భాసనాటకం – బాలచరితమ్

0
2

[box type=’note’ fontsize=’16’] “విస్తారమైన సాహిత్యంలో ప్రాచీనమైన రచన, నాటకసాహిత్యంలో భాగమైన అమూల్య రచన – బాలచరితమ్. భాసుడు ఇచ్చిన ఈ వారసత్వసంపదను కాపాడుకోవటం మన విధి” అంటున్నారు ఇ.ఎన్.వి.రవి. [/box]

[dropcap]సా[/dropcap]ధారణంగా మనం జీవిస్తున్న ప్రపంచంలో మనం తీసుకున్న కొన్నికొన్ని చర్యలకు, కొన్ని కొన్ని అనుశీలనలకు, నిర్ణయాలకూ కూడా ఫలితం – వెంటనే కనిపించకపోవచ్చు. కానీ ఆ అనుశీలన వ్యర్థం ఎప్పటికీ అవదు. సాహిత్యానుశీలనమూ అటువంటిదే. చక్కని/విస్తృతమైన సాహిత్యానుశీలనం యొక్క ప్రయోజన పరిణామం కూడా దీర్ఘకాలికమైనదే.

సంస్కృతంలో ’కావ్యం’ అన్న శబ్దానికి ఒకప్పుడు ’సుభాషితమ్’ అన్న నామాంతరం ఉండేదిట. కావ్యం అన్నది భావ ప్రకటన కానీ భాషాప్రకటన కానీ కాదు, అదొక సంస్కారాభివ్యక్తి. ఈ సూక్ష్మం తెలిసిన వారు మహాకవులు. అందుకనే విస్తృతమైన కావ్యాలు చదువుకోవడం వల్ల కవి తాలూకు సూక్ష్మమైన సంస్కారాభివ్యక్తి పాఠకుడికి తెలుస్తుంది. ఈ అనుశీలన వల్ల బుద్ధి కూడా సునిశితమవుతుంది. ’కవి’ ని తెలుసుకోవడం అన్నా, ’కవిహృదయం’ అన్నా అదే.

భాస కవిని తెలుసుకోవాలంటే కొంత మేరకు మన ప్రాచీన చారిత్రక వాతావరణాన్ని ఊహించాలి. సాహిత్యం ప్రజలకు చేరవలెనంటే కవులకు రాజాశ్రయం తప్పనిసరిగా ఉన్న కాలం. ఉన్నతవర్గాల కోసం సాహిత్యం సృజించవలసిన రోజులు. పాఠకుడు/సామాజికుడు నిర్ధారితమై పోయాడు కనుక రచన కూడా కొంతలో కొంత తదనుగుణంగా ఉండవలసిన పరిస్థితులు. (మొత్తం సమాజమంతానూ అలానే ఉంటుందని కాదు ఇక్కడ అర్థం. నాటి కాలంలోనే గాథలు, వజ్జాలగ్గాలు, కథాసరిత్సాగరాలు కూడా వచ్చినై)

అటువంటి పరిస్థితులు ఉన్న కాలంలో భాసకవి రచించిన నాటకాలను అనుశీలిస్తే, ఆయన ఎంత స్వతంత్రంగా రచనలు చేశాడో తెలుస్తుంది. ఈయన నాటకాలన్నీనూ దాదాపుగా సాధారణ స్థాయి సామాజికులకు దగ్గరగా ఉన్నవే. రచనలో వస్తువు – ఉదాత్తమైన రామాయణ,మహాభారత కావ్యాలకు చెందినప్పటికీ, రచనా సంవిధానం, పాత్ర చిత్రణా వంటివి కేవలం ఉన్నతవర్గాల మెప్పు కోసం వ్రాసినట్టుగా క(అ)నిపించదు. ఈయన ఎన్నుకున్న ఇతివృత్తాలు కూడానూ నాయకుడు-ప్రతినాయకుడు చెడు-మంచి ఉత్తముడు-అధముడు ఇటువంటి  మూసపద్ధతుల ధోరణులకు అతీతంగా ఉన్నాయి. బయట సాహిత్యలోకంలో దుర్మార్గపాత్రలైన దుర్యోధనుడు, కర్ణుడు, కైక – ఈయన నాటకాల్లో ఉదాత్తమైనవి. సాధారణ సాహిత్యంలో అనాగరికుడు/రాక్షసుడు అయిన ఘటోత్కచుడు – ఈయన రచనలో గొప్ప సంస్కారి. నాటకసంవిధానంలో స్త్రీల పాత్రలు తక్కువగా ఉన్న సాహిత్యవాతావరణాన ఈయన కేవలం స్త్రీపాత్రలతో స్వప్నవాసవదత్తమ్ లో ఓ పూర్తి అంకాన్ని రచించాడు. (ఇది మరే సంస్కృత నాటకంలోనూ కనిపించదు)

ఈ కవి తన సంస్కారాన్ని రచనలో ప్రక్షేపించటానికి – రామాయణ, మహాభారతాది కావ్యాలను మార్చటానికి కూడా వెనుకాడలేదు. ఈ చర్యలన్నిటి వెనకాల కవి సంస్కారం – అనుశీలకుడికి కనిపిస్తుంది. కావ్యాల్లో తెలిసే ఈ సంస్కారపు అనుశీలనే కాలక్రమంలో పాఠకుడికి నిజజీవితంలోనూ ఉపయోగపడాలి, పడుతుంది కూడానూ. బయట ప్రపంచాన్ని మూసలుగా కాక మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం సామాజికునికి కావ్యానుశీలనం ద్వారా కలుగుతుంది. పైకి ప్రతీయమానం కాని గొప్ప ప్రయోజనం యిది. అయితే ఇదంతా ఒక్కపూటలోనూ, ఒక్క కావ్యంతోనో అలవడేది కాదు. విస్తృతపఠనం వల్ల సహృదయుడికి కలిగే బౌద్ధిక, మానసిక పరిణామం యిది.

***

సంస్కృత నాటకం ద్వారా ఎన్నో సూక్ష్మమైన, అద్భుతమైన నాటకీయతను, పాత్రచిత్రణను రచించిన భాసకవి – తన నైపుణ్యాన్ని, ప్రతిభను మరొక మార్గానికి మళ్ళించి అతి సరళంగా రచించిన నాటకం బాలచరితమ్. ఇది బాలకృష్ణుని లీలల గురించిన నాటకం. భాసకవి ప్రతిభలో అనేకపాళ్ళు ఆయన ఎన్నుకునే వస్తువు/ఇతివృత్తం లోనే ఉందనేది విద్వాంసులందరూ ఒప్పుకునే మాటే. అలాంటి కవి ఎన్నుకున్న ఈ నాటకంలోని వస్తువులో (శ్రీకృష్ణుని బాల్య లీలలు) ఏ మాత్రం నాటకీయత లేదు. పైగా, ప్రదర్శించబడేది నాటకం కాబట్టి – సంవిధానరీత్యా రంగస్థలంపై ఓ చిన్నిబాలుడు నటించి ఒప్పించగలిగే పరిస్థితి లేదు. లీలలను తెరపై ఇతర పాత్రలతో చెప్పించాలి. అదేదో శ్రవ్యకావ్యానికి ఒప్పే ప్రక్రియ. ఇలా ఈ వస్తువు నాటకానికి సరిపడని ప్రక్రియ. (ఆ కారణం చేతనే ఈ నాటకాన్ని భాసుడు వ్రాయలేదని కొందరు సంస్కృతపండితులు ఊహించారు). అలాంటి ఓ వస్తువును ఎన్నుకుని భాసుడు తనవైన విశిష్టతలను చూపుతూ ఐదంకాల నాటకాన్ని రచించాడు. యథావిధిగా, ఇతర భాసనాటకాల అనుశీలనలో లాగానే ఇక్కడా బాలచరితమ్ నాటక కథను గురించి చెప్పుకుందాం.

బాలచరితమ్ కథ.

మొదటి అంకం.

అవతారపురుషుడైన విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడిగా దేవకీదేవి గర్భాన జన్మించాడు. లీలామానుషవిగ్రహుడైన భగవానుని దేవర్షి నారదుడు దర్శించుకున్నాడు.

తనకు ఇదివరకు జన్మించిన ఆరుగురు శిశువులను వధించినట్లే ఈ శిశువునూ కంసుడు చంపేస్తాడన్న భయంతో వసుదేవుడు, దేవకీదేవికి శిశువును సావకాశంగా కనులారా చూసుకోనీకుండా, మథురానగర కారాగృహం బయటకు వెళ్ళి యమునానది వైపు దారితీశాడు. బయట ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్టుగా ఉంది. ఆ చీకట్లో ఓ వెలుగు పొడమింది. కంసుడే వెలుగును ధరించి తన వెంట బడ్డాడని వసుదేవుడు కత్తి దూశాడు కానీ, తీరా చూస్తే ఆ మెఱుపు శిశువు నుంచే వచ్చింది. ఆ వెలుగు చూపిన బాటలో వసుదేవుడు వెళ్ళగా, ఉప్పొంగి ప్రవహిస్తున్న యమున సగానికి విచ్చి, వసుదేవుడికి దారినిచ్చింది.

యమునను దాటి వసుదేవుడు బృందావనంలో ఓ మఱ్ఱిచెట్టు వద్ద నక్కి తన మిత్రుడైన నందగోపుని కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో నందగోపుడు అక్కడకు ఓ మృతశిశువును తీసికొని రానే వచ్చాడు. ఆ శిశువు యశోదకు జన్మించినది. ఆ శిశువు మృతశిశువని తెలిస్తే, యశోద గుండె బ్రద్దలవుతుంది. అందుకే ఆ శిశువుతో బాటు ఈ మఱ్ఱిచెట్టు వద్దకు వచ్చాడు నందగోపుడు.

చీకట్లో తన మిత్రుడు నందగోపుని పోల్చుకున్న వసుదేవుడు ఆతని చాటుగా పిలిచాడు. నందగోపుడు మొదట ఆ పిలుపు విని, ఏదో పిశాచమని భయపడినప్పటికీ,  గొంతును పోల్చుకుని,వసుదేవుని వద్దకు వచ్చాడు. వసుదేవుడాతనికి తన మగబిడ్డను తీసికొని, పెంచుకొమ్మన్నాడు. ఆ శిశువు కారణంగా కంసుని నుండి ఆపద ఎదురవచ్చని సందేహించినా, చివరకు నందగోపుడు బాలకృష్ణుని తీసికొనక తప్పింది కాదు. ఆ శిశువు ఆశ్చర్యంగా – నందగోపుడు మోయలేనంత బరువుగా ఉన్నాడు. నందుడు మహావిష్ణువును, ఆయన అనుచరులను ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు గరుత్మంతుడు ప్రత్యక్షమై, మిత్రులిద్దరినీ అనుగ్రహించాడు.  శిశువు కూడానూ బరువు తగ్గి తేలికగా మారేడు. ఆ శిశువు గోకులంలో మహారాజులా ఆడిపాడుతూ, పాలు, పెరుగు, వెన్నలు దొంగిలిస్తూ పెరుగుతాడని నందగోపుడు వసుదేవుడికి మాట ఇచ్చినాడు.

వసుదేవుడు – నందగోపుని మృతశిశువును చేత నెత్తుకోగానే ఆ మృతశిశువు కాస్తా ప్రాణం పోసుకుని ఏడవసాగింది. ఆ శిశువును తీసికొని వసుదేవుడు వెనక్కి వెళ్ళి, దేవకి పక్కన పడుకోబెట్టాడు.

***

రెండవ అంకం.

కంసుడు తన ప్రతాపాన్ని గురించి ప్రగల్భాలు పలుకుతూ సభకు వచ్చినాడు. అంతక్రితం ఆతడికి కలలో అనేకమైన దుర్నిమిత్తాలు కనిపించినాయి. అతనికి వందిమాగధులు స్వాగతం చెప్పారు. అభ్యంతరమందిరానికి వెళ్ళిన అతనికి – మధూక ఋషి శాపం – వజ్రబాహుడనే పేరుతో ఎదురయ్యింది. (ఈ శాపం భాసకవి కల్పన). ఆ శాపం కంసుని నాశనం చేస్తానని బెదిరించింది. కంసుడు దానిని  “పర్వతం లాంటి తనను కాకి రెక్కల వల్ల వచ్చిన గాలులు భయపెట్టలేవని” ధిక్కరించి నిద్రకు ఉపక్రమించాడు. ఆ శాపం తన తోటి వారైన ప్రసుప్త, అలక్ష్మి, ఖలతి,కాళరాత్రి తదితరులను, కంసుని ఇంటిని ఆక్రమించమని ఆనతిస్తూ పిలిచింది.

ఇంతలో కంసుడు ఆ రాత్రి బయట కనిపిస్తున్న ఉల్కాపాతాలు, భూకంపాలు గురించి పురోహితుల వద్ద తెలుసుకొమ్మని ఓ దాసిని పంపాడు.  బలాకి అన్న ఆ యువతి – ఆ నిమిత్తాలన్నీ ఓ మహానుభావుడు భూమిపై అవతరించిన సందర్భంగా ఏర్పడినవని పురోహితవాక్యాన్ని చెప్పింది. ఆ శిశువు – దేవకి యొక్క ఆడశిశువే. కంసుడు ఆలోచనలో పడ్డాడు. ఆడుశిశువేనా? తనకు ఏర్పడే ప్రమాదం మగశిశువు గురించి కదా? నిజానిజాలు తెలుసుకొందుకు రాజు కంసుడు వసుదేవుని రప్పించాడు. వసుదేవుడు కొంత సందేహించినా, చివరకు, “భగవంతుని విషయంలో అబద్ధం కూడా నిజం” అవుతుందని తలచి పుట్టింది ఆడుశిశువేనని చెప్పాడు.

పుట్టింది అమ్మాయైనా, అబ్బాయైనా సంహరింపక తప్పదని నిశ్చయించుకుని ఆ శిశువును, దేవకిని రప్పించాడు. కంసుడు శిశువును వధించడానికి చేతుల్లో తీసుకోగానే, ఆ శిశువు పైకెగసి, కాత్యాయనీదేవి రూపాన్ని ధరించి కంసుని హెచ్చరించింది. కాత్యాయనిదేవి అనుచరగణం –  బాలకృష్ణుని కోసం గోకులానికి వెళ్ళారు.

***

మూడవ అంకం.

బృందావనంలో నివసిస్తున్న ఓ వృద్ధగోపాలకుడు తన మేనల్లుడైన దామకుడికి, దామకుడి మిత్రులైన మేఘదత్త, వృషభదత్త, కుంభదత్త, ఘోషదత్తులకు నందగోపపుత్రుని లీలలను వివరించాడు.

నందగోపపుత్రుడు పుట్టిన పది రోజులకు పూతన అన్న రాక్షసి తన పాలీండ్లలో విషాన్ని నింపుకుని, గోపిక వలె వచ్చింది. ఆమె బాలుణ్ణి చేత తీసుకుని తన స్తనములపై పొదవుకున్నది. అంతట బాలుడు ఆమె ప్రాణాలను హరించివేయగా, ఆమె రాక్షసి రూపాన నేలపడింది. ఓ మాసం తర్వాత శకటుడనే రాక్షసుడు బాలుడికేసి బండి రూపంలో రాగా, అతణ్ణి గుర్తించి తన పాదప్రహారంతో ఆతణ్ణి పిండి చేశాడు. వాడూ దానవరూపంలో పడి చచ్చినాడు. ఆపై నెలకు బాలుడు ఇల్లిళ్ళకు తిరుగుతూ పాలు, పెరుగు, వెన్న, పాయసం, మజ్జిగలు భుజింపసాగాడు.

గోపస్త్రీలు ఈ దుందుడుకుతనాన్ని యశోదకు చెప్పగా ఆమె బాలుణ్ణి ఓ రోకలికి కట్టివేసింది. బాలుడు ఆ రోకలిని ఈడ్చుకుంటూ రెండు మద్ది చెట్లను కూల్చివేశాడు. ఆ వృక్షాలు రెండున్నూ యమల, అర్జునులనే దానవుల రూపంలో నేలబడ్డారు. అప్పటి నుంచి ఈ బాలుడు మహాబలవంతుడని, ఈతణ్ణి అందరూ భర్తృదామోదరుడని పిలువసాగినారు. ఇంతలో ప్రలంబుడనే ఓ దానవుడు నందగోపకులలో ఒకడుగా చేరి, వాయురూపంలో సంకర్షణుని ఎత్తుకు పోసాగినాడు. అది తెలిసి సంకర్షణుడు ఆతణ్ణి పిడికిలితో తలపై కొట్టి చంపేశాడు.

వడ్డాది పాపయ్య చిత్రం, ‘చందమామ’ సౌజన్యంతో

ఓ సారి గోపజనులు తాటి పళ్ళను తెచ్చుకుందుకు తాలవనానికి వెళ్ళారు. అక్కడ ధేనుకుడనే దానవుడు గార్ధభరూపంలో రాగా, ఆతని ఎడమపాదాన్ని పట్టి, చంపేశాడు. కేశి అనే రాక్షసుడు గుర్రం వేషంలో వస్తే, ఆతనికి అదే గతి పట్టింది. ఇలా భర్తృదామోదరుడు పలు కార్యాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం భర్తృదామోదరుడు గోపస్త్రీలతో కలిసి “హల్లీసకం” అనే నృత్యాన్ని చేయబోతున్నాడు. అందరం కలసి ఆ నృత్యాన్ని చూద్దాం. – వృద్ధగోపాలకుడు చెప్పి ముగించాడు.

బృందావనంలో దామోదర, సంకర్షణులు, అందమైన గోప గోపికలతో కలిసి కుండలి నృత్యమైన హల్లీసక నృత్యం చేస్తూ చాలాసేపు క్రీడించారు.

ఆ నృత్యం ముగుస్తుండగా, అరిష్టర్షభుడనే రక్కసుడు ఎనుము రూపాన అక్కడకు వచ్చినాడు. వాడు నందగోపపుత్రుణ్ణి ఎలుగెత్తి పిలుస్తూ హుంకరించినాడు. దామోదరుడు ఆ రక్కసుని ముందుకు వచ్చాడు. ఆతణ్ణి చూచి, అరిష్టర్షభుడు హుంకరిస్తూ, “బాలుడు నువ్వు నా ముందు ఏమి నిలబడగలవు?” అని ఆక్షేపించాడు.

వీలైతే ఒక్కకాలిపై నిలబడ్డ నాపై దాడి చేసి, కనీసం నన్ను కదల్చటానికి ప్రయత్నించమన్నాడు దామోదరుడు.

వృషభ రక్కసుడు ఆ పని చేయలేక మూర్ఛపోయాడు. మూర్ఛ నుండి తేరుకున్న అరిష్టర్షభునికి ఎదురుగా నున్నది ఒక అవతారపురుషుడని అవగతమయ్యింది. ఆ అవతారపురుషుడి చేత మరణం కూడా వరమేనని తలపోసి దామోదరుణ్ణి ఎదుర్కున్నాడు.

దామోదరుడు ఆ అరిష్టర్షభుణ్ణి కూడా వధించేశాడు.

అందరూ దామోదరుణ్ణి ప్రశంసించారు. ఇతడే కాదు, కాళీయుడనే మరొక పన్నగపతి కూడా అహంకరిస్తూ గోపజనాన్ని పొట్టనపెట్టుకుంటున్నాడు. ఆతని అహంకారాన్ని కూడా శమింపజేస్తానని దామోదరుడు చెప్పాడు.

***

నాలుగవ అంకం.

దామోదరుడు కాళింది మడుగు వద్దకు వెళుతుంటే, అక్కడకు చెదరిన కేశపాశాలతో గోపాంగనలు వచ్చారు. వారు, కేశవుని మడుగు వద్దకు వెళ్ళవద్దని వారించారు.

వారిని అనునయించి దామోదరుడు మడుగులోనకు ప్రవేశించాడు. ప్రవేశింపగానే మడుగు నుంచి గొప్ప పొగ రేగింది. మడుగున ప్రవేశించిన దామోదరుడు కాళీయుని పట్టి, ఆతని పడగలపై చేరాడు. అక్కడ కేశవుడు – మేఘములపై నిలచిన ఇంద్రునిలా ప్రకాశించాడు.

కాళీయుని పడగలపై చేరిన శ్రీకృష్ణుడు ఆ పడగలపై హల్లీసకం అనే నృత్యాన్ని ఆరంభించాడు. కాళీయుడు మండిపడి, ఆతణ్ణి స్వర్గానికి పంపుతానని గర్జించాడు. చేతనైతే తన భుజాన్ని మాత్రం దహించి చూపుమని కాళీయునికి సవాలు విసిరాడు. “నాలుగు సముద్రాలు, ఏడు కులపర్వతాలు దహించగలగిన నాకు నీ భుజం ఒక లెక్కా?” అని కాళీయుడు విషాన్ని వదిలాడు.

ఆ విషం దామోదరుణ్ణి ఏమీ చెయ్యలేకపోయినది. అప్పుడు కాళీయుడికి తన ఎదుటనున్నది సాక్షాత్తూ నారాయణుడని తెలిసి, శరణు వేడాడు. తను గరుత్మంతునికి భయపడి ఈ మడుగున చేరానని విన్నవించుకున్నాడు. తన పాదచిహ్నాలు ఏర్పడిన పడగలపైన గరుడుడు దాడి చెయ్యడని చెప్పి దామోదరుడు, కాళీయుడిని మడుగు విడచి వెళ్ళేలా చేశాడు. ఆపై నీటిలో వికసించిన పూలను గోపాంగనలకోసం కోసుకుని బయటకు వచ్చాడు. భయంతో బెదరిన గోపబాలురను, గోపాంగనలను ఊరడించి తాను తెచ్చిన పూలను వారికి ఒసంగినాడు.

దామోదర, సంకర్షణులకు భటుడొకడు వచ్చి – మథురానగరరాజు ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు రాజధానిలో జరుగబోతున్న ధనుర్మహోత్సవానికి రమ్మని పిలచినట్లు చెప్పాడు. కంసునికి కాఅం సమీపించినదని, ఆ ఉత్సవానికి వెళ్ళాలని అన్నతమ్ములు సంకల్పించినారు.

***

ఐదవ అంకం.

వ్రజభూమిలో ఉన్న దామోదర, బలరాములను మథురకు కార్ముక ఉత్సవం పేరిట పిలిచి, మల్లయోధులతో యుద్ధం చేయించి మట్టుపెడదామని కంసుడు మనసులో భావించాడు.

శ్రీకృష్ణబలరాములు మథురకు వచ్చి, రాజపరివారానికి వస్త్రాలు తీసుకొని వెళుతున్న ఓ రజకుని వద్ద వస్త్రాలను బలవంతాన గుంజుగున్నారు. పిమ్మట దామోదరుడు గోపాలక బృందం చూస్తుండగానే – ఉత్పలాపీడమ్ అనే ఓ మత్తగజాన్ని, దాని దంతాలను ఊడపెరికి వెంటనే చంపేశాడు.

అంతేకాదు, ఉత్సవాధికారుల నుండి పతాకాన్ని లాక్కుని రాజమహాపథంలో ప్రవేశించారు. అక్కడ మదనిక అన్న ఓ మరుగుజ్జు యువతి గంధలేపనాదులను అంతఃపురానికి తీసుకువెళుతుంటే, ఆ గంధలేపనాదులను తమ ఒడలకు తడవుకొని, ఆ గంధాన్ని అమ్మాయిపై చిలకరించారు. వెంటనే ఆ కుబ్జ, అందమైన అమ్మాయిగా మారిపోయింది. పిమ్మట ఆ యోధులిద్దరూ ధనుశ్శాలకు వెళ్ళారు.అక్కడ సింహబలుడనే వాణ్ణి చెవులపై చరచి మట్టుపెట్టి, ధనుస్సును రెండు ముక్కలు చేశారు. ఇప్పుడు మహారాజు వైపుగా వస్తున్నారు.

దామోదరబలరాముల గురించిన ఉదంతాన్ని ధ్రువసేనుడనే భటుడి ద్వారా విన్న కంసుడు ఆందోళన చెంది, చాణూరముష్టికులనే మల్లులను సత్వరమే పిలిపించాడు.

చాణూరముష్టికులు తమ గురించి ప్రగల్భాలు పలుకుతూ వచ్చారు.

దామోదరబలరాములూ సభకు వచ్చారు. వీరికి భటుడు స్వాగతం పలికేడు.

“రండి. కూర్చోండి. ఈయనే మహారాజు”

“ఎవరికి మహారాజు?”

“అందరికీ. మన ప్రపంచానికి కూడానూ”

“ఈ రోజునుండి అది కుదరదు”

“మహారాజుకు జయము. వీరు వచ్చిరి”

రాజు కంసుడు శ్రీకృష్ణ బలరాముల ఆకారాన్ని చూసి వెఱగు పడ్డాడు. ఆపై మల్లులకు, వృష్ణివీరులకు యుద్ధం ఏర్పాటు చెయ్యమని ధ్రువసేనునికి ఆనతిచ్చాడు.

యుద్ధంలో మల్లయోధులను దామోదరసంకర్షణులు ఓడించడమే కాక, వధించారు. ఆ వెంటనే దామోదరుడు కంసుని కూడా సంహరించాడు. కంసుడి శరీరం కొండలా నేలకూలింది.

అంతట అక్కడకు అనావృష్టి, శివక, హృదిక,పృథుక, సోమదత్త, అక్రూరాది ప్రముఖ వృష్ణియోధులు విచ్చేశారు. వసుదేవుని కూడా రావించారు. బాలకులిద్దరు వసుదేవునికి అభివాదం చేశారు.

“ఈ రోజు సత్పుత్రుని పొందిన ఫలాన్ని ఈ రోజు పొందాను” అని ఆనందించాడు వసుదేవుడు. ఇద్దరినీ ఆశీర్వదించాడు.

అంతట బాలురు ఉగ్రసేనుని రావించి,  గోపాలకులకు, ప్రజలకు – వృష్ణిరాజ్యానికి ఆ ఉగ్రసేనుని మహారాజుగా ప్రతిష్ఠిస్తున్నట్టు ప్రకటించిరి.  అంతట నారదమహర్షి విచ్చేశాడు. బాలురు నారదమహర్షికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి పూజించారు. నారదమహర్షి బాలురను దీవించి, కంసుణ్ణి వధించినందుకు ప్రశంసించి దేవలోకానికి వెనుతిరిగి వెళ్ళిపోయాడు.

భరతవాక్యంతో నాటకం ముగింపు.

నాటకాంశాలు

ఈ నాటకంలో ప్రధాన అంగి రసం – అద్భుతమని రాఘవన్ గారు పేర్కొన్నారు. వీర రౌద్ర భయానక రసాలు అక్కడక్కడా పోషింపబడినాయి. అయితే రాఘవన్ గారే మరొక్క చోట ఇదే నాటకాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ – ఈ నాటకం భక్తి ప్రతిపాదకమైన దృశ్యకావ్యమని పేర్కొన్నారు. భాసుడు ఈ నాటక ఇతివృత్తాన్ని మహాభాగవతమ్, విష్ణుపురాణం, హరివంశమ్ వంటి కావ్యాలలో నిబద్ధమై ఉన్న బాలకృష్ణుని లీలల నుంచి గ్రహించాడు. అయితే అయినంత మేరకు నాటకీయతను కల్పించడంలో స్వీయప్రతిభ చూపాడు కవి.

1.

సూత్రధారకృతారంభైర్నాటకైః బహుభూమికైః |

సపతాకైర్యశో లేభే భాసః దేవకులైరివ ||  (బాణభట్టు హర్షచరితమ్ 1.7)

సూత్రధారుడి చేత ఆరంభింపబడినవి, వివిధములైన పాత్రలు కలవి, అవాంతరపాత్రలు కలవి అయిన  నాటకముల చేత భాసుడు దేవతల వలె యశస్సును గడించినాడు.

బహుభూమికైః, పతాకైః అని బాణుడు కంఠోక్తిగా చెప్పాడు కాబట్టి ఈ పద్యం భాసుడి యొక్క బాలచరితమ్ నాటకానికే వర్తిస్తుందని సంస్కృతవిమర్శకులు రాఘవన్ గారు అంటారు.

(బాలచరితమ్ లో పాత్రలు)

భాసుని నాటకాలన్నింటిలోనూ అత్యధికమైన పాత్రలు ఉన్న నాటకం బాలచరితమే. బహుభూమికైః అన్న శబ్దానికి పెక్కుపాత్రలు అన్న అర్థాన్ని స్వీకరిస్తే – బాలచరితమ్ నాటకమే సరిపోలవచ్చు.  బాణభట్టు వంటి మహాకవి భాసుని గురించి ప్రస్తావిస్తూ, ఏ ఒక్క నాటకానికి ఆయనను పరిమితం చేసి ఉండడు.  అందుచేత బహుభూమికలు అంటే – వైవిధ్యభరితమైన అనేక పాత్రలు అన్న అర్థాన్ని స్వీకరించటం న్యాయమని ఈ వ్యాసకర్త అభిప్రాయం.

2.

ఈ నాటకంలో భాసుడు – అతి సరళమైన భాషను ఉపయోగించాడు. శ్లోకాలు కూడా అనాయాసంగా ఉన్నాయి. నిజానికి ఈ నాటకాన్ని – తెలుగు కొంచెం బాగా తెలిసిన వాళ్ళు శుభ్రంగా చదువుకోవచ్చు. పద్యాల్లో భావాలు కూడా అంతే సులభంగా ఉన్నాయి. ఇంత సరళంగా వ్రాశాడు కాబట్టి – ఇది చిన్నపిల్లలకు పాఠ్యాంశంగా పెడితే బావుండునని వింటర్ నిట్చ్ అనే ఆంగ్లేయుడు సూచించాడు. సబబైన సూచనే.

ఈ నాటకాన్ని కవి బహుశా చిన్నపిల్లలకోసం రచించి ఉంటాడని సంస్కృతవిమర్శకులు రాఘవన్ గారి అభిప్రాయం. చిన్నపిల్లలకు నాటకాలు చూసే అవకాశం నాటి కాలంలో ఉందా? అన్నది ఆలోచించవలసిన విషయం. పైగా గర్భాష్టమం తర్వాత సాంప్రదాయ విద్యను దాదాపుగా గురుకులాల్లో నేర్చుకునే కాలం. గురుకులాల్లో ఇలా నాటకాలను ప్రదర్శించే అవకాశం ఉండి ఉంటుందా? అన్నదీ సందేహాస్పదమైన విషయమే. బహుశా – భగవంతుడు శ్రీకృష్ణునికి చెందిన పర్వదినాలలో ప్రదర్శించటానికి  కవి రచించి ఉండే అవకాశం ఉంది. కొందరు విమర్శకులు – ఈ నాటకాన్ని భాసుడు ఏదో యజ్ఞం వంటిది జరిగినప్పుడు రచించి ఉంటాడని కూడా ఊహించారు. ఇంకొక రకంగా ఊహిస్తే ఈ నాటకాన్ని భాసుడు తన రచనల్లో గొప్పవైన ప్రతిమ, చారుదత్తమ్, స్వప్నవాసవదత్తమ్, వంటి నాటకాలకు ముందే, తన తొలిదశలో వ్రాసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఇతివృత్తాన్ని ఎంచుకునే విషయంలో ఇది భాసుని ధోరణికి విలక్షణంగా ఉంది.  నాటకీయతకు అంతగా అవకాశం లేని రచన బాలచరితమ్. అందుచేత ఈ రచన భాసునిది కాదని, తర్వాత ఎవరో ఆయన రచనలను అనుకరించి ఈ నాటకం వ్రాశారని అని కూడా కొందరు ఆంగ్లేయులన్నారు.

3.

కంసుడు – దేవకి గర్భాన ప్రభవించిన సప్తమ సంతానాన్ని నాశనం చెయ్యాలని ఆ శిశువును ఎత్తుకోగానే, ఆ శిశువు వినాశకాలపు కాళరాత్రిలా పైకెగసి ఉగ్రరూపం తాల్చి నిలుచున్నది. ఆమె కాత్యాయనీ దేవి.

శుంభం నిశుంభం మహిషం చ హత్వా కృత్వా సురానా(ణాం)హతశత్రుపక్షాన్ |

అహం ప్రసూతా వసుదేవ వంశే కాత్యాయనీ కంసకులక్షయాయ ||

శుంభనిశుంభులను, మహిషుణ్ణి వధించి, సురులను శత్రువుల నుంచి రక్షించి, వసుదేవుని వంశములో కాత్యాయనిగా కంసుని కులముని రూపుమాపుటకు జన్మించితిని.

ఆ వెంటనే కాత్యాయని అనుచరులైన కుండోదర, శంకుకర్ణ, మహానీల, మనోజవులు వచ్చారు.

కాత్యాయని అనగా దుర్గ/దుర్గి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్’ అని మంత్రం.  ఈ ఘట్టంలో కాత్యాయనీదేవి, శుంభనిశుంభుల ఉదంతాన్ని పరిశీలించిన విమర్శకులు, కొన్ని వ్యాఖ్యలు చేశారు. శుంభనిశుంభులు, మహిషుల ప్రస్తావన వేదం నాటి దుర్గ/కాత్యాయనీదేవి కాలంలో లేదని, దరిమిలా భాసుని కాలంలోనూ లేదని, ఇటీవలి కాలంలో ఈ భావన వచ్చింది కాబట్టి, ఈ నాటకం కూడా భాసుడు వ్రాసి ఉండకపోవచ్చు లేదా మూలంలోని భాసనాటకాన్ని తీసికొని తదనంతర కాలంలో నాటకీయంగా మలచి ఉండవచ్చు – అని ఈ విమర్శకులు.

ఇది సమర్థమైన వాదన కాదు.  ఆధ్యాత్మిక రూపాల పరిణామక్రమం కాలంలో ఏ ఒక్క బిందువు దగ్గరో ఉన్నట్టుండి ఆరంభం అవదు. ముఖ్యంగా భారతీయ ఆధ్యాత్మిక నేపథ్యంలో. వేదాలలో శుంభనిశుంభులు ప్రస్తావింపబడనంత మాత్రాన, వేదకాలపు దుర్గ వేరని, తదనంతర కాలపు దుర్గ వేరని ఏర్పరచే సిద్ధాంతాలు నమ్మశక్యమైనవి కావు.  వేదాల్లోనే కాక, సప్తమాతృకల అర్చన వచ్చిన తర్వాత కూడా కాత్యాయని ప్రస్తావన కనిపిస్తుంది. సప్తమాతృకల శిల్పాలు – గుప్తులకాలం నాటివీ, అంతకు మునుపు కాలానివి కూడా ఉన్నాయి. నాటి ఆర్యావర్తంలో ఇలా ఓ అర్చారూపాన్ని – ఫలానా కాలంలో కనుగొన్నారని స్పష్టంగా చెప్పడం దుస్సాధ్యమైన విషయం. ఇంత నాటకంలో ఓ చిన్న అర్చామూర్తిని పట్టి కాలగణనకు పూనుకోవడం వ్యర్థమైన పని.

4.

ఆ విషయం అలా ఉంటే, ఇది భాసనాటకమే అని చెప్పడానికి కొన్ని స్పష్టమైన దృష్టాంతాలు ఉన్నై. నాంద్యంతే తతః ప్రవిశతి సూత్రధారః“,”స్థాపనా అన్న నిర్దేశాలతో బాటు, నాటకం చివరన భరతవాక్యం కూడా ఇతరనాటకాలను పోలి ఉంది.

ఇమాం సాగరపర్యంతాం హిమవద్వింధ్యకుండలమ్ |

మహీమేకాతపత్రాంకం రాజసింహః ప్రశాస్తు నః ||

సముద్రం వరకూ వ్యాపించిన, హిమాలయ, వింధ్య పర్వతాలను వహించిన భూమిని ఒకే గొడుగు క్రిందకు తెచ్చి ’రాజసింహుడు’ మనలను సక్రమముగా పరిపాలించుగాత!

ఇలా భరతవాక్యాలలో రాజసింహుని ప్రస్తావన భాసుని నాటకాల భరతవాక్యంలో వస్తుంది. ఈ రాజసింహుడు ఎవరా అని ఇతమిత్థంగా తేలలేదు.

5.

బాలచరితమ్ నాటకం ఆరంభంలోనూ, చివరనా – నారదుడి ప్రవేశం ఉంది. భాసుని మరొక నాటకమైన అవిమారకమ్ లో కూడా నాటకం చివరన నారదుని రాక కనిపిస్తుంది.

ఈ నాటకంలో వృషభదత్తుడు, కుంభదత్తుడు ఇద్దరు గోపబాలకుల పేర్లు కనబడతాయి. ఈ పాత్రలు ఇవే పేర్లతో పంచరాత్రంలో కూడా కనిపిస్తాయి.

6.

ఇప్పుడు లభిస్తున్న భాసనాటకాలు మూలభాసనాటకాలకు రంగస్థల రూపాలని, వీటిని కేరళలో చాక్యార్లు అనే కూడియాట్టం నాటకప్రదర్శనను పారంపరికంగా ప్రదర్శించే వారు రంగస్థలానికి అనుగుణంగా మలచారని ఒక వాదన.

అలా అయితే నాటకం మధ్యలో వచ్చే ప్రాకృతభాషా సంభాషణలు ఉండనవసరం లేదు.  వాటిని తొలగించి పూర్తి సంస్కృతంలో నిర్మించి ఉండవచ్చు. అంతే కాక, భాసనాటకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క నిడివిలో ఉన్నాయి. రంగస్థలానికి అనుగుణంగా మార్చే పక్షంలో కొన్ని నాటకాలని నిడివి పెంచి, తగ్గించటం ఉండరాదు. ఈ కారణాలు కూడా ఇవి భాసనాటకాలు కాదని చెప్పటానికి బాధకాలే.

పాత్ర చిత్రణ

1.

కంసుడు ఒక దుష్టుడు. కాముకుడు కూడా. ఈతని కాముకత్వాన్ని “చూపటానికి” యథావిధిగా భాసుడు ఓ విచిత్రమైన సంవిధానాన్ని ఎన్నుకున్నాడు. రెండవ అంకం ఆరంభంలో – కంసపాత్ర రంగస్థలంపై అడుగుపెట్టగానే, ఆతనికి కొందరు యువతులు స్వాగతం చెవుతారు. వారి స్వాగతం ఇలా ఉంటుంది.

ఆఅచ్ఛ భట్టా! ఆఅచ్ఛ! అహ్మాణం కణ్ణాణం తుఎ సహ వివాహో హోదు!”

(ఆగచ్ఛ భర్తః ! ఆగచ్ఛ! అస్మాకం కన్యానాం త్వయా సహ వివాహో భవతు!)

“రండి స్వామీ, రండి. మా కన్యలకు మీతో వివాహం జరుగనీ!”

కంసుడు తన గురించి స్వోత్కర్షలు చెబుతూ కొన్ని పద్యాలు చెబుతుంటాడు. ఒక్కో శ్లోకం పూర్తవగానే ఈ యువతీవందిమాగధులు పైని వాక్యాన్ని పలుకుతారు. ఇలా పదే పదే సాగుతుంది. ఇలా స్త్రీలతో పలుమార్లు ఒకే వాక్యం చెప్పించి, కవి – వారి మనసులో భయాన్ని, కంసుని పాత్ర నీచత్వాన్ని కూడా Elevate చేశాడు. ఈ ప్రక్రియలో కొంతమేరకు హాస్యాన్ని కూడా పోషించాడు

2.

మధూకుడనే ఒకానొక మహర్షి – కంసుని సర్వనాశనం కమ్మని శపిస్తాడు. ఆ శాపరూపుడు వజ్రబాహుడనే పేరుతో కంసుని అంతఃపురంలోకి అడుగుపెడతాడు. కంసుని “రాజ్యశ్రీ” ని విష్ణువు ఆజ్ఞప్రకారం అక్కడనుండి వైదొలగమని చెప్పి, తన మిత్రులైన ప్రసుప్త, అలక్ష్మి, ఖలతి, కాళరాత్రి, మహానిద్ర, పింగళాక్షులతో కలిసి కంసుని ఇంట నివాసం ఏర్పరచుకొంటాడు. – ఈ ఘట్టం లోని పాత్రలపేర్లను, ఆ పేర్ల స్వభావాలకు ప్రతీకలుగా నిలిపి, భాసుడు అందమైన నాటకీయత సృష్టిస్తాడు. ఈ ఘట్టం బహుశా – నేడు లభ్యమవుతున్న సంస్కృతనాటకసాహిత్యం ప్రకారం మొట్టమొదటి ప్రతీకాత్మక ప్రయోగం (Allegory) కావచ్చు. తర్వాత ఎంతో కాలానికి నాటకం మొత్తాన్ని ప్రతీకాత్మకంగా చేసిన – ప్రబోధచంద్రోదయం, సంకల్పసూర్యోదయం వంటి ప్రయోగాలు వచ్చినవి.

అంతే కాదు. శ్రీమన్నారాయణుడు మానవరూపం ధరించి వ్రజరాజ్యంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీమన్నారాయణుని ఆయుధాలైన నందకము, శార్ఞము, కౌమోదకి, సుదర్శనము వంటివి గోపబాలురుగా వ్రజభూమిలో అడుగు పెడతాయి.

కవిత్వాంశాలు

ఈ నాటకం స్వభావ రీత్యా భాసనాటకాలకు విరుద్ధమైనదని చెప్పుకున్నాం. ఇందులో శ్లోకాలను చాలా సరళంగానూ, అందంగానూ వ్రాశాడు కవి.

1.

వసుదేవుడు బాలుణ్ణి చేతులతో ఎత్తుకొని, “ఎంత బరువుగా ఉన్నాడు అబ్బాయి?” అని ఆశ్చర్యచకితుడైనాడు. ఇంకా;

వింధ్యమందరసారోయం బాలః పద్మదళేక్షణః |

గర్భే యయా ధృతః శ్రీమానహో ధైర్యం హి యోషితః ||

తామరరేకుల కన్నుల వాడైన ఈ బాబు వింధ్య,మందర పర్వతముల సారములా ఉన్నాడు. ఇటువంటి ఎవరైతే ఈ బాలుణ్ణి గర్భంలో తాల్చినారో (ఆమె యొక్క) ధైర్యం గొప్పది!

భాసనాటకాలను వెలికితీసిన T. గణపతిశాస్త్రి గారు ఈ శ్లోకాన్ని గురించి ఇలా వ్యాఖ్యానించారు.

ఈ శ్లోకంలో రెండవ పాదంలో “అహో, ధైర్యం హి యోషితః” అన్న వాక్యాన్ని అర్థవంతంగా చెప్పాలంటే, యయా (ఎవతె చేత) – అన్న శబ్దానికి తస్యాః (ఆమె చేత) అన్న ఆధ్యాహారాన్ని ఆరోపించుకోవాలి. అలా చేయడం వలన ’హి’ అన్న శబ్దానికిగల స్వారస్యం చెడుతుంది. అందుచేత రెండవపాదంలో గర్భే యయా బదులు “గర్భే అనయా” – అవగ్రహంతో గర్భేऽనయా అని ఉండాలి.

గర్భేనయా ధృతః శ్రీమానహో ధైర్యం హి యోషితః |

గణపతిశాస్త్రి గారు ఎందుచేతనో, ఈ ఒక్క శ్లోకాన్ని పీఠికలో వ్యాఖ్యానించటం గమనార్హం.

2.

లిమ్పతీవ తమోఙ్గాని వర్షతీవ అఞ్జనం నభః |

అసత్పురుషసేవేవ దృష్టిర్విఫలతాం గతా ||

తమః = చీకటి

అఙ్గాని = శరీరములను

లిమ్పతీవ = పూయుచున్నట్లుగా (ఉంది)

నభః = ఆకాశము

అఞ్జనం = కాటుకను

వర్షతి ఇవ = కురుస్తున్నట్లుగా (ఉంది)

అసత్పురుష సేవా ఇవ = దుర్జనునికి చేసే ఉపకారంలాగా

దృష్టిః = చూపు

విఫలతాం గతా = విఫలత్వాన్ని పొందుతున్నది.

వసుదేవుడు నడిరేయి బాలకృష్ణుని తీసికొని వెళుతున్నాడు. ఆ రేయి – చీకటిని తనకు పులుముకున్నట్టుగా ఉంది. ఆకాశం కాటుకను కురుస్తున్నట్టున్నది.చూపు – చెడువాని స్నేహం లా విఫలమయినట్టు ఉంది.

ఈ శ్లోకం సంస్కృతసాహిత్యంలో ప్రముఖమైనది. ఆలంకారికులు ఈ శ్లోకాన్ని పలుసందర్భాలలో పేర్కొన్నారు.అంతే కాదు, ఈ చిన్ని శ్లోకం పలు కావ్యాలలో ఉంది. అన్నిటికన్నా మొదట ఇది భాసుని బాలచరితమ్ లోనే ప్రయోగింపబడి ఉండాలి. మరిన్ని వివరాలను ఈ లంకె లో చదువుకోవచ్చు.

 3.

సాధారణంగా భాసనాటకాల్లో పద్యాలు పాత్రచిత్రణలో భాగం. పద్యాల ద్వారా పాత్రను చిత్రించటంలో ఆయన పెట్టింది పేరు. ఈ నాటకంలో అటువంటి సంవిధానానికి అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల సరళమైన, అందమైన పద్యాల ద్వారా పాత్రల భావాన్ని ఉద్యోతించాడు.

కంసుడు – తమను మోసంతో చంపాలని మథురకు రావించాడని చూచాయగా దామోదర బలరాములకు తెలిసింది. వారు మహాబలోత్సాహాలతో మథురలో అడుగుపెట్టి, తమ ప్రతాపాన్ని అనుగుణమైన చోట్ల చూపుతూ ధనుశ్శాలకు వచ్చి, ధనుస్సును రెండుముక్కలు చేశారు. ఆపై

ఆపీడదామశిఖిబర్హవిచిత్రవేషః, పీతాంబరః సజలతోయదరాశివర్ణః |

అభ్యేతి రోషపరివృత్తవిశాలనేత్రో రామేణ సార్ధమిహ మృత్యురివావతీర్ణః ||

బాగా లాగి బిగించి కట్టిన జడపై పూలను, నెమలిపింఛాన్ని తాల్చిన విచిత్రవేషంతో, పసుపు వస్త్రాలతో, నల్లటి మేఘంలాంటి శరీరంతో, రోషంనిండిన విశాలమైన కనులతో, బలరామునితో కలసి, మృత్య్వు భూమిపై దిగినట్లు వస్తున్నాడు!

శ్రీకృష్ణుని శరీరవర్ణనతో బాటు ఆయన మనసులో ప్రతిఫలిస్తున్న రోషాన్ని కళ్ళలో చూపుతూ ఉన్నట్టు కవి వర్ణించడం – గమనార్హం.

శ్రీకృష్ణుడు మేఘశ్యాముడు,  పీతకౌశేయవాసుడు. కొందరు కవులు ఆయనను ఇంద్రనీలమణిరూపమని కూడా వర్ణించారు.

స ఇంద్రనీల స్థలనీలమూర్తీ రరాజ కర్చూరపిశంగవాసః |

వైసృత్వరై రంబురుహాం రజోభిః యమస్వసు శ్చిత్ర ఇవోదభారః || (మాఘం 3.11)

ఇంద్రనీలమణి ప్రదేశంలా నల్లనైన శరీరం గలవాడు, హరితాళంలా పచ్చనైన వస్త్రములు తాల్చినవాడునూ అయిన ఆ వాసుదేవుడు ప్రసరిస్తున్న తామరల పుప్పొడులతో చిత్రవర్ణమైన యమునానదిప్రవాహంలా ప్రకాశించాడు.

4.

అలా ఉంచితే సంకర్షణుని (బలరాముని) కూడా అపూర్వంగా వర్ణించాడు కవి. బలరాముని చూచిన కంసుడు ఇలా అనుకొన్నాడు.

అభినవ కమలామలాయతాక్షః శశినిభమూర్తి రుదారనీలవాసాః |

రజత పరిఘ వృత్తదీర్ఘబాహుః చలదసితోత్పలపత్రచిత్రమాలః ||

క్రొందామరల లాగా స్వచ్ఛమైన తెల్లని కనులు, చంద్రకాంతితో ప్రకాశించే మేని, తేలికపాటి నీలిరంగు వస్త్రాలు, వెండితో చేసిన రోలుపొత్రంలా గుండ్రంగా పొడుగ్గా ఉన్న బాహువులు, కంఠంలో నల్లకలువల రేకలతో చేసిన దండ.

ఈతడే కదా, లలితగంభీరమైన ఆకృతి గలవాడు, దామోదరుని అన్న అయిన బలరాముడు!

 రజత-పరిఘ-వృత్త-దీర్ఘబాహుః = వెండి-రోలులా ఉన్న- గుండ్రని- పొడవైన బాహువులు!  ఆ చేతులు ఈ పోలికతో ఊహించండి!

(వెండి రోలు రోకలి)

5.

మరికొన్ని అందమైన, సరళమైన శ్లోకాలు.

నారాయణాయ నరలోకపరాయణాయ లోకాననాయ కమలామలలోచనాయ |

రామాయ రావణవిరోచనపాతనాయ వీరాయ వీర్యనిలయాయ నమో వరాయ ||

నారాయణునికి, నరలోకపరాయణునకు, లోకం యొక్క ముఖమునకు, తామరల వంటి శుభ్రమైన కనులవానికి, రామునకు, రావణసంహారచణునకు, వీరునకు, వీరత్వమునకు నిలయమైన వానికి, శ్రేష్ఠునకు వందనము.

ఏతాః ప్రఫుల్లకమలోత్పల వక్త్రనేత్రా గోపాంగనాః కనకచంపకపుష్పగౌరాః |

నానావిరాగవసనా మధురప్రలాపాః క్రీడన్తి వన్యకుసుమాకులకేశహస్తాః ||

వికసించిన తామర వంటి మోముపై నల్లకలువల వంటి కళ్ళు కలిగిన వారు, పసిడి, మొగలిపూల వలె గౌరవర్ణము కలిగిన వారు, రకరకాల ఎరుపు రంగు వస్త్రములు ధరించినవారు, మధురంగా మాటలాడువారు, మణికట్టుకు, కేశపాశాలకు రకరకాల అడవిపూలను చుట్టుకున్నవారు అయిన ఈ గోపాంగనలు వీరే!

(ఈ ఘట్టం తర్వాత ఘట్టాన గోపాంగనలు భీతావహులైన వర్ణన ఉంది. ఈ వర్ణనను అధరరుచకం అన్న ఉపశీర్షిక లో చూడవచ్చు.  రెండు వర్ణనల్లోనూ ఉన్న వ్యత్యాసం గమనార్హం)

దామోదరోయం పరిగృహ్య నాగం విక్షోభ్య తోయం చ సమూలమస్య |

భోగే స్థితం నీలభుజంగమస్య మేఘే స్థితః శక్ర ఇవావభాతి ||

ఆతడు దామోదరుడు! కాళీయసర్పాన్ని చేతబట్టి, నీటిని మూలంగా కలచివేసి, కారుమేఘంపైనున్న ఇంద్రుడిలా నీలి సర్పంపై నిలబడి ఉన్నాడు. (ఇంద్రుడు మేఘాలపై నిలచి వజ్రాయుధంతో మేఘాన్ని తాటిస్తే వర్షం కురుస్తుందని పౌరాణిక ఉపాఖ్యానం)

అధరరుచకం/అధరరుచయం (?)

కాళింది మడుగు వద్దకు వెళుతున్న దామోదరునకు గోపాంగనలు కనిపించినారు. వారి వర్ణన ఇలా ఉంది.

ఏతా మత్తచకోరశాబనయనాః ప్రోద్భిన్నకమ్రస్తనాః

కాన్తాః ప్రస్ఫురితాధరోష్ఠరుచయః విస్రస్తకేశస్రజః |

సంభ్రాంతా గలితోత్తరీయవసనాస్త్రాసాకులవ్యాహృతాః

త్రస్తా మామనుయాంతి పన్నగపతిం దృష్ట్వైవ గోపాంగనాః ||

కాళీయుని చూచి,  మదించిన వెన్నెలపులుగులవంటి కనులవారు, వికసించిన, ఇంపైన స్తనములవారు, కాంతులీను పెదవులవారు, విడచిన కేశపాశముల వారు అయిన ఈ కాంతలు, భయపడి, ఉత్తరీయాలు చెదరి, మనస్సులో భయపడినవారై,  నా వద్దకు వస్తున్నారు.

ఈ పద్యంలో ప్రస్ఫురిత అధరోష్ఠ రుచయః అంటే బాగుగా అతిశయించిన క్రిందిపెదవి యొక్క కాంతిగలవారు అని అర్థం. రుచయః బదులు రుచకః అన్న పాఠం స్వీకరిస్తే ఓ ముఖ్యమైన సంగతికి దారితీస్తుంది.

పెదవి క్రింది భాగాన (గెడ్డం పైన) గుండ్రంగా స్త్రీలు అలంకరించుకునే ముద్రకు ఓష్ఠరుచకము అని పేరు. ఇది గుప్తుల కాలానికి ప్రస్ఫుటంగా వ్యాపించిన అలంకారం. ఇది సువర్ణముద్ర. అంటే బంగరు రంగు కాంతులీనే ఒకానొక ముద్ర. గుప్తుల కాలం లో నిష్కము అంటే బంగరు నాణెం. కార్షాపణం అంటే వెండి రూక. నిష్కం ఆకారంలో ఉన్నది రుచకము. ఇది అజంతా శిల్పసుందరిలో కనిపిస్తుంది.

ఈ రుచక శబ్దాన్ని బాణభట్టు, అంతకు మునుపు కవి అయిన శూద్రకుడు కూడా పేర్కొన్నారు. ఇ రుచకం -శాతవాహనుల కాలానికి కూడా ఉండి ఉండాలి. ’రుచకం’ అనే పాఠభేదం ఉండినట్లయితే –  భాసుని కాలంలోనూ ఈ అలంకరణ ఉండేదని ఊహించవచ్చు. ఉండేదా?  ఏమో!

హల్లీసకం:

గోపబాలికలైన ఘోషసుందరి, వనమాలి, చంద్రలేఖ, మృగాక్షి ఇత్యాదులు – వ్రజభూమిలో ఆనందంగా అడుతూ పాడుతూ ఉన్నారు. వారితో వాసుదేవబలరాములు చేరారు. చేరి “హల్లీసకం” అనే నృత్యం చేశారు.

ఏంటా హల్లీసకం?

మండలేన తు యన్నృత్యం హల్లీసకమితి స్మృతః |

ఏకస్తత్రతు నేతా స్యాద్గోపస్త్రీణాం హరిర్యథా || (హేమచంద్రుని కావ్యానుశాసనమ్ – 8 వ అధ్యాయం)

హల్లీసకం అనే నృత్యం – యువతీయువకులు చేరి గుండ్రంగా కూడి నర్తించేది. అందులో ఒకరు నేత, మిగిలిన వారు స్త్రీలు. హరి, గోపస్త్రీలతో ఆడునట్లుగా. నృత్యం – మార్గ, దేశీలని రెండు విధాలు. మార్గం అంటే సాంప్రదాయనృత్యం. దేశీ అంటే జానపదశైలి. హల్లీసకం – దేశీ నృత్యం.

ఈ నిర్వచనం క్రీ.శ. 11 వ శతాబ్దంలోని హేమచంద్రుడిదైనప్పటికీ, అంతకు మునుపు ఎంతో కాలం నుంచి  ఈ నృత్యం ఆర్యావర్తంలో అన్నివైపులా వ్యాపించి ఉన్నది. దాదాపు ఇదే నిర్వచనాన్ని నాట్యశాస్త్రానికి వ్యాఖ్యానమైన అభినవభారతి లో అభినవగుప్తుడు పేర్కొన్నాడు.

సాహిత్యదర్పణంలో విశ్వనాథ కవిరాజు హల్లీశ పేరును ఉపరూపకంలో భాగంగా చెప్పాడు.

హల్లీశ ఏక ఏవాంగః సప్తాష్టౌ దశ వా స్త్రియః |

వాగుదాత్తైకపురుషః కైశికీవృత్తిరుజ్జ్వలా |

ముఖాంతిమౌ యథా సంధీ బహుతాళలయస్థితిః || (ఉదా: కేళిరైవతకమ్) 

(హల్లీశం ఒక అంగంతో కూడిన ఉపరూపకం. ఇందులో ఏడు నుండి పది వరకూ స్త్రీలు, ఉదాత్తపురుషుడు ఉంటారు. ఉజ్జ్వలమైన కైశికీవృత్తి ఉంటుంది. ముఖసంధియుని, బహుతాళలయస్థితియునూ కూడా ఇందులో సిద్ధం.)

 పైని నిర్వచనం కూడా అంతో ఇంతో అర్వాచీనమైనదే. అయితే అంతకంటే ఎంతో ప్రాచీనమైన మహాభారతంలో ఖిలభాగమైన హరివంశపురాణంలో విష్ణుపర్వంలో హల్లీసకం ప్రస్తావన ఉంది.

జగ్రాహ వీణామథ నారదస్తు షడ్గ్రామరాగాది సమాధియుక్తమ్ |

హల్లీసకం తు స్వయమేవ కృష్ణః సవంశఘోషం నరదేవ పార్థః ||

మృదంగవాద్యానపరాంశ్చ వాద్యాన్ వరాప్సరస్తా జగృహుః ప్రతీతాః |

ఆసారితాంతే చ తతః ప్రతీతా రంభోత్థితా సాభినయార్థతజ్ఝా|| (హరివంశం, విష్ణుపర్వం 89. 68, 89.69)

ఓ రాజా!  అప్పుడు నారదమహర్షి తన వీణను సవరించాడు. ఆరు గ్రామాలపై ఆధారపడిన రాగాల ద్వారా చిత్తాన్ని సమాధిగతం చేశాడు. శ్రీకృష్ణుడు మురళిని మ్రోగించి హల్లీసక క్రీడను ఆరంభించాడు. అర్జునుడు మృదంగవాదం మొదలుపెట్టినాడు. సంగీతకళలో నిష్ణాతులైన, శ్రేష్ఠమైన అప్సరసలు ఇతర వాయిద్యాలను మ్రోగించసాగిరి. ప్రథమ నర్తకీప్రవేశం (ఆసారితమ్) తర్వాత నాట్యకళలో విజ్ఞాని రంభ అభినయానికి ఉద్యుక్తురాలై లేచినది.

(గ్రామం – అన్నది సంగీతపరిభాష అట! ఆరు గ్రామాలు అంటే – మధ్య, శుద్ధ, భిన్న, గౌఢ, మిశ్ర, గీత. ఈ ఉదంతాన్ని వైశంపాయనుడు జనమేజయునకు చెబుతున్నాడు. అందుకే శ్లోకంలో నరదేవ అన్న సంబోధన ఉన్నది.)

***

ఆంధ్రదేశంలో కూడా ఈ నృత్యం పద్దెనిమిదవ శతాబ్దం వరకూ ప్రాచుర్యంలో ఉన్నట్టు కనిపిస్తూంది. ఇలా మండలాకారంలో ఆడే నృత్యాలను గొడ్లి/గొండ్లి నృత్యాలు అన్నారు. పద్దెనిమిదవ శతాబ్దంలో కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో ఈ హల్లీసకాన్ని గురించి వివరించాడు.

సీతారాములు అయోధ్య మేడపై విహరిస్తున్నారు. వారి యెదుట యువతులు రకరకాల నృత్యాలు చేశారు. అందులో హల్లీసకం ఇలా ఉంది.

సీ.

అన్యోన్య హస్త దండావృత్తు లెసఁగ నొం

డొరుల సామ్ముఖ్యంబు లొంది యొంది

యీవలావల వచ్చి యితరేతరము దొల్త

నిలచిన నెలవుల నిలచి నిలచి

కంకణ మంజీర కాంచికల్ మ్రోయ స

వ్యాప సవ్య స్ఫూర్తి జూపి చూపి

తాళవాద్య రవానుకూలంబుగా మంద

దృతమృదు గతులను తిరిగి తిరిగి

గీ.

యనుపమ రసోదయంబున నభినవాతి

చిత్రవర్తన భంగులఁ జెలఁగి చెలఁగి

విడివడి మన్మనథోన్మద ద్విరదములన

సఖులు హల్లీసకము సల్ప సంతసిల్లి (.రా 6.140)

ఈ నృత్యం కొంచెం (తెలుగు) సాంప్రదాయనిర్వచనానికి భిన్నంగా ఉంది. నాయకుడు లేడు కానీ సఖులే మండలాకారంలో నృత్యం చేశారు.

దరిమిలా – హల్లీసకం అన్నది దేశీనృత్యరీతి అని తెలుస్తోంది. బాలచరితమ్ లో హల్లీసకం ప్రస్తావన రెండుమార్లు వచ్చినది. గోపికలతో దామోదరసంకర్షణులు ఆడిన సందర్భాన, తిరిగి వాసుదేవుడు కాళీయునిపై ఆడిన సందర్భాన రెండవసారి. కాలక్రమంలో ఇది గొండ్లి/గొండిలి/కుండల/మండల నృత్యమయినట్లు తెలుస్తూంది. తెలుగునాట ఇది కుండలి నృత్యంగానే ప్రసిద్ధి. తెలంగాణాలో బ్రతుకమ్మ, కేరణలో ఓణం నాడు మహిళలు జరుపుకునే నృత్యం బహుశా హల్లీసకం, దండరాసకం వంటి ప్రాచీన నృత్యరూపాలకు నేటికాలపు అవశేషాలు కావచ్చు.

నాటకంలో గానం.

భరతుని నాట్యశాస్త్రం లో నాట్యానికి 11 అంగములు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏకాదశాంగముల స్వరూపమే నాట్యశాస్త్రసంగ్రహము.

రసభావాహ్యభినయాః ధర్మీవృత్తిప్రవృత్తయః |

సిద్ధిః స్వరాః తథాతోద్యం గానం రంగశ్చ సంగ్రహః ||

రసము, భావము, అభినయము, ధర్మి, వృత్తి, ప్రవృత్తులు, సిద్ధి, స్వరములు, ఆతోద్యములు (చర్మముతో చేసిన మద్దెల, మృదంగము మొదలైనవి), గానము, రంగము – ఇవి నాట్యములో భాగాలు.

పైని నాట్యాంగాలలో గానం ఒకటి. గానం అంటే నాటకరచయిత నాటకంలో భాగంగా వ్రాసిన పద్యాలను రాగయుక్తంగా ఆలాపించటమా లేక నాటకరచయితకు ప్రమేయం లేకుండా, నాటకసమాజాల వారే కూర్చిన పాటలు ఉండేవా?  నాటకరచనలో లేని గానాలను ధ్రువాగానాలు అన్నారు. ధ్రువం తెలుగులో దరువు అయిందట.  కాళిదాసు విక్రమోర్వశీయం నాటకపు విలక్షణ ప్రతిని, దాని వ్యాఖ్యానాన్ని బెంగాలు రాష్ట్రంలో కనుగొన్న HD వేలాంకర్ అన్న సంస్కృతపండితుడికి  అందులో ధ్రువాగానాలు కనిపించినవి. ఈ ధ్రువాగానాలను నాటకసమాజపు వారు, నాటకం కొనసాగే కొన్ని సందర్భాలలో ఆలపించేవారట. వీటిని రచించే అవకాశమూ నాటకసమాజాలకే ఉండేదని వేలంకర్ గారు ప్రకటించారు. దరిమిలా గానం అన్నది నాట్యంలో ప్రత్యేకమైన అంగం.

భాసుని బాలచరితమ్ లోనూ నాటకరచయిత కాకుండా, నాటకాన్ని ప్రదర్శించే సమాజం వారు గానం చేయదగ్గ ఘట్టాలు సూచనాప్రాయంగా ఒకటి రెండు చోట్ల కనిపిస్తాయి.

మూడవ అంకంలో కృష్ణబలరాములు గోపికలతో కలసి హల్లీసకం అన్న నృత్యం చేస్తారు. ఆ నృత్యాన్ని చూసిన వృద్ధగోపాలకుడు ఇలా అంటాడు.

హీహీ షుట్ఠు ఈదం | షుట్ఠు వాఇదం | షుట్ఠు నచ్చిదం | జావ అహం వి ణచ్చేమి | పరిస్సంతో ఖు అహం |”

హీ హీ సుష్ఠు గీతమ్ | సుష్ఠు వాదితమ్ | సుష్ఠు నర్తితమ్ | యావదహమపి నృత్యామి | పరిశ్రాంతః ఖల్వహమ్ |”

ఆహా! చక్కని గీతము, చక్కని వాయిద్యము, చక్కని నర్తనమును. నేనూ ఆడతాను. గొప్ప ఊరట కలిగింది సుమా.

ఈ ఘట్టంలో ఏ గానం సాగిందో, ఏ వాయిద్యాలు ఉపయోగించినారో, ఆ నర్తనం ఎలా జరిగిందో – అది నాటకంలో నటులపైన, నాటకసమాజపు అభినయప్రక్రియ పైన ఆధారపడినది. నాటకరచయితకు బాహ్యామైన సంవిధానం యిది.

ముగింపు.

భాగవతం, హరివంశంలో రచించిన బాలకృష్ణుని లీలలు – భారతదేశపు కావ్యసాహిత్యంలో, భక్తిసాహిత్యంలోనూ అపూర్వమైనవి. వీటికి అనుసృజనలు పెక్కుభాషల్లో వెలువడినాయి. ప్రాకృతకవులు కూడా ఈ లీలలను ఎంతో మనోహరంగా వర్ణించారు. జైన కవులకు కూడా ఈ ఘట్టం ఎంతో గొప్పగా రుచించినది. దరిమిలా జైనకవులు బాలకృష్ణుని లీలలను వర్ణించటమే కాక, కృష్ణుని తీర్థంకరునిగా కూడా ఉద్యోతించినారు. తెలుగున ఎఱ్ఱనామాత్యుడు రచించిన హరివంశం అతిమధురం,మనోహరం. పోతనామాత్యుడు సరేసరి. ఈ కవి రచించిన బాలకృష్ణుని లీలల్లో “అమ్మా తమ్ముడు మన్ను తినేను..” వంటివి పాటల రూపంలో కూడా తెలుగు నాట అందరినీ పరవశింపజేశాయి. అన్నమయ్య, క్షేత్రయ్య వంటి పదకవులు కూడా అద్భుతంగా బాలకృష్ణుని లీలలను కీర్తించారు. అన్నమయ్య రచించిన “ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు..” – ఇటువంటి కీర్తనలు ఎటువంటి సామాజికుణ్ణైనా పరవశింపజేస్తుంది. నిజానికి కృష్ణలీలలయొక్క వాజ్ఞ్మయం బహువిస్తారమైనది.

ఇంత విస్తారమైన ఈ సాహిత్యంలో ప్రాచీనమైన రచన, నాటకసాహిత్యంలో భాగమైన అమూల్య రచన – బాలచరితమ్. నాటకానికి తగని ఈ కథను భాసుడు ఇతర సంవిధానాలతో రచించి, ఓ పెద్ద సంపదను వారసత్వంగా ఇచ్చిపోయినది నిజం. ఈ వారసత్వసంపదను కాపాడుకోవటం పెద్దమాట, కనీసం గుర్తించటం అయినా చెయ్యాలి. అది మన విధి. మనకు మనం చేసుకునే సాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here