Site icon Sanchika

భారత్ కీ పెహ్చాన్ ధరంపాల్ కీ దృష్టి మే – పుస్తక పరిచయం

[dropcap]“భా[/dropcap]రత్ కీ పెహ్చాన్ ధరంపాల్ కీ దృష్టి మే / भारत की पहचान – धर्मपाल की दृष्टि में” అన్న హిందీ పుస్తకం గురించిన పరిచయం ఇది. ఇది ప్రఖ్యాత చరిత్రకారుడు గాంధేయవాది అయినటువంటి ధరంపాల్ గారి లేఖలు మరియు వ్యాసాల సంకలనం. వందల ఏళ్ళ వలస పాలకుల నిరంకుశత్వం నుంచి స్వాతంత్య్రం లభించిన తర్వాత భారతదేశం కేవలం పాశ్చాత్య దేశాలకు నాసిరకమైన నకలుగా మిగిలిపోకుండా తన స్వత్వాన్ని కోల్పోకుండా భావి భారత నిర్మాణం జరగాలన్న తపనకు ప్రతిరూపం ఈ పుస్తకం. ఇప్పటికీ ఇలాంటి తపన కలిగి భారతజాతి యొక్క స్వత్వానికి గుర్తింపు చిహ్నాలు ఏమిటి అని తెలుసుకోగోరే వారికి ఈ పుస్తకం పనికొస్తుంది.

ధరంపాల్ గారి గురించి నాకు మొదట తెలిసినది 2005/2006 ప్రాంతంలో. నేను ఇంజనీరింగ్ చదువుతున్న కాలేజీలో ఆయన కొద్ది రోజులు బస చేయటం జరిగింది అప్పట్లో. అప్పుడు ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించే భాగ్యం కలిగింది. తర్వాత ఆయన రచనలు ఎన్నో చదివాను. ఆయన శిష్యులతో ఆయన రచనలను అభిమానించే వారితో ఆయనను ఆదర్శంగా భావించే వారితో గత కొన్నేళ్ళుగా అడపా దడపా ఏదో ఒక విధమైన మాటామంతీ జరుగుతూనే ఉంది. ధరంపాల్ గారి రచనలు ఒకసారి చదివి అర్థం చేసుకుంటే మనసులో ఏదో ఒక మూల లేశమాత్రమైనా స్వజాతీయ సంస్కృతి పట్ల అనురాగం ఉంటే ఆయన ఆలోచనలు జీవితకాలం వెంటాడతాయి మనలను.

ధరంపాల్ గారి శతజయంతి సందర్భంగా ఈ మధ్యే ఆయన పేరుమీద ఒక వెబ్సైట్ కూడా పెట్టారు ఆయన అనుయాయులు ఆయన పుస్తకాలు కొన్ని ఈ వెబ్సైట్లో ఉచితంగా డవున్లోడ్ చేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి రకరకాల ఆన్లైన్ మాధ్యమాల ద్వారా కూడా లభ్యం ఆయన రాసిన పుస్తకాలు . తెలుగులో ఇప్పుడిప్పుడే అంతర్జాలంలో ధరంపాల్ గారి రచనల అనువాదాలు పరిచయాలు కనిపిస్తున్నాయి. ఇది మంచి పరిణామము.

బ్రిటీషు వారు భారత దేశానికి వచ్చిన కాలంలో ఈ దేశపు స్థితిగతులు సామాజిక పరిస్థితులు సాంస్కృతిక మూలాలు తెలుసుకోవటానికి ఎన్నో పరిశోధనలు చేశారు. ఇలా వారు ఈ దేశపు చరిత్రను గురించి భద్రపరిచిన రాతప్రతులు లేఖలు వగైరాలను ఆధారంగా చేసుకొని అప్పటి భారత దేశ వైభవాన్ని తదనంతర పతనాన్ని గురించి లోతైన పరిశోధన చేసారు ధరంపాల్ గారు. ఇతరత్రా చరిత్రకారులకు మల్లే ఏ భావజాలానికి దాసుడు కాకుండా కేవలం కుతూహలంతో స్వదేశాభిమానంతో చేసిన పరిశోధన ఇది. బ్రిటీషు వారు పొందుపరిచిన ఆర్కైవ్స్ ఆధారంగా పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దపు భారత దేశం నిజానికి ఎన్నో విషయాలలో అప్పటి యూరోపు దేశాలకంటే ఉన్నతమైన స్థితిలో ఉండేదని ఒక పద్దతి ప్రకారం ఈ దేశ సంపదను ఆంగ్లేయులు రెండు వందల ఏళ్ళకు పైగా దోచుకున్నారని ఆ క్రమంలోనే భారత దేశం తీవ్రమైన విధ్వంసానికి లోనైందని అంటారు ధరంపాల్. పదిహేడు పద్దెనిమిది శతాబ్దపు భారత దేశంలోని విద్యా వ్యవస్థను గురించి ఆ కాలపు సైన్సు టెక్నాలజీ గురించీ మరెన్నో విషయాల గురించి ఎంతో కష్టపడి రేయనకా పగలనకా శ్రమించి విషయ సేకరణ చేసి పుస్తకాలు రాసారు ధరంపాల్ గారు.

అయితే ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. మార్కిస్టు దృక్పథంతో చరిత్రను చూసే చరిత్రకారులకు ధరమ్ పాల్ వెలికితీసిన నిజాలు మింగుడుపడవు వారి అజెండాకు పనికి రాదు ఈ రిసెర్చి. ఈ దేశం గతంతో నాకు సంబంధంలేదు . మన భవిష్యత్తు బాగుపడాలంటే పాశ్చాత్య దేశాలను మనం అనుకరించక తప్పదు ఇప్పటికే పారిశ్రామిక విప్లవం తెచ్చిపెట్టిన వైజ్ఞానిక ప్రగతి అనే పరుగుపందెంలో మనం వెనుక పడ్డాము అని గుడ్డిగా పాశ్చాత్య దేశాలకు నకలుగా భారత దేశాన్ని తయారు చేయాలని అనుకునే వారికి కూడా ధరంపాల్ రిసెర్చి పనికిరాదు. ధరంపాల్ గారి రచనలను ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీ వారు తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినా కూడా ఆ దిశగా వారు చేసిన కృషి అంతగా కనపడదు ఈ మధ్యనే ప్రభుత్వం వారి అధికారిక ట్విట్టర్ హేండిల్ లో ధరంపాల్ ప్రస్తావన కనిపించింది .

అయితే గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ధరంపాల్ గారు తన చారిత్రక పరిశోధన ఆధారంగా చేసిన ప్రతిపాదనలను స్వీకరించి జాతి భవిష్యత్తును గురించిన నవ్య సృజన జరగాలంటే మనం ఎంతో మారాల్సి ఉంటుంది. ప్రతిదానికీ పాశ్చాత్య సంస్కృతిలో నాగరికతలో సమాధానం వెతుక్కునే పద్దతికి స్వస్తి పలకాల్సి ఉంటుంది.

2000 సంవత్సరంలో RSS వారి పిలుపు మేరకు నాగపూర్ వెళ్లారట ధరంపాల్ గారు. అప్పటి ప్రసంగ వ్యాసం ఒకటి పొందుపరచారు ఈ పుస్తకంలో. ఖిలాఫత్ ఉద్యమ నేపథ్యం గురించీ ఆ విషయంపై గాంధీ గారికి RSS వ్యవస్థాపకుడైన హెగ్డేవర్ గారికి కలిగిన అభిప్రాయ భేదాల గురించి ప్రస్తావిస్తారు ధరంపాల్ ఈ వ్యాసంలో. ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభంలో బ్రిటీషు వారిచే దళితులుగా గుర్తింపబడ్డ కొన్ని జాతుల వారు దక్షిణ భారత దేశంలోని కొన్ని ప్రాంతాలలో సైన్యాలలో సేనానులుగా పని చేశారని అంటారు ధరంపాల్. గ్రామాలలో ఇప్పటి పోలీసు వ్యవస్థను పోలిన వ్యవస్థ ఒకటి ఉండేదని ఈ జాతుల వారు కొందరు పోలీసు పని కూడా చేసేవారని అంటారాయన. ఈ జాతుల వారు తమను తాము వీర సైనికులుగా యోధులుగా అభివర్ణించుకునే వారనీ అంటారు ధరంపాల్. గ్రామాలలో భూమి తగాదాలలో న్యాయం చెప్పే పని కూడా ఈ జాతుల వారు చేసిన దాఖలాలు ఉన్నాయని అంటారాయన. బ్రిటీషు పాలకుడైన వారెన్ హేస్టింగ్స్ మద్రాసు నుంచి కలకత్తాకు వెళ్ళే సమయంలో ఒక దస్తావేజు రాయించాడట. అందులో ఇప్పుడు మనం దళితులుగా జమకట్టే ఒక జాతి వారు తమ గురించి తాము ఇలా చెప్పుకున్నారట “వీ ఆర్ గ్రేట్ సోల్జర్స్, వి ఆల్సో మేక్ సెండల్స్ / We are great soldiers we also make sandals” అని . ఈ జాతుల వారి గురించి అప్పటి కాలపు బ్రాహ్మణులు కానీ ఇతర వర్గాల వారు కానీ వివక్ష చూపి ఉండచ్చును కానీ అసలు ఈ జాతుల వారు తమ గురించి తాము ఏమనుకున్నారు అన్నది తెలుసుకోవలసిన అవసరం ఉంది అని అంటారు ధరంపాల్. వారి “సెల్ఫ్ – ఇమేజ్” అన్నది తెలియాలి అంటారాయన. మనకి సాధారణంగా ఈ విషయంపై లభించే సాహిత్యం అంతా కూడా బ్రిటీషు పాలనానంతర సాహిత్యమే. ధరంపాల్ ప్రస్తావిస్తున్నది బ్రిటీషు వారి పాలన ఇంకా పూర్తిగా నిలదొక్కుకోని కాలం గురించి. అంబేడ్కర్ మహశయుని కులమైన మహర్ జాతి వారి గురించి కూడా ఇటువంటి కథనాలు ఉన్నాయి. “Caste in Indian politics” అని 1995లో రజనీ కొఠారి రాసిన పుస్తకంలో ఒక వాక్యం నాకు బాగా గుర్తు. ఇటువంటి విషయాల పై పరిశోధన చేసిన రిసర్చర్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ వ్యాసానికి సంబంధించి కొఠారి పరిశోధనలో ఒక వాక్యం ముఖ్యం. “The post office, the courts, and the police replaced the Mahar as messenger, arbitrator of land disputes, and watchman” అన్నది. బ్రిటీషు కాలము అనంతరం పుట్టుకొచ్చిన పోలీసు వ్యవస్థ, కోర్టుల వ్యవస్థ, పోస్ట్ ఆఫీసు వ్యవస్థ వచ్చాక సంప్రదాయ పద్ధతిలో మహార్ జాతి వారికి పారంపర్యంగా వస్తున్న వృత్తులకు విఘాతం కలిగిందని ప్రస్తావిస్తారు తమ పరిశోధనలో కొఠారి. ఈ మార్పుల తర్వాత చాలా మంది మహర్లు బ్రిటీషు సైన్యంలో చేరటం వగైరాల గురించి కూడా ప్రస్తావిస్తారు తమ పరిశోధనలో కొఠారి. మహర్ జాతి వారికి అప్పటి మహారాష్ట్ర గ్రామీణ సమాజంలో “బారహ్ బలుతేదార్” వ్యవస్థలో రకరకాల వృత్తులు చేసే సౌలభ్యం ఉండేదని అంటారు కొఠారి. అయితే హేయమైన వివక్ష కూడా ఉండేదని ప్రస్తావిస్తారు కొఠారి. కానీ వివక్ష అన్నది ధరంపాల్ వ్యాస పరిధిలోని విషయం కాదు. “సెల్ఫ్ ఇమేజ్” గురించి ఆయన ప్రస్తావన. ధరంపాల్ ప్రస్తావించినట్లు గానే ఛత్రపతి శివాజీ కాలం నుంచే మహర్ జాతి వారు సైన్యంలో పనిచేసిన దాఖలాలు ఉన్నాయని అంటారు కొఠారి. కాబట్టి వారెన్ హెస్టింగ్స్ కు ఒక దళిత జాతి వ్యక్తి “వీ ఆర్ గ్రేట్ సోల్జర్స్” అని పరిచయం చేసుకుంటే ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు ఈ విషయాల పైన చాలానే పరిశోధనలు జరిగాయి కానీ బ్రిటీషు వారు రాక మునుపటి కాలంలో ఈ జాతుల “సెల్ఫ్ ఇమేజ్” గురించిన పరిశోధన మరింత జరగవలసి ఉన్నది.

ఇదే వ్యాసంలో అదిలాబాద్ కళా ఆశ్రమంకు చెందిన గురూజీ రవీంద్ర శర్మ గారిని గురించి కూడా ప్రస్తావిస్తారు ధరంపాల్. గురూజీ రవీందర్ శర్మ గారితో తాను చేసిన సంభాషణను ప్రస్తావిస్తారు ఇక్కడ ధరంపాల్ గారు. దాదాపుగా అన్ని జాతుల వారికీ వారి వారి స్వంత పురాణాలు ఉన్నాయనీ వారికంటూ సొంతమైన సంగీతమూ సంగీత వాద్యాలు బాణీలు ఉండేవనీ చెప్పారట గురూజీ. చాలా జాతుల వారికి తమ తమ కుల పురాణాలను చెప్పే భిక్షా జాతుల ఉపకులాల వారు ఉండేవారని చెప్పారట రవీందర్ శర్మ గారు ధరంపాల్ గారికి. ఈ జాతుల వారు కుల పురాణాలకు ఉపయోగించే పటం చిత్రాలను వగైరాలను కూడా చూపించారట గురూజీ ధరంపాల్ గారికి. ఇవంతా చూస్తే ఆ జాతుల వారేదో దౌర్భాగ్యపు బతుకు బతికినట్టుగా తనకు అనిపించలేదని వారి సొంత దృక్కోణంలో వారి జీవితం సమృద్దిగా ఉన్నట్టే అనిపించిందని అంటారు ధరంపాల్. ఇలా దేశం యావత్తు ప్రతీ జిల్లాలోను పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని అప్పుడే మన గురించి మనం చెప్పుకున్న కథలు తెలుస్తాయని లేదంటే మన చరిత్ర అంతా కూడాను కేవలం వలస పాలకుల దృష్టితో రాసిన చరిత్రేనని అంటారు ధరంపాల్.

మాటవరసకు మనం ఏదో గొప్పగా బతికామనే అనుకుందాము. తర్వాత ఎందుకు ఇలా దిగజారి పోయాము అని ఆలోచిస్తాం. అటు తర్వాత ఇపుడేమి చేయాలి ఇదంతా ఆలోచించి ఆన్న ప్రశ్న రావటం కూడా సహజమే అంటారు ధరంపాల్. మనకు నకలు చేయటం అన్నది బాగా అలవాటైపోయిందని మన స్కూళ్లు హాస్పిటళ్లు విశ్వ విద్యాలయాలు అన్ని కూడా ఇంగ్లీషు వాడి దగ్గర ఉండేవాటికి చౌక నకళ్లుగా అనిపిస్తాయని అంటారయన. ఇంగ్లీషు వాడి అనుకరణ అయ్యాక జర్మనీని అనుకరించటమో లేదా అమెరికాను అనుకరించటమో నేర్చామని మనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోడానికి సరైన ప్రయత్నం జరగట్లేదని అంటారు ఆయన. ఉదాహరణకు విదేశీయులు తయారు చేసిన కంప్యూటర్ పైన సాఫ్ట్‌వేర్ రాయటానికి ప్రయత్నించాము సరే అసలు మన భారతీయ దృక్కోణంలో కొత్త కంప్యూటర్‌ను ఆవిష్కరించటం చేయటం దిశగా ఆలోచించలేదని అంటారు ధరంపాల్. సరే పాశ్చాత్యులను అనుకరించటం ఇప్పుడు తప్పనిసరి అని అనుకున్నా కూడా ఏవో కొన్ని విషయాలలో వారికంటే మనం ముందు ఉండాలని లేదంటే పెద్ద ఉపయోగం లేదనీ అంటారు ధరంపాల్. ఉదాహరణకు సౌర శక్తి ఉత్పాదనలో వారికంటే ముందు ఉండే ప్రయత్నం జరగచ్చని అంటారు ఆయన. ఏదో ఒక విషయంలో వారికంటే ముందు ఉండకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఎవరూ ఈ దేశానికి సముచిత స్థానం ఇవ్వరని అంటారు ధరంపాల్.

గాంధీజీ కలలుకన్న స్వరాజ్యం అన్నది నిజానికి అమెరికా సమాజంలో కూడా లేదని అంటారు ఇదే ప్రసంగ వ్యాసంలో మరోచోట ధరంపాల్. ఒక నెల రోజులు పని దొరకక పోతే లేదా పని నుంచి విశ్రాంతి తీసుకుంటే ఇంటద్దెలు కట్టుకునే స్థోమత లేని వారు చాలా మంది ఉన్నారని అటువంటి వారు రాజ్యం ఇచ్చే సోషల్ సెక్యూరిటీ మీద ఆధారపడాల్సి వస్తుందనీ అంటారాయన. మనకి కలగాల్సిన స్వరాజ్యం ఇటువంటి నామమాత్రపు స్వరాజ్యం కాదని అంటారు ధరంపాల్.

వలస పాలకుల నుంచి స్వాతంత్య్రం వచ్చినా కూడా వలస మేధ అన్నది చాలా మంది మస్తిష్కాలలో బలంగా వెళ్లూసుకొని పోయిందని తెల్లవారు దేశాన్ని వదిలి వెళ్ళినా తెల్లవారి లాగానే ఆలోచించేవారు మన పాలకులలో శిష్ట వర్గాలలో చాలా మందే ఉన్నారని అంటారు ధరంపాల్. ఈ భావదాస్యం గురించి గాంధీ చాలా లోతుగా ఆలోచించారని అయితే స్వాతంత్ర్య పోరాటం చివరి రోజులలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నెహ్రూ వంటి వారు కూడా పూర్తిగా పాశ్చాత్య భావాలకు దాసులై పోయారనీ ఈ విషయమై గాంధీ ఆలోచనలను స్వాతంత్ర్యానంతరం మనం పట్టించుకోలేదని అంటారు ధరంపాల్.

మరొక లేఖలో ప్రస్తావించిన ఒక అంశం నాకు బాగా నచ్చింది. బ్రిటీషు గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఇలా రాశారట ఒక చోట – “చాలా మంది భారతీయులు పూర్వపు కాలంలో భిక్షా వృత్తుల వారికి బ్రాహ్మణులకి ఇచ్చే దానాలను బాగా తగ్గించి వేసి ఆ డబ్బును యూరోపు వారు తెచ్చిపెట్టిన జల్సాల మీద కొత్తగా మార్కెట్టులో వచ్చిన వినోద సాధనాల మీద వెచ్చించటం మొదలు పెట్టారు” అని రాసుకునాడట బెంటింక్. సరే బ్రాహ్మణులు ఎలాగూ దుర్మార్గులు దుష్టులు కుట్రలు చేసి వేరే ఉపాధి మార్గం చూసుకున్నారు కాబట్టి వారికి దానాలు లేకపోయినా నష్టం లేదు అని అనుకుందాం. కానీ ఈ భిక్షా వృత్తులు లుప్తమై పోవటం వలన మనం కోల్పోయిన సాంస్కృతిక సంపద ఎంతో ఉంది. భిక్షా వృత్తుల ఉపాధి కోల్పోయి ప్రగతి రథ చక్రాల కింద నలిగిపోయిన కులాల వారు ఎందరో ఉన్నారు. భిక్షా వృత్తుల వినాశనం వల్ల మనం కోల్పోయింది ఏమిటో గుర్తించే వివేచనను మన సమాజం కోల్పోయింది నేడు. స్వాతంత్య్రానంతరం కూడా భిక్షా వృత్తుల వారి గురించి మనం పట్టించుకున్నది పెద్దగా ఏమీ లేదు. దీని గురించి ఆలోచించే వారు చాలా తక్కువ నేటి మన సమాజంలో. ఈ సాంస్కృతిక విధ్వంసం మాత్రమే కాక పారిశ్రామిక విప్లవం తెచ్చిన వైజ్ఞానిక పురోగతి వల్ల వచ్చిన కొత్త పరికరాలు పనిముట్ల వెల్లువలో మరిన్ని కుల వృత్తులు లుప్తమయ్యాయని దాని వలన సమాజంలోని ఉన్నత వర్గాలకు ఇతర వర్గాలతో సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లాయని వారి మధ్యన దూరం ఇంకా పెరిగిందని అంటారు ధరంపాల్. ఈ పరిణామాలన్నిటి ప్రభావం చేత ఇరవయ్యో శతాబ్దపు ప్రారంభం నాటికి భారతీయులు తమ సొంత సమాజాన్ని పద్దెనిమిదో శతాబ్దపు బ్రిటీషు పాలకుల దృష్టితో చూడటం అన్నది మొదలయిందని అంటారు ధరంపాల్ . మన జాతి చరిత్ర యావత్తు దాదాపుగా ఆంగ్లేయుల దృక్కోణంలో రాసిన చరిత్రే మిగిలిందని అంటారాయన. బ్రిటీషు పాలనానంతర మార్పుల గురించి ప్రస్తావిస్తూ మరొక మాట అంటారు ధరంపాల్ గారు. బ్రిటీషు పాలన వేళ్ళూసుకొనక మునుపు దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రాంతాలలో పోలీసు లేదా రక్షక భటుల వ్యవస్థను గురించి ప్రస్తావిస్తారు ధరంపాల్. అప్పటి కాలంలో ఎవరిదైనా వస్తువు ఏదైనా దొంగిలింపబడితే దొంగ దొరకని పక్షంలో పోలీసు లేదా రక్షకభటుడు నష్ట పరిహారం చెల్లించే వ్యవస్థ ఉండేదట (విజయనగర సామ్రాజ్యంలో ఇటువంటి వ్యవస్థ ఉండేదని నేను ఇది వరకే వేరొక చోట చదివాను). బ్రిటీషు వారు పోలీసు వ్యవస్థ నిర్వహణ బాధ్యత తీసుకున్నాక ఇదంతా తారుమారయ్యి నష్ట పరిహారం మాట దేవుడెరుగు ఫిర్యాదు చేసినవారిని కూడా జైలులో ఖైదు చేసి హింసించే వ్యవస్థ వచ్చిందని అంటారు ధరంపాల్.

బ్రిటీషు పాలన వలన భారత దేశంలోని సామాజిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని అంటారు ఆయన. వర్ణ వ్యవస్థ అన్నది భారత దేశంలో ఇప్పటి చరిత్రకారులు చెప్పినట్లుగా కచ్చితంగా నిచ్చెన మెట్ల వ్యవస్థలా అమలైన దాఖలాలు తక్కువని అంటారు ధరంపాల్. బ్రిటీషు వారు వచ్చే కాలానికి భారత దేశంలో రాజ్యం చేసే రాజులు ద్విజులు కారని అప్పటికి ఎందరో రాజులు శూద్ర కులాల వారేనని చరిత్ర చెబుతోందని అంటారు ఆయన. అప్పటి భారత దేశ విద్యా వ్యవస్థను గురించి ఆయన రాసిన “ది బ్యూటిఫుల్ ట్రీ / The Beautiful Tree: Indigenous Indian Education in the Eighteenth Century” ఆన్న పుస్తకంలో కూడా పద్దెనిమిదవ శతాబ్దపు భారత దేశ పాఠశాలలో శూద్ర వర్ణానికి చెందిన జాతుల విద్యార్థులు ఎందరో ఉన్నట్టుగా రుజువులతో సహా నిరూపించారు. నిజానికి ఆ వ్యవస్థలో స్వతః సిద్ధంగా ఉన్న కొన్ని వెసులుబాటులను కూడా ఆంగ్లేయులు జనగణన కోసం తెచ్చిన వ్యవస్థ నాశనం చేసిందని అంటారు ధరంపాల్. గ్రామీణ సమాజంలో జాతుల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు సెన్సస్ (census) అంటే జనగణన లెక్కల బ్రిటీషు వ్యూహాల దెబ్బకు పూర్తిగా కుదేలయ్యాయని అంటారు ధరంపాల్.

స్వాతంత్ర్యం లభించాక భారతీయ మూలాలు కొద్దో గొప్పో నిక్షిప్తమై ఉన్న గ్రామీణ సమాజాలను పూర్తిగా కాదనుకుని నగరీకరణ బాట పట్టామనీ అందుకోసం మనం పాశ్చాత్యుల విజ్ఞానం మీద ఆధార పడాల్సి వచ్చిందని వారు మన మెదళ్ళను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని తుదికంటా వారి మీద ఆధార పడేలా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేశారని అంటారు ధరంపాల్. ఇందువలన అసలు స్వజాతీయ భారతీయ విజ్ఞానం అన్నది పూర్తిగా అక్కర్లేని విషయం అయిపోయిందని అంటారు ధరంపాల్.

మరొక వ్యాసంలో భారతీయ దృక్పథంలో పర్యావరణాన్ని మరియు సమాజాన్ని చూసే దృష్టిలో పాశ్చాత్య సంస్కృతుల వలె మానవ కేంద్రీకృత ఆలోచన విధానం అంటే anthropocentrism అన్నది లేదని అంటారు ధరంపాల్. భారతీయులు సృష్టిలో మానవుడిని సకల చరాచర జీవరాశుల లాగానే ఒక సహజ భాగంగా చూసారని మానవుడే కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకోవడం సృష్టికి పునః సృష్టి చేయటం అనేది పాశ్చాత్య సమాజంలో పుట్టిన జబ్బు అని అంటారు ధరంపాల్. క్రైస్తవ ప్రభావానికి లోనైన యూరోపు సమాజంలోనే ప్రకృతి గురించిన దృక్పథం మారిందని వృక్షాలు వనాలు పశువులు ఇతర జంతువులు వగైరాలన్నీ కూడా కేవలం మనిషి తన అవసరం కోసం వాడుకోవటానికే ఉన్న వనరులు అన్న అభిప్రాయం బలపడిందని అంటారు ధరంపాల్.

1992లో బ్రెజిల్ లో పర్యావరణ పరిరక్షణ గురించి జరిగిన సదస్సును గురించి ఒక లేఖ ఉంది ఈ పుస్తకంలో . పదిహేనవ శతాబ్దంలో అమెరికాను కనిపెట్టినప్పటి నుంచీ భూమ్మీద రకరకాల జాతుల వారి ఆస్తులూ సిరిసంపదలూ జీవన విధానాలూ మరియు సంస్కృతులపై యూరోపు వారి దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఇప్పుడు వారి నోటి నుంచి పర్యావరణ పరిరక్షణ గురించిన మాటలు వినాల్సి రావటం హాస్యాస్పదం అని అంటారు ఈ లేఖలో ధరంపాల్.

2002లో రాసిన మరొక లేఖలో గోవధ గురించి గోమాంస భక్షణ గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి. విచ్చలవిడిగా విచక్షణారహితంగా మాంసం కోసం గోవధ చేయటం అన్నది ఈ దేశంలో బ్రిటీషు వారు వచ్చాకే ప్రారంభం అయ్యిందని అంటారు ధరంపాల్. ఈ విషయంపై ఆయన తన అనుయాయుడైన ముకుందన్ తో కలిసి ఒక పెద్ద పుస్తకమే రాశారు “The British Origin of Cow-slaughter in India: With Some British Documents on the Anti-Kine-Killing Movement, 1880-1894” అని. ఈ పుస్తకం ముఖచిత్రంలో 1893లో గోవధను గురించి విక్టోరియా మహారాణి అప్పటి వైస్రాయ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యను ప్రస్తావించారు. “ఇది చూడటానికి ముస్లిముల గోమాంస భక్షణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలా అనిపించినా కూడా నిజానికి ఇది మనకు (బ్రిటీషువారికి) వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం. ఎందుకంటే ముస్లిముల కంటే ఎక్కువగా గోవధ అన్నది మన సైన్యం కోసం మనమే జరిపిస్తున్నాము” అని అన్నదట అప్పట్లో విక్టోరియా రాణి!

ధరంపాల్ గారి పుస్తకాలు సాధారణంగా PhD స్కాలర్ భాషలో ఉంటాయి. చరిత్ర పరిశోధకుల కోసం రాసినట్టుగా ఉంటుంది. బ్రిటీషు వ్రాత ప్రతులలో నుంచి యథాతథంగా రిఫరెన్సులు ఉంటాయి ఎన్నో గణాంకాలు ఉంటాయి అప్పటి భారతీయ సమాజ స్థితిగతుల గురించి. ఆ పుస్తకాలకు భిన్నంగా హిందీలో ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఆయన ఏదో నా పక్కనే కూర్చొని మాట్లాడుతున్న భావన కలిగింది నాకు. దాదాపుగా పదిహేనేళ్ళ కిందట ఆయనతో నా సంభాషణను నాకు మళ్ళీ గుర్తుకు తెచ్చింది ఈ పుస్తకం. నా వ్యక్తిగత జీవితంలో ఈ విషయాల పై నేను చేసిన కృషి పెద్దగా ఏమీ లేదు. కనీసం అప్పుడప్పుడు ఆయన ఆలోచనలను ఇలా నలుగురితో పంచుకుంటూ ఉంటే అదొక సాంత్వన.

Exit mobile version