భవిష్యత్ దర్శనం

0
3

[box type=’note’ fontsize=’16’] ఉగాది 2022 సందర్భంగా సంచిక నిర్వహించిన కథల పోటీలలో బహుమతి పొందిన కథ. [/box]

[dropcap]సె[/dropcap]మినార్ జరుగుతున్న ఆ హాల్‌లో ఒక్కసారిగా కలకలం! ఈ కలకలానికి కారణం సైంటిస్ట్ శ్రీ వాత్సవ్ తను తయారుచేసుకొచ్చిన పత్రాన్ని సమర్పించబోతూ పలికిన పలుకులు. “2050 నాటికి రెండు కాళ్ళ మూగజంతువుల జాతిలోకి చేరబోతున్న మానవజాతి”.

“దయ ఉంచి నిశ్శబ్దంగా ఉండండి. నన్ను చెప్పనివ్వండి” అంటూ తన పత్రాన్ని సమగ్రంగా సంపూర్తిగా చదివి వినిపించాడు. సహజంగా ఏ సెమినార్‌లో అయినా ఒకరి తర్వాత మరొకరు తమ పత్రాలు చదివి నిర్వాహకులకు అందచేస్తుంటారు. కానీ శ్రీవాత్సవ్, నిర్వాహకులకు ఒక చిన్న అభ్యర్ధన చేశాడు. ‘దయ ఉంచి నేను సమర్పించిన ఈ పత్రంలో విషయాల గురించి సభకు విచ్చేసిన వారిలో ఎవరికైనా ఏమైనా సందేహలుంటే ప్రశ్నించడానికి అనుమతినీయగలరు’ అని చెప్పి తను సమర్పించిన పత్రంలో విషయం పై ఎంత సాధికారత ఉందో చెప్పకనే చెప్పాడు. దానికి నిర్వాహకులు అంగీకరించడంతో ఒక్కొక్కరుగా శ్రీవాత్సవ్ పై ప్రశ్నలు సంధించడం మొదలుపెట్టారు.

***

“ఏ ధైర్యంతో లేదా దేనిని ప్రాతిపదికగా చేసుకుని మీరు 2050 నాటికి రెండు కాళ్ళ మూగ జంతువుల జాతిలోకి చేరబోతున్న మానవజాతి అన్నారు” అని ఒకతను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా శ్రీవాత్సవ్ అతనికి ఒక చిన్న ప్రశ్నను సంధించాడు.

“డెడ్ ఏజ్ డుడో – ఈ వాక్యాన్ని మీరెప్పుడైనా విన్నారా?”

“ఈ వాక్యానికి నేనడిగిన ప్రశ్నకు సంబంధమేమిటి?” అతను తిరిగి ప్రశ్నించాడు.

“యెస్! ఉంది, ఖచ్చితంగా ఉంది.” చాలా నిబ్బరంగా సమాధానమిచ్చాడు.

“చెప్పండి మిస్టర్ శ్రీవాత్సవ్” అతను తిరిగి ప్రశ్నించాడు. “చెపుతున్నావినండి” అంటూ శ్రీ వాత్సవ్ చెప్పటం మొదలుపెట్టాడు.

“డుడో అనేది మారిషస్‌లో ఒకప్పుడు నివసించిన పక్షిజాతి. విన్నారు కదూ, ఒకప్పుడు అన్న పదాన్ని, అవును ఆ జాతి ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. దానికి కారణమేమిటో మీకు తెలుసా! ఒకప్పుడు హాయిగా, కులాసాగా, చక్కగా ఎగురుతూ ఆనందంగా జీవించిన ఆ పక్షిజాతి, తమకు కావలసిన ఆహరం నేలపైనే సమృద్ధిగా దొరకడంతో క్రమక్రమంగా అవి ఎగరడం మానివేసి చక్కగా నేలపై దొరికే ఆహరంతో జీవించసాగాయి. అలా అవి నేలపై దొరికే ఆహారానికి ఎంతగా అలవాటు పడ్డాయంటే అవి పూర్తిగా ఎగరడాన్నే మరిచిపోయేటంతగా. అదుగో అప్పుడే వాటికో కష్టం వచ్చిపడింది, అదేంటంటే మారిషస్ ఒక అందమైన ప్రకృతి శోభతో అలరారే ప్రాంతం,అందుకే మారిషస్ పర్యాటక సందర్శన ప్రాంతంగా మారడంతో తరచుగా పర్యాటకులు మారిషస్ సందర్శించడమే కాకుండా అక్కడే నేలపై తిరుగాడుతున్న ఆ చక్కటి డుడో పక్షులను పట్టుకుని కాల్చి తినడం మొదలుపెట్టారు. పాపం అవి ఆ పర్యాటకుల బారినుండి తప్పించుకుని ఎగిరిపోదామనుకుంటే అవి ఎగరడం ఎలాగో పూర్తిగా మరిచిపోవడంతో సునాయసంగా ఆ పర్యాటకుల చేతికి చిక్కిపోయేవి. అలా క్రమేణా ఆ జాతి జాతి అంతా అంతరించిపోయింది. అదుగో అప్పటినుంచే కాలంతో బాటు మారకుండా మిగిలిపోయే వారిని ఉద్దేశించి ‘డెడ్ ఏజ్ డుడో’ అంటారు. ఇప్పటికైనా అర్థమై ఉంటుంది, నేను ఎందుకు ఈ వాక్యాన్ని ఉదహరించానో” అని ముగించాడు.

“కాలంతో మారే కదా, మొబైల్ లోకంలో ప్రయాణిస్తున్నాం” తిరిగి అతను అందుకున్నాడు.

“అదే నేను చెప్పేది, కాలంతో మారండి కానీ మనకు ఉండే సహజ లక్షణాలను పూర్తిగా విడిచిపెట్టేసి కాకుండా, అలా విడిచిపెట్టేసి డుడో జాతి ఏమైందో చూసారు కదా” సమాధానమిచ్చాడు శ్రీవాత్సవ్.

ఈ లోపు ఇంకొకతను అందుకున్నాడు. “ఈ ఒక్క అంశంతో జనరలైజ్ చేసేస్తారా?” ప్రశ్నించాడు.

“మరొక ఉదాహరణ చెపుతాను, వినండి. మీ అందరికీ ఈ విషయం తెలిసిన విషయమే, హైదరాబాద్ నెహ్రూ జుయాలజికల్ పార్క్‌లో జరిగిన యథార్థ సంఘటన. ఒక్కసారి ఆలకించండి” అంటూ ఇలా చెప్పుకుపోయాడు.

“హైదరాబాద్ నెహ్రు జుయాలజికల్ పార్క్‌లో సింహాలను ఉంచే ఫెన్సింగ్ లోకి మందుసేవించిన మత్తులో ఉన్న ఒకతను ప్రవేశించాడు. కానీ అక్కడున్న సింహం అతనిని ఏమీ చేయలేదు, ఈ లోపు సింహాలను సంరక్షించే అతను వచ్చి మత్తులో ఉన్న అతనిని రక్షించి తీసుకురావటం జరిగింది. అపుడు ఎందుకు ఆ సింహం అతనిని ఎటాక్ చేయలేదు అనే విషయాన్ని నిశితంగా పరిశోధిస్తే తెలిసిన విషయమేంటో మీకు తెలుసా? ఆ సింహాన్ని చిన్న పిల్లగా ఉన్నప్పుడే వేరొక చోట నుండి తేవటం, తరువాత దానికి రోజూ మాంసం ముక్కలు ఒక గిన్నెలో తీసుకెళ్ళి పెట్టడం అలవాటు చేయడంతో దానికి సహజసిద్ధమైన వేటాడమనే స్వభావమే లేకపోవడంతో, మందు మత్తులో మునిగిపోయి ఆ ఫెన్సింగ్ లోకి ప్రవేశించిన అతనిని ఏమీ చేయలేదని తెలిసింది”.

“ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో, మీ అందరికీ తెలిసిన విషయమే, డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం. కోతినుంచి మానవుడు పుట్టాడని చెప్పుకుంటున్నాం. కోతికి ఉండే తోక మానవుడికి లేకపోవడం పరిణామ క్రమంలో దానిని ఉపయోగించడం తగ్గించివేయడమే. అంతేకాదు జిరాఫీ మెడ అంత పొడవుగా సాగడానికి కారణం కాలక్రమంలో చెట్లు ఎదిగిపోవడంతో, ఆకులు అందుకునే నిమిత్తం వాటి మెడ బాగా సాగాయని మనకు తెలిసిన విషయమే. అంతెందుకు కుట్టించుకున్న చెవులలో గానీ, కుట్టించుకున్న ముక్కులో గానీ ఏమీ ఉంచకుండా కొంతకాలం ఉంచితే ఏమవుతుందో మీకు తెలుసు, ఆ రంధ్రం పూడుకుపోతుంది. యెస్! ఈ విషయాలన్నింటినుంచి మీకిప్పటికే నా ఆవేదన దేనికో అర్థం అయే ఉంటుందని భావిస్తున్నాను” అంటూ కాస్త విరామం తీసుకున్నాడు.

***

“ఇంతకీ మీ ఉద్దేశమేమిటి? మనం కొంతకాలానికి మూగజీవులుగా తయారవుతామంటారా?” మరొకతను ప్రశ్నించాడు.

“అక్కడికే వస్తున్నా. ఇప్పటికే మనం మాట్లాడటం బాగా తగ్గించేసాము. ఎంతసేపూ మొబైల్‌లో చాటింగ్, అదీ మెసేజ్ చేస్తూ గడపడమే, ఒక పండగైనా, పబ్బమైనా, శుభ సందర్భమైనా, అశుభ సందర్బమైనా మెసేజ్ లకే పరిమితమైపోయాం. బంధువులతో గానీ, మిత్రులతోగానీ ఆప్యాయంగా పలకరించుకోవటం గానీ, ఆత్మీయంగా మాట్లాడుకోవటంగానీ మరిచిపోయాం. ఈ మొబైల్‌కి ఎంతగా అడిక్ట్ అయిపోయామంటే ఇంటి దగ్గర కూడా క్షణం దానిని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాం. మనం మన తల్లితండ్రులతో ఎంత సేపు మాట్లాడుతున్నాం? అంతెందుకు మనం, మనం కట్టుకున్న భార్యతోగానీ, మన పిల్లలతో గానీ పట్టుమని పదినిమిషాలు మాట్లాడే సందర్భాలు ఉంటున్నాయా? సహజసిద్ధమైన పలకరింపులు కూడా మరిచిపోయి ఎవరికివాళ్ళం మొబైల్స్‌లో మునిగితేలుతున్నాం. ఇక అన్నతమ్ముల మధ్య, అక్కచెళ్ళెళ్ళ మధ్య సంభాషణల రూపంలో సంబంధాలను ఎంతవరకు నిలుపుకుంటున్నాం అనే విషయమే చూస్తే చెప్పక్కర్లేదు, చాలాచాలా తగ్గించేసాం! ఇలా మాట్లాడటం పూర్తిగా తగ్గించేసుకుని మెసేజ్ లకే పరిమితమైతే పైన చెప్పినట్లు జరిగినట్లుగా కాలక్రమంలో స్వరపేటిక వాడుక తగ్గిపోవడంతో స్వరపేటిక మూసుకుపోవడంలో వింతేమి ఉంది. అప్పుడు రెండు కాళ్ళ మూగజంతువులకి మనకి తేడా ఏముంది? మీకు ఇప్పుడు ఎంతో అతిశయోక్తిగా అనిపించవచ్చు, అలాగే అసంబద్ధంగా అనిపించవచ్చు కానీ మనం ఇదే విధంగా మాటలాడటం మరిచిపోయి మెసేజ్ లకే పరిమితమైపోతే ఖచ్చితంగా ఏదో ఒకనాటికి రెండుకాళ్ళ మూగజంతువుల కోవలోకి చేరటం తథ్యం. ఎప్పుడైనా అనుకున్నామా, రెక్కలు ఉండి ఎగరటం తెలిసిన ఒక పక్షి కొంతకాలానికి ఎగరటమే మరిచిపోయి తన చావు తాను కొనితెచ్చుకుంటుందని?

చివరగా మిమ్మల్ని భయభ్రాంతులను చేయటానికో, లేనిపోనివాటిని ఊహించేసుకోమని చెప్పటమో కాదు నా ఉద్దేశం. ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ ఉండకపోవచ్చు,కానీ ఇప్పటికైనా మేలుకోకపోతే జరిగేది మాత్రం అదే అని చెప్పటం నా ఉద్దేశం. యాంత్రిక జీవనానికి అలవాటుపడితే బతుకు నిస్సారంగా గడిచిపోతుంది, అంతేకాదు ఆ జీవితానికి ఓ అర్థం, పరమార్థం ఉండబోదు. అందుకే మాట్లాడుకుందాం, కలిసి మాట్లాడుకుందాం, మనసులు కలబోసుకుందాం, మనఃస్ఫూర్తిగా మనసువిప్పి మాటలతో బంధాలను, బంధుత్వాలను, మితృత్వాలను ఆప్యాయతలను, ఆత్మీయతలను పంచుకుందాం. ఆ దిశగా పయనిద్దాం, రండి”

కరతాళధ్వనులతో సెమినార్ హాల్ ఆడిటోరియమ్ మార్మోగింది, శ్రీ వాత్సవ్ మాటలకు మద్దతుగా…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here