భయానకమైనది పరధర్మాననుష్ఠానం

0
1

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘భయానకమైనది పరధర్మాననుష్ఠానం’ అనే రచనని అందిస్తున్నాము.]

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥

(భగవద్గీత 3వ అధ్యాయం, 35వ శ్లోకం)

[dropcap]చ[/dropcap]క్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా, గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది; స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే; కానీ, పరధర్మం మాత్రం భయంకరమైనది అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.

ఇక్కడ ధర్మం అంటే ‘ప్రవృత్తి’ లేదా ‘స్వభావం’ అని అర్థం. సహజంగా మన ప్రవృత్తికి తగ్గ పనులే చెయ్యాలని ఈ శ్లోకం చెప్తుంది. ఇది ఒక మంచి మేనేజ్‍మెంట్ అంశం కూడా.

మనలో పుట్టకతో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి, వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. అదే స్వధర్మం అవుతుంది. మనం జన్మించిన కులం, మతం ఆధారంగా కూడా కొన్ని పద్ధతులు మన జీవితంలో ప్రవేశిస్తాయి. అయితే ఇతరులకు నిర్దేశించబడినవి, వాటితో మనకు ఎంత మాత్రం సంబంధం లేనిది పరధర్మం అవుతుంది.

మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం మరియు ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం పరధర్మపాలన అవుతుంది అని శాస్త్రం నిర్వచించింది..

వ్యవహారిక భాషలో చెప్పాలంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. పులి జీవితంలా నక్క జీవితం ఉంటే నక్కకే నష్టం. నక్క దశలో వున్నప్పుడు నక్కలానే జీవించాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఒక నక్క పులిలా జీవించదానికి ప్రయత్నిస్తే అధోగతి తప్పదు. ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది.

పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది. సదా, సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం! స్వధర్మపాలనలో మరణం సంభవించినా మేలే! మరోకరిలా నటించటం కన్నా మనం మన లాగే ఉండటం ఏంతో ఆనందదాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది.

మనం చేస్తున్న ఉద్యోగం ఊడకుండా ఉందంటే అందులో మనకి సామర్థ్యం ఉన్నట్టే. కనుక అదే స్వధర్మం అనుకుని దానిని ప్రేమించడమే. అప్పుడు మనశ్శాంతి తోడుగా ఉంటుంది.

పరమాత్మ ఉవాచ సారం అయిన  ‘శ్రేయాన్‌ స్వధర్మో విగుణః’.. నీవు చేపట్టిన వృత్తిలో ఆదాయం తక్కువ ఉండొచ్చు. ఇంకో వృత్తి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి పెట్టవచ్చు. కానీ నీవు చేపట్టిన వృత్తికి న్యాయం చేయాలి, నీకు ప్రావీణ్యం లేని ఇంకొక వృత్తి అది ఎంత ఎక్కువ ఆదాయం తెచ్చినా అందులో వేలు పెట్టకు అని గరికపాటి వారి వ్యాఖ్యానం అందరికీ ఆచరణీయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here