లారు కానీ, ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయని ఊహించలేదు. ఎప్పుడు వస్తారో, ఎన్నాళ్ళు పడుతుందో అర్ధం కావటం లేదు.”

“ఎంత దూరంగా ఉన్నా నెల, మహా అయితే నెలన్నర, ఆ తరువాత మా ఆయన నన్ను, పిల్లల్ని చూడకుండా ఉండలేరమ్మా, ఇప్పుడు మరి మా కుటుంబాన్ని కలవటానికి ఎన్ని నెలలు పడుతోందో, అసలు ఈ ఉద్యోగం ఉంటుందో లేదో, బుర్ర పిచ్చి ఎక్కుతోంది”అంటూ తన నిస్సహాయతను వ్యక్తపరిచింది.

అది విన్న భానుమతికి మనసులో మా బాగా అయ్యిందిలే, బడాయి పోయేదానివిగా అని అనుకుంటూ, వస్తున్న ఆనందాన్ని అణిచిపెడుతూ, పైకి మాత్రం “అయ్యో! పాపం, అలా అయిందా, ఎంత కష్టం వచ్చింది నీకు, అందుకేనమ్మా మేము ఎక్కడికీ వెళ్లి సంపాదించే ప్రయత్నం చేయలేదు, కలో,గంజో ఇక్కడే అని తాగుదాం అని, అంత కష్టం ఎందుకు అని అనుకున్నాం.”

“నా మటుకు మా ఆయన నన్ను, పిల్లలని వదిలి ఒక్క పూట కూడా ఉండలేరు. సాయంత్రం అయితే చాలు మల్లెపూలు పెట్టుకుని, మంచి చీర కట్టకుని మహాలక్ష్మి లాగ కళ్ళ ముందు ఉండాలి. సరే, జాగ్రత్తమ్మ, వంటింట్లో ఎసరు పెట్టాను మరిగిపోతోంది” అంటూ ఎన్నాళ్ళ నుండో దాగిన అక్కసు అంతా దించేసి ఆనందంగా ఇంట్లోకి వచ్చేసింది. అది విన్న దుబాయ్ లక్ష్మి, దెబ్బకు తన ఇంట్లోకి పారిపోయింది.

సంతోషంగా ఇంటిలోపలికి వచ్చిన ఆమెకు, అప్పుడే బజార్ ముగించుకుని వచ్చిన పరంధామయ్యను చూచి, చేతిలో సంచీ తీసుకుని “అన్నీ తెచ్చారా, ఓహో మల్లెపూలు కూడా తెచ్చారా, కూరలు సరిగా తేవటం రాదు గానీ, ఇది మాత్రం చక్కగా తెచ్చేస్తారు.” అంటూ విసుగుతో కూడిన ఆనందంలో లోపలకు వెళ్ళిపోయింది.

అలా ఇంక ఆ రోజంతా హాయిగా నడచిపోయి, డిన్నర్ కూడా పిల్లల్లకు కావలసినవి చేసేసి, ఇల్లు అంతా సర్దుకుని, నెమ్మదిగా స్నానం చేసి, చీర మార్చుకుని భర్త పరంధామయ్య దగ్గరకు చేరింది.

“భాను! ఇలా కూర్చో, ఇవాళ పొద్దున్న అంతా కోపంగా ఉండి, సాయంత్రం నుండి అమ్మగారు హుషారుగా ఉన్నారు, ఏం జరిగింది ఏంటి?” అంటూ అనునయంగా అడిగాడు.

“ఆ దుబాయ్ లక్ష్మీ లేదు వాళ్ళ ఆయన” అంటూ……. మొత్తం ఏకరువు పెట్టింది. “నేను అన్నీ పనులు చేయలేకపోతున్నా, ఏదైనా పనిమనిషి పెట్టుకుందామనుకున్నా, మన జీతం సరిపోదు, పోనీ దుబాయ్ లక్ష్మిలాగా మొగుడిని విదేశాలు పంపినట్టు, మిమ్మల్ని కూడా ఎక్కడకు అయినా పంపుదాం అంటే, చూస్తున్నాంగా వాళ్ళ కష్టాలు, పైకి కనిపించినంత సుఖంగా లేరు. జీవితాంతం ఆ కాసిన్ని డబ్బుల కోసం అక్కడకు వెళ్లి, వయసు ఉడిగిన తరువాత ఇక్కడకు వచ్చి, బీపీ, సుగర్, ఇంకా తెలియని మాయ రోగాలకు బిళ్ళలు వేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమైనా మన మధ్య తరగతి వాళ్ళ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందండి, ఆ బ్రహ్మదేముడు సరిగా రాయడు మన జీవితాలను, డబ్బులు లేక కష్టంగా, దుర్భరంగా ఉండేలా చేస్తాడు, డబ్బులు కోసం అన్నీ త్యాగం చేసి కూడబెడితే, శరీరం రోగాలకు నెలవు అయ్యేలా చేస్తాడు. దేముడు మన మధ్యతరగతిని పట్టించుకోడండి” అంటూ వేదాంతం పలికింది భానుమతి.

“భానుమతి! నువ్వెవరివోయి. భానుమతివి… అంటే రారాజు భార్య అన్న మాట, నువ్వే ఇలాగ బేలగా మాట్లాడితే ఎలా, ఇలాంటివి ఎన్ని వచ్చినా ఎడం చేత్తో తోసేయగల సమర్థురాలివి,” అంటున్న పరంధామయ్య మాటలకు అడ్డువచ్చింది భానుమతి.

“ఏం అన్నారు, నా పేరు భానుమతి ఐతే అయ్యింది కానీ మా ఆయన దుర్యోధనుడు కాదు, రారాజు కాదు, పరంధామయ్య, ఏదో కంపెనీలో పెద్ద క్లార్క్, నేను మీ అందం చూసి, మంచితనం చూసి కట్టేసుకున్నా గాని, ఆ పేరేమిటి…. పరంధామయ్య… పరధ్యానంలా ఉంది, ఛీ, ఏం బాగోలేదు,” అంటూ ఎప్పుడో ముప్ఫై సంవత్సరాల క్రితం జరిగిన పెళ్లి తంతు గురించి, అప్పటి విషయాలు గురించి ఆలోచిస్తూ ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్లి పోయింది.

‘అయ్యబాబోయి, ఇది గతంలోకి వెడితే ఇంకా చెలరేగి పోతుంది’ అని అనుకుంటూ “భాను! అది మా తాత పేరే,… అలా తిట్టకు, పైనున్న పితృదేవతలు శపిస్తారు, ఇంతకూ నీ కాలు నొప్పి ఎలా ఉంది, ఏమైనా డాక్టర్‌కు చూపించావా? అశ్రద్ధ ఎందుకు? చూపించుకుంటాను అంటూ ప్రతీ నెలా నా దగ్గర డబ్బులు తీసుకుంటావ్. అసలు ఒక్కరికైనా చూపించావా?” అంటూ నెమ్మదిగా ఆమె కుడి మోకాలు నొక్కుతూ అన్నాడు పరంధామయ్య.

“తగ్గింది లెండి, ఏదో అలా వస్తూ పోతూ ఉంటుంది, మన కాలనీ లోనే, ఆ రెండో సెక్టార్‌లో మన ఊరు అమ్మాయి డాక్టర్ సుధ అని ఉంది, ఆవిడకు చూపించాను, ఏవో మందులు రాసింది, కాస్త తగ్గిందిలెండి.  మరేవో టెస్టులు రాసి చేయించుకుని రమ్మంది, ఇచ్చిన మందులతో తగ్గింది కదా అని ఇంక చేయించలేదు.” అన్నది భానుమతి.

“అలాగా. మరి చేయించుకోవచ్చు కదా, ఆవిడా ఫీజు యెంత? డబ్బులు అన్నీసరిపోతున్నాయి కదా, ఆ టెస్టులు కూడా చేయించు, ఈసారి శ్రద్దగా క్రమం తప్పకుండా మందులు వేసుకో” అన్నాడు పరంధామయ్య.

“అబ్బే. ఫీజు ఏమీ మనకు లేదు, అందరికీ కన్సల్టేషన్ ఫీజు కింద 500 తీసుకుంటుంది, మన ఊరు అమ్మాయి కదా, కాస్త పచ్చి వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఒక చిన్న డబ్బాలో తీసుకు వెడతాను, కొంచెం ఖాళీ అవ్వంగానే, సీసీ కెమెరా ద్వారా నన్ను చూసి ‘పిన్నిగారు రండి’ అని పిలుస్తుంది. చక్కగా చూస్తుంది. ఫీజు బదులు, ఆ చిన్న డబ్బా ఇచ్చేసి వచ్చేస్తా, మంచి డాక్టరమ్మ. నా నొప్పి తగ్గిపోతుంది లెండి, ఇంక దాని గురించి ఆలోచించకండి., నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను.” అంటూ మంచంపై రెండోవైపుకు వెళ్లి పొడుకుంది.

“భాను! అప్పడే నిద్రా, మరి ఇవ్వాళ తెచ్చిన మల్లెపూలు వేస్ట్ అవుతాయేమో చూడు” అంటున్న పరంధామయ్యను చూచి,

“మీ టైం టేబుల్‌లో, ఏ పీరియడ్ కాన్సిల్ అవ్వదన్నమాట” అంటూ విసుక్కుంటూ అటువైపు తిరిగి పడుకుంది. నెమ్మదిగా పరంధామయ్య లైట్ ఆర్పేసి, ఆవిడ పక్కకు చేరాడు.

ఉదయం లేచి స్నానం అయినా తరువాత, భానుమతి దేముడి మందిరంలో పూజ చేయటం మొదలుపెట్టింది. నిన్నటి నుండి పూర్తిగా అలుముకున్న ఆలోచనలు, తన జీవన విధానంపై అసంతృప్తి, సుఖం లేకపోవటం,… అన్నీకష్టాలు ఆడదానికేనా, మగాళ్లంతా హాయిగా ఉన్నారు అంటూ, ఇలాంటి దరిద్రపు రాత రాసిన ఆ బ్రహ్మదేముని నిలబెట్టి అడగాలి, అని తిట్టుకుంటూ అగరబత్తీ వెలిగించింది.

ఇంతలో ఎదురుగా బ్రహ్మదేముడు తనలోకంలో పనిచేస్తూ, టీవిలో కనిపించినట్టుగా కనిపించాడు.

“యావమ్మా! భానుమతి. నిన్నటి నుండి ఎందుకు నన్ను ఎక్కువగా తిట్టుకుంటున్నావ్? నీకు చక్కటి పిల్లలు, మంచి భర్త ఉన్నారుగా, నెల తిరిగేటప్పటికీ నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్ళేలాగా సంపాదన రాసానుగా, ఇంకేం కావాలి? నీవు చేసుకున్న పుణ్యానికి ఇంత కన్నా ఇంకా ఏమి ఇవ్వాలి?” అంటున్న బ్రహ్మదేముడిని చూచి,

“స్వామి, అన్నీ కష్టాలు ఆడవారికేనా?, ఇంటెడు పని, వంట పని, పిల్లలను సాకే పని, అత్తమామలను చూచుకోవటం, గొడ్డు చాకిరీ చేయిస్తున్నావ్ మా చేత. మాకు ఏమి సుఖం ఇచ్చావ్? పోనీ డబ్బులు ఎక్కువ ఇచ్చివుంటే కాస్త పనిమనిషులను పెట్టుకునే వాళ్ళం, ఆ స్తోమతా మాకు ఇవ్వలేదు” అంటూ బ్రహ్మదేముని నిలదీసింది భానుమతి.

“అదేమిటమ్మా, మీ ఆయన దగ్గర నుండి పనిమనిషికని ప్రతీ నెలా డబ్బులు గుంజుతున్నావు కదా, మరి ఆమెను పెట్టుకోకుండా, పని కానిచ్చేస్తూ నన్ను తిట్టుకుంటావేమిటి. ఒకవేళ పనిమనిషి, ఎవరైనా పని చేద్దామని వస్తే మాత్రం నువ్వు ఉండనిస్తావా? నెల తిరగగానే నీ ధాటీకి, మీ కాలనీ నుండి పారిపోవటం నాకు తెలియదు అని అనుకుంటున్నావా?” అని నిగ్గ తీసాడు బ్రహ్మదేముడు.

“అయ్యా, స్వామీ, నీకు అన్నీ తెలుసుగా, ఏదో నాలుగు డబ్బులు అలా మిగుల్చుకోపోతే మా సరదాలు ఎలా తీరుతాయి? ఏడాదికి కనీసం ఒక తులం బంగారం, ఒక అర డజను కొత్త చీరలు కొనుక్కోవాలిగా, ఎక్కడ నుండి వస్తాయి? నువ్వైతే దేముడివి, ఎలాగయినా అమ్మవారికి, ఏడాదికి సరిపడా సమకూర్చగలవు. మా ఆయనను అడిగితే ఎక్కడనుండి తేను? అని బుర్ర తినేస్తాడు. ఏదో ఇలా కాస్త వెనకేసుకొచ్చే దారి కనుక్కున్నా.” అంటూ భానుమతి బ్రహ్మదేమునికి కౌంటర్ ఇచ్చింది.

“అది సరే, భానుమతి, ఆ మధ్య మీ ఆయనకు చేదోడు, వాదోడుగా ఉంటానంటూ ఉద్యోగం వెలగబెట్టావు కదా, మరి అది ఎందుకు మానేశావ్?”….కాస్త రెట్టించిన స్వరంతో బ్రహ్మదేముడు పలికాడు.

“అదా స్వామి, అక్కడ ఉద్యోగం చేసి, ఇంటికి వస్తే మాకు కనీసం మంచి నీళ్లు ఇచ్చేవారు కూడా ఉండరు, మగవాళ్ళుతో సమానంగా ఉద్యోగం చేసినా, ఇంటికి వచ్చేటప్పటికి, ఇక్కడ మా పని మామూలే, ఆఫిసు నుండి మేము వచ్చి మళ్ళీ పని అందుకోకపోతే పొయ్యిలో పిల్లి కూడా లేవదు. ఒకవేళ మా మొగుళ్ళు ముందుగా వచ్చి ఇంట్లో ఉన్నా, మేము వచ్చేవరకు పచ్చిమంచినీళ్లు కూడా తాగరు. మామీద ప్రేమ అనుకునేవు, నా బొంద. ఆ మంచినీళ్లు కూడా మేమే ఇచ్చే దాకా వాళ్ళు కదలరు. ఒకవేళ ఎవరి మొగుడయినా ఏమైనా సహాయం చేస్తే ఆ పనితీరు మాకు నచ్చదు. అందువల్ల ఉద్యోగం మానేశా.” అంది భానుమతి.

“ఇంతకూ, భానుమతి నీకు ఏమి కావాలో నాకు అర్థం కావటం లేదు? అసలు నీ కోరిక ఏమిటి? చెప్పు, తీర్చే ప్రయత్నం చేస్తాను” అన్నాడు బ్రహ్మదేముడు.

“అదా స్వామి, కష్టాలన్ని ఆడవాళ్లకే పెట్టావ్, ఈ బాధ్యతలు, బంధాలు, పనులతో చచ్చిపోతున్నాం, కార్తవీర్యార్జనునకు వెయ్యి చేతులు ఇస్తే, మాకు వెయ్యి పనులు ఇచ్చావ్, ఎంతైనా పురుష పక్షపాతివి కదా, ఆడదానిగా పుట్టేకన్నా అడవిలో మానై పుట్టడం మేలు అన్న సామెత నిజం అని అనిపిస్తోంది. మేమే ఇంటిపని, వంట పని, ఉదయం లేచిన దగ్గర నుండి, కాఫీలు, టిఫినీలు, భోజనాలు, సాయంత్రం నోటిని ఖాళీగా ఉండకుండా స్నాక్స్, బట్టలు ఉతుక్కోవటం, ఇస్త్రీ చేసుకోవటం, పిల్లల స్కూల్ వర్క్ చేయటం, చేయించటం, ఇల్లు సర్దుకోవటం, గ్యాస్ బుకింగ్, కిరాణా తెచ్చుకోవటం, ఇల్లు ఊడ్చుకోవటం, ఒకటేమిటి, ఆఖరుకు మా ఇంట్లో బాత్రూమ్‌లు కూడా కడుక్కోవటం దాకా, రాత్రి అయ్యేసరికి మొగుడిని శాంత పరచటం దాకా చేయలేక, చస్తున్నాం అనుకో, మరీ జీతం లేని పనిమనిషి బతుకు అయిపోయిందనుకో, డబ్బున్న వాళ్లకు ఏ బాధ లేదు. మా పరిస్థితే ఘోరంగా ఉంది, ఇంక నువ్వే చూసుకో స్వామి, మా కష్టాలు చెప్పి చెప్పి, అలుపొచ్చింది.” అంటూ తన అక్కసునంతా వెళ్లగక్కింది భానుమతి.

“అలాగంటావా, పోనీ నీకు తోడుగా, మీ ఆయనకు ఇంకో పెళ్ళాన్ని ఇవ్వనా?” అంటూ కాస్త కొంటెగా నవ్వాడు బ్రహ్మదేముడు.

“చాలు, గొప్పగా చెప్పావ్. ఏ పోరు అయినా భరించగలం గాని, సవతి పోరు భరించలేం. అయినా నీకు ఇదేం బుద్ది స్వామీ, మిగతా వాళ్ళలా కాకుండా, మీ ఇంట్లో ఒక్కరే ఉన్నారుగా? నువ్వు బాగానే ఉన్నావుగా? నేను సగటు భారతీయ మహిళను, కష్టం, సుఖం ఏమైనా నాకే దక్కాలి, అసలు ఇలాంటి ఆలోచన నీకు ఎలా వచ్చింది?” అంటూ బ్రహ్మదేముని పైకి మండిపడుతూ జవాబు చెప్పింది భానుమతి.

అది విన్న, బ్రహ్మదేముడు కాసేపు మౌనంగా, సాలోచనలో పడ్డాడు. ఎప్పటికీ ఆయన కళ్ళు తెరవకపోతే భానుమతికి అనుమానం వచ్చేసి, “స్వామీ, కోపం వచ్చిందా, మా కష్టం అలాంటిది, మా గురించే ఆలోచిస్తున్నావు కదా, ఆలోచించు, ఏదో ఒకటి మంచి చేసేయి.” అంటూ భానుమతి చేతులు కట్టుకుని ప్రార్థిస్తూ, ఇంకా ఏమీ తేల్చుకొని బ్రహ్మదేముడిని కంగారు పెట్టడం మొదలు పెట్టింది.

“సరేలే, భానుమతి, చాలా సేపు మీకు ఎలా మంచి చేయాలా అని ఆలోచించిన తరువాత, ఒక ఉపాయం నాకు తట్టింది, అలా చేస్తే మీ కష్టాలు కొంతవరకూ తీరుతాయి. మరి అలా చేయమంటావా? నీకు సమ్మతమేగా? మరి నీకు వరం ఇచ్చేయమంటావా? చెప్పు, వెంటనే తేల్చు, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి” అంటూ బ్రహ్మదేముడు భానుమతి అడిగాడు.

భానుమతి “సరే స్వామీ, అని అనటం, బ్రహ్మదేముడు ‘తథాస్తు’ అని దీవించడం జరుగగానే, భానుమతికి మరో రెండు చేతులు మొలిచాయి.

“చూసావా, నీకు అదనంగా మరో రెండు చేతులు ఇచ్చాను, కేవలం రెండు చేతులు ఉంటేనే, నువ్వు వెయ్యి పనులు చక్కదిద్దుతున్నావ్, మరో రెండు చేతుల వల్ల ఇంకా చేయొచ్చు, అందువల్ల మగవాళ్ల పనులు మరికొన్ని మీకు బదలాయిద్దాం అని కూడా అనుకుంటున్నా.” అన్న బ్రహ్మదేముని మాటకు ఉలిక్కిపడి…

“అయ్యబాబోయ్! ఏమిటి మళ్ళీ ఇంకో రెండు చేతులా? ఇంకా కొంత పని బదలాయింపా? వద్దు బాబోయి, రాజ్యంగంలో రిజర్వేషన్లు సవరించినట్టు చేసావు కదా, అక్కరలేదులే ఇంకో రెండు చేతులు, ఎంతైనా నీవు పురుష పక్షపాతివే కదా, నీకో నమస్కారం, మమ్మల్ని,ఇలా బతకనీయి, ఏదో దేముడివి కదా అని మా కష్టం చెప్పుకొచ్చాం. రొంపకు మందు వేస్తే, ముక్కు ఊడినట్టు, చాల్లే నీ సలహా, నీ వరాలు. ఎంతైనా మా ఫ్రెండ్ చెప్పినట్టు ‘మగాళ్లంటే మగాళ్లే’ అన్నట్టు” అంటూ అక్కడనుండి పరిగెత్తింది.

అలా పరిగెడుతూ, వద్దు బాబోయ్, అమ్మో బ్రహ్మదేముడు కూడా మా రాతను మార్చలేడన్న మాట అని అనుకుంటూ, చేతులు విదిలిస్తూ, ఎదురుగా ఉన్న గోడను కుడికాలితో తన్ని కలలో నుండి వాస్తవంలోకి వచ్చింది.

ఉలిక్కిపడి నిద్ర లేచిన పరంధామయ్య “ఏమిటీ భాను, కలవరిస్తున్నావు, గోడను తన్నేస్తున్నావ్, భానూ, భానూ” అంటూ అరిచాడు.

తెలివి వచ్చిన భానుమతికి అర్థం అయ్యింది, బ్రహ్మదేమునితో సంవాదం కలలో జరిగిందని, కలలో పరిగెడుతూ, గోడను తన్ని వాస్తవంలో వచ్చానని. అసలే నొప్పి కలిగిన కాలు మరింత దెబ్బ తగలటంతో, కాలు కదపలేని స్థితికి వచ్చింది. వెంటనే పరంధామయ్య, ఆటోను పిలిచి, డాక్టర్ సుధ ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు.

భానుమతి వద్దు అంటున్నా, వినకుండా కన్సల్టేషన్ ఫీజు కట్టి, మొదటి పేషంట్‍గా వెళ్లడం, డాక్టరమ్మ చూడటం, టెస్టులు రాయటం, అవి కూడా చేయించుకుని రావటం, రాసిన మందులు కొనుక్కుని ఇంటికి వెళ్లడం వరుసగా జరిగి పోయాయి. అలా శ్రద్ధగా భానుమతి చేత మందులు వాడించడం వల్ల, కాలు నొప్పి రెండురోజులలో పూర్తిగా తగ్గిపోయింది.

ఒకరోజు భానుమతి ఆలోచిస్తూ ఉంటే, ‘ఇన్నాళ్లు ఈ సుధమ్మే కదా నాకు మందులు ఇచ్చింది, మరి ఏమీ తగ్గలేదు, మరి ఇప్పుడు ఎలా తగ్గిందా?’ అని ఆలోచిస్తే ఒక విషయం బోధపడింది. తాను ఫీజు ఎగ్గొట్టటం కోసం వడియాలు, మజ్జిగ మిరపకాయలు ఇస్తే, ఆమె ఎక్స్‌పెరిమెంట్‌కు వచ్చిన కొత్త మందులు తనపై ఫ్రీగా ప్రయోగించిందని అర్థం అయ్యింది.

అంటే ఈ డాక్టరమ్మ వడియాలు, వంకాయలకు పడదన్నమాట.

ఆమ్మో…. డాక్టర్ సుధమ్మో…. డాక్టర్ రాక్స్… భానుమతి షాక్స్.

అదే సమయంలో టీవిలో ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం వస్తోంది. అందులో “పొట్టోడిని, పొడుగోడు కొడితే, పాడుగోడిని పోశమ్మ కొట్టిందని” అంటూ ఇంకా ఏదో చెబుతున్నారు.

Exit mobile version