సరదా పడ్డ ‘భీష్ముడు’

0
2

భీష్మ సినిమా సమీక్ష

[dropcap]చా[/dropcap]లా కాలం క్రితం ఒక థియేటర్‌లో కూర్చునున్నాను. టౌన్లలో, ఊరి చివార్న ఉన్న హాల్లో సినిమా చూస్తే అందులో ఉన్న అనుభూతే వేరు. అరుపులు, పొలికేకల మధ్య వెండితెర మీది వెలుగులు నిండుగా సాగిపోతూ ఉంటే అదో సరదా. అప్పుడు ‘కృష్ణ మనోహర్’ అనగానే అప్పటి వరకూ ‘పోకిరి’ అని చెప్పిన హీరో ఒక్కసారి స్లో మోషన్‌లో పరుగు తీసుకుంటూ వచ్చాడు. హాలంతా పొలికేకలతో నిండిపోయింది. అక్కడితో ఆగలేదు ఎవరూ. రంగు రంగు కాగితాలు తెర మీదకి రాలిపోయాయి. చప్పట్లు కొట్టడంలో కూడా మరో ధోరణి ఉంది. రెండు చేతులూ పైకి ఎత్తి అక్కడ చప్పట్లు కొడుతున్నారు కుర్రాళ్ళు… నా ప్రక్కనున్న కుర్రాడిని జాగ్రత్తగా గమనించాను. అతని ముఖంలో ఓ వెలుగు, ఓ ఆశ, ఓ చిరునవ్వు, ఇలా ఆ కొద్ది సేపట్లో ఎన్నో! ఒక హీరో లక్షణాలను వాళ్ళలో వాళ్ళు చూసుకోవటం, లేదా వాళ్ళల్లో పొంచియున్న వారే ఒకడెవరో హీరో ఎందుకు కాకూడదు అనే ఆలోచన, అతను గొప్పవాడు ఎందుకు కాలేడు అనే తీయనైన నమ్మకం వీళ్ళందరిని ఆ రంగుల ప్రపంచానికి అంత దగ్గరగా తీసుకుని వస్తూ ఉంటుంది.

21-2-2020న విడుదలైన ‘భీష్మ’ చిత్రంలో కూడా డిగ్రీ డ్రాప్ అయినవాడు కాడు, ఆశయాల మీద నమ్మకం ఉన్నవాడు ఇంత గొప్ప కంపెనీకి వారసుడు అని ప్రకటన వచ్చినప్పుడు నా వెనక కూర్చున్న కుర్రాళ్ళెందరో మరి ఎందుకో చప్పట్లు కొట్టేశారు…

ఆ ఒక్క కనెక్షన్ వల్లనే ఈ చిత్రం హిట్ అని నేను అనుకోవటం లేదు. ఈ చిత్రం ఆద్యంతం సరదాగా నవ్విస్తూ, కవ్విస్తూనే ఉంది.

వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘కంటిన్యూయిటీ ఎడిటింగ్’ ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. (నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన చిత్రం ఇది). దర్శకుడు ఎంచుకున్న పద్ధతి కూడా మంచి హాస్యానికి సంబంధించిన పద్ధతి.

ఒక గాంభీర్యం గల సన్నివేశం జరుగుతున్నట్లు కనిపించగానే కొద్ది క్షణాలలోనే అందులో ఏమీ లేదని చెప్పటం, నేపథ్యంలో కథ నడిపించేయటం వంటివి సహజమైన ప్రతిభ ఉన్న వారికి తప్ప కుదరదు. కాకపోతే ఈ తరహా ట్రీట్‌మెంట్‌కి నటీనటులను ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రధానమైన పాత్రలో (భీష్మ) అనంతనాగ్ కనిపించటం ఆసక్తికరంగా తోచింది. పొందికగా, సహజంగా ఈ పాత్రలను పోషించిన వారిలో నరేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘు బాబు తదితరులు.

హీరో నితిన్ పోషించిన పాత్ర కూడా ‘భీష్మ’. ఇతను సింగిల్‍గా ఉంటూ ఎవరు జత కట్టుకునేందుకు దొరకటం లేదనే బాధలో ఉన్న కుర్రాడు! ఏ.సి.పి అమ్మాయి చైత్ర (రశ్మిక)ను ప్రేమిస్తాడు. సీనియర్ భీష్మ యొక్క సంస్థ భీష్మ ఆర్గానిక్ ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఈ అమ్మాయి వద్ద నుండి ఆర్గానిక్ వ్యవసాయం తాలూకు వివరాలు తెలుసుకుంటాడు. పురుగుల మందులు, రసాయనికపరమైన వ్యవసాయానికీ, అనాదిగా వస్తున్న శాస్త్రీయ పద్ధతిలో పండించే పంటలకీ, రైతులకీ వినియోగదారులకీ మధ్య ఎంచుకున్న కథాంశం కథ కోసం అని అనిపించినా మనందరి మనుగడకీ, మనం తింటున్న వాటికీ మధ్య తీవ్రమైన అనుబంధం ఉన్న విషయమే అని చెప్పాలి. ఈమధ్య డాక్టర్ గారు ఎన్నో జబ్బుల గురించి, మనం తీసుకునే ఆహారం గురించి ఎన్నో ప్రసంగాలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందారు. ఈయన దగ్గర నుండి లాగిన ఓ ఇతివృత్తంలా తోస్తుంది. సీరియస్‌గా ఆలోచిస్తే చాలా కాలం క్రితం డంకెల్ డ్రాఫ్ట్, రైతుల ఆందోళనలు, మనం ఏది పండించాలి, ఏది తినాలనేది విదేశీయులు నిర్ణయించటం ఏమిటి అనేది చర్చల్లోకి వచ్చింది. కాకపోతే ఈ అంశాన్ని హీరో గారు తన ఫైటింగ్స్ స్కిల్స్‌తో ఎదుర్కొన్నట్టు కాకుండా ప్రజల వైపు నుంచి పోరాడినట్లు చూపిస్తే భిన్నంగా ఉండేది. కానీ మరి అది మన కుర్రాళ్ళకి సినిమాలా కనిపించి మనోరంజకంగా ఉండదు. అది అర్థంకాని ‘కళాఖండం’ అయిపోతుంది! అంచాత ఇలా చెప్పాలి. సామాజికపరంగా స్పందించవలసిన మంచి అంశాన్ని ఇలా అయినా ఎంచుకున్నందుకు తృప్తి చెందాలి అనిపించింది.

పెద్దాయన భీష్మ ముప్ఫయి రోజుల కోసం హీరోను ఈవోగా నియమిస్తాడు. ఈ ముప్ఫయి రోజులలో ఇతను విలన్ రాఘవన్ (జిస్సు సేన్ గుప్తా) పన్నుతున్న పన్నాగాలు అన్నీ ఎదుర్కొని విజయవంతంగా నిలుస్తాడు. చివరకు ఓ మంత్రిగారు  రాఘవన్ బ్రాండ్‌ను ఓపెన్ చేసేందుకు వచ్చి ఆ బ్రాండ్ రసాయనాలతో కూడినదని ప్రకటన చేసి అతని నిర్బంధంలోకి తీసుకోవటంతో కథ ముగింపు జరిగినప్పటికీ అది ఎందుకు చేశారనేది కడుపుబ్బా నవ్విస్తుంది! హీరోకి ఆయన హోటల్ లో అమ్మాయితో దొరికిపోవడం, ఆ సమయంలో స్యార్టన్ దుస్తులలో ఉండటం ఈ హాస్యపు కథనానికి చివరి మజిలీలో నిలిచింది.

ఈ చిత్రంలో కొన్ని థియేటర్ స్కిల్స్‌కు సంబంధించినవి ఆకట్టుకుంటాయి. పాటల చిత్రీకరణ ఆకట్టుకుంది. ఒక పాట పూర్తిగా స్టేజ్ క్రాఫ్ట్ మీద కనిపించటం విశేషం.

రశ్మిక సింపుల్ గా కనిపించి అలరిస్తుంది. నితిన్ ఎంతో ఈజ్ గల నటుడు. మిగతా నటులతో కలిసి పోయి టీం వర్క్ చేస్తూనే హీరో అనిపించుకున్నాడు ఈ చిత్రంలో.

మన చుట్టూతా జరిగేవన్నీ ఎంత గంభీరంగా ఉన్నా చివరకు మిగిలేది కేవలం కొద్దిసేపు నవ్వుకునేందుకేనన్నది వాస్తవమే. ఫ్రాన్స్‌లో విజయవంతమైన చిత్రాలలో సగం చిత్రాలు హాస్యం పండించేవే. ఏ కొద్ది సేపు విసుగు రానీయకుండా సాగిపోయే ఈ సకుటుంబ, సపరివార చిత్రానికి నిర్మాత సూర్యదేవర నాగ వంశీ.

రేటింగ్ 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here