భారత కోకిల

0
2

[dropcap]ఆ[/dropcap] రోజు ఏడవ క్లాసు చదివే అమ్మాయిలంతా క్లాసులో చేరి గోలగోలగా అరుస్తున్నారు. డ్రాయింగ్ టీచరుగారు బోర్డు మీద వేసిచ్చిన బొమ్మ గీసేశారు. ముందుగా గీసిన వాళ్లు అలా అల్లరి చేస్తున్నారు.

“ఏయ్ పిల్లలూ మీరు మరేదైనా బొమ్మ ప్రాక్టీస్ చేయొచ్చుగా, అలా సయమాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నారు” అన్నారు టీచరుగారు.

“మాకేదైనా కథ చెప్పండి మేడమ్” అని ఒకరంటే, “నిజం టీచరుగారూ, ఒక చిన్న కథ చెప్పండి” అని మరొకరూ అడిగాడు.

దాంతో టీచరుగారికి కథ మొదలు పెట్టాక తప్పలేదు. “మీకీ రోజు మంచి విషయమొకటి చెప్తాను.” అని “భారత కోకిల అని ఎవర్ని పిలుస్తారో చెప్పగలరా?” అని అడిగారు.

“నాకు తెలుసు. సరోజినీనాయుడు గారిని” అంటూ కళావతి అందించింది.

“అవును. కరెక్ట్‌గా చెప్పావు. 1879, ఫిబ్రవరి పదమూడో తేదీన ఆమె జన్మించింది. చిన్నతనం నుంచి చాలా చురుకైనది. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా వుండేది. పదకొండేళ్ల వయసులోనే కవిత్వం వ్రాయగలగింది. పన్నెండేళ్ల వయసులేనే మెట్రిక్ పరీక్ష వ్రాసింది. రాష్రానికంతా ఫస్ట్ వచ్చింది. అప్పటి మెట్రిక్ అంటే ఈనాటి డిగ్రీతో సమానమనుకోండి.”

టీచరు గారి మాట పూర్తి కాకుండానే “అంత చిన్న వయసులో చదివిందా?” అనడిగారు పిల్లలు.

“అవును, మరి ఎంత తెలివిగలదో చూడండి అన్నారు టీచరు.

“ఇంగ్లీషు, సంస్కృతం, బెంగాలీ, ఊర్దూ, పర్షియన్ భాషలను నేర్చుకున్నది. ఎన్నో పుస్తకాలు చదివేది. ఖాళీ సమయాల్లో ఇంట్లో తమ్ముళ్లతో, చెల్లెళ్లతో కలిసి ఇంగ్లీషు నాటకాలు వేసేది. తన పదమూడో ఏట పద్యనాటకం వ్రాసింది. ఆ నాటకం పేరు ‘మొహర్ మునీర్’, దాన్ని నిజామ్ ప్రభువు కూడా చదివాడు. బాగా మొచ్చుకున్నాడు. ఆమెను ఇంగ్లాండ్ పంపి పెద్ద చదువులు చదివించటానికి ధన సహాయం చేశాడు. ఆమె ఇంగ్లాండ్ వెళ్లింది. భారతేదేశంలో వుండే పల్లకీ బోయల గురించి, గాజులమ్మే వాళ్లను గురించి, చేపలు పట్టే వాళ్లను గురించీ కవిత్వం వ్రాసి అందర్నీ మెప్పించింది. ‘బంగారు వాకిలి’, ‘విరిగిన రెక్క’, ‘చావుపుట్టుకలు’, ‘కాలవిహంగం’ మొదలగునవి ఈమె రచనలు. వీటిని ఆమె ఇంగ్లీష్‌లో వ్రాసింది. వీటిని ఫ్రెంచ్, జర్మన్, భాషల వాళ్లు అనువాదం చేశారు. మీ ఇంగ్లీషు, పాఠ్యా పుస్తకాల్లో ఆమె కవితలు ముందు ముందు మీకు కనిపిస్తాయి” అన్నారు టీచర్.

“అప్పుడు మేం వాటిని బాగా ఇష్టంగా చదువుతాం టీచరుగారూ” అన్నారు పిల్లలు.

“ఇంగ్లాండ్‌లో చాలా పేరున్న ‘రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్’కు ఈమెను సభ్యురాలిగా ఎన్నుకొన్నారు. కొన్ని రోజులకు ఆమె ఇంగ్లాండు నుండి భారదేశానికి తిరిగి వచ్చింది. డా. గోవిందరాజులు నాయుడి గారిని పెళ్లి చేసుకున్నది. నలుగురు పిల్లలు కలిగారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించింది. గోపాల కృష్ణ గోఖలే ఈమె మొదటి రాజకీయ గురువు. ఆ రోజుల్లో హిందూ, ముస్లిమ్‍ల మధ్య బాగా గొడవలు జరిగేవి. లక్నోలో ఈమె చేసిన ఉపన్యాసం వలనే హిందువులు మహమ్మదీయులు స్నేహంగా మారిపోయారని చెప్పేవారు. అలా హిందూ ముస్లిమ్‍ల మధ్య స్నేహాన్ని పెంచే సత్తా ఆమెకున్నదని గోఖలే, గాంధీజీ గట్టిగా నమ్మేవాళ్లు. గాంధీజీని ఈమె గురువుగా, తండ్రిగా భావించేది.

ఆ రోజుల్లో సరోజీనీ నాయుడు ఉపన్యాసం చెప్తుంటే వినటానికి ఎక్కడెక్కడి నుండో ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్లు. ఆ ఉపన్యాసాలకు ఎంతో ఉత్తేజం పొందేవారు. ఇదంతా గాంధీజీ చూసి ఆమెకు ‘భారతకోకిల’ అనే బిరుదిచ్చారు. జవహర్ లాంటి ఎంతో మంది యువకులకు ఆమె మార్గదర్శకమైంది. స్త్రీల కోసం కూడా ఆమె ఎంతో పాటు పడింది. ఒకసారి వంగదేశపు గవర్నర్ స్త్రీలను అవమానించాడని అతడి చేత క్షమాపణలు చెప్పించింది. స్త్రీల సీటు హక్కు కోసం పోరాడింది. రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా స్త్రీల ప్రతినిధిగా పాల్గొన్నది. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకోబడింది. 1928లో ఆమెరికాలో జరిగిన ఫసిఫిక్ స్త్రీల ప్రతినిధిగా వెళ్లింది. ఇండియా, అమెరికాల మధ్య, ఇండియా కెనడాల మధ్య ఒక రాయిబారిగా పని చేసి దేశాభివృద్ధికి పాటుపడింది. ఉప్పు సత్యాగ్రహంతో పాటు ఎన్నో దేశ స్వాతంత్ర్య సంగ్రామ పోరాటాల్లో పాల్గొన్నది. గాంధీజీకి ప్రతి విషయంలోనూ సలహాల నివ్వలిగినంత తెలివిగలది ఆమె. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ తొలి మహిళా గవర్నర్‍గా ఎంపిక చేయబడింది. తన కుటుంబ సభ్యులతోపాటు దేశ విదేశీ ప్రజల్ని ప్రేమించి అందర్నీ ప్రేమించే మనిషిగా మిగిలిపోయింది. చూశారా పిల్లలూ సరోజినీ నాయుడి తెలివితేటలూ, నాయకత్వ లక్షణాలూ” అనేంతలో బెల్ మోగింది.

పిల్లలు టీచరు గారికి ధన్యవాదాలు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here