Site icon Sanchika

భారత స్వాతంత్ర్య ఉద్యమం – స్వామి వివేకానంద పాత్ర

[స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘భారత స్వాతంత్ర్య ఉద్యమం – స్వామి వివేకానంద పాత్ర’ అనే వ్యాసాన్ని అందిస్తున్నారు ఎన్. సాయి ప్రశాంతి.]

[dropcap]“నా [/dropcap]విద్యార్థి దశలో స్వామి వివేకానందుని ఉపన్యాసాలు చదివి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తిదాయక ప్రసంగాలు నా మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. నా ఆలోచనా సరళిని, నా జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాయి. మహా ఋషి, తత్వవేత్త అయిన స్వామీజీ నిద్రాణమై ఉన్న భారతజాతిని తమ బోధలతో మేల్కొలిపారు. ఇది నా తలరాత, ఇది నా దురదృష్టము అనే ధోరణి వదిలి భారతీయులు కార్యోన్ముఖులు కావాలని బోధించారు స్వామీజీ.”

ఈ మాటలు దేశ ద్వితీయ ప్రధాన మంత్రిగా గొప్ప కీర్తి పొందిన లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వామి వివేకానంద గురించి ఒక సందర్భంలో అన్నవి.

అయితే స్వామీజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి గల కారణం – ఆయన దేశ పునరుజ్జీవన మార్గాలను, తద్వారా స్వాతంత్ర్య ఉద్యమాన్ని పరోక్షంగా ప్రభావితం చేసారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాల పర్యటన ముగించుకుని 1897లో మద్రాసు వచ్చారు. అప్పుడు ఎంతో మంది ఆయనను కలవడానికి వచ్చేవారు. అలా ఒకసారి మద్రాసు విశ్వవిద్యాలయం విద్యార్థులు వచ్చి ఆయనను ఇలా ప్రశ్నించారు –

“మీరు విదేశాలకు వెళ్లి మీ వ్యక్తిత్వంతో, భారతీయ ఆధ్యాత్మిక శక్తితో ఈ ప్రపంచాన్నే జయించారు కదా, మరి ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావచ్చు కదా..”

అప్పుడు అది సముచితమైన ప్రశ్నే.

అప్పుడు స్వామి వివేకానంద వారికి సూటిగా ఒకే సమాధానమిచ్చారు.

“నేను రేపే మీకు స్వాతంత్ర్యం తీసుకురాగలను, కానీ నిలబెట్టుకునే వారెక్కడ ఉన్నారు?”

మన దేశం అప్పుడు ఎదుర్కొన్న సమస్యలలో ఆత్మవిశ్వాసం కోల్పోవడం ఒకటి. అందువల్ల స్వామీజీ తన ఉపన్యాసాలు లేఖలు మరియు సంభాషణల ద్వారా పరోక్షంగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రభావితం చేసారు. ఈ మొత్తం కార్యాన్ని జాతిని జాగృతం చేయడం (Awakening India Movement) అని సంక్షిప్తంగా చెప్పవచ్చు.

***

స్వామి వివేకానంద 1863లో కలకత్తాలో భువనేశ్వరి దేవి, విశ్వనాథ్ దత్తా దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. బాల్యం నుండి అన్నింట్లో ప్రథమ స్థానంలో నిలిచేవారు. జ్ఞానానికి, ఆత్మ విశ్వాసానికి రూపమా అన్నట్లు నాయకుడిగా వ్యవహరించేవారు. అపారమైన దయాగుణం కలిగి ఉండేవారు. అయితే ఆధ్యాత్మిక  జిజ్ఞాస వల్ల శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుడై సన్యాసిగా మారారు. అయినా ఆయనలో విశిష్టత ఏమిటంటే దేశభక్తి.

1886లో ఆయన తన దేశ పర్యటన ప్రారంభించారు. దేశ ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను మరియు అసలు మన దేశం సమస్యలు ఎదుర్కోవడానికి మూల కారణం ఏంటో తెలుసుకుని, దానిని పరిష్కారం ఏమిటో కనుక్కున్నారు. ప్రజలలో ఆత్మవిశ్వాసం క్షీణించిపోవడమే సమస్యలన్నిటికి మూలకారణంగా గ్రహించి అనేక మంది రాజులను, విద్యావేత్తలను, నాయకులను కలిసి వారిని సామాన్య ప్రజలలో విద్యావ్యాప్తికై కృషి చేయమని, వారిని బలవంతులుగా చేసే భావాలను వారికి అందించమని చెప్పారు. అలా స్ఫూర్తి పొందిన వారిలో ఖేత్రీ మహారాజు ఒకరు. బాలగంగాధర్ తిలక్ కూడా స్వామి వివేకానంద నుండి ఎంతో స్ఫూర్తి పొందారు. ఎందుకంటే ఆంగ్లవిద్య ప్రభావానికి లోనైన భారతీయులు భారతదేశంలో ప్రాచీన విషయాలను సంస్కృతిని దూషించి, దోషాలను మాత్రమే చూపించి, భారతీయుల ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టి, ఆత్మగౌరవాన్ని దిగజార్చే సంఘ సంస్కర్తలే తప్ప భారతదేశ సాంస్కృతిక వైభవం గుర్తించి సరియైన రీతిలో, ఆత్మవిశ్వాసం కలిగించేలా బోధించేవారు కరువైన వేళ దేశ పూర్వవైభవం, ప్రస్తుత స్థితికి, సాంస్కృతిక వైభవం అన్నింటి పైనా పూర్తి అవగాహనతో బోధించడే భారతీయులలో ఆత్మవిశ్వాసం అనే జ్యోతిని ప్రజ్వలింపజేశారు స్వామీజీ.

అందుకే ఆయన అసలు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి, అక్కడి వారిలో మన దేశంపై గల అపోహలు తొలగించి, వారికి దేశ వైభవాన్ని గురించి అర్థమయ్యేలా చేసారు. 1857లతో ప్రథమ స్వాతంత్య్ర ఉద్యమం జరిగింది, ఆ తర్వాత రకరకాల పద్ధతులలో స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించసాగారు మన పూర్వీకులు. ఆంగ్లేయ దొరల ముందు చేతులు కట్టుకుని నిలబడి, మాకు స్వాతంత్ర్యం ఇప్పించండి అని ప్రాధేయపడ్డ రోజులు ఉన్నాయి. తిరుగుబాటు ఉద్యమాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో ప్రాణత్యాగాలు కూడా జరిగాయి. 1897 నుండి స్వామి వివేకానంద ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చారు. అదే ఈ భారతదేశ జాగృత ఉద్యమం. అయితే అందుకు ఆయన చాలా వినూత్న విధానాలు అనుసరించారు. ప్రజలలో దేశం పట్ల విశ్వాసం, తమపై తమకు విశ్వాసం కలిగించేలా చేయాలని, అప్పుడు వారు వారికేమి కావాలనుకున్నా సాధించుకుంటారని చెప్పేవారు. అయితే ఎన్నో తరాలనుండి మన జాతి సామాన్య ప్రజలను, స్త్రీలను, బలహీన వర్గాలను విస్మరించడం వల్లే, వారిలో ఆత్మవిశ్వాసం నశించిపోయి పరులకు బానిసలైపోయిందని, వారిని బలవంతులుగా చేసి విద్యనందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తే, ఆ దేశ ప్రేమ గల వ్యక్తులు స్వాతంత్ర్యం సులభంగా సంపాదించుకుంటారని చెప్పేవారు.

అయితే. స్వామి వివేకానందుడు అన్ని రంగాలలో దేశాన్ని బలోపేతం చేస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని భావించారు. విద్యారంగంలో అనేకమంది విద్యావంతులైన యువకులను ప్రోత్సాహించారు. నివేదితగా పేరు పొందిన మార్గరెట్ నోబుల్ ఒక పాశ్చాత్య వనిత. ఆమె స్వామీజీ ప్రసంగాలకి ప్రభావితురాలై, భారతదేశం వచ్చి స్త్రీవిద్యా వ్యాప్తికి ఎంతో కృషి చేసింది. వ్యవసాయాన్ని విస్మరించవద్దని, ఒక విజ్ఞాన శాస్త్రమూ నేర్చుకోమని, ఎంతో మంది యువకులకు చెప్పారు. పరిశ్రమలు స్థాపించి, పరిశోధన సంస్థలు ఏర్పాటు చేసి దేశంలో వైజ్ఞానికరంగాన్ని బలోపేతం చేయమని జమ్‍షెడ్‍జీ టాటాని ఉత్తేజితం చేసారు. ఆయన కృషి వల్ల IISC ఏర్పడడింది.

“భారతదేశంలో ఏ రంగంలో ప్రగతి సాధించగోరినా మతపరమైన పెనుమార్పు ముందు రావడం అవసరం, భారతీయుడి మనస్సు ఆధ్యాత్మికత మీదే ఉంటుంది. ఆధ్యత్మిక మార్పు, వ్యక్తిత్వ నిర్మాణం తర్వాతే సామాజిక, రాజకీయ సంస్కరణలు జరగాలి” – అన్నారు స్వామి వివేకానంద.

ఎవరైనా శిష్యులు, యువకులు స్వతంత్రం గురించి అడిగితే మనుషులను తయారు చేస్తే వారే స్వాతంత్ర్యం సంపాదించుకుంటారు అనేవారు. విద్యావంతులైన యువకులు గ్రామ గ్రామాలు వెళ్ళి వారిలో చైతన్యం కలగించారించాలని, దేశభక్తిని త్యాగాన్ని పెంపొందించాలని చెప్పేవారు. ఆయనే స్వయంగా 1897లో పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చాక దేశంలోని అనేక ప్రాంతాలలో, కళాశాలలలో, పట్టణాలలో ప్రసంగాలిచ్చారు. ఎంతో మంది యువకులను దేశం కోసం త్యాగం చేసేలా ఉత్తేజపరిచారు. అందులో సామాన్య ప్రజలతో పాటు అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు కూడా ఉన్నారు.

మన స్వాతంత్ర్య సమరయోధులలో చాలామంది ఆ సమయంలో విద్యార్థి దశలో ఉన్నారు. వారందరూ స్వామి వివేకానందుల ఉపన్యాసాలు చదివారు. కొందరు ప్రత్యక్షంగా విన్నారు. వారందరిలో దేశభక్తి, అచంచల విశ్వాసం ఏర్పడింది. అలా స్ఫూర్తి పొందిన వారు, స్వాతంత్ర్య సంగ్రామం సాగించారు. స్వామి వివేకానంద నుండి స్ఫూర్తి పొందిన వారిలో గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్ర బోస్, బాల గంగాధర తిలక్, నెహ్రూ మొదలైన వారు ముఖ్యులు. అయితే వారితో పాటు సామాన్య ప్రజలు, స్త్రీలు, పిల్లలు సైతం స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. అంటే స్వామి వివేకానంద స్పూర్తి వారి నరనరాన జీర్ణించుకుపోయింది.

***

భారత పునర్నిర్మాణం మీద స్వామీజీ:

“మన ప్రవృత్తి ప్రకారం మనం ఎదగాలి. పరాయి సమాజాలు మన మీద రుద్దిన కార్యాచరణ తీరుతెన్నులను పాటించడం వృథా ప్రయాస. నేను ఇతర జాతుల వ్యవస్థలను నిరసించడంలేదు. అవి వారికి సానుకూలమైనవే గాని మనకు మాత్రం కావు. మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఇది. వారి ఇతర విజ్ఞానశాస్త్రాల ఇతర వ్యవస్థల ఇతర సంప్రాదాయాల నేపథ్యంలో ప్రస్తుతం వారి వ్యవస్థ రూపొందింది. మన దారిలోనే మనం సాగుతాం. అదే మనం చేయవలసిందని కూడా..”

***

స్వామీజీ తన విదేశీ శిష్యులను కూడా భారతదేశ అభివృద్ధికై కృషి చేసేలా ప్రోత్సాహించారు. ఒకసారి జోసఫిన్ మెక్లౌడ్ అనే శిష్యురాలు ఇలా అడిగింది – “స్వామీజీ, మీరు మాకెంతో ఇచ్చారు. మరి మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం?”

అందుకు స్వామి వివేకానందుడు ఇచ్చిన సమాధానం “భారతదేశాన్ని ప్రేమించు”.

ఆ తర్వాత ఆమె తన జీవితాన్ని భారతదేశానికి సేవ చేయడానికి అంకితం చేసింది.

“మీరు ఆరాధించే ముక్కోటి దేవతలను పక్కన పెట్టండి. భారతమాతనే మీ ఆరాధ్యదేవతగా ఆరాధించండి” అన్న ఆయన పిలుపు భారతదేశ స్వాతంత్ర్య సమరానికి ఊపునిచ్చింది.

ఎంతోమంది యువకులు బ్రిటిష్ ప్రభుత్వం వారికిచ్చిన మరణ శిక్షను కూడా ధైర్యంగా ఆహ్వానించారు. వారి ధైర్యం వెనుక స్వామి వివేకానంద సందేశం యొక్క స్ఫూర్తి ఎంతో ఉంది.

***

“వివేకానందుని సాహిత్యం చదివిన తర్వాత నాలో ఉన్న దేశభక్తి ఇంకా వేయి రెట్లు పెరిగింది” – స్వామీజీ గురించి గాంధీజీ.

~

“స్వామీజీ తన రచనల ద్వారా మా కాలపు విద్యార్ధులని ప్రభావితం చేసినట్లు దేశంలోని ఏ ఇతర నాయకులు చేసియుండలేదు. నేటి స్వాతంత్ర్య ఉద్యమానికి పునాదులు స్వామీజీ యొక్క సందేశంతో ఏర్పడిందే.” – సుభాష్ చంద్రబోస్

~

“వివేకానందుని ధైర్య సాహసాలు అసమానం. ఆయన పురుష సింహంగా వెలుగొందారు. ఆ మహనీయుని దివ్యశక్తి ప్రభావం ఇప్పటికి అత్యున్నత స్థాయిలో మనపై ప్రసరిస్తూనే ఉంది. ఆ దివ్యశక్తి పటిష్టమైనదిగా ఉత్కృష్టమైనదిగా భారతావని ఆత్మలో భాగంగా భాసిస్తోంది.” – అరవింద యోగి

~

“స్వామి వివేకానందుడు గొప్ప యోగి మాత్రమే కాదు ఒక మహోన్నత జాతీయవాది కూడా. ఆయన భారత జాతీయతని ఉన్నత పీఠానికి చేర్చారు. మన దేశ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించారు. దేశ ప్రజలలో జాతీయతా భావాన్ని మేల్కొల్పడానికి తన జీవితాన్నే అంకితం చేసారు. ఈనాటికీ స్వామీజీ నెలకొల్పిన జాతీయతా భావనలు ప్రజలను స్పందింపజేస్తూనే ఉన్నాయి” – రమేశ్ చంద్ర మజుందార్

***

మనం భారతదేశం గురించి తెలుసుకోవాలంటే స్వామి వివేకానందని చదవాలని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు. ఆయనలో భారతదేశం యొక్క సంగ్రహాన్ని మనం చూడవచ్చు. ఆయన భావనలు, ఉపదేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అనేకమంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు స్వామీజీ నుండి స్ఫూర్తి పొందినవారే. అందులో, అబ్దుల్ కలామ్ ముఖ్యులు.

స్వామీజీ, వ్యక్తి నిర్మాణం పై దృష్టి సారిస్తే వ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు, ఎందరో ఆయన సూక్తులు ఆచరిస్తూ దేశానికి ఆదర్శప్రాయులుగా నిలబడుతూనే ఉన్నారు. స్వామీజీ సందేశం నిరంతరం. ఆయన కార్యం స్వాతంత్ర్యం లభించడంతో పాటు జాతి నిర్మాణం ద్వారా కొనసాగుతూనే ఉంటుంది

స్వామీజీ వాణి:

భారతావని నశించవలసిందేనా? అలా జరిగితే ప్రపంచం నుండి ఆధ్యాత్మికత నిష్క్రమించినట్లే. నైతిక పరిపూర్ణత మూలబడినట్లే. ఆదర్శజీవనానికి తిలోదకాలు ఇచ్చినట్లే. వాటి స్థానే విషయేచ్ఛ, భోగలాలస స్త్రీ పురుష దేవతల మల్లే తాండవిస్తాయి.

ధనం పౌరోహిత్యం నెరపుతూ ఉంటే మోసం దౌర్జన్యం పోటీతత్వం క్రతువులుగా పరిణమిస్తాయి. మానవ ఆత్మే ఆహుతి అవుతుంది. కానీ ఆ స్థితి ఎన్నడూ దాపురించదు. ప్రాచీనకాలంలో మనం గర్వించదగ్గ మంచి విషయాలు ఎన్నో జరిగాయి. అయితే చెడు విషయాలు కూడా లేకపోలేదు. ఆ మంచి విషయాలనన్నిటిని మనం పదిలపరచుకోవాలి. కాని భవిష్యకాల భారతదేశం ప్రాచీన భారతం కన్నా మిన్నయై విరాజిల్లాలి. మనం ప్రగతి శిఖరాలనధిరోహిస్తాం, కండబలంతో కాదు ఆధ్యాత్మిక శక్తితో. నిర్మూలాత్మక చర్యలతో కాక శాంతిపథంలో ప్రేమమార్గంలో. మన భారతదేశం ఎన్నడూ లేనంత వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇది నా కళ్లకు కట్టినట్టు ద్యోతకమవుతుంది.

ఆధార గ్రంథాలు:

Exit mobile version