[dropcap]ర[/dropcap]విచంద్ర ఇంట్లోకి అడుగుపెడుతూనే తువ్వాలు అందుకుని బాత్‍రూంలోకి దూరాడు.
హాలో కూర్చున్న అతని తండ్రి సదాశివం “ఏమిటీ వీడీకీ రోజు శుచీశుభ్రం ఒక్కసారిగా గుర్తుకొచ్చినట్టున్నాయి” అంటూ వ్యంగ్య బాణం విసిరాడు.
“మీకు ఎప్పుడూ ఎకసెక్కాలే తప్ప పనిలేదా” అంది రాజ్యం విసుగ్గా మొహం పెట్టి.
“నేనేమన్నా? అయినా తల్లిప్రాణం కదా” అని అమాయకపు ముఖం పెట్టాడు.
బయటికొచ్చిన రవి తల తుడుచుకుంటూ “అమ్మా! కాస్త కాఫీ యివ్వు” అన్నాడు.
అప్పుడే అక్కడికొచ్చిన శాంత “నేనిస్తానత్తయ్యా” అంటూ వంటగదిలోకెళ్ళింది.
“ఇదో పతిసేవ లాగుంది” అన్నాడు సదాశివం.
“ఉష్! మీ నోరెలా మూయించాలో తెలీడం లేదు”
సదాశివం చిత్రమైన మనిషి. ప్రతిదానికీ వక్రంగా మాట్లాడుతూ వెటకారంగా స్పందించటం అతని స్వభావం. లోపలేముందో, ఏం లేదో ఎవ్వరికీ తెలీదు – అందుకే ఇంట్లో ఎవ్వరూ అతని మాటలు పెద్దగా పట్టించుకోరు ఒక్కొక్కసారి అప్రియమైన సత్యం ఎదుటివారిని సూటిగా తగిలే ప్రమాదం వుంటూనే వుంటుంది.
“ఏమిటి అలా వున్నారు? ఏమైంది?” అంది శాంత నెమ్మదిగా.
“ఏం లేదు ట్రాఫిక్ జామ్‍లో ఇరుక్కుపోయా గంట” అన్నాడు కాఫీ అందుకుంటూ రవి.
ఇంతలో హరీష్ “నాన్నా! నువ్వు బస్‍లో వచ్చావు కదా! నేను చూశా” అన్నాడు అప్పుడే అక్కడికొచ్చి.
“అదేమిటీ? బండేమైంది?” అంది శాంత.
“అది ఎంతకీ స్టార్ట్ కాలేదు. మెకానిక్ దగ్గర వదిలాను” అంటూ గదిలోకెళ్ళిపోయాడు.
శాంత కొడుకువైపు సీరియస్‍గా చూస్తూ “నువ్వు బట్టలు మార్చుకుని కాళ్ళుచేతులు కడుక్కో. ఎన్నిసార్లు చెప్పాలి?” అంది.
“ఒరేయ్! మీ నాన్నని చూసి నేర్చుకో” అన్నాడు సదాశివం.
రాజ్యం విసుగ్గా “సర్లెండి. ఒరేయ్ చిన్నా! స్కూల్‍నుంచి రాగానే కాళ్ళుచేతులు కడుక్కోవాలని అప్పుడేదైనా తినాలని ఎన్నిసార్లు చెప్పా”
“ఇంకా ఒకటి మర్చిపోయావ్ బామ్మా! బట్టలు మార్చుకోవాలనీ” అంటూ వెక్కిరించి లోపలికెళ్ళిపోయాడు.
శాంత గదిలోకెళ్ళింది. రవి మంచం మీద పడుకుని వున్నాడు. మోచేయి కళ్ళకి అడ్డంగా పెట్టుకున్నాడు. ఆమె అతని దగ్గరగా వెళ్ళింది.
“ఏమైంది? అదోలా వున్నారు” అంది.
“ఏం లేదు. చిరాకు ఈ ఊరి ట్రాఫిక్ చూస్తే”
ఆమె నిశితంగా అతన్నే చూసి “మీరు ఆఫీసులో పార్టీ అని వెళ్ళారు. ఉదయమే వస్తాలే అన్నారు. కానీ నాకు మాత్రం అర్ధరాత్రి దాటాక వచ్చేస్తారనిపించి, ఎంతో చూశాను” అంది.
“ఏమిటో ఫ్రెండ్స్ కదలనీయలేదు. ఎప్పుడో ఒకసారి కదా పార్టీ అంటూ వదల్లేదు”
“టిఫిన్ తెస్తాను” అంటూ లోపలికెళ్ళింది. అతనికళ్ళలో ఒక అసహన భావం తళుక్కున మెరిసి మాయమైంది.
రవి చూడటానికి చాలా బుద్ధిమంతుడే. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. చెల్లెలు రమ వున్నప్పటికీ మగపిల్లడి హోదా రవిచందర్‍కే కదా దక్కేది. అతను పైకి కనిపించినదానికి విభిన్నమైన మరొక వ్యక్తి లోపలున్నాడని ముందుగా గ్రహించింది తల్లి రాజ్యం. పైకి నెమ్మదస్తుడుగా కనిపించినా లోపల ఒక విచ్చలవిడితనం వుందనిపిస్తుంది. అయినా ఒక్కడే వంశోద్ధారకుడు. అందుకే ఎంతో ముద్దు. అతనిమీద ఈగవాలనియ్యదామె. సదాశివం అందర్ని ఆటపట్టిస్తాడు కనుక అతని మాటలెవ్వరూ పట్టించుకోరు.
***
మర్నాడు త్వరగా తయారై ఆఫీసుకని బయలుదేరాడు రవిచంద్ర. వెళ్తూ “బండి లేదు క్యారేజి వద్దు” అంటూ బయటపడ్డాడు.
“రవీ! బండి త్వరగా తెచ్చేసుకో. మెకానిక్ దగ్గర ఎక్కువ రోజులుంచితే పార్టులు తీసేస్తారు” అంటూ అరిచాడు సదాశివం.
“సరే” అన్నాడు ఆశ్చర్యంగా, తండ్రి తిన్నగా మాట్లాడేసరికి అతనికి వింతగా అనిపించింది.
రవిచంద్రకి తల్లి అంటే ఎంతో భక్తి. ఆమెకి తనంటే ప్రాణమనీ తనేం చెప్పినా ఆమె ఆమె క్షణాలమీద చేస్తుందని మహా యిష్టం. తండ్రిని చూస్తే చచ్చేంత భయం. ఏ మూలనుంచి ఏ పోటుకు మాట విసురుతాడో అని బిక్కుబిక్కుమంటూ వుంటాడు. అతను అనుకున్నదానికి భిన్నంగా రాజ్యం ఆ రోజు లేచిన దగ్గరనుంచి సాధిస్తూనే వుంది “కొత్త బండి! బోలెడు డబ్బుపోసి పైగా లోను పెట్టి కొన్నది. నెలనెలా బిళ్ళకుడుముల్లా వేలకి వేలు చెల్లిస్తున్నాం. శ్రద్ధలేదు” అంటూ స్వగతంగా మాట్లాడుకుంటూనే పనిచేసుకుంటూ పోతున్న తల్లిని చూస్తే రవికి మొదటిసారి భయమేసింది.
మూడు రోజులైంది రవి బండి తెచ్చుకోలేదు. రోజు ఆఫీసుకు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక వెర్రివాలకం పడిపోయింది. శాంతా ఆందోళన పడుతోంది. ఏదో వుందని, బయటపడటం లేదని ఆమెకి అర్థమైందిగానీ, అసలు సంగతి గ్రహించలేకపోయింది.
రవికి గడ్డం పెరిగింది, కళ్ళు లోతుకు పోయి ముఖం పీక్కుపోయింది. ఎన్నిసార్లు అడిగినా “ఏం లేదు బండీకి రిపేరన్నాడు అంతే” –
ఆ రోజు లేస్తూనే సదాశివం ఆలోచనలో పడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకుని కాఫీ తాగి కుర్చీలో కూర్చుని ఒక్కక్షణం కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఆలోచనలో మునిగిపోయాడు. అదీ అయిదు నిమిషాలే. కళ్ళు తెరిచి లేచాడు ఎంతో నెమ్మదిగా వ్యంగ్యం లేకుండా కొడుకు దగ్గరకెళ్ళి “ఏరా! రవీ! బండి లేకుండా ఇబ్బంది పడుతున్నావు. బయట భోజనం ఎక్కువ రోజులు పడదు జాగ్రత్త” అన్నాడు.
తండ్రి అలా మామూలు మనిషిలా మాట్లాడేసరికి రవికి ఎక్కడలేని అభిమానం, ప్రేమ ఒక్కసారి పొంగివచ్చాయి. ఎప్పుడూ లేనిది ఆయనొక ఆపద్భాందవుడిలా కనిపించాడు. నాన్న మంచివాడే. నేనంటే ప్రేమ అనిపించింది. దానికితోడు మూడురోజులుగా తల్లి సాధింపు అతన్ని తెగ బాధిస్తోంది. రవి కొంచెం సముఖంగా కనిపించేసరికి, కొడుకు చెయ్యి పుచ్చుకుని వాళ్ళ బెడ్‍రూంలోకి తీసుకునివెళ్ళి “నాయినా రవీ! ఏదైనా ప్రాబ్లమ్ వుంటే నాతో చెప్పరా. ఏదో అస్తమానూ వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడతానని నన్ను శత్రువులా చూడకు. ఎలాంటి సమస్యైనా ఫరవాలేదు. చిటికెలో పరిష్కరించుకుందాం. నువ్విలా డల్‍గా ఉంటే చూడలేనురా” అన్నాడు చివరిమాటల్లో గొంతు గరగరమంది. రవి నీరుకారిపోయాడు. కళ్ళలో నీరూరింది. ఉక్కపోతలో గిజగిజపాడిపోతున్నవాడికి చల్లటి ఫ్యానుగాలి తగిలినట్లయింది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్లయి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు.
నాలుగు రోజుల క్రితం మిత్రులందరూ బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సందర్భం ఏమిటంటే బాగా డబ్బున్న భాస్కర్ బర్త్‌డే. ఆ రాత్రి పదిమందీ చాలా యిష్టంగా, కష్టపడి బెస్టయిన గెస్ట్ హౌస్ బుక్ చేసుకుని రంగంలోకి దిగారు. అందరూ మధ్యతరగతి వాళ్ళే. తిండి, మందు తప్ప మరొకటి వుండకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఖరీదైన మందు బాటిల్స్ బాటిల్స్ ఖాళీ చేసి పారేశారు. స్పృహ తప్పేవరకు తాగి తందనాలాడారు. ఒళ్ళు మరచిన మత్తులో జోగారు.
తెల్లారి పదిగంటల వరకు లేవలేదు. ఒక్కొక్కళ్ళు లేచి కాస్త ముఖం కడుక్కుని బయలుదేరారు. రవికూడా పదిన్నర వరకు లేవలేకపోయాడు. అదృష్టం ఆరోజు శలవురోజు అని చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరాడు.
రూం బయటికి రాబోతు బాటిల్ చివరగా మిగిలిన ఒక పెగ్ నోట్లో పోసేసుకుని, బండి తీశాడు రవి. మత్తుగా ఏం లేదుగానీ, హాయిగా, ఉషారుగా అనిపించింది.
అతని దురదృష్టం కొద్దీ పోలీస్ స్క్వాడ్ ‘బండాపు’ అంటూ చెక్ చేశారు. తాగి బండి నడుపుతున్నాడని కేస్ బుక్ చేసి స్కూటర్ తీసుకెళ్ళిపోయారు.
ఒంటిగంటవరకు ఎంత తంటాలుపడిన పోలీసులు లొంగి రాలేదు. వాళ్ళు చెప్పింది ఒకటే “మీ తల్లిదండ్రుల్ని తీసుకుని రండి. అప్పుడు ఫైన్ కట్టి మీ వెహికల్ తీసుకుపొండి” అని అదేమాట మీద నిలబడిపోయారు. వస్తూ వస్తూ కక్కుర్తిగా నోట్లో పోసుకున్న నాలుగుచుక్కలు అతనికిప్పుడు చుక్కలు చూపిస్తున్నాయి.
“వారు లేకపోతే….” అన్న తెలివి ప్రశ్నది.
“డెత్ సర్టిఫికేట్లు తీసుకురండి”
“ఎప్పుడో….”
ఇంకా ఏదో చెప్పబోతే “వెళ్ళు వెళ్ళవయ్యా పనిచూడు” అన్నాడు చీత్కారంగా.
అయినా రవికి అమ్మానాన్నా వున్నారు.
“ఎవర్నో తీసుకొచ్చి అమ్మా – నాన్నా అంతే చీటింగ్ కేసులో లోపలేస్తా” అన్నాడో కొంటె పోలీసు.
భార్యని తీసుకురమ్మంటే అయిదు నిమిషాల్లో కాళ్ళవేళ్ళాపడి, భయపెట్టి, బతిమాలి తీసుకొస్తారని వాళ్ళకి తెలుసు.
మందు తాగినట్లు పోలీసులకు పట్టుపడి అమ్మా, నాన్నల దగ్గర తలెత్తుకుని ఎవడైనా, ఎలా నిలబడగలడు అని వాళ్ళ అభిప్రాయం. అందుకే రవి ఇంట్లో సమస్య వెంటనే పరిష్కరించలేకపోయాడు. దొంగతనం – వ్యభిచారం – ఇలాంటి మందుకేసుల వాళ్ళు తల్లిదండ్రులకు తెలిస్తే అవమానంలో కుంగిపోతారు. అదీ వాళ్ళ ఉద్ధేశం. ఇతను కాస్త ముందుతరం వాడు. అందుకు అవమానపడుతున్నాడు. రవి విచారంగా, దాదాపు కళ్ళనీళ్ళతో చెప్పాడు.
“ఎంతో ట్రై చేశాను. వాళ్ళు లంచానికీ లొంగలేదు. ఇన్‌ఫ్లూయిన్స్ చేద్దామన్నా అబ్బే లొంగిరాలేదు”
సదాశివం బరువుగా నిట్టూర్చాడు.
“తాగితే పెద్ద తప్పేం కాదు. కాని తాగి బండి తోలకండి అనేది ఉవాచ. ఏది నిజం – నీతి నువ్వేకాదు, మరొకరు కూడా ప్రమాదంలో పడే అవకాశం వుంటుంది. అది తప్పుకదా” అన్నాడు తండ్రి.
రాజ్యం మాత్రం ఛస్తే రానని చెప్పేసింది. అమ్మకి నేనంటే ప్రాణం అనుకున్న రవి ఎదురుదెబ్బ తిన్నాడు. “నేను పోలీస్ స్టేషన్‍కి ఏమైనా రాను” అని తెగేసి చెప్పింది.
“నేను రమ్మంటే వస్తా” అంది శాంత.
“వద్దమ్మా! పోలీసువాళ్ళు అడిగినదానికంటే ఒక్క అక్షరం కూడా ఎక్కువ మాట్లాడకూడదు” అన్నాడు సదాశివం.
తల్లి రానందుకు ఏం చెప్పాలో సిద్ధం చేసుకుని, కొడుకుతో బయలుదేరాడు సదాశివం.
రవిచంద్రకి తలకొట్టేసినట్లుగా ఉంది. తండ్రికి తెలుసు తను అప్పుడప్పుడు తాగుతానని కానీ ఈ అపరాధభావం కృంగదీస్తుంది. పోలీసుస్టేషనులో అడుగుపెడుతుంటే తనమీద తనకే అసహ్యం వేసింది రవికి.
“మరేం పర్లేదు నడు” అన్నాడు సదాశివం.
అక్కడున్న క్లర్క్ దగ్గరకెళ్ళి విషయం నెమ్మదిగా చెప్పాడు. అతను వెంటనే రిజిష్టర్ చూసి, ఫైన్ చిటి రాసి రవి చేతిలో పెట్టి “డబ్బు కట్టి బండి తీసుకెళ్ళండి” అన్నాడు.
“మీ ఫాదర్….” అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో – “వెళ్ళండి సార్! డబ్బుకట్టి బండి తీస్కుపోండి” అన్నాడు గట్టిగా. రవికొంచెం ఆశ్చర్యపోయాడు.
“ఆ ఆఫీసరు ట్రాన్సఫరై వెళ్ళిపోయాడండి” అంటూ నవ్వుతూ, చేత్తో వెళ్ళండి వెళ్ళండి అన్నట్టు సైగ చేశాడు. దూరంనుంచి చూస్తున్న సదాశివం విషయం పసిగట్టాడు. స్లాట్‍లో వున్న బండి దుమ్ముకొట్టుకుపోయి వుంది. అక్కడే వున్న ఓ కుర్రాడు గుడ్డ పట్టుకొచ్చి శుభ్రంగా తుడిచి, యిచ్చాడు. వాడి చేతిలో ఓ యాభైరూపాయలు పెట్టాడు రవి.
బయటికొచ్చి పెట్రోల్ బంక్ వైపు పోబోతూ రవి ఒక్కసారి ఆగాడు. “నాన్నా!” అంటూ ఆయన చేయి అందుకుని తన కుడి చెయ్యి వేసి “ఇంక జన్మలో తాగనని ప్రమాణం చేస్తున్నా ఈ పోలీసు స్టేషను సాక్షిగా” అన్నాడు.
సదాశివం కొడుకు భుజం తట్టి “నడు” అన్నాడు.
పెట్రోలు బంకువైపు తిప్పుతుంటే రవిచంద్ర మనసులో ఒక భావం కలుక్కుమంది.
నిజంగా ఏదైనా ఒక చెడుని కట్టడి చేద్దామనుకున్న ఆఫీసర్‍కి బహుమానం బదిలియేగా నిట్టూర్చాడు.