[box type=’note’ fontsize=’16’] “సమాజంలో నిజానికి సూపర్ హీరోలుండరు. యెలాంటి మ్యాజిక్కులూ జరగవు. మన చుట్టూ వున్న అన్యాయాన్ని తలవొగ్గక నిలదీసే ప్రతివాడూ సూపర్ హీరోనే. ఇలాంటి చైతన్యం కలిగించడం వరకూ సినెమా సఫలమైనట్టే” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “భావేశ్ జోషి సూపర్ హీరో – సూపర్ హీరో” సినిమాని సమీక్షిస్తూ. [/box]
[dropcap]ఉ[/dropcap]డాన్, లూటేరా, ట్రాప్డ్ లాంటి చిత్రాలందించిన విక్రమాదిత్య మోత్వానె సినెమా అంటే ఆతృతగా యెదురు చూస్తాం. అందునా విక్రమాదిత్య మోత్వానే, అనురాగ్ కాశ్యప్, వికాస్ బహల్ (క్వీన్), మధు మంతెన కలిసి నిర్మించిన చిత్రం. మొదటి ముగ్గురూ బాగా పేరుపొందిన దర్శకులు మరి. అంతేనా? ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే కూడా విక్రమాదిత్య, అనురాగ్ కాశ్యప్‌లు కలిసి వ్రాశారు.
ఇన్ని కారణాలుంటే చిత్రం చూడకుండా ఆగే పనేనా? విక్రమాదిత్య తన మొదటి చిత్రం “ఉడాన్” తోనే చాలా గొప్ప దర్శకుడనిపించుకున్నాడు. యెలాంటి వంకా లేని, యెప్పటికీ నిలిచిపోయే చిత్రం అది. ఆ తర్వాత వచ్చిన లూటేరా ఓ హెన్రి కథ “ద లాస్ట్ లీఫ్” కు చాలా అందమైన చిత్రానువాదం. ఇక ట్రాప్‌డ్ కూడా ఒక హాలివుడ్ సినెమా చూస్తున్నట్లుంటుంది. అయితే ఇవన్నీ చెప్పుకున్నాక ఈ చిత్రం ఆ స్థాయిని అందుకోలేకపోయిందనే చెప్పుకోవాలి. సినెమా కథను అది విధించే పరిమితులను దృష్టిలో పెట్టుకుంటే అంతగా అనిపించదు.
మామూలుగా మనం యెన్నో సూపర్ హీరో చిత్రాలు అటు కామిక్స్ లోనూ, ఇటు తెర మీదా చూసి వున్నాము. సూపర్ మాన్, స్పైడర్ మాన్, బ్యాట్ మాన్ లాంటివీ, మన దగ్గర క్రిష్ లాంటివి, హాలివుడ్‌లో అవెంజర్స్, డార్క్ నైట్ లాంటివి. అయితే వీటిలో ఆ సూపర్ హీరొ చాలా శక్తిమంతుడుగా, మానవ సాధ్యంకాని విన్యాసాలు చేస్తూ అబ్బుర పరుస్తాడు, న్యాయం తరపున నిలిచి పోరాడి, గెలిచి మనకు వొకరకమైన రిలీఫ్ ని ఇస్తాడు. కాని ఇందులో సూపర్ హీరో మామూలు మనిషి, అసాధారణ శక్తులు లేనివాడు. వొకడు అనడం కంటే ముగ్గురు అనొచ్చు.
సమాజంలో నిజానికి సూపర్ హీరోలుండరు. యెలాంటి మ్యాజిక్కులూ జరగవు. మన చుట్టూ వున్న అన్యాయాన్ని తలవొగ్గక నిలదీసే ప్రతివాడూ సూపర్ హీరోనే. ఇలాంటి చైతన్యం కలిగించడం వరకూ సినెమా సఫలమైనట్టే. పాత్రలన్నీ చాలా సహజంగా వుంటాయి. దెబ్బలు తినే సూపర్ హీరోలు. అన్యాయం యెంత బలమైనదో అంచనా వేయలేని సూపర్ హీరోలు. చివరిలో కొంత సాగదీసినట్లు వుంటుంది. ముఖ్యంగా ఆ బైక్ చేసింగ్ అప్పుడు. కాసేపు యేమిటి, ఇతను హాలివుడ్ సూపర్‌హీరోలా చూపించాలనుకుంటున్నాడా అనవసరంగా అనిపిస్తుంది కూడా. ఇప్పుడు మీడియా యేవిధంగా పని చేస్తుందో, ప్రజలు యే విధంగా చాలా తేలికగా మోసగించబడుతున్నారో (ఫేక్ న్యూస్) ఇవన్నీ బాగానే చూపించాడు.
దర్శకత్వం, సినెమేటోగ్రఫీ చాలా బాగున్నాయి. అమిత్ త్రివేది సంగీతమూ పాటలు కూడా. ఇక నటన విషయంలోకొస్తే భావేశ్ గా చేసిన ప్రియాన్షు పాత్ర నిడివి చిన్నదైనా చాలా బాగా చేశాడు. గురి తప్పని బాణాల్లాంటి సంభాషణా చాతుర్యం, ఆ కళ్ళు, ఆ శరీర భాష, ఆఖరికి ఆ చిలిపి నవ్వు కూడా. వొకసారి అతను ఆవేశంలో సిక్కుని కొడతాడు. తర్వాత క్షమాపణలు చెప్పడానికి వెళ్తే సిక్కు ముక్కుకి బేండేజి వుంటుంది. యెంత అణుచుకుందామన్నా ఆపుకోలేని నవ్వు. ఆ సీన్ అలా గుర్తుండిపోతుంది. అతని నుంచి ఇంకా మంచి చిత్రాలు ఆశించవచ్చు. ఇక అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ కి ఇది రెండవ చిత్రం. మొదటి చిత్రం “మిర్జ్యా” లో కన్నా ఇందులో బాగా చేశాడు. కుర్ర చేష్టల నుంచి బాధ్యతాయుతుడుగా మారే క్రమంలో అన్నీ షేడ్స్ కనబరిచాడు. అదంతా దర్శకుడి చలవా, మరొకటా అన్నది ముందు ముందు తెలుస్తుంది. కాని ఈ చిత్రం వరకు మార్కులు ఇవ్వాల్సిందే. (ఇది యెందుకు అంటున్నానంటే ప్రభాస్, గోపీచంద్ నాకు “వర్షం” చిత్రంలో నచ్చారు; కాని తర్వాత అలాంటి నటన మరో చిత్రంలో కానరాలేదు!) నిషికాంత్ కామత్, ఇంకా ఇతర నటులు కూడా బాగా చేశారు.
మంచి చిత్రాలని ఇష్టపడే వాళ్ళు వొక సారి చూడాల్సిన చిత్రమే.