అద్భుతమైన విషయ జ్ఞానమిచ్చే పుస్తకం

0
3

[dropcap]ఈ[/dropcap] ధనుర్మాసములో నేను చదివిన మంచి పుస్తకం – ‘భారతీయ తత్వ చింతన’.
‘భారతీయ తత్వ చింతన’ మన్నది మహా సముద్రము. ‘తత్వ’ మంటే పరమాత్మ. ‘తత్వ’ మంటే చింతన, ఒక ఆలోచన. భారతీయులు పూర్వం నుంచి ప్రపంచానికి ఆధ్యాత్మక మార్గమందించిన వారు. ప్రపంచము మొత్తం  భౌతికమైన విషయ జ్ఞానము వెంట పరుగెడితే, భారతీయ ఋరుషులు అంతర్మఖ జ్ఞానానికై అర్రులు చాచారు.  ప్రపంచములో సర్వము ఒక జ్ఞానమందించే ప్రయత్నములో సందేశాలిస్తే, భారతీయ తత్వములో ‘ప్రశ్నలు వేయి – జ్ఞానాన్ని అందుకో’మని చెప్పారు.  అందుకే భారతీయ జ్ఞానము సర్వము ప్రశ్నలతోనూ, చర్చలతో కూడి వుంటుంది. అతి విస్తారమైన, లోతైన ఈ జ్ఞానము నేటి ఆధునిక కాలములో పశ్చిమ జాతి పోకడల అనుకరణలకు చాదస్తముగా, పాత చింతకాయ పచ్చడిలా అనిపించవచ్చు. కాని లోతు తెలియాలంటే దిగాలిగా ముందు. నేటి వారికి చదివి, లేదా ప్రశ్నించి తెలుసుకునే ఓపికా జ్ఞానము రెండూ వుండవు. అలాంటివారికి తత్వ జ్ఞానము గురించి చిన్న పుస్తక రూపములో అందించే చక్కటి ప్రయత్నమే కస్తూరి మురళీకృష్ణ గారి ‘భారతీయ తత్వ చింతన’.
150 పేజీల ఈ పుస్తకములో ఆయన ఆది మానవుని ఆలోచనల నుంచి, ఆధునిక మానవుని ఆలోచనల వరకూ క్రోడీకరించి అందించే ప్రయత్నం చేశారు. కులాలకు, మతాలకు అతీతమైన, ఉన్నతమైన భారతీయ తత్వమును విశదీకరించారు. ఋషులంటే ఆనాటి శాస్త్రవేత్తలని చెబుతారు మురళీకృష్ణ గారు. నిజమే కదా. తెలియని విషయము తెలియ చెప్పటములో మన ఋషుల తరువాతనే ఎవరైనా. శాస్త్రజ్ఞులంటే కూడా అదే అర్థం వస్తుంది గమనిస్తే.
ఈ పుస్తకములో నాంది నుండి ముగింపు వరకూ 18 అధ్యాయాలు పొందుపరిచారు. వేదాలు మొదలు ఉపనిషత్తులు, జైనము, బౌద్ధమూ, శంకర, రామానుజ, భగవద్గీత భక్తి ఉద్యమము, చైతన్య మహాప్రభూ… నుంచి నేటి ఆధునిక ఆలోచనల వరకూ పొందుపరిచారు. ఎలాంటి ఆలోచనలు లేని వారు ఎంతో కొంత గ్రహించవచ్చు ఇది చదివాక. సందేహాలతో చదివితే సందేహము తీరవచ్చు.  విశాల దృక్పథము, తెలుసుకోవాలనే జిజ్ఞాస ముఖ్యము. అదే భారతీయ తత్వానికి మూలము కూడా.
ఎన్నో పుస్తకాలు వచ్చినా మన భారతీయ తత్వవిచారణ మీద పూర్తి వివరణతో  వచ్చినవి అరుదు. “తెలుసుకోవాలనే కోరికే జ్ఞానానికి మూలము”. తనకు తెలిసినది కన్నా, తెలుసుకోవలసినది చాలా వున్నదన్న జ్ఞానమే జిజ్ఞాసకు తొలిమెట్టు. ఆనాడు ఆ ఆలోచనలతో మొదలెట్టిన జిజ్ఞాసులు అందించిన జ్ఞానము అపూర్వము. విషయము మీద వున్న జ్ఞానమే బలము. అందుకే విజ్ఞానానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు పెద్దలు. నేటి మనము ఆ విషయము మరచి వారిది పాతచింతకాయ పచ్చడని తీసేస్తాము. అలా అనటానికి మనకున్నదల్లా అజ్ఞానము తప్ప మరోటి లేదు.
మన పూర్వ ఋషులు అందించిన జ్ఞానము నేటి శాస్త్రజ్ఞులు ఒక్కొక్కటే బద్దలు కొట్టి చూపుతుంటే మనకు వింతగా వుంటుంది. మన పూర్వుల తత్వదర్శనము విశ్వరూపము మనకు అప్పటికి కాని అర్థముకాదు.
ఉదా :
“విజ్ఞాన శాస్త్రం ప్రకారం సూర్యరశ్మిలో ఏడు రంగులున్నాయని చెబుతారు.
బుగ్వేదం ‘అమీయే సప్తరశ్మ యస్తత్ర’ (1-105-9) అంటే ‘సూర్యరశ్మిలో ఏడు రంగులున్నాయి అంటుంది”.
ఎప్పటి బుగ్వేదము, ఎప్పటి ఏడు రంగుల మిశ్రమము? వాటి మధ్య కాల భేదమెప్పటిది? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో వివరించారు మురళీకృష్ణగారు ఈ గ్రంథంలో.  విదేశీయులు (బ్రిటీష్ వారు) మన ధర్మం మీద మనకు ఏహ్యభావము కలిగించారు. మన ధర్మం మీద మనకు చులకన ఏర్పడితే వారి అధిక్యత మనము వప్పుకుంటామని కుతంత్రంతో మన మీద బలవంతముగా రుద్దిన ఆధునీకత మనకు కలిగించిన నష్టము చెప్పనలవి కానిది. ఆయన పుస్తకములో చెప్పినట్లు ‘కోకిల కాకి కావాలని చేసే ప్రయత్నము’.
వేదము గురించి చెబుతూ ఋషుల సత్యశోధన ఫలితాల సంకలనం వేదమంటారు. మనిషి స్వేచ్ఛాజీవి. అందుకే మన ధర్మం స్వేచ్ఛా ధర్మం. వ్యక్తిని దేనికీ బలవంత పెట్టదు. ప్రతి వారు తమంతట తాము జ్ఞానానికై తపన పడి, జ్ఞానార్థి అయి తెలుసుకునే జ్ఞానము మన తత్వము. అందుకే భారతీయ ధర్మం ఎప్పుడూ ఎవ్వరి మీద బలవంతముగా రుద్దబడలేదు. ప్రతివారు వారికి నచ్చినవి వారు పూజించవచ్చు. జ్ఞానము మాత్రమే గీటురాయి. ఆ జ్ఞానము తమ గురించి తాము తెలుసుకోవటము. సత్య దర్శనము.
భారతీయ ఋషులు అందించిన జ్ఞానము ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులలో ఈశావాస్యోపనిషత్తు
‘ఓం పూర్ణ మదః…… పూర్ణ మేవా వశిష్యతే॥’  అంటూ మొదలవుతుంది. ‘ఏ దృష్టితో చూస్తే అలా కనిపించే మంత్రమిది’.
‘ఈ మంత్రం భారతీయ వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు మానసిక శోధనలో, ప్రకృతి పరిశోధనలో ఎదిగిన ఎత్తులు, దిగిన లోతులను, వారి మేధాశక్తికి, అపురూప ప్రతిభాపాటవాలకు, వారి భావనా బలానికీ దర్పణం పడుతుంది’. ఈ మంత్రాలను అర్థం చేసుకుంటూ పోతే వేదాలు మొదలు అన్నీ మన పూర్వీకుల వైజ్ఞానిక పరిశోధన ఫలితాలని స్పష్టంగా తెలుస్తుంది.
ఉపనిషత్తులు నేటి ప్రపంచానికి పరిచయం చెయ్యవలసిన అవసరము ఎంతైనా వుంది. ఆ జ్ఞానము నలుగురికి తెలియటము వలన నేటి జీవితములో జరిగే ఆందోళనలు తప్పక తగ్గు మొఖం పడుతాయి.  జైన బౌద్ధ మతాలను కూడా మురళీకృష్ణగారు వివరించారు. బౌద్ధ మతములో వచ్చిన ముక్కలు, నిలబడిన తత్వం వివరముగా వివరించారు.
నేటికి ఎక్కడా కనపడని చార్వాక తత్వం గురించి కూడా మనము ఈ పుస్తకములో చూడవచ్చు. నేడు ప్రబలుతున్న వాదము కొంత ఆనాటి చార్వాక సిద్దాంతములా అనిపించవచ్చు చదువరులకు. షడ్దర్శనాలలో ఆయన వాటి అర్థము వివరణలతో పాటు నేటి వాటి ప్రయోజనము వివరించారు.
‘సిద్ధాంతమనేది ఆమోదయోగ్యమైన సత్యం. అందరూ ఆమోదించిన సిద్ధాంతము సూత్రమవుతుంది’ ఇలా చిన్న చిన్న వివరణలతో మూల సూత్రాన్ని వివరించారు.
‘బ్రహ్మ సూత్రాలు ఆనాటి సమాజంలో ఉన్న సందిగ్ధ స్థితికి దర్పణం. ఈ సందిగ్ధం నుంచి అద్వైత తత్వం ఎదగటము భారతీయ తత్వవేత్తల మేథాశక్తికి తార్కాణం’.
శంకరుల అద్వైత సిద్ధాంతం మీద వివరణ అద్భుతంగా వుంది. అది చదవరులకు అరటిపండు వలచి చేతిలో పెట్టారు. శంకరులు వివరించిన ‘అభేదశృతి’ వాక్యాల విరణము సులభముగా అర్థమవుతుంది. ఆదిశంకరులు భారతావనిలో పర్యటించి వివిధ వాదనలను ఖండించి అద్వైతమును స్థిరపరిచారు. ఆయన హైందవమును తిరిగి నిలబెట్టటానికి భూమి మీదకు వచ్చిన పరమాత్మగా భక్తులు కొలుస్తారు. ఎన్నో తత్వాలున్నా, నేటీకి అద్వైతము నిలబడి వున్నది. జగద్గురువులుగా వున్నది కూడా ఆదిశంకరులు ఒక్కరే!!
ఈ పుస్తకములో మధ్యయుగములో వచ్చిన భక్తి ఉద్యమము గురించిన వివరణ విపులముగా వుంది. దాసభక్తి గురించి, రామదాసు, మీరాబాయి ఇత్యాదుల వివరాలు తెలుసుకోవచ్చు.
ఆధునిక భారతములో వచ్చిన మార్పులను, సంస్కర్తలను గురించి వివరాలు చకచకా చదివిస్తాయి. మత మార్పులకు వ్యతిరేకంగా దయానంద సరస్వతి ఆర్యసమాజము ద్వారా కొంత కృషి చేశారు. ఆనాడు ఆధునిక భావజాల మత్తులో కలిగిన మతమార్పిడికి నేటి మతమార్పుకు తేడా వుంది. నేటిది కేవలము రాజకీయం, డబ్బు కలిపి చేస్తున్న క్రీడ ఇది. Einstein మహశయుడు తను భగవద్గీతను చదివి E=MC2 అన్నది కనిపెట్టానని చెప్పాడు. పశ్చిమ దేశ శాస్త్రజ్ఞలు భారతదేశము వైపు చూస్తున్నారు జ్ఞానము కోసము. అలాంటప్పుడు మనము మన పూర్వులు చెప్పినవి కనీసము తెలుసుకోవటము మన ధర్మం. నమ్మటము నమ్మకపోవటము తరువాతి మాట. కాని వారు చెప్పినవి తెలుసుకోని వుండటమన్నది కనీస ధర్మం కదా. అందుకై అన్నీ క్రోడికరించి వున్న ఇలాంటి పుస్తకాన్నైనా చదవాల్సి వుంది. అద్భుతమైన విషయ జ్ఞానమిచ్చి తత్వజ్ఞానమును పరిచయం చేస్తున్న ఈ పుస్తకాన్నీ ప్రభుత్వం పాఠ్యపుస్తకముగా మారిస్తే కొంతైనా ఉపయోగముంటుంది. ఇటువంటి అద్భుతమైన గంధ్రమందించిన మురళీకృష్ణ గారికి మనఃపూర్వక అభినందనలు. ఈ ధనుర్మాసములో నేను చదివిన మంచి పుస్తకాలలో ఇది ఒకటి.

***

భారతీయ తత్వ చింతన
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు, విజయవాడ
పుటలు:150, వెల: ₹ 60
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు
#33-22-2, చంద్ర బిల్డింగ్స్,
సి.ఆర్. రోడ్, చుట్టుగుంట, విజయవాడ. 520 004.
ఫోన్: 0866-2436643

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here