Site icon Sanchika

భయపడకు

[dropcap]అ[/dropcap]నిదంపూర్వమూ,అనూహితమూ ఐన
ఒక అదృశ్య శత్రువు దండయాత్ర
కౌగిట్లో చిక్కి అలమటిస్తున్నాడు
మనిషి నేడు..
లోకమంతా జడుపు ధూమం కమ్ముకుని
అన్ని ఉద్రేకాలూ అప్రాసంగికాలయిపోయి
మనుషులందరూ భయాశ్వాలమీద
స్వారీ చేస్తున్నారు.
ఎవరికి వారే అప్రకటిత ఎమర్జెన్సీని విధించుకుని
తమ సెల్లు గదుల్లో తామే బందీలయ్యారు.
రిమోటు నొక్కితే చాలు మృత్యుదేవి నృత్య కార్యక్రమమే
ప్రసారమౌతుంటే క్షతగాత్రుల మృతవీరుల
రోజువారీ మేజువాణీ ముచ్చట్లను
వణికే చేతుల్తో వరుస పేర్చుకుంటున్నాడు మనిషి.
ఇప్పుడు ప్రతివాడూ వైద్యుడే.
శొంఠి పొడి ముక్కులో వేసుకుంటే
ఎలాంటి వైరసైనా బలాదూరంటాడొకడు.
బోధి వృక్షం కిందినుంచి
ఇప్పుడే లేచొచ్చినట్లు జీవనమూల్యాలను
రంగరించి పోస్తా డింకొకడు.
వాట్సప్ వర్షధారల వడగళ్ళ జల్లులతో
కింకర్తవ్య విమూఢుడైదిక్కుల్చూసేవాడే ప్రతివాడూ.
రేపురాబోయే సునామీని తలచుకుంటూ నేడే
మృత్యువేదన చెందుతున్నాడు చూడు.
యుగాంతానికింకా చాలా టైముంది..
ఎంత భయంకర తుపానైనా తీరాన్ని దాటక తప్పదు.
అల్పపీడన మైనా అధిక పీడనమైనా
అణగిపోకుండా అలాగే వుండిపోదు.
అంతదాకా కొంత ఝంఝామారుతాన్ని
ఎదుర్కోక తప్పదు కదా!
భయం చీకట్లను తరిమేందుకు
ఆత్మవిశ్వాసపు కాగడాను వెలిగించి
ముందడుగేయడమే ముఖ్యకర్తవ్యం.
మనసునిండా భరోసానింపుకోవడమే
మనిషి గంతవ్యం. . .

Exit mobile version