Site icon Sanchika

యువభారతి వారి ‘భారతీయ పునరుజ్జీవనం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

భారతీయ పునరుజ్జీవనం

[dropcap]మా[/dropcap]నవుని చరిత్రలో, యూరపు పునరుజ్జీవనం ఒక మహోజ్జ్వల అధ్యాయం. పునరుజ్జీవనం (Renaissance) అనే మాట అక్కడే పుట్టి ప్రపంచమంతటా వాడుకలోకి వచ్చింది. ఆ ఒక్క మాటలో ఆధునిక మానవ నాగరికత అంతా ఇమిడి ఉంది. యూరపు పునరుజ్జీవన మంతటి ప్రతిభా సమన్వితమైనది కాకపోయినా భారతీయ పునరుజ్జీవనం అల్పమైనదేమీ కాదు. యూరపులో కొన్ని శతాబ్దాల కృషివల్ల సాధ్యమైన గొప్ప ఫలితాలు భారతదేశంలో ఒక్క శతాబ్దం లోనే సిద్ధింపజేసుకోబడినవి.

పల్లె పట్టులు, సాధారణ ప్రజలు, వారి ఆర్థిక పరిస్థితి, దేశీయ పరిశ్రమలు, వ్యవసాయం, ప్రాచ్య విజ్ఞానం – ఇవన్నీ ఆంగ్ల పరిపాలనా ఫలితంగా దిగజారిపోయినా, దేశమంతా ఒక ఏలుబడి కింద ఉన్నందున, పట్టణాలలో శాంతి భద్రతలు స్థిరపడినందున, రాకపోకల సౌకర్యాలు సక్రమంగా ఏర్పడినందున, దేశములో ఒక విధమైన చైతన్యం కనిపించింది. ఈ చైతన్యంలో, జాతికి మార్గదర్శకులైనవారు అన్ని రంగాలలో ఉద్భవించారు.

రాజా రామ్ మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారు విద్యావ్యాప్తికి, సంఘ సంస్కరణకు కృషి చేయగా, దయానంద సరస్వతి, వివేకానందుడు, దాదాభాయి నౌరోజీ, బాలగంగాధర తిలక్, మహాత్మా గాంధీ – భారత జాతీయతకు ప్రాతినిధ్యం వహించి ప్రజలలో జాగృతిని, చైతన్యాన్ని కలిగించారు. ఈ మహనీయుల కృషి ఫలితంగా, సాంస్కృతిక రంగంలో నూతన చైతన్యం ఉద్భవించింది. స్వాతంత్ర్య సాధన కృషి సాగింది. ఈ నూతన చైతన్యాన్నే పునరుజ్జీవనంగా పేర్కొనవచ్చు.

సహస్రాబ్దాల తపః ఫలితంగా, తాను సంతరించుకున్న సంస్కార బలంతో, ప్రజ్ఞా ప్రాభవాలతో ప్రగామిస్తున్నా భారతీయుడు బ్రిటిషు వాడి ఆధిక్యానికి మనఃపూర్వకంగా ఎన్నడూ తల ఒగ్గలేదు. పారతంత్ర్య తమస్సుల్లో చిక్కుకున్నా, తన ప్రజ్ఞను మరువలేదు. పైగా చారిత్రిక కారణాలవల్ల మన దేశంలో బ్రిటిషు పరిపాలన వల్ల సంఘటిల్లిన పరిస్థితులను అవగతం చేసుకొని, తనలోని స్వేచ్ఛా శక్తులను సముద్దీప్తం చేసుకోవాలని ఉద్యమించినాడు. గ్రహణ కాలంలో కోల్పోయిన కాంతిని మళ్ళీ ప్రసరించిన ఇనబింబం లాగా విజృంభించినాడు. రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక, సాహిత్య క్షేత్రాలలో కొత్త పంటలను పండించాడు – కొత్త సిద్ధులను సాధించాడు.

విశిష్టమైన రెండు గొప్ప నాగరికతల సమ్మేళనం వలన ఈ పరివర్తనం సాధ్యమైంది. ఇట్టి అపూర్వ పరివర్తనం ఎలా సంభవించింది? దీని లక్షణాలేమిటి? దీని వలన కలిగిన సత్ఫలితాలేమిటి? మనం సాధించిన విశేషాలేమిటి? అన్న అంశాలను సమీక్షిస్తూ, దాస్య తమస్సుల్లో తాత్కాలికంగా మాటుబడిన భారతీయుడు తన ప్రతిభా లతకు మారాకు హత్తిన వైనాన్ని, శ్రీ డి రామలింగంగారు ఈ పుస్తకంలో రుచిరంగా వివరించారు. వీరు సుప్రసిద్ధ కథకులు, సమీక్షకులు, పాత్రికేయులు, ఆంధ్రాంగ్ల భాషా విశారదులు, చక్కని విమర్శకులు, వీటన్నిటితో పాటు సహృదయతా సంపత్తికి నిధులు.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF%20%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version