భారతీయ ప్రేమ కథామాలిక – పుస్తక సమీక్ష

3
2

[dropcap]భా[/dropcap]రతీయ సమాజంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పురాణాలను వక్రీకరించి, పురాణ పాత్రల వ్యక్తిత్వాలను వికృతంగా ప్రదర్శిస్తూ, వాటిని దిగజార్చి ప్రదర్శించటం గొప్ప రచయితగా, తాత్త్వికుడిగా పేరు సంపాదించటానికి, అవార్డులు, సన్మానాలు పొందటానికి రాచమార్గంగా స్థిరపడింది. అలాంటి రచనలకే ఆదరణ. పురాణాలను ‘కొత్త చూపు’తో ప్రదర్శించారని పొగడ్తలు, చర్చలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితులలో పురాణ పాత్రలను అత్యంత గౌరవంతో, లోతైన అవగాహనతో ప్రదర్శించటమే కాదు, పురాణ గాథలలో అంతర్లీనంగా ప్రదర్శితమయిన ప్రేమ తత్త్వాన్ని ప్రస్ఫుటమయ్యే రీతిలో రచించిన కథల సంపుటి ‘భారతీయ ప్రేమ కథామాలిక’ ప్రచురితమవటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇంత కాలానికి తెలుగు సాహిత్య ప్రపంచంలో మెజారిటీ ఆమోదించి, ఆదరించి, అందలం ఎక్కిస్తున్న స్థిరపడిన ఆలోచనకు విరుద్ధమైన ఆలోచనను ప్రదర్శించే సాహిత్యం తెరపైకి రావటం ఆరోగ్యకరమైన పరిణామం. అయితే, అందరూ ఆమోదిస్తూ, అవార్డులిస్తున్న ఆలోచనా ధోరణికి భిన్నమైన ఆలోచనను ప్రదర్శించటం సాహసమే కాదు, మూర్ఖత్వం కూడా. ఎందుకంటే, ఇలాంటి కథలను సాహిత్య పెద్దలు చదవరు. విమర్శకులు పట్టించుకోరు. అయినా సరే, ‘పురాణ పాత్రల ఆధారంగా కథలు కానీ, నవలలు కానీ సృజించాలంటే ఆయా పాత్రల గురించి కనీస అవగాహన ఉండాలి. ఆయా పాత్రల వ్యక్తిత్వాలు, ఔచిత్యాలు వంటి విషయాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పురాణాలంటే గౌరవం ఉండాలి.’ అని ప్రకటించి పురాణ గాథలలోని ప్రేమతత్త్వాన్ని ఆవిష్కరించటం ద్వారా ‘ప్రేమ విరాట్ స్వరూపాన్ని దర్శింప చేయాలన్న ఆలోచన వల్ల సృజించిన కథలు ఇవి’ అని రచయిత కస్తూరి మురళీకృష్ణ ముందుమాటలో స్పష్టం చేశారు. తన దృష్టిలో ప్రేమ అంటే ఏమిటన్నది ‘నాందీ ప్రస్తావన’లో స్పష్టంగా ప్రదర్శించారు. స్త్రీ పురుషులు తమ అసలు స్వరూపం గ్రహించేందుకు చేసే ప్రయత్నమే ‘ప్రేమ’ అని నిర్వచించారు. ఆ ప్రయత్నాలు విభిన్నమైన దారులలో, విధానాలలో సాగుతాయి. అందుకే ప్రేమ భావన అంత వైశిష్ట్యము, విభిన్నము, విస్తృతము అన్న భావనను కలిగిస్తారు.

ఈ పుస్తకంలో  మొత్తం 44 ప్రేమ కథలున్నాయి. ఈ 44 కథలలో 24 కథలు ‘పురాణాలలో ప్రేమ’ విభాగంలో, 3 కథలు ‘ఆధ్యాత్మిక భావన’ విభాగంలో, 12 కథలు ‘గాథలు’ విభాగంలో, 5 కథలు ‘ఇరుగు పొరుగు’ విభాగంగా వర్గీకరించి పొందుపరిచారు. అంటే భారతీయ ప్రేమ కథామాలికలో అధిక శాతం కథలు పురాణాల నుంచి స్వీకరించినవే. అయినా జానపద గాథలు, చారిత్రక ప్రేమ గాథలు కూడా ఉన్నాయన్న మాట. ‘ఇరుగు పొరుగు’ విభాగంలో భారతదేశానికి పొరుగు దేశాలయిన పాకిస్తాన్, శ్రీలంక, తిబ్బత్తు, మ్యాన్‌మార్ (బర్మా) దేశాలకు చెందిన ప్రేమ కథలున్నాయి.

ప్రేమ నిర్వచనాన్ని విశాలం చేయటంతో మామూలుగా ప్రేమ కథలుగా భావించని జ్ఞానదేవుడు, అక్క మహాదేవి, లల్లాదేవి (కశ్మీరు)ల ఆధ్యాత్మిక అన్వేషణాత్మక గాథలను కూడా ప్రేమ గాథలుగా పరిగణించే వీలు చిక్కింది. ఇందులో అక్క మహాదేవి, లల్లదేవిలు ‘శివుడి’ని తమ ప్రియుడిగా, భర్తగా భావించిన వారు. దాంతో ప్రేమ అంటే తల్లిదండ్రులను ఎదిరించటం, భర్తని కాదని పరాయి పురుషుడితో లైంగిక సంబంధాలు నెరపటం, స్వలింగ సంపర్కం వంటివేనని కుబుద్ధులు చేస్తున్న దుర్మార్గపు ప్రయత్నానికి అడ్డుకట్ట కట్టే సాహిత్య పోరాటానికి దర్పణం పడుతుందీ పుస్తకం. ఇందులో జాబ్ చార్నోక్ ప్రేమ గాథ (మలిగే దీపం వెలిగింది), రాణీరూపమతి ప్రేమ కథ (ప్రేమ రూపమతి), అంబికాపతి – అమరావతిల ప్రేమ కథ (ప్రేమ పరీక్ష) వంటివి గాథల విభాగంలో ఉన్నాయి. ఈ కథలు చారిత్రక ప్రేమ కథలను నూతన దృక్కోణంలో ప్రదర్శిస్తాయి.

పురాణ ప్రేమ కథల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రాముడిపై సీత అలిగి ‘వేరు వెళ్ళిపోయింది’, ఊర్మిళ లక్ష్మణుడికి ‘డైవోర్స్’ ఇచ్చేసింది, అహల్య ఇంద్రుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే, చేతకాని ఆమె భర్త కోపించి శాపం ఇచ్చాడు వంటి అత్యంత నీచమైన, హేయమైన, ధూర్తమైన ఆలోచనలను ప్రదర్శిస్తూ; అదే ‘కొత్త చూపు’ అని కాలర్లెగరేస్తున్న వారు, వారిని పొగిడి తామూ ‘అభ్యుదయవాదులం’ అని జబ్బలు చరుచుకునేవారు తప్పనిసరిగా చదివి, తమ పొరపాట్లు అర్థం చేసుకుని లెంపలు వేసుకునేట్టు చేసే శక్తివంతమైన కథలు ఈ విభాగంలోని కథలు.

అహల్య, గౌతముల అమర ప్రేమ గాథ ‘ప్రేమ పరమార్థం’. సీతారాముల అద్భుతమైన ప్రేమ గాథ ‘ప్రేమాగ్ని పరీక్ష’. యయాతి ప్రేమ అవగాహన కథ ‘అసలైన ఆనందం’. రతి-మన్మథుల ధర్మబద్ధమైన ప్రేమ కథ ‘ధర్మబద్ధమైన కోరికే ప్రేమ’. ఇలా ప్రతి ఒక్క పురాణ గాథనూ అత్యద్భుతమైన ప్రేమ రసప్రవాహంగా తీర్చిదిద్ది మామూలుగా సమాజంలో ఈ గాథల గురించి వికృత రీతిలో ప్రచారంలో ఉన్న ఆలోచనలపై సాహిత్య ఖడ్గ ప్రహారం శక్తివంతంగా చేసి వాటిని తుత్తునియలు చేశారు రచయిత. ఈ కథలలో సందర్భానుసారంగా పలు వికృత వాదనలను పూర్వపక్షం చేసి, విచ్ఛిన్నకర ఆలోచనలను ఖండించారు. అక్కడక్కడా ప్రేమ తత్త్వాన్ని వివరిస్తూ విమర్శలూ చేశారు. మచ్చుకి:

“ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కలిగి ఉన్న స్త్రీ మాత్రమే తన పురుషుడిని అర్థం చేసుకోగలుగుతుంది. అవి పుష్కలంగా ఉన్న పురుషుడే తన స్త్రీ గౌరవం పొందగలడు. అలాంటి స్త్రీ పురుషుల సంబంధమే ప్రపంచానికి అసలైన ప్రేమ స్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.” ఇది ‘అగ్ని పరీక్ష’ ను వివరిస్తూ సీత, ఊర్మిళతో అనే మాటలు.

“ఎప్పుడయితే వ్యక్తి తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని అనుకుంటాడో అప్పుడు తనని తాను కోల్పోతాడు. కానీ ఎప్పుడైతే తాను ప్రేమిస్తున్నది ఎదుటివ్యక్తిలోని తననే అన్న నిజం గ్రహిస్తాడో అప్పుడు తనని తాను తెలుసుకుంటాడు. అప్పుడీ ప్రపంచంలో అందవిహీనమైనది కనబడదు. ప్రేమించే అర్హత లేనిది ఉండదు”. ఇది బలరాముడితో ప్రేమతత్వాన్ని, సౌందర్యతత్వాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు ‘జగమంతా ప్రేమమయం’ కథలో అన్న మాటలు.

“కామం శరీర సంబంధి. ప్రేమ ఆత్మ సంబంధి. కాని ఈ ప్రపంచంలో ఆత్మను గ్రహించే మార్గం శరీరం ద్వారానే లభిస్తుంది. కాబట్టి కామం ప్రేమ శిఖరారోహణకు నాందీ ప్రస్తావన మాత్రమే. అక్కడే ఆగిపోయేవారు శారీరక ప్రపంచంలోనే మిగిలిపోతారు. వారి అనుబంధాలు, సంబంధాలు శరీర పరిధిని దాటవు. ఎవరైతే కామాన్ని నాందీ ప్రస్తావనగా చేసుకుని ప్రేమ సోపానాన్ని అందుకుని శిఖరాగ్రం చేరుతారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. అది అసలు ప్రేమ”. ఇది ‘ప్రేమ… ఆత్మ సంబంధి’ అన్న కథలో పార్వతి శివుడితో చేసిన వాదనలోని ఓ భాగం.

‘స్త్రీతో అన్ని సౌఖ్యాలు అనుభవించి గర్భాన్ని విచ్ఛిన్నం చేసి మరీ ఇంకా ఇంకా సౌఖ్యాలు అనుభవించటమే ప్రేమలో మైదాన స్థాయి అని అసురులు నమ్ముతారు. అదే అసలైన ప్రేమ అని అమాయకులను మభ్యపెడతారు. ఆ ప్రచారంలోని నైచ్యాన్ని, అసమంజసాన్ని ప్రపంచానికి ప్రదర్శించేందుకు భగవంతుడు తన జీవితాన్ని ఎన్నుకున్నాడా అనుకుంది తార.’ ఇది తారా-శశాంకుల ప్రేమ గాథ ‘ప్రేమ బాధ్యత’ లో తార ఆలోచన.

“సన్నిహితంగా ఉన్న ప్రతివారూ ప్రేమికులు కారు. ప్రపంచంలో స్త్రీ పురుషులది ఒక్కటే ప్రేమ కాదు. ప్రేమ అనంతమైన భావన. దాన్ని స్త్రీ పురుషులకు మాత్రమే పరిమితం చేసి సంకుచితం చేయకు.” ‘ప్రేమ… ఒక అనంతమైన భావన’ కథలో కచుడు దేవయానితో అనే మాటలు.

ఇలా ఈ సంపుటిలోని కథల్లో ప్రేమ భావనకు సంబంధించిన అనేక ఆలోచనలు అడుగడుగునా కనిపిస్తాయి. ఆధునిక సమాజంలో ప్రేమ పట్ల నెలకొని ఉన్న అపోహలు, అనృతాలు, అనౌచిత్యాలన్నిటికి సమాధానాలివ్వటమే కాదు ప్రేమ అసలు స్వరూపాన్ని బోధపరుస్తాయీ కథలు. తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలంలో ఒక అపురూపమైన కథల పుస్తకం ఇది. సరైన ఆలోచనలనిచ్చి, సరైన దిశలో వ్యక్తులను ప్రయాణింప చేయగల శక్తివంతమైన కథల సంపుటి ‘భారతీయ ప్రేమ కథామాలిక’. ఈ కథల గురించి, ఇందులో ప్రదర్శితమైన భావనలు, సిద్ధాంతాలు తత్వం గురించి విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంటుంది. భారతీయ తత్వంలోని ఔన్నత్యాన్ని, ఉత్తమంగా ప్రదర్శించిన కథాసంపుటి ‘భారతీయ ప్రేమ కథామాలిక’. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొని దాచుకొని పదే పదే చదువుతూ ఆలోచించాల్సిన పుస్తకం ఇది.

***

భారతీయ ప్రేమ కథామాలిక (కథా సంపుటి)
రచన: కస్తూరి మురళీకృష్ణ
ప్రచురణ: సాహితీ ప్రచురణలు
పుటలు: 248
వెల: ₹ 150/-
ప్రతులకు:
సాహితీ ప్రచురణలు,
33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ 520 004
for online orders: sahithibooks.com

ఫోన్: 0866-2436642/43

sahithi.vja@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here