Site icon Sanchika

భయమేస్తోంది..!!

[dropcap]అ[/dropcap]క్షరాలు
నా అందుబాటులోకి రావటంలేదు
అలిగాయో ఏమో
పిలిచినా పలకకుండా పట్టించుకోకుండా
అల్లంత దూరంలో ఉండి
నన్నో ఆటాడుకుంటున్నాయి

పదాలుగా మారమని
పాదాలలో అనువుగా ఒదగమని
పదేపదే ప్రాధేయపడితే కానీ
తమ పంతం వీడటంలేదు
నా మాట వినడంలేదు

యతిప్రాసల సంగతులు లేని
వచనకవిత్వపు వరుసపంక్తులలో
గతి తప్పకుండా ఒదగమంటే
శ్రుతి తప్పిన నాదంలా
నెత్తిన నొప్పిని తెచ్చి పెడుతున్నాయి

భావాలకు తగ్గ రూపంలో వేషం కట్టడంలేదు
అలంకారానికి అనువుగా కూర్చోవటం లేదు
సుందరమైన శబ్దంగా రూపుదిద్దుకోవడంలేదు
అర్థం వివరింపనీయకుండా
అనర్థపు పెడర్థాల ఛాయలోకి
అమాంతంగా ఆసాంతంగా జారిపోతున్నాయి

మాధుర్యపు పానీయంగా మార్చే
నా ప్రయత్నాన్ని వమ్ముచేస్తూ
కటువైన కషాయంగానో
విస్మరించలేని విషంగానో మారిపోతున్నాయి

ఇదేమైనా
‘కవిత’ చేసిన కుట్ర కాదుకదా
పదిమంది ముందు
‘కవి’గా గొప్పలు పోయే నాకు
తానేమిటో
తన విలువేమిటో తెలియజెప్పేందుకు

ఏమిటో,
అక్కడక్కడా అగుపిస్తున్నాయి
‘కవిత’ కోపగృహాన్ని చేరిన చిహ్నాలు

కైకలా తగని కోర్కెలు కోరుతుందేమో ?
సత్యభామలా తన్ని‌ విసిరికొడుతుందేమో ??
భయమేస్తోంది..!!!

Exit mobile version