[box type=’note’ fontsize=’16’] దర్శకుడు కాస్త యెక్కువ శ్రధ్ధ పెట్టి వుంటే దీనికంటే మెరుగైన చిత్రం లభించి వుండేదని అంటున్నారు పరేష్. ఎన్. దోషి “భరత్ అను నేను” సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]దే[/dropcap]శ రాజకీయాల గురించి తీసిన చిత్రాలంటే గుర్తొచ్చే భారతీయుడు, జెంటల్మన్, లీడర్ సినిమాల కోవకు చెందినదే ఈ “భరత్ అనే నేను” కూడా. కాని మహేశ్ బాబు ఇదివరకటి చిత్రాలలాగా (పోకిరి, దూకుడు ఇవే నా మనసులో వున్నాయి, అతను నటించిన చివరి రెండు చిత్రాలు చూడనే లేదు) కట్టిపడేసే ఎంటర్టైనర్ కాదు. సరే ఆనవాయితీగా కథ క్లుప్తంగా చెప్పుకుందాం.
చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన భరత్ (మహేశ్ బాబు) కోసమై అతని తండ్రి రెండో వివాహం చేసుకుంటాడు. కాని ఆశించిన విధంగా అతన్ని ఆమె దగ్గరకు తీసుకోలేకపోతుంది. భరత్ తన స్నేహితుని కుటుంబంతో లండన్ వెళ్ళి చదువుకుంటాడు. అతని తండ్రి (శరత్ కుమార్), తన స్నేహితుడు వరదరాజులుతో (ప్రకాశ్ రాజ్) కలిసి వో రాజకీయ పార్టీ పెట్టి ఆ పనుల్లోనే యెప్పుడూ బిజీగా వుంటాడు. ఇన్నేళ్ళ తర్వాత ముఖ్యమంత్రిగా వున్న తండ్రి చనిపోయిన వార్త తెలిసి దేశానికి తిరిగి వస్తాడు భరత్. అల్లర్లు జరగవచ్చని చెప్పి అతను వచ్చెటప్పటికే అంత్యక్రియలు చేయించేశామంటారు. తల కొరివి పెట్టింది రెండో భార్య కొడుకు. మాట్లాడగలిగినా యెంచేతో (చివరిదాకా కారణం తెలీదనుకోండి) మాటలు మానేస్తాడు ఆ అబ్బాయి సిద్దర్ధ్. పార్టీ అధ్యక్షునిగా వున్న వరదరాజులతో పాటే ఇంకొంతమందికీ కుర్చీ కాంక్ష వుండడంతో నాటకీయంగా భరత్ ను ముఖ్యమంత్రిని చేస్తారు. అయిదు డిగ్రీలున్నా రాజకీయ పరిజ్ఙానం, దేశపరిస్థితుల జ్ఙానం లేని భరత్ సందేహిస్తూనే వొప్పుకున్నా త్వరలోనే రాష్ట్రాన్ని బాగు చేయడానికి వొక్కొక్కటిగా ప్రయత్నాలు చేస్తాడు. ఈ కథలోనే ఇరికించి వసుమతి (కియారా ఆడ్వాణి) అనే మధ్యతరగతి అమ్మాయిని పెట్టి, భరత్ కూ ఆమెకూ మధ్య ప్రేమ కథ సన్నటి పోగులతో అల్లారు. మధ్యలో నెలకొన్న సంక్షోభం, అనుమానాలు, భరత్ పదవీ విరమణ, మళ్ళీ యెన్నికవడం, చివరికి పెళ్ళితో సుఖాంతమవుతుంది కథ.
వ్యాపార చిత్రాలతో, వినోదాత్మక చిత్రాలతో యెవరికీ పేచీ వుండనవసరం లేదు, నాకు కూడా లేదు. అయితే ప్రేక్షకుడు హాల్లో కూర్చున్నంత సేపైనా కుర్చీ కి కట్టేసినట్టు కూర్చోబెట్టగలగాలి. దానికి యేం చేయాలి? ఆ కథ యెలాంటిదైనా గాని, దర్శకుడికి దాని మీద పూర్తి నమ్మకం వుండాలి, కథ చెప్పే పనిలో వొళ్ళు తెలీకుండా మునిగిపోవాలి. అప్పుడే ఆ సన్నివేశాలుగాని, పాత్రలు గాని, నటనగాని సజీవంగా మన ముందుకు వస్తాయి. నాకు ఇక్కడే లోపం అనిపించింది. Willing suspension of disbelief అంటారే, అలా అనుకుని కూర్చున్న ప్రేక్షకుడిని ఆ కాస్సేపు కట్టి వుంచగలగాలి; ఇంటికెళ్ళినతర్వాత మనసులో ఆ కథలోని సాధ్యాసాధ్యాల గురించి తీరిగ్గా బేరీజు వేసుకోవచ్చు. పదేళ్ళ తర్వాత తలచుకుంటే అవునుకదా అప్పుడు నచ్చింది అని మాత్రమే గుర్తుకు రావాలి. నేను ఇంకెవరినీ తప్పు పట్టను. ప్రకాశ్ రాజ్ యెప్పట్లానే బాగా చేశాడు. రెండు నిముషాల పాత్రే ఇచ్చినా గుర్తుండిపోయేలా నటించగలనని రాహుల్ రామక్రిష్ణ నిరూపించుకున్నాడు. వయసు పెరగడం ఆగిపోయిన అందగాడు యెప్పట్లానే చేశాడు. యెందుకో అతని చేత ramp walking లాంటిది చాలా చేయించారు, అనవసరంగా. ఇక కియారా ఆడ్వాణిని చాలా కాస్సేపే చూపించారు. యెలాగూ మన సినెమాలలో హీరోయిన్లకి బలమైన పాత్ర వుండదు, కాస్త రొమాన్స్ పేరుతో తీసుకుంటారు. ఇందులో అదీ లేదు. వొకసారి కలిసి ఇడ్లీ తింటారు, మరో సారి ఆమె అతనికోసం జున్ను (బహుశా అతనికి ఉప్మా తినితిని విసుగొచ్చిందని తెలుసేమో 🙂 ) తీసుకెళ్తుంది. అప్పుడైనా ఇద్దరి మధ్యా మాటా మంతీ యేమీ వుండవు. వెళ్ళనా మరి అని ఆమె అడగడం, కాసేపు వుండరాదు అని అతను అనడం. ఇంతే. బహుశా వచ్చే మహేశ్ బాబు సినెమాలో హీరోయిన్ వుండకపోయినా ఆశ్చర్యపడను. తన బలమైన భుజాల మీద సినెమా మొత్తాన్ని అతనే మోయగల సమర్థుడు. సర్కాజం కాదు, నిజంగానే చెబుతున్నా. ఒక లోపం మాత్రం కొంచెం చెప్పుకోవాల్సిందే. భరత్, వసుమతిల ఫొటోలు వేసి వాళ్ళ మధ్య యేదో సంబంధం వుందని పత్రికల్లో వ్రాస్తే నైతిక బాధ్యత అని చెప్పి పదవికి రాజీనామా చేస్తాడు భరత్. యెలాగూ అతనికి పెళ్ళాడే ఉద్దేశ్యముంది. ఆమె వాచ్యంగా చెప్పకపోయినా సుముఖంగానే వున్నట్టు చూపిస్తారు. అలాంటప్పుడు రాజీనామా చేస్తే తప్పు చేసినట్టుండదా? వివాహ ప్రకటనతో నోళ్ళు మూయించేదానికి అనవసర చర్య కాదా?
పాటలు, సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికేం లేదు, ఆ లొకేషన్లు బాగున్నాయని తప్ప. కొరటాల శివగారు కాస్త యెక్కువ శ్రధ్ధ పెట్టి వుంటే దీనికంటే మెరుగైన చిత్రం లభించి వుండేది.