భరద్వాజ సాహితీ జీవిత ప్రస్థానం

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ శార్వరి రచించిన ఈ వ్యాసం తొలుత – డా. సిహెచ్. దేవానందరావు సంపాదకత్వంలో భరద్వాజ గారి ఏబదవ జన్మదినోత్సవ జ్ఞాపిక సంకలనం ‘సగందారిలో…’లో ప్రచురితమయింది. అలనాటి ఈ వ్యాసాన్ని సంచిక పాఠకులు అందిస్తున్నాము. [/box]

ఉన్నదంతా అందరికీ పంచేసి, కడుపులో కాళ్ళెట్టుగుని పడుకొన్న భరద్వాజ సాహితీ జీవిత ప్రస్థానం:

[dropcap]అ[/dropcap]తను మహర్షి కాదు.

అతను బ్రహ్మర్షి కాదు.

అతను కర్మయోగి, సాక్షాత్తు కర్మయోగి.

అతను భరద్వాజ.

భరద్వాజ మహర్షి పేరును తనది చేసుకుని, తనకు తానే ఋషిత్వాన్ని ఆపాదించుకున్నాడు.

ఋషి కానివాడు కవి కాదుకదా, మరి?

భరద్వాజ విపులార్థంలో కవి.

మానవ జీవితాలను, వాస్తవాలను, మానవతను తన రచనలకు ఆలంబనం చేసుకున్నాడు కనుక, కవిగా మిగిలిపోక, రచయిత కాగలిగాడు.

రచనను తపస్సుగా భావించి, సాధనచేసి రచనలో లయించాడు కనుక మహారచయిత అయినాడు.

తన కలాన్ని ప్రేమామృతంలోముంచి, మానవ వికాసనానికి, చైతన్యానికి, రచన సాగించాడు కనుక అజాత శత్రువైనాడు.

రచనవల్ల సమాజంలో విప్లవం వస్తుందా అంటే ‘చలం’ గారిని చూపించవచ్చు. ‘చలం’ తన రచనల ద్వారా, తెలుగునాట అపూర్వ విప్లవం సాధించాడు.

చలం రచనలే లేకపోతే, ఈనాటి తెలుగు సాహితీ వనంలో ఇన్ని పూలు గుబాళించేవే కావు. ఆ పని ‘చలం’ తర్వాత ఆయన సాహిత్య వారసుడైన భరద్వాజ చాలావరకు చేశాడు.

యాభైఏళ్ళు నిండిన మా భరద్వాజతో ముప్ఫయి ఏళ్ళ చెలిమిని ఒకమారు పర్యావలోకం చేసుకుంటే తెలుగు సాహిత్య వికాసం కళ్ళముందు కదలాడుతుంది. “My head is too big for my hat” అన్నట్లు ఆయన సాధించిన వాటికన్న, అతని మేధస్సు పెద్దది. కనిపించని అతని కీర్తి కిరీటంలో నూరుకుపైగా మణులున్నాయి.

‘నల్లనివాడు, కానీ చల్లని మనసున్నవాడు’ – అతను. అతను నూరు పుస్తకాలు ఎలా రాశాడు? మహాకవులకు, మహాపండితులకు సాధ్యం కాదే! “అతని చదువెంత. అతనెంత?” అనేవారు కొందరు. ఆనాడు- అంటే అతని మొదట పుస్తకం కూడా అచ్చుకాని రోజుల్లో… ముప్ఫయి ఏళ్ళనాటి మాట. అప్పుడు అతనే నేనుగా, నేనే అతనుగా – జంటగా మసిలిన రోజులు… కలిసి తిరిగిన రోజులు.

1948లో భరద్వాజ తెనాలి వచ్చాడు. పొట్ట చేత పట్టుకుని వచ్చిన అతను, పొట్టగడవక నేను ఒక ప్రెస్‍లో పనికి చేరాం. శ్రీ ఆలపాటి రవీంద్రనాథ్ జ్యోతి ప్రెస్ అధిపతి. ఆయన జ్యోతి, రేరాణి, సినిమా – అని మూడు పత్రికలు ప్రారంభించారు. నెల్లూరులో ‘జమీన్ రైతు’ పత్రికలో పనిచేస్తున్న భరద్వాజ ‘జ్యోతి’లో పనిచేయడానికి వచ్చాడు. ముప్ఫయి రూపాయల జీతం…. జ్యోతికి కథ ఇవ్వడానికి వెళ్ళిన నాకు అతనితో పరిచయం అయింది. లుంగీ అరచేతుల చొక్కా వేసుకుని అతి నిరాడంబరంగా అవుపించాడు.

భరద్వాజకు అప్పటికే వివాహం అయింది. కానీ భార్య కాపురానికి రాలేదు. కనుక తక్కువ జీతంతో ఎలాగో బండి లాగేవాడు. పేరుకు సబ్ ఎడిటర్ అయినా, చేయవలసిన పనులు చాలా వుండేవి. చివరకు బండిల్స్ కట్టి, స్టేషనుకు తీసుకువెళ్ళడం కూడా మా పనే! వేరేగది అద్దెకు తీసుకునే స్తోమత లేదు కనుక ఆఫీసులోనే పడుకునేవాడు. జీతం డబ్బు భోజనానికి సరిపోగా, పై ఖర్చులకు కథలు రాసేవాడు.

కళాకరులకు, రచయితలకు ఆకల్ని సహించడం, బాధల్ని భరించడం జన్మహక్కు. ఏరి, కోరి వరించిన జర్నలిజం కనుక, రచయితలకు ఆ కష్టాలలోనే తృప్తి…. తిండి పెట్టలేకపోయినా, ప్రేమించే మొగుడు లాంటిది ‘రచన’. సాహిత్యాన్ని ఉద్ధరించాలనుకున్న వాడు, కష్టాలు పడవలసిందే…. ఆ సాహిత్య పిపాసతోనే నెల్లూరు పరుగెత్తాడు. అక్కడ ఆత్రేయ, కణ్వశ్రీ వంటి సాహితీ మిత్రులు లభించారు. తన కృషిని హర్షించడమే కాక, ప్రోత్సహించారు. ఇంకేం, ఆ మాత్రం భుజం తట్టేవారుంటే గంగలో దూకమన్నా దూకవచ్చు. దూకిన తర్వాత తనకు ఈత రాదన్న సంగతి జ్ఞాపకం వస్తుంది. కానీ, మునిగిపోకుండా ఈత నేర్చుకుని, ఆవలి తీరానికి చేరగలిగాడు భరద్వాజ. మధ్యలో మునిగిపోయేవారే ఎక్కువ. కన్నీళ్ళను, ఆకలిని సరస్వతికి నైవేద్యం పెట్టి వరాలు పొందాడు.

తెనాలిలోనే భరద్వాజకు ‘శారద’ పరిచయం అయినాడు. అప్పటికే ‘శారద’ రెండు మూడు నవలలు, చాలా కథలు రాసి కీర్తి సంపాదించుకున్నాడు. ఇద్దరూ ‘హాట్’ రైటర్స్. సెక్సు కథలు రాస్తారని పేరు. అక్కడే పలువురు రచయితలతో స్నేహం.

భరద్వాజను విపరీతంగా అభిమానించిన వ్యక్తి శ్రీ ధనికొండ హనుమంతరావు గారు. ఆయనకు చౌడేశ్వరీదేవి, శివం, భరద్వాజ – వీరు ముగ్గురంటే ఇష్టం. తన ‘అభిసారిక’ పత్రికలో నెలనెలా ఓ కథ వేసి, ఇరవై రూపాయలు ఇచ్చేవాడు. అలా ఎడిటర్స్ అభిమానాన్ని పొందడం భరద్వాజ అదృష్టం.

అప్పుడే తెలిసింది భరద్వాజ స్వస్థలం తాడికొండ అని… అక్కడ తన బాల్యం గురించి, అక్కడి బాల్య స్నేహితుల గురించి తన ‘పాకుడురాళ్ళు’ నవలలో వర్ణించాడు.

భరద్వాజ కారణ జన్ముడని నేననను. వాళ్ల అమ్మగారికి ఏ భగవంతుడో కలలో కనిపించి, ఆమె కడుపు పండలేదు. అతను పసివాడుగా ఊయెల ఊగుతున్నప్పుడో, పారాడుతున్నప్పుడో, నాగుపాము పడగపట్టి అతని భవిష్యత్తుకు జోస్యం చెప్పలేదు. అతను అతి సాదా మనిషి. చాలా పేద కుటుంబంలో పుట్టాడు. వంశ పారంపర్యా వచ్చిన కీర్తి, మేధస్సు కావు అతనివి.

ఆ రోజుల్లో పల్లెలలో చదువులకు అవకాశం తక్కువ. ఇప్పుడున్నన్ని పాఠశాలలు, కళాశాలలు లేవు. ఉన్న ఎలిమెంటరీ స్కూలులో, ఎనిమిదవ తరగతి వరకు చదివాడు అంతే! ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్నా మరచిపోయి వుంటాడు. పెద్ద చదువులు చదివించే స్తోమత లేకా, చదివినా నిష్ప్రయోజనమనీ పెద్దలు చదువుకు గుడ్‍బై చెప్పించారు.

ఆ తరువాత ఉద్యమాలనీ, ఉద్ధరింపులనీ కొంతకాలం గడిపాడు. నాటకాలాడీ ఆడించీ ఇంకొంత కాలక్షేపం. జీవిత ప్రవాహం, అతన్నెక్కడా నిలబడనిచ్చేది కాదు. ఒక్కో తరంగం, ఈడ్చి కొడుతుంటే ములిగి, నీళ్ళుతాగి, ఉక్కిరిబిక్కిరి అయి కడ ప్రాణంతో పైకి తేలేవాడు పాపం!

అతను చేసినన్ని పనులు చేసినవారూ, అంతలా జీవితానుభవాలను పొందినవారూ రచయితల్లో అసలు లేరనను గానీ, చాలా తక్కువమంది. గోర్కీ అన్నట్లు ఈ ప్రపంచమే అతనికొక విశ్వవిద్యాలయమయింది. అనుభవాలే పాఠ్యగ్రంథాలు. ఆ గ్రంథాల సారాంశం – అనుభవాల సారాంశం – ఉత్తరోత్తరా అతనికి చాలాగా ఉపకరించింది. వాటిని ముడిసరుగ్గా వాడుకొని, అపూర్వమైన వస్తుసంచయాన్ని సృష్టించాడు.

కొంతకాలం – ఊరూరా తిరిగాడు. కొంతకాలం – సరే –

అతను నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరులో యువజన కాంగ్రెసు శిబిరం జరుగుతోంది. యువకులకు గుర్రపుస్వారీ, తుపాకీ కాల్చడం, కసరత్తులు నేర్పుతామన్నారు. వెళ్ళాడు. అవేమీ అట్టేగా జరగలేదు. ఎ.సి. సుబ్బారెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, పొట్టి శ్రీరాములు, కళా వెంకట్రావు గారలతో అప్పుడే పరిచయం.

ఇది కాదుగానీ – అప్పటికే అక్కడున్న ఆత్రేయ మహర్షితోనూ, కణ్వమహర్షితోనూ, ఈ భరద్వాజ మహర్షీ చేరిపోయాడు. ముగ్గురూ కలిసి 1947 ఆగష్టు 15న ‘సుప్రభాతం’ అన్న చిన్నపుస్తకాన్ని వెలువరించారు. ‘బక్కడొక్క’ అన్నపేరుతో, భరద్వాజ కవితవొకటి అందులో వచ్చింది.

మరో ముచ్చట!

భరద్వాజ – ఇప్పుడు సరేననుకోండి – ఒకప్పుడు పసందైన పద్యాలు రాసేవాడు. గీతాలూ, గేయాలూ, స్వేచ్ఛా కవితలూ రాసేవాడు. కొన్నికొన్ని అచ్చయ్యాయి కూడా.

“మంచి కవిత్వం చాలా చదివాను. అందుకే కవిత్వం రాయడం మానేశాను” అన్నాడు నాతో వొకసారి.

“మంచి కథలూ చాలా చదివావుగదా, అవి రాయడమూ మానేస్తావా?” అన్నాను.

“అహా! దివ్యంగా!” అన్నాడు భరద్వాజ నవ్వుతూ.

అప్పుడెప్పుడో అన్నమాట, అతను ఈ మధ్యనే నిజం చేశాడనుకొంటున్నాను.

చదవడం – అతనికి ప్రాణవాయువు లాంటిది. చిన్నతనంలో చదువుకొనలేకపోయిన తన దురదృష్టాన్ని తలుచుకొని – ఇప్పటికీ క్షోభించిపోవడం నాకు తెలుసు. నెల్లూరులో ఉన్నప్పుడే – విద్వాన్ పరీక్షకు చదువుదా మనుకున్నాడు. కానీ ఆ అధ్యాపకుడు – ‘సరే’ నంటూనే అతనికి చదువు చెప్పేందుకు వొప్పుకోలేదు.

అప్పుడే –

భరద్వాజ లైబ్రరీలను ఔపోసన పట్టాడు. అతను చదవని పుస్తకం లేదు. శ్రీపాద, చలం, కొడవటిగంటి, ధనికొండ, గోపీచంద్, శరత్, ప్రేమ్‍చంద్‍ల సాహిత్యాన్ని జీర్ణం చేసుకుని మనుచరిత్ర, వసుచరిత్ర, కళా పూర్ణోదయం, ఆముక్తమాల్యద – మొదలైన ప్రబంధాల్ని, భారత, భాగవతాల్ని తెగ చదివాడు. భాషపైన బోలెడంత అధికారం సంపాదించాడు. కథలు, నవలలు రాసుకునేవాడికి అంత భాషా పాండిత్యం అవసరమే నంటాడు భరద్వాజ. భాషపైన అధికారం సంపాదించని రచయిత పెరుగుదల లేక చచ్చిపోతాడుట! అప్పుడు ‘తను ఏం రాయగల?’నన్నది తేల్చుకోగలిగాడు.

‘చలం’ భరద్వాజకు గురువయ్యాడు. చలం రచనల్లోని వేగం, భాష, విరుపులు… స్వేచ్ఛ… భావ విప్లవం, భరద్వాజను ఆకట్టుకున్నాయి ఇదెంతదాకా పోయిందంటే – రచయిత పేరు లేకుండా ఓ కథను అచ్చువేస్తే, అది చలంగారు రాసిందో, భరద్వాజగారు రాసిందో చెప్పడం దుస్తరంగా ఉండేది ఆ రోజుల్లో.

“దాన్నుంచి బయట పడాలి”

ఈ హితవచనాన్ని అక్షరాలా పాటించేందుగ్గాను కొంతకాలం భరద్వాజ అసలేమీ రాయలేదు. అధవా రాసినా వాటిని అచ్చుకూ పంపలేదు. తెనాలిలో ఉన్నప్పుడు ఎంత విరివిగా రాశాడో – ఆ తెనాలిలోనే, అతను మౌనంగానూ ఉండిపోయాడు.

తెనాలి రచయితలపై గోపీచంద్, జి.వి కృష్ణారావుల ప్రభావం విచిత్రంగా పడేది. గోపీచంద్ రచనలు రచయితల్ని ఆకట్టుకునేవి. జి.వి కృష్ణారావు వ్యక్తిగతంగా పరిచయమైన వారిపై తన ముద్ర వేసేవాడు. ఇద్దరూ తాత్వికులే! గోపీచంద్ తత్వచింతన వేరు….

అడవిలో కూర్చుని మహాకావ్యాలు రాయవచ్చునేమోగానీ, కథలు, నవలలూ రాయడం సాధ్యం కాదు. సమాజం రచయితకు పునాది. మనుషులతో పరిచయం అవసరం. మా ఆంధ్రా పారిస్ రచయితలకు; నటీనటులకు కేంద్రం.

భరద్వాజ గొప్ప రచనలు చేయడానికి తెనాలి వాతావరణం బాగా సహాయం చేసింది. ఆలూరి భుజంగరావు, భోజన హోటల్ నడిపే నాగభూషణం, కాఫీ హోటల్ సప్లయిర్ శారద, వీరమల్లు రామకృష్ణ – అతని స్నేహితులు. నేను, తాళ్ళూరి నాగేశ్వరరావు వంటివాళ్లం ఇంకా చిన్న రచయితలం. అతని అభిమానులం మాత్రమే అప్పటికి!

భరద్వాజతో నా స్నేహలతలు పెనవేసుకొనడానికి ఒక కారణం ఒకే ప్రెస్‍లో పనిచేయడం. రెండవ కారణం ఒకే ఇంట్లో ఉండడం. నేను చదువుకొనడానికి ఓ చిన్న పర్ణశాల ప్రత్యేకంగా వుండేది. అది అతనికిచ్చాం వాడుకోడానికి – అ పర్ణశాలకు ‘కవితాకుటీరం’ అనో ‘సాహిత్యాశ్రమం’ అనో నామకరణం చేశాడు. తనే… అప్పుడే నాకో పెన్‍నేమ్ తగిలించాడు. ‘శార్వరి’ అనే పేరు అతను నిర్ణయించిందే. ఆ కుటీరంలో కూర్చుని తను కథలు రాసుకుంటుండేవాడు. ఆ రోజుల్లో నాకు కథలు రాయడం రాదు. అతనే కథలు రాయడం నేర్పాడు. ఒక కథా వస్తువు ఎట్లా ఎన్నుకోవాలో, పాత్రల్ని ఎలా మలచాలో, చర్చించి డైలాగులతో సహా నోటితో కథ చెప్పి ‘అలా రాయి’ అని శాసించేవాడు. ఇద్దరమూ ఊరి చివర, కాలువపైకి వెళ్ళి ఇసుక గుట్టలపైన కూర్చుని రాత్రి పన్నెండు వరకు సాహిత్య చర్చలు చేస్తుండేవాళ్ళం. ఆ చర్చలు అతనికెంత ఉపకరించాయో గాని నాకు మాత్రం చాలా లాభించాయి. నేనూ కథలు రాయగలనన్న నమ్మకాన్ని కలిగించాయి నాకు.

ఒక్కొక్క కథకు ‘ప్లాటు’ చర్చించుకుని, ఇద్దరం రాయడానికి కూర్చునేవాళ్ళం. తెల్లారి ఆ కథల్ని, శారద, నాగభూషణం, వీరమల్లు రామకృష్ణ మొదలైన మిత్రులకు వినిపించేవాళ్ళం. బాగున్నది నిలిచేది, రెండోదాన్ని, నిర్దాక్షిణ్యంగా చించి పారేసే వాళ్లం… అదివొక యజ్ఞం – అదో సాధన. ఒకే సిట్టింగ్‍లో ఎంత పెద్ద కథ అయినా పూర్తి కావాలి…. తెల్లవారినా సరే! అతను రెండు రోజులలో, ఏకబిగిన, ఒక నవలే రాసేవాడు. తెనాలిలో సుమారు పాతికమంది చిన్నాపెద్దా రచయితలు ఉండేవారు. అందరూ మా బృందంలోని మిత్రులే.

అప్పుడు చలంగారు బెజవాడలో వుండేవారు. భరద్వాజ వారానికొకసారైనా బెజవాడ వెళ్ళి ‘గురువు’ గారి దర్శనం చేసుకు వచ్చేవాడు. భరద్వాజకు సౌరీస్ అంటే ఇష్టం… సౌరీస్ ద్వారా ఈయన చలంగారి ప్రేమను సంపాదించాడు. అప్పుడే తన మొదటి పుస్తకం ‘రాగిణి’ అచ్చయింది. దానికి ‘చలం’ గారి చేత పీఠిక రాయించాడు. తనంత వాడుగ భరద్వాజను చలంగారు గుర్తించారు. “ఇకమీద నేను రాయకపోయినా ఫరవాలేదు” అన్నారు చలం భరద్వాజ రచనల ఉన్నతిని చూసి. ఆ తర్వాత చలంగారు తన ‘ధోరణి’ కథలు నవలలు రాయలేదు. ఆంధ్ర దేశంలో తన వారసుణ్ణి వదలి, తను రమణాశ్రమం చేరుకుని, తపస్సు చేసుకోసాగారు. అందుకే భరద్వాజ సాహిత్యపరంగా ‘చలం’ గారికి ఋణపడ్డాడు. చలం ఆశించిన శిఖరాలకు చేరుకుని, ఋణవిముక్తుడైనాడు కూడా.

భరద్వాజ శైలి కొత్త రచయితలకు వరవడి. అతను సమాజాన్ని వదలి రచనలు చేయలేదు. సమాజంలో అట్టడుగున పడివున్న వారు, పడి లేవలేని వారు అతని కథల్లో పాత్రలు. జీవితాల్లోంచి కథల్ని పిండడం అతనికి చాతనైనంతగా, మరెవరికీ చాతకాదేమో! వ్యభిచారం మీద కథ రాయాలంటే, వ్యభిచార స్త్రీల జీవితాన్ని తెలుసుకు తీరాలి. అతను అలాగే వ్యభిచార గృహాలకు వెళ్ళేవాడు. కథా వస్తువుల కోసం, వారి చీకటి గదులవంటి జీవితాల కోసం. ఒక వెలయాలు రాత్రికి రెండు రూపాయలు తీసుకునేదైతే రెండూ యిచ్చి, ఆమె కథ విని వచ్చేవాడు. ఒక ముష్టిది కనిపిస్తే, ఆవిడ వెనుక కథ వుందని అనుమానం వస్తే, అర్ధరూపాయి డబ్బులిచ్చి, అన్నం పెట్టించి, ఆమె కథ చెప్పించుకునేవాడు. అతను కథా వస్తువుల కోసం, అడ్డమైన వాళ్ళతో కలిసిపోయేవాడు. ఆ పద్ధతి నాకిష్టం వుండేది కాదు.

అంతకు ముందెలా వున్నా, శారద, నాగభూషణం, భుజంగరావు, ప్రకాశం, ఎప్పుడూ భరద్వాజను ముసురుకొనే ఉండేవారు.

పాలడబ్బాడు బియ్యాన్ని కుండలో వొండుకొని, బాదంఆకుల్లో ఒక్కోముద్దా పెట్టుకుని, పచ్చిమిరపకాయ అదరువుగా నంజుకొని, అందరం కడుపునిండా నీళ్ళు తాగాక, కమ్మని కథలు చెప్పేవాడు భరద్వాజ.

ఆకలి, దరిద్రం, డబ్బుకోసం గింజులాట, వీటికోసం దిగులు – మరేవీ అతనికుండేవిగావు. ఉన్నదంతా అందరికీ పంచేసి – కడుపులో కాళ్ళెట్టుగుని భరద్వాజ పడుకున్న రోజులు నాకింకా గుర్తున్నాయి.

రచనల వలన పొట్టగడవక, రాయడం మీద విసుగెత్తి, తెనాలి బస్టాండులో పునుగులమ్ముకొని బతకడం సాగించాడు శారద.

“కలం కన్న కళాయిని నమ్ముకోవడమే నయం రా!” అని శారద బాధగా అన్నపుడు భరద్వాజ అక్షరాలా పసిబిడ్డలా రోదించాడు.

పుస్తకాల కన్నా, అతన్ని ఇల్లాంటి సంఘటనలే బాగా మార్చాయి. పట్టుదల, దీక్ష, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం, అతనిలో బలపడ సాగాయి. ఇవే అతన్ని మనిషిని చేశాయి. మనిషిగా నిలబెట్టాయి. ఉన్నతుణ్ణి చేశాయి.

రెండేళ్ళన్నా కాకముందే జ్యోతీ, రేరాణి, సినిమా పత్రికలు మూతపడ్డాయి. భరద్వాజకు మళ్ళీ ఉద్యోగం ఓ సమస్య అయింది. నలందా ప్రెస్ అధిపతి కోగంటి రాధాకృష్ణ మూర్తిగారు అప్పటికే ‘సమీక్ష’ పత్రిక నడుపుతున్నారు. ఆ పత్రికలో చేరాడు. అదొకమంచి మలుపు జీవితంలో. ఆయనకు పాఠ్యపుస్తక ప్రచురణలు ఉండేవి. జి.వి కృష్ణారావు వంటి రాడికల్ హ్యూమనిస్టుల కేంద్రం అది. అక్కడ వుండగానే భరద్వాజ బాగా నిగ్గుతేలాడు. అతని ఆలోచనా సరళి మారింది. తన గమ్యాన్ని తను నిర్దేశించుకోగలిగాడు. అందుకు హ్యూమనిస్టు మిత్రుల రచనలూ, ఎం. ఎన్. రాయ్ గ్రంథాలూ ఉపకరించాయి. అప్పుడే కవిరావు, చలపతిరావుల స్నేహం తోడైంది.

పాఠ్యపుస్తకాల వ్యాపారంలో అపరిమితమైన పోటీ ఉండేది. ఈ పోటీలో అనారోగ్య లక్షణాలూ చాలా ఉండేవి. ప్రతివారూ, తమ పుస్తకాలను ఎంపిక చేయించుకోవడంతో బాటుగా, ఎదుటివారి పుస్తకాలు సోదిలోకి రాకుండా చూసుకోవడం కూడా ముఖ్యంగా ఉండేది.

ఈ జూదం భరద్వాజకు కొత్త. అంతకుముందు బెజవాడకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలు తిరిగాడేగానీ బెజవాడ దాటినవాడు కాడు. అయినా బయల్దేరాడు. తొలి సంవత్సరం, అంతగా రాణించలేకపోయాడు. దేశం కొత్త, మనుషులు కొత్త, రంగం కొత్త. మిగిలిన వారికన్నా, తను తక్కువ వ్యాపారం చేసినందుకు అతని చిన్నపోయాడు.

“నన్ను మన్నించండి. నా తెలివితక్కువ కారణంగా మీ వ్యాపారం సరిగ్గా జరగలేదు” అన్నాడు రాధాకృష్ణ మూర్తిగారితో.

“నా తెలివి తక్కువ కారణంగా నేను నష్టపోతే నాకు దిగుల్లేదు శర్మా! నన్ను నమ్ముకొని ‘కెఆర్‍కె’ నష్టపోయాడు గదా! ఆయన్ను చూడాలంటే ఎంత సిగ్గుపడుతున్నానో ఎలా చెప్పనోయ్?” అన్నాడా రోజుల్లోనే!

ఈ అనుభవాల నుండి అతడు నేర్చుకొన్న పాఠాలు అనేకం. ఆ మరుసటి ఏడూ, ఆ తరువాతి సంవత్సరమూ, అతను కొదమ సింగంలా చెలరేగిపోయాడు. శ్రీకాకుళం, విశాఖ, తీర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు జిల్లాలో, నలందావారి పుస్తకాలను, జిల్లా బోర్డుల చేత ఎన్నిక చేయించాడు. రచయితగా అతనికున్న పేరు ప్రతిష్ఠలు, నలందావారి వ్యాపారానికి ఉపయోగపడ్డాయి.

మనుషుల్ని అంచనా వేయడంలో, అతనికున్న దక్షత – అసూయ పడదగినంతటిది. ఎదటివారి ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించినా, అలాగని బయటపడనంతటి గడుసువాడు భరద్వాజ.

“వ్యాపారమంటే, అక్షరాల వ్యాపారమేనయ్యా బాబూ! అందులో నీతి, అవినీతి అన్న రకాలు – మన తృప్తికోసం, మనం అనుకొనేవి. అంతే!” అనేవాడు ఆ రోజుల్లో.

ఆ రోజుల్లో – అటు పర్లాకిమిడి నుండి, ఇటు గూడూరు దాకా, అతనికి తెలిసిన వారుండే వారు. అందునా ‘ఆంతర్యం’గా తెలిసినవారూ ఉండేవారు. వీరందరూ – భరద్వాజ కోసమని అతను చెప్పిన పనులు చేసి పెడుతూ ఉండేవారు.

ఒకసారి విశాఖపట్నంలోనో, విజయనగరంలోనో భరద్వాజకు మాట యిచ్చిన పెద్దమనిషి, ఆ పనిచేయలేదు. అది తెలియక పని జరిగిందని, యజమానికి ఫోను చేసేశాడు భరద్వాజ. ఇంకో కంపెనీ వారి పుస్తకాలకు ఆర్డర్లు వచ్చాయన్న సంగతి అతనికి తెలిసినప్పుడు –

“వాడి పుఠం ఆరుస్తాను చూడు” అన్నాడతను నాతో.

ఆ మరునాడే అతను మాయమయిపోయి, వారం తరువాత కనిపించాడు.

“ఏమయ్యావ్?” అన్నాను.

అతను – సరాసరి ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళాడు. అతను ఎన్నిక చేసిన పుస్తకాల్లోని తప్పులను ఎత్తి చూపించాడు. ఆ పుస్తకం గాంధీగారి మరణానికి పూర్వం అప్రూవ్ అయిన పుస్తకం. “గాంధీగారు సబర్మతీ యందుండి, జహ్వరునకు సలహాలనిచ్చుచున్నారు” అన్నవాక్యం 1954వ సంవత్సరానికి ఎలా నప్పుతుందో చెప్పమన్నాడు. అవతల పెద్దమనిషి బిత్తరపోయాడు పాపం! పాత ఆర్డరును కాన్సిల్ చేసి నలందావారి పుస్తకాలనే పెట్టాడు.

ఇతను అలవరచుకున్న నైపుణ్యం నలందా పబ్లిషర్స్ వారి వ్యాపారాభివృద్ధికి బాగా ఉపయోగించి లక్షలాది లాభాలు గడించిపెట్టింది. ఆ నైపుణ్యమే భరద్వాజకు ఆ సంస్థను వదిలాక మరింతగా ఉపయోగించింది. ఎవరి ప్రాపకాన్నైనా తన సంస్థ అభివృద్ధికి అనుకూలంగా మలుచుకోవడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అతని ఆ సరళికి నేను విస్తుపోతుంటాను ఈనాటికీ.

అప్పుడే విజయవాడ రేడియోను అందుకున్నాడు. రచయితగా… భరద్వాజను అభిమానించి, అనేక ప్రోగ్రాములు యిచ్చినవారు, శ్రీ ఆచంట సూర్యనారాయణ మూర్తి. దరిమిల బుచ్చిబాబుగారితో పరిచయం ఏర్పడింది.

జీవితం చదరంగం… ప్రతిఎత్తు ఆలోచించి వేసిన వాడే విజయం సాధించగలడు. భరద్వాజ ప్రతి పావును ఆచి, తూచి, ఆలోచించిగానీ కదల్చడు. అందుకే అతనికి ఓటమి లేదు. అతను “ఇదిగో పడిపోతున్నాడు. ఓడిపోతున్నాడు” అనుకునే సమయంలో మరోమెట్టు పైకి వెడుతున్నాడు.

ఎవరి జీవితమూ వడ్డించిన విస్తరికాదు. ఆ వ్యక్తి కోరుకున్న విధంగానూ జరగదు. ఒడుదుడుకులు, మెట్టపల్లాలు, జయాపజయాలు తప్పవు. ఏడేళ్ళు నలందా నీడలో తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్న భరద్వాజ జీవితంలో మరో ప్రయోగం చేయాలనుకునప్పుడు, మిత్రులం చాలామందిమి వారించాం. అయినా, ఈ గజమొండి వినలేదు.

అప్పటికే ధనికొండ మద్రాసు నుండి ‘అభిసారిక’ను సంపాదిస్తున్నాడు. మరో కథల మాసపత్రికను తేవాలని ఆయన సంకల్పం. ‘జ్యోతి’ పిలుపు నందుకొని, భార్యా బిడ్డలతో మద్రాసు వెళ్ళాడు. ఆ పత్రిక కోసం, రాత్రింబవళ్ళు పనిచేశాడు. చాలామంది కొత్త రచయితలను తన పత్రిక ద్వారా పరిచయం చేశాడు.

మరో ప్రయోగంగా చేస్తున్న ఉద్యోగాన్ని మానేశాడు.

“మళ్ళా తెనాలికేనా?” అని అపహాస్యంగా అడిగాడు ఓ పెద్దమనిషి.

“కాదు” అన్నాడు భరద్వాజ.

“ఇక్కడుండి ఛస్తావా?”

“చావను చూస్తూ వుండు”

ఇదీ అతని జవాబు.

అంతదాకా కలంతో రాసేవాడు కాస్తా, కలాలు అమ్మకానికీ, బాగుచేయడానికీ కుదిరాడు.

ఏ ఉద్యోగంలో ఉంటే, ఆ ఉద్యోగాన్ని నమ్మకంగా చేయడం అతని స్వభావం!

మద్రాసులో ఉన్నప్పుడు అద్భుతమైన నాటకాలు ప్రసారం చేశాడు. ‘ఆంధ్ర (వార) ప్రభ’లో వారం వారం ఓ శీర్షికను నిర్వహించేవాడు. నార్లవారు చక్రపాణికి చెప్పి, భరద్వాజను హైదరాబాదులో ‘యువ’కు పంపించారు.

మళ్ళా మార్పు-

అప్పట్లో గోపీచంద్‍గారు గ్రామస్థులు కార్యక్రమాల ప్రయోక్త. భరద్వాజకు పూర్వపు మిత్రుడు. అదీగాక – భరద్వాజ నాన్నగారూ, ఉన్నవ లక్ష్మీ నారాయణ పంతులుగారూ, త్రిపురనేని రామస్వామి గారూ, అయ్యదేవర కాళేశ్వరరావు గారూ మంచి స్నేహితులు కూడా. నండూరి విఠల్ గారు చెబుతే, ఓ దరఖాస్తు పెట్టాడు భరద్వాజ ఆకాశవాణికి. తరవాత చేరాడు కూడా.

గోపీచందుగారిని భరద్వాజ స్వంత అన్నగా భావించినా, ఆయన ప్రభావం భరద్వాజపై ఎక్కువగా పడలేదనిపిస్తుంది. గోపీచంద్ రచయితను మించిన తాత్వికుడు… యోగి. అరవింద శిష్యుడు ఆయన. దశదిశలా విస్తరించిన ప్రజ్ఞాశాలి. ఆయనను ఒకవైపు నుండే పరిశీలించి భరద్వాజ అర్థం చేసుకున్నారేమో! ఒకే కోణంలోంచి రచనలు చేయరాదని, రచయితకు వివిధ దృక్పధాలు – అవసరమని గ్రహించాడు గోపీచంద్ గారి సాన్నిహిత్యంలో. ఆయనది తాత్విక దృక్పథం అయితే, భరద్వాజది వైజ్ఞానిక దృక్పథం.

నేనెరిగిన ఈ ముప్ఫయి ఏళ్ళలో అతని అనుభవం పెరిగింది. సంసారం పెరిగింది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అయితే భరద్వాజ తాను సాధించింది ఏమిటి అని నిత్యం ఆలోచిస్తుంటాడు. జీవితంలో తను నేర్చుకున్నది ఏమిటి? ఈ లోకానికి తను చేసింది ఎంత?

నూరుపైగా పుస్తకాలు రాశాడు, మరో నూరు పుస్తకాలు అలాగే రాయగలడు. రికార్డు సృష్టించగలడు. అవార్డులు, బహుమతులు సంపాదించాడు. కానీ తృప్తిలేదు. ‘తృప్తి’ చెందిననాడు అతను రాయలేడు. ఉత్తమరచనకు ‘అసంతృప్తి’ అవసరమేమో!

భరద్వాజకు బంధువులు తక్కువ. అయినవాళ్లు మరీ తక్కువ. అతనికున్నది మిత్రులు, స్నేహితులు. అతను ఇతరుల్ని ఎంత అమాయకంగా, నిష్కల్మషంగా, నిష్కపటంగా ప్రేమిస్తాడో, వారూ అతన్ని అలాగే ప్రేమిస్తారు: అభిమానిస్తారు, ఆదరిస్తారు.

అతనిదగ్గరున్న ఒకే ఒక్క బ్రహ్మాస్త్రం ‘మంచితనం’. ‘నాకు ఆకలి అవుతుంది’ అని అడగ్గలడు. అడిగి పెట్టించుకోనూగలడూ.

భరద్వాజ మాట ధొరణి రవంత కటువుగా వుంటుంది. అతని తీరు చేదుగానూ వుంటుంది. ఆలోచిస్తే అతను చెప్పిందే నిజం అవుతుంది. నిజాన్ని చేదుమాత్రగా మింగాలంటాడు. మనసులో ఒకటి అనుకుని, పైకి మరొకలా చెప్పడం అతని చాతకాదు. చదువుకోలేదుగదా! మోహాన అనేస్తాడు. మంచిగానీ, చెడుగానీలే.

స్వయం ప్రతిభతో  పైకి రావడానికి భరద్వాజ ఒక చక్కని ఉదాహరణ. అతను ఎంత శ్రమపడి ఇంగ్లీషు నేర్చుకున్నదీ నాకు తెలుసు. డిక్షనరీ దగ్గరుంచుకొని చదివేవాడు. రోజూ పది మాటలు కంఠతా పట్టేవాడు. అందుకే అతని ఇంగ్లీషులో వ్యాకరణ దోషాలు వుండవచ్చు గానీ, స్పెల్లింగు తప్పులుండవు. అతని ఆంగ్లభాషా ‘పద’ పరిజ్ఞానం అలాంటిది. ఎం.ఎ. చదివిన వారికి కూడా అతనికి తెలిసినన్ని మాటలు తెలియవనుకుంటాను. అందుకే ఎంత జటిలమైన పుస్తకం అయినా సులభంగా అర్థం చేసుకోగలడు. అనువదించనూ గలడు.

అతని దృష్టిలో విశ్వనాథ సత్యనారాయణ అంటే ఎంత గౌరవమో దిగంబర కవి, నగ్నముని అన్నా అంతే గౌరవం. మంత్రిగారిని, బిచ్చగత్తెనూ, ఒకేలా అభిమానించగలడు. పరమపతివ్రతకు, పక్క వ్యభిచారికి చేయెత్తి నమస్కరించనూ గలడు. అదీ అతని సంస్కారం. అదీ అతని మానవత.

రచన విషయంలో అతను స్పృశించని అంశం లేదు. మనుచరిత్ర, వసుచరిత్ర, కుమార సంభవం వంటి కథలు అతని ప్రబంధ పరిచయానికి ప్రతీకలు. ఆ కథల్ని మలచిన తీరు అపూర్వం.

భరద్వాజకు దేవుడిపై నమ్మకం లేదు. ఇప్పుడు ఉన్నదేమో మరి! అతను గుడికి వెళ్ళగా, నేను చూడలేదు. ఇంట్లో కూడా వ్రతాలు, పూజలు చేస్తాడనుకోను. అతనికి విచిత్రంగా సైన్సు మీద నమ్మకం ఏర్పడ్డది. పని కట్టుకుని అనేక సైన్సు పుస్తకాలు చదివాడు. దానివల్ల ఒరిగేదేమిటో నాకు తెలియదు. 1952లోనే ‘చిత్రగ్రహం’ అనే సైంటిఫిక్ నవల రాశాడు. మానవుడు చంద్రమండల యాత్ర చేయడానికి చాలా ఏండ్లకు ముందే భరద్వాజ ‘చిత్రగ్రహం’ చేరుకున్నాడు.

తెలుగులో ఇన్ని పుస్తకాలు వచ్చినా తృప్తి లేదు. అతని చాలా కథలు, నవలలు అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి. ఇంగ్లీషులోనూ వచ్చాయి. ‘ఫాంటసీ క్వింటెట్’, ‘లవ్స్ లేబర్ లాస్ట్’ అనే పుస్తకాలు రెండు వి. పురుషోత్తం గారు ఆంగ్లీకరించారు. ఒకదానికి కె. ఎ. అబ్బాస్, రెండవదానికి ఎం. చలపతిరావు పరిచయ వ్యాసాలు రాశారు ప్రశంసిస్తూ. ’పాకుడురాళ్ళు’ నవల కూడా ఇంగ్లీషులో రానున్నది.

ఒకప్పుడు భరద్వాజకు సినిమా రచయిత కావాలనే ‘సరదా’ వుండేది. మద్రాసులో వుండగా కలిసి రాలేదు. అతను సినిమా రచయిత అయివుంటే ఇన్ని పుస్తకాలు రాసి, ఇంత కథ నడిపేవాడు కాదేమో! సినిమావాళ్ళు మంచి రచయితల జోలికి రారు. అలా వస్తే మంచి సాహిత్యం సృష్టించేవారు ఉండరు గదా! గొప్ప రచయితలు సినిమావారికి పనికిరారు. పనికి రాకపోవడమే మంచిది.

మొదటినుండీ భరద్వాజ తన కాళ్ళమీద నిలబడడం నేర్చుకొన్నాడు. ఇతరుల్ని ఆశ్రయించినట్లు నటిస్తాడు గానీ, ఎవరినీ ఆశ్రయించడు. ఎవరిపైనా పూర్తిగా ఆధారపడడు. తన పనికోసం “నీవు ఇంద్రుడవు, చంద్రుడవు” అనడు. “ఈ పని నీవు చేయగలవు, కనుక చెయ్యి” అని శాసిస్తాడు.

ఈ మధ్యనే పాపం గుండె జబ్బుచేసి కోలుకున్నాడు. భగవంతు డనేవాడున్నాడో లేడోగాని, మనల్ని నడిపించే ఒక మహత్తర, అదృశ్యశక్తి వుందంటున్నాడిప్పుడు. “మన శక్తికన్న దివ్యశక్తి గొప్ప” దని విశ్వసిస్తున్నాడు. గోపీచంద్‍గారు ఆ విషయాన్ని ముందుగానే గ్రహించి, అరవింద సన్నిధిని చేరాడు. భరద్వాజ ఆలస్యంగానైనా గ్రహించాడు.

మనిషి ఉన్నతుడు కావడానికి తన కృషి, పూర్వపుణ్యం అవసరం. ఆ పూర్వార్జిత సుకృతం భరద్వాజకు పుష్కలంగా వుంది. ఈ జన్మలో దాన్ని సమాజపరం, సాహిత్యపరం చేస్తున్నాడు. దానిని ‘ఆత్మ’పరం చేసి, సాధన చేయడమూ అవసరమే. అతను అక్షరాలా కర్మయోగి అనడం ఇందుకే!

అతను మహర్షి కాదు.

అతను బ్రహ్మర్షీ కాదు.

అతను కర్మయోగి, సాక్షాత్తు కర్మయోగి.

– శార్వరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here