భిన్నత్వంలో ఏకత్వం

0
2

[dropcap]సిం[/dropcap]గరేణి మొయిన్ స్టోర్స్‌లో టెండాల్‌ ‘ముఖద్ధమ్ బషీర్ అహమ్మద్’ హిందువు కాకపోయినా తన తోటి కార్మికులను ఎప్పుడూ భాయ్ అని సంభోదిస్తూ సొంత సోదరుడిగా భావించి తోటి వాళ్ళ కష్ట సుఖాలలో తాను కూడా ఓ భాగస్వామిగా వుండేవాడు. స్టోర్‌లో పి.ఎ\స్టోర్ కీపర్ శంకరం గార్ని ఎప్పుడూ శంకర్‌జీ అని పిలుస్తూ అందరితో కలివిడిగా వుండేవాడు.

బషీర్ అహమ్మద్ ఇంటి పరిస్థితి ఆలోచిస్తే భార్య ‘ముంతాజ్’ భర్తకు తగ్గ భార్య. కుటుంబ నిర్వహణ, పొదుపు, పిల్లల చదువులు, వాళ్ళ అవసరాలను తీర్చడం; భర్తకు తోడు నీడగా సంసారపక్ష జీవితం గడపడం ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. అబ్బాయి ఖలీల్ ఇంటర్ రెండవ సంవత్సరం ప్రయివేటు కాలేజీలో చదువుతున్నాడు. వాడికి చదువే ధ్యాస. అందరిలో మొదటి శ్రేణిలో పాసవాలనేది అతని ఆశ, కోరిక కలిసి పట్టుదల కూడా ఖలీలుకి ఎక్కువే.

పెద్ద అమ్మాయి సైరాభాను 9వ తరగతి సింగరేణి ఆడపిల్లల స్కూలులో చదువుతోంది. రెండవ అమ్మాయి సాధన 7వ తరగతి. ఇదే టూకీగా బషీర్ అహమ్మద్ కుటుంబ సమాచారం.

స్టోర్‌లో వస్తువులు లారీ నుంచి దించాలన్నా లేదా లారీకి లోడ్ చెయ్యాలన్నా బషీర్‌ది అందేవేసిన చేయి. తోటి వాళ్ళని హుషారు పరుస్తూ నాయకుడిగా పూర్తిగా బాధ్యత తనే తీసుకుని తోటి వాళ్ళకు డ్యూటీలో కష్టం తలగకుండా చేసి అందరితో బషీరన్నా అని ఆప్యాయంగా పిలిపించుకునేవాడు.

ఒక్క బషీర్‌ది మాత్రం నెలసరి జీతం. మిగిలిన కార్మికులందరిదీ రోజువారి భత్యం. కానీ అందరిదీ ఒకటే బాట ఒకటే మాట. బషీర్ మాటకు చేతకు స్టోర్స్‌లో తిరుగులేదు. దైవభక్తి విషయాని కొస్తే మూడు పూటలా ఎక్కడ ఉన్నా అల్లా అని శ్లాఘిస్తూ నమాజ్ వేళల్లో తన ఆచార వ్యవహారాలను నియమాలను తప్పకుండా పాటించేవాడు. ఎంత బరువులు పట్టే పనైనా, తోటి వాళ్ళు తనను బలవంతం చేసినా మద్యాన్ని ముట్టడం, పొగ త్రాగడం అతనికి నిషేధాలు. తోటి వాళ్ళకి ఈ అలవాట్లు మానుకోవాలని, ఇల్లు ఒళ్ళు కూడా గుల్ల చేసే ఈ వ్యసనాలు అమ్మ సాక్షిగా త్యజించాలని బోధిస్తూ అందరికీ ఆదర్శంగా బ్రతుకు లాగిస్తున్నాడు.

అబ్బాయి ఖలీల్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో కాలేజీలో అన్ని గ్రూపుల విద్యార్థుల కన్నా అత్యధిక శాతం మార్కులు సాధించటం చేత, ఎమ్.సెట్‌లో కూడా మొదటి 600లోపు రేం‌కు రావడం వల్ల – ప్రక్కనే వున్న కారేపల్లిలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ఫ్రీ ఫీజు సీటు దొరికింది. పొద్దునే తల్లి డబ్బా సద్ది 7 గంటలకే ఖలీల్‌కి ఇస్తే ప్యాసింజర్ బండికి కొత్తగూడెంలో ఎక్కి కారేపల్లి స్టేషన్‌లో దిగి కాలేజీకి నడుచుకుంటూ పోవడం రోజు ఖలీల్ దినచర్య. ఇలా నాలుగేళ్ళు గడిచాయి. పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టుగా ఫైనల్ ఇయిర్ రిజల్ట్స్‌లో యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్‌గా ఖలీల్ ఎంపిక కావడం వాళ్ళ కుటుంబానికే గాకుండా చదివిన కాలేజీకీ పేరు తెచ్చింది, తండ్రి పని చేసే స్టోర్స్‌లోను ఎనలేని ఖ్యాతి ఖలీల్ గడించాడు. బషీర్ పై అధికారులు, తోటి కార్మికులు, పేషీట్ రైటరు అంతా బషీర్ చేసిన పుణ్యఫలం అని గొప్పగా పొగిడేవారు.

“పుణ్యం కొలది పురుషుడు, తను చేసిన దానం కొలది బిడ్డలు” అనే సూక్తి పేర పేషీట్ రైటర్ పి.ఎ. శంకర్ శాస్త్రి గారు బషీర్‌ని పొగుడుతూ మీ అబ్బాయి ఇంకా అభివృద్దిలోకి వచ్చి నీకు నీ కుటుంబానికి మంచి ఖ్యాతిని తేవాలనే తన ఆశని గొప్పగా వర్ణించాడు.

ఖలీల్‌కి కూడా యు.ఎస్.ఎ.లో గొప్ప విశ్వవిద్యాలయంగా చెప్పే బర్కిలీ విశ్వవిద్యాలయంలో యమ్.యస్. (M.S) చేయాలనే ఆశ బాగా వున్నది. అందుకే కాలేజీలో ప్రొఫెసర్ల సహాయంతో యు.ఎస్.కి కావలిసిన అన్ని నమూనా ఫారాలు తెప్పించుకుని కావలసిన సమాచారాన్ని పంపి యమ్.యస్ చేయడానికి సంసిద్ధుడైనాడు.

కానీ తండ్రి బషీర్ ఎంత డబ్బు ఖర్చవుతుందో, తన ఆర్థిక స్తోమత సరిపోతుందో లేదోనని ఆలోచించసాగాడు. ఈ విషయాన్నే తరచు స్టోర్స్‌లో అందరితో ముచ్చటిస్తూ వుండేవాడు. కానీ అందరికి ఖలీలు అమెరికా ప్రయాణం చదువు పూర్తి కావాలనే వుండేది. కాలం గిర్రున తిరుగుతూనే వున్నది. కొత్తగా విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి ఉపక్రమించే వాళ్ళందరికి పిలుపులు, వుత్తర ప్రత్యత్తరాలు ప్రారంభమయినాయి. ఒక రోజు బషీర్ మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో కేంటిన్‌లో భోజనం చేస్తుంటే ఖలీలు సైకిలు మీద రివ్వున వచ్చి వీసాకి కావలసిన ముఖ్య అర్హతల పట్టిక పట్టుకు వచ్చాడు.

ఏమిటో ఆ హడావిడి అని అందరూ బషీర్‌కేసే చూస్తూన్నారు. తండ్రికి ఖలీలు విషయం అంతా పూర్తిగా వివరించి ఏం చెయ్యాలో తండ్రికి వివరించాడు. తింటూ.. తింటూ.. వున్న ప్లేట్‌ని ప్రక్కకు జరిపి విషయాన్ని మళ్ళీ గుచ్చి గుచ్చి అడిగారు.

ఖలీల్ విషయాన్ని వివరిస్తూ అమెరికాలో ఉండి చదువుకోడానికి చదివించడానికి ఇండియాలో తండ్రికి బ్యాంక్‌లో దాదాపు 18 లక్షలకు పై బడి నిల్వ బ్యాంకు ఖాతాల్లో ఉండాలి. అట్ల ఉన్నట్టుగా బ్యాంకు మేనేజర్‌తో అకౌంటు కాపీతో బ్యాంక్ అధికార ధ్రువీకరణ అవసరం అని చెప్పాడు.

ఎంత గోల్ట్ మెడల్ విశ్వవిద్యాలయంలో సంపాదించిన స్కాలర్‌షిప్ చదువుకోడానికి కాలేజీ ఏర్పాటు చేసినా యు.ఎస్. ప్రభుత్వం వీసా ఇవ్వడానికి బ్యాంక్ నిల్వ ఆధార పత్రం అవసరం అని స్పష్టపడింది.

ఇంకేముంది బషీర్ అహమ్మద్ తన ఆర్థిక పరిస్థితి తన కుటుంబ పరిస్థితి ఓసారి ఆలోచించుకుని, ఏం చేయ్యాలో పాలుబోక, ఒక మూల కుర్రాడు ఖలీల్‌ని నిరుత్సాహపరచకుండా డబ్బు ఎక్కడ ప్రయత్నం చెయ్యాలా అని వాపోతున్నాడు.

ఆ సాయంత్రం పేషీట్ పైటర్ పిఏగారికి విషయాన్ని తెలిపి సలహా అడిగాడు బషీరు.

సింగరేణీలో కార్మికులకు వేజ్‌బోర్డ్ సిటిల్‌మెంటు ఎరియర్సు దాదాపు 2 సంవత్సరాలు పైపడ్డవి, సంవత్సర లాభాలు, బోనస్ మరియు పండుగ అడ్వాన్సు చెల్లించడానికి ఆ నెల జీతంతో కలిపి ఇవ్వడానికి స్టోర్‌కి సర్క్యులర్ ఆరోజే పిఎ శంకర్‌శాస్త్రి గారికి చేరింది. తాను ఒకటే ఆలోచించాడు తోటి కార్మికుడి కుటుంబానికి చేయూతనివ్వాలి. డబ్బులేని కారణంగా ఓ తెలివైన కుర్రాడి భవిష్యత్తుకి అడ్డంకి రాకుండా వుండాలంటే మనకార్మిక వర్గమంతా ఏకమై ఏదో ఒకటి చేసి ఈ బషీర్ గండం నుండి బయటపడేటట్లు చేయ్యాలి అని స్థిర అభిప్రాయానికి వచ్చి సాయంత్రం 5గంటలకు గేట్ మీటింగ్ ఉన్నది, కార్మిక ఉద్యోగులు తప్పని సరిగా హజరు కావాలని నోటీసు తయారు చేసి టైమ్ టోబుల్ నోటీసు బోర్డ్‌లో అతికించారు.

సాయంత్రం ఔట్ మస్టర్ పడ్డాక కార్మిక ఉద్యోగ వర్గాలు గేటు మీటింగ్‌కు హజరైనారు.

యూనియన్ సెక్రట్రీగా వున్న శంకర శాస్త్రి గారు ఆరోజు మీటింగ్ అజెండా తెలియజేస్తూ –

“7వ తారీకున జీతాలు పేమెంటితో అరియర్స్ పండగ అడ్వాన్సు పేమెంట్ జరుగబోతోంది కనుక మన కార్మిక వర్గము, ఉద్యోగ సంఘాల వాళ్ళు ఏకమై ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాల్సివున్నది. అందుకు మంచి మనసు చేసుకుని మన కార్మకులంతా వారి వారి సొమ్ములన్ని మన అన్న బషీర్ అహమ్మద్ పేర అతని లెక్కల ఖాతాలో జమచేస్తే ఆ సొమ్ము మొత్తం రెండు రోజుల్లో ఎవరి సొమ్ము వాళ్లకు జాగ్రత్తగా అందజేయడం జరుగుతుంది. ఇది కేవలం ఓ మధ్యతరగతి కుటుంబ విద్యార్థి అభివృద్ధికై చేసే చిన్న ప్రయత్నం. ఈ యజ్ఞంలో అంతా పాలుపంచుకోవాలని ఆశిస్తున్నాను” అని చెప్పి శంకర శాస్త్రి తన ప్రసంగాన్ని ముగించాడు.

ఇంతలో కార్మికుల తర్జన భర్జనల పిదప ముక్తకంఠంతో కార్మికుల పైసలు జాగ్రత్తగా తిరిగి అందజేసే పద్దతిలో సహాయం చేయ్యడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అందరూ సమర్థించారు. బషీర్ అహమ్మద్ ఒక్కసారిగా నిలబడి తన కృతజ్ఞతలను కార్మికులందరికీ పేరు పేరున తెలియబరిచాడు.

ఆ నెల 7వ తారికున కార్మికుల జీతాల పేమెంట్ మొత్తం సొమ్ము బషీర్ అహమ్మద్ ఖాతాలో జమ చేయడం జరిగింది.

మరుసటిరోజు ఆదివారం. సోమవారం బ్యాంకు మేనేజరు బషీర్‌కి తన బ్యాంక్ అకౌట్‌లో 20 లక్షలు జమై ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చాడు. బషీర్ కొడుక్కి ఆ సర్టిఫికెట్ ఇచ్చి వెంటనే ఓ చెక్కు బుక్‌తో శంకరశాస్త్రి గారి దగ్గరకు వెళ్ళి ఎవరి సొమ్మలు వాళ్ళకి ఇచ్చేయండని అన్ని చెక్కులపై తాను సంతకం చేసి శంకరశాస్త్రి గారి చేతిలో పెట్టాడు.

ఆ సంవస్సరం అందరితో బాటు బషీర్ కుటుంబం వాళ్ళు దీపావళి వాళ్ళ సొంత పండుగలా జరుపుకున్నారు. ఖలీల్ పై చదువులకై శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళి చదువులో నిమగ్నమైనాడు.

కాలం పరుగులు తీస్తూ ఖలీల్ రెండు సంవత్సరముల యమ్.యస్. నిర్విఘ్నంగా పూర్తి చేసి ఆ యూనివర్సిటీకే టాప్ రాంక్ సాధించి అదే విశ్వవిద్యాలంయంలో అసోసియట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కూడా సంపాదించి తనకే కాకుండా వారి కుటుంబానికి కూడా గొప్ప వెలుగును ప్రసాదించాడు.

బషీర్ అహమ్మద్‌కి 60 సంవత్సరములు నిండడంవల్ల కంపెనీ అతన్ని విశ్రాంత ఉద్యోగిగా లెటర్ జారీ చేసి కుటుంబ సహితంగా వీడుకోలు ఫంక్షన్‌కి రావలసినదిగా ఆహ్వానించింది. అమెరికా నుండి ప్రత్యేకంగా తండ్రి పదవీ విరమణకు ఇండియా వచ్చి – సభలో తనకు చదువుకోడానికి ఆర్థికంగా సహాయం చేసిన కార్మిక వర్గానికి ఆజన్మాంతం ఋణపడి ఉంటానని, నేను ముస్లిమ్ విద్యార్థినైనా మతము కులము జాతీ వివక్షత లేకుండా కార్మికులంతా ఒకటే కులం అని గొంతెత్తి చాటి సహాయ సహకారములనందించారని ఇదే మన భారతదేశ ఔన్నత్యం అనీ, భిన్నత్వంలో ఏకత్వం అంటూ రెండు చేతులు పైకెత్తి దండం పెట్టాడు. వాళ్ళు తీసిన గ్రూప్ ఫోటోలో తాను కూడా నిలబడి ఆ ఫోటోని భద్రంగా తన ఆల్బంలో దాచుకున్నాడు ఖలీల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here