భయం

0
3

[యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘భయం’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

భయం మనసు యొక్క ఉత్పత్తి! భయపడే కొద్దీ పెరిగిపోతుంది. దానిని గమనించడం ప్రారంభిస్తే అది తోక ముడుస్తుంది! – స్వామీ తత్త్వవిదానంద

***

అప్పుడు మా అన్నయ్య డిగ్రీ, నేను ఇంటర్ చదువుతున్నాం. ఆ రోజు శివరాత్రి. మా నాన్నగారు మా ఊరి శివాలయం పూజారి. అర్ధరాత్రి లింగోద్భవం వరకూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అందరం ఇంటి కొచ్చాం. నాన్నగారికి హార్ట్ ఎటాక్. శ్రీధర్ మామ నాన్నగారిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. లాభం లేదు. శివునిలో ఐక్యమయ్యారు.

దహన సంస్కారాలు పూర్తయ్యాయి. అన్నయ్య తల కొరివి పెట్టాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మా అమ్మ గారు మాతో “మహానుభావులు మీ తండ్రి. పర్వదినాన శివునిలో లీనమయ్యారు. కోటికి ఒక్కరు కూడా పొందలేని గతి. అలాంటి వారికి కూడా తీరని కోరిక ఒకటుంది. ఒక్కసారైనా హరిద్వార్ – ఋషికేశ్ యాత్ర చెయ్యాలని. తీరకుండానే తనువు చాలించారు. వారి అస్థికలైనా గంగలో నిమజ్జనం చేస్తే మీరు పితృ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. కానీ.. మీరు మన ఊరు దాటి ఎక్కడికి ప్రయాణం చెయ్యలేదు. ఎలా” అన్నారు.

“నాన్నగారి ఆకాంక్ష నేను నెరవేర్చుతానమ్మా! ఋషికేశ్ వెళ్లి అస్థికలు గంగమ్మలో నిమజ్జనం చేస్తాను.” అన్నాను. నా దైర్యానికి నాకే ఆశ్చర్యం వేసింది!

విషయం తెలిసిన శ్రీధర్ మామ బెజవాడ వరకూ సింహాద్రి, అక్కడినుండి హరిద్వార్‌కు డెహ్రాడూన్ సూపర్ ఫాస్ట్ లోనూ, మళ్ళీ ద్వాదశ కర్మ నాటికి తిరుగు ప్రయాణానికి రిటర్న్ టికెట్స్ కూడా రిజర్వ్ చేశాడు.

మూడో రోజు చిన్న కర్మ సందర్భంగా అస్థికలు ‘సంచయనం’ చేసి, ఆ కలశాన్ని బాగ్‌లో పెట్టుకుని రెడీగా వున్నాను. శ్రీధర్ మామ నా బట్టల బాగ్ తీసుకుని తన లాంబ్రెట్టా స్కూటర్ వేసుకుని వచ్చి, నన్ను ఎక్కించుకొని రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు తీసు కొచ్చి సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కిస్తూ “జాగ్రత్త రా అల్లుడూ! రైల్వే స్టేషన్‌లలో.. రైల్లో కూడా జేబు దొంగలుంటారు. ప్రయాణంలో ఎవరినీ అంటే నీ సహ ప్రయాణీకులను కూడా నమ్మొద్దు! ఎవరేమి పెట్టినా తినవద్దు!” అంటూ అనేక జాగ్రత్తలు చెప్పాడు.

అప్పటి వరకు భయం అంటే ఏమిటో తెలియని నాకు ‘దొంగ’ భయం పెట్టాడు మావయ్య!! ట్రైన్‌లో కూర్చున్నా నే గానీ సెనక్కాయలు అమ్ముకొనే ముసలవ్వ దగ్గర్నుంచి భిక్ష మెత్తు కొనే మామ్మ వరకూ,.. అంతెందుకు టికెట్ చెకింగ్ వారు, అప్పుడప్పుడు వచ్చే పోలీస్ వరకూ.. అందరూ దొంగల్లాగే కనిపిస్తున్నారు. డబ్బులున్న నా పాంట్ సీక్రెట్ పాకెట్ అప్పుడప్పుడు తాకి చెక్ చేసుకుంటున్నాను.

విజయవాడ స్టేషన్‌లో దిగి పదో నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు వెళ్లి ఒక చోట కూర్చున్నాను. ఆ ప్లాట్‌ఫామ్ మీద తిరుగుతున్న వారందరూ నాకు దొంగల్లా తోస్తున్నారు. నాలాంటి మామూలు మనిషి ఒక్కడూ కనిపించలేదు.

పావు తక్కువ ఐదు గంటలకు మదురై – డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అందులోనూ అందరూ దొంగాల్లాగే కనిపిస్తున్నారు. నా బోగీలో ముగ్గురు సన్యాసులు కూడా వున్నారు. వాళ్ళు ముగ్గురూ అందరి కంటే పెద్ద దొంగల్లా కనిపిస్తున్నారు నాకు బవిరి గెడ్డాలు, మీసాలతో! నా కర్మ కొద్దీ నా ఎదుటి బెర్త్ మీద ఒక పెద్ద సన్యాసి, తమిళం, ఇంగ్లీషుల్లో తెగ మాట్లాడుతున్నాడు! అతని సంచీలో కత్తి గానీ పిస్తోలు గానీ వుండే వుంటుంది. అతను నన్నే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. నేను నా లోనికి కుంచించుకు పోతున్నాను భయంతో!!

నాకు తెలీని భాషలో మాట్లాడేస్తున్నా, సడెన్‌గా తెలుగులో “బాబూ ఎక్కడి దాకా ప్రయాణం?” అడిగాడు.

“ఋషికేశ్!” చెప్పాను

“ఒంటరిగా వెళ్తున్నావేం? భయంగా లేదా?” అడిగాడు. ఇంటి లోంచి పారిపోయి వచ్చిన బాపతుగా భావించి వుంటాడు.

“మా నాన్నగారు శివాలయంలో పూజారి. శివరాత్రి రోజున శివ సాన్నిధ్యం పొందారు. వారి అస్థికలు గంగలో నిమజ్జనం చేయాలని మా అమ్మ గారి ఆశయం. మా అన్నయ్య ఇంటి దగ్గర కర్మలు చూసుకుంటున్నాడు. నేను ఒంటరిగా బయలుదేరాను. మా మావయ్య చెప్పిన ప్రకారం రైల్వే స్టేషన్లో, ట్రైన్లో అందరూ దొంగలే కనిపిస్తున్నారు. అందరిలోనూ మీరు దొంగల నాయకుడిలా కనిపిస్తున్నారు.” చెప్పాను.

ఆ సన్యాసి అదోలా నవ్వాడు. ఎందుకో ఆ నవ్వు నాకు చాలా నచ్చింది!

“చూడూ! నేనూ.. స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతి. ఋషికేశ్ ఆర్ష విద్యా పీఠంలో వేదాంత శాస్త్రం బోధిస్తాను. నన్ను ఒక ఆత్మీయుడిగా భావించు. అప్పుడు నాలో కనిపిస్తున్న దొంగ మాయమై పోతాడు. దొంగ అంటే భయం ఉన్నవాడికి అందరూ దొంగల్లా, దెయ్యం అంటే భయం ఉన్నవాడికి అన్నీ దెయ్యాల్లా, పాము అంటే భయమున్నవాడికి అన్నీ పాముల్లా కనిపిస్తాయి. భవిష్యత్తు అంటే రేపటి గురించి ఆలోచిస్తే భయమే కలుగుతుంది. తాడులో పామును చూస్తే అన్యదా గ్రహణం భయమే మరి! నీ భయం నీ మనసు యొక్క ఉత్పత్తి. నీకంటే అన్యంగా ఏదో వుందనే భావనే భయం! నీ మనస్సు చెప్పేది సత్యమని చెప్పడానికి ప్రమాణం లేదు. గుణ దోషములు వస్తువులలోనో, నీ ఎదుటి నామ రూపాల్లోనో లేవు. నామ రూపాలు చూడడం మానేసి వాటి తత్వాలను చూడాలి! మనస్సును చంపెయ్యకూడదు. దాన్ని నీవు ఉపయోగించుకోవాలి! మనస్సు నిన్ను ఉపయోగించుకున్నపుడే ఈ భయాలు! అసలు నీవు తప్ప రెండోది లేదు. నీవు చూస్తున్నవి, వింటున్నవి, భావన చేస్తున్నవి. అన్నీ నీ లోపలే వున్నాయి. నీ లోపల వున్న వాటినే నీ బయట నీవు చూస్తున్నావు! నీ మనసును నీవు గమనించు, అలా గమనిస్తూ వుంటే ఈ నామ రూపాలు ‘మాయ’ అని తెలుస్తుంది. భయాలన్నీ తొలగిపోతాయి!!”

రాత్రి పది గంటలు కావస్తుంది. రైలు రామగుండంలో ఆగింది. స్వామీజీ రైలు దిగి రెండు పొట్లాలు ఇడ్లీలు తెచ్చి ఒకటి నాకిచ్చి “అనుమానాలేమీ పెట్టుకోకుండా ఇవి తిని ప్రశాంతంగా నిద్రపో! ఋషికేశ్‌లో నీ పనులన్నీ నేను పురమాయించి నిన్ను తిరిగి హరిద్వార్‌లో రైలు ఎక్కించే ఏర్పాటు నేను చేస్తాను.” అన్నారు.

నాకు చాలా ప్రశాంతంగా బావుంది. మా నాన్నగారు నేర్పించిన శ్లోకం గుర్తొచ్చింది.

‘అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాక యా! చక్షురున్మీ లితం యేన తస్మై శ్రీ గురవే నమః!!’

– స్వస్తి –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here