[శ్రీమతి బోర భారతీదేవి రచించిన ‘భారతమ్మ శతకం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి.]
[dropcap]‘భా[/dropcap]రతమ్మ మాట భవిత బాట’ అనే మకుటంతో రాసిన ఈ 108 శతక పద్యాలు ఎంతో విలువైనవి.
ఎన్నో రకాల పద్యాలు మనకి ఆనాటి నుంచి ఉన్నాయి. అయితే ఈనాడు కూడా అంతే ప్రతిభతో పద్యాలు రాస్తున్నారు, చదివేవారు చదువుతున్నారు.
మనిషి జీవితానికి విలువ సాహిత్యం కావాలి ఎందుకంటే, పద్య రూపంలో అతి తేలికగా రాగయుక్తంగా పాడవచ్చును, చదువ వచ్చును. అందులో ఆటవెలది బాట ఆటల పూదోట.
భారతి గారు ఉపాధ్యాయిని వృత్తిలో పిల్లలకి పాటలు చెపుతూ హితవులు నేర్పుతూ, సాహిత్య సేవలో నిరంతరం నిత్య నూతనంగా కార్యక్రమాలు చేస్తూ, సాహితీ సుగంధ పరిమళాలు విదజల్లుతూ విద్యారంగ కృషి, సాహితీ రంగ కృషి జరపడం అభనందనీయం. సూక్తులను కొత్త కోణంలో ప్రజలకు అందేలా, అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా ఈ శకతంలో రచించారు. ఆమె ఎన్నో బిరుదులు పొందారు. ప్రక్రియలు చాలా రాశారు, పుస్తకాలు వేశారు.
శ్రీ బోర వెంకట సత్యనారాయణ, కృష్ణవేణి పుణ్య దంపతులు బిడ్డగా; కీ.శే. సరగడ కేశవరెడ్డి, సూర్యకాంతం గారి కోడలిగా; శ్రీ సరగడ నారాయణ రెడ్డి ధర్మపత్నిగా; ఇద్దరు బిడ్డలకు తల్లిగా – విద్య ఉద్యోగ సాహితీ రంగ సేవ ఉపాధ్యక్షురాలిగా భారతి గారి కృషి అభినందనీయము.
మన జీవితంలోని అక్షర సత్యాలని ఆటవెలదితో – ఆటలు ఆడిస్తూ పిల్లలకి చెప్పే సూక్తులుగా, పెద్దలకి కూడా అవసరమే అన్నట్లు భారతి గారు రాశారు. వీరివి కొన్ని పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
కాదేది అనర్హం అన్నట్లు గజల్, నానీలు, రుబాయిలు, తేనియల బాల గేయాలు రాశారు. బాలల వికాసం – జీవిత లక్ష్యంగా సాహితీ సముద్రంలో స్వాతిముత్యంలా ఆవిడ అవిరళ కృషి భావి తరాలకు మార్గదర్శకము.
పద్యాలు రాయడం ఒక ఎత్తు, శతకంగా మకుటంతో రాయడం మరో ఎత్తు. ఆవిడ పేరు తోనే ‘భారతమ్మ మాట భవిత బాట’ అన్నారు. చక్కని స్వీయ మకుటము.
భారతమ్మ అనడంలో మన భరతమాత కూడా జ్ఞప్తికి వస్తుంది. చక్కని మకుటము.
మొదటి పద్యాలలో వినాయకుడు, సరస్వతి దేవి, విష్ణుమూర్తి, భరతమాతని ప్రార్థిస్తూ ఆమె కలాన్ని నడిపే విధానంలో అద్భుత చతురత చూపారు.
ముఖ్యంగా భారతి గారు ప్రతి అంశాన్ని తీసుకుని చక్కగా చెప్పారు. అటు వినాయకుని, శ్రీ మహా విష్ణువును, లక్ష్మి సరస్వతుల కృపతో కలం పెరుగునని చెప్పారు.
ఆహారం జీవితానికి అతి ముఖ్యం. అందుకని ఆవిడ నేటి ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌పై అద్భుతమైన పద్యాలు చెళుకుల వలె విసిరారు.
ఇంటి వంట నెపుడు హీనముగా చూడకు అంటూ, నేటి ఆధునిక యుగంలో ఫైవ్ స్టార్ బిర్యానీలు అంటు ఎగబడి – ఇంటి వంట వద్దు అనేవాళ్ళు కాస్త క్లిష్ట పరిస్థితిలో ఇంటి వంటే గతి అనే పరిస్థితి వచ్చాక తప్పలేదు. ఇంట్లో ఉన్న శుచి శుభ్రత ఆహారం ఆరోగ్యానికి మూల హేతువు అంటు భారతమ్మ మాట భవిత బాట అన్నారు.
జాన పొట్ట కోసం నీతి దప్పి, మూడు రోజుల జీవన యానంలో అన్ని గతి తప్పి జీవించడం వల్ల మనిషికి విలువ వుండదని చెప్తారు.
గడ్డి పోచ చిన్నది అని గాబరా పడవద్దు, అన్ని పోచలు గట్టిగా పేని తాడుతో ఏనుగును కట్టవచ్చును అనే సందేశంలో ఐకమత్య మే బలము అనే సూక్తి స్ఫూర్తిగా ఉన్నది.
కూటి కోసం కోటి విద్యలు అంటు ఎన్నో రకాల విద్యలతో కోట్లు సంపాదించి గర్వపడటం కాదు, గతంలో నువ్వు ఏమిటి అని తెలుసుకోవాలి. అప్పుడే జీవితానికి విలువ ఉంటుందని అంటారు భారతీదేవి.
ఫాస్ట్ పుడ్ కోసం పరుగులు పెట్టి అనారోగ్యం పాలు పడవద్దు, మంచి చెడులు చూసి తినాలని చెబుతారు. అమ్మ చేతి వంట అనే పద్యంలో తల్లి ఎప్పుడు ప్రేమతో విటమిన్లు పోషకాలు ఉన్న భోజనం పెడుతుంది, ముఖ్యంగా ప్రేమతో పెట్టడం వల్ల అది అమృతతుల్య ఆహారం అవుతుంది అంటూ భారతమ్మ మాట భవిత బాట అంటారు.
పరులకు సహాయం చేసి మానవుడిలో మాధవుడిని చూడమని చెప్పారు.
జీవితంలో ప్రతి అంశము ఆడపిల్ల, విమర్శ, మంచి మాట, మానవత్వం, అబద్దం, గొప్పలు, సమస్య, యోగ సాధన, ధర్మ రక్షణ. ఆనందము, మంచి మాటలు – భవితకు బంగారు బాట అంటూ ఆవిడ 108 పద్యాలు రాశారు.
చివరి 108వ పద్యంలో సిరులు పెంచుకున్న చిరకాలం ఉండదు, పరుల సొమ్ము కోసం ఆశపడవద్దు, నీవు సంపాదించిన మంచి మానవత్వం, సాయం, అభిమానము ఇవే జీవితంలో శాశ్వత కీర్తి అంటూ ముగించారు.
అద్భుతమైన ముగింపుతో తన స్నేహితుల అభినందనలతో కుటుంబ సభ్యుల ఆదరణ ఆత్మీయతతో ఈ భారతమ్మ మాట భవితకు బంగారు బాట అవ్వాలని ఆశిద్దాం. మనము కూడా అభినందనలు తెలుపుదాము.
***
భారతమ్మ శతకం (పద్య కవిత్వం)
రచన: బోర భారతీదేవి
పేజీలు: 37
వెల: ₹ 75
ప్రచురణ: తపస్వి మనోహరం పబ్లికేషన్స్,
ప్రతులకు:
బోర భారతీదేవి
58/12/13, SF 202,
సూర్య రెసిడెన్సీ, పాత కరస,
ఎన్.ఎ.డి. పోస్ట్, విశాఖపట్టణం 530009
ఫోన్: 9290946292