భయంకరమైన కష్టాలను దాటుకుంటూ చేసిన జీవన ప్రయాణం – భైరప్ప ‘భిత్తి’

0
2

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]‘భి[/dropcap]త్తి’ ప్రముఖ కన్నడ రచయిత ఎస్. ఎల్. భైరప్ప గారి ఆత్మకథ. ఇది రచయిత కన్నడలో రాసారు. ఎస్. రామస్వామి, ఎల్.వి శాంతకుమారి గార్లు దీన్ని కన్నడ నుండి ఇంగ్లీషులోని అనువదించారు. ఇంగ్లీషు అనువాదం 672 పేజీలు ఉంటుంది. ఈ ఆత్మకథకు ముందు రచయిత తన జీవితంలోని సంఘటనల ఆధారంగానే ‘గృహభంగ’ అనే నవల  రాసారు. ఇది తెలుగులోకి కూడా అనువాదమయింది. గృహభంగలో భైరప్ప గారు తన చిన్నతనం గురించి వారి తల్లి పడ్డ కష్టాల గురించి వివరంగా రాసారు. కాని భిత్తిలో ఈ వివరాలన్నీ ఇంకా విపులంగా చెప్పుకొచ్చారు. వారి చిన్నతనపు రోజులు వారు పడ్డ కష్టాలు వారు చూసిన జీవితం చదివితే వారి జీవిత ప్రస్థానంలో చూసిన ఎత్తు పల్లాలన్ని తెలుసుకుంటే వారిని పూర్తిగా అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుత యువతరానికి వీరి జీవితం స్ఫూర్తిదాయకం. ఎవరూ ఊహించని పేదరికం, పడ్డ కష్టాలు, అందులోని వారి అనుభవాలు ఇవన్నీ వారి వ్యక్తిత్వాన్ని ఎలా మలిచాయో తెలుసుకోవడం నిజంగా అవసరం. జీవితాన్ని ఎదుర్కొనే మనోధైర్యాన్ని, ఓటమిని ఎదిరించే శక్తిని ఇచ్చే పుస్తకం ఇది. మనం ఊహించలేని ద్రుర్భర పరిస్థితులను దాటుకుని ప్రస్తుత స్థితికి వారు చేరుకున్న విధానం చదువుతుంటే వారి అపార ఆత్మ శక్తి, నిబ్బరం, జీవితం పట్ల సానుకూల దృక్పధం కనిపిస్తాయి.

అతి పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భైరప్ప గారు. ఆయన బాల్యపు రోజులన్నీ కటిక పేదరికంతో ఒంటరితనంతో, పూటకు తిండి దొరకడమే గొప్ప అనుకునే పరిస్థితులలో గడిచాయి. అవి భరించడం సామాన్యులకు అలవి కాదు. ఎంతో మానసిక శక్తి ఉంటే తప్ప ఆ కష్టాలను ఎదుర్కోలేరు. ఒకటే రోజు కొన్ని గంటల వ్యవధిలో సోదరున్ని, సోదరిని ప్లేగు వ్యాధి కారణంగా కోల్పోవడం అత్యంత విషాదకరమైన సంఘటన.

కొన్ని రోజులకే తల్లి కూడా అదే జబ్బుతో మరణీస్తుంది. అంతకు ముందు పసి బిడ్డగా ఒక చెల్లెలు, తరువాత కొన్ని రోజులకు మరో తమ్ముడు ఆకలితో మరణించడం అతని జీవితంలో మరో అనుభవం. వీటన్నిటి మధ్య బంధువుల కఠిన వైఖరి, ఏ మాత్రం సహాయం చేయని సొంత వారు ఇన్ని భరిస్తూ కూడా వారు తన జీవితంలో ముందుకే సాగారు. ఎవరో దయతలచి ఒప్పుకుంటే వారి ఇంటి మెట్ల క్రింద పడుకుని భిక్షాన్నాన్ని స్వీకరిస్తూ కడుపు నింపుకుంటూ వారాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఎన్నో అవమానాలను సహిస్తూ వారు తన యవ్వనంలో ఎక్కువ రోజులు గడిపారు. ఆకలి కోసం పని చేయడం లేకా చేతులు చాచి భిక్ష అడగడం, ఇవన్ని ఒక ఎత్తైతే తన మేనమామ వల్ల అతను పొందిన కష్టాలు  మరొక ఎత్తు.

తమ్ముడు చనిపోతే శవం మోసేవారెవ్వరూ లేక ఆ శవాన్ని భుజాన వేసుకుని మరో చేతితో కుండ పట్టుకుని ఒక్కడే శ్మశానానికి వెళ్ళి అంతక్రియలు నిర్వహించడం గురించి చదువుతున్నప్పుడు కన్నీళ్ళు ఆగవు. అప్పుడు అతని వయసు కేవలం పద్నాలుగు సంవత్సరాలు. అప్పటికే ముగ్గురు తోడబుట్టినవారినీ, తల్లిని కోల్పోయి ఉన్నాడు భైరప్ప. అంతక్రియలు చేసి ఇంటికి వస్తే అతని మేనత్త ఆకలి తీర్చుకోవడానికి ఒక రాగి ముద్ద ఇవ్వడానికి కూడా ఇష్టపడదు. అంత భయంకరమైన మనుష్యులని పరిస్థితులను చూసి పెరిగారు భైరప్ప. తన ఊరిలో ఉన్న పతివత్రా స్త్రీలు కన్నా శరీరాలను అమ్ముకునే వేశ్యలలో ఎంతో కనికరం, మానవత్వాన్ని చూసానని చెప్తారు ఒక సందర్భంలో.  అపుడే చేసే వృత్తి పుట్టిన కులం కన్నా గుణం మనిషికి ప్రధానమనే నమ్మకం బలంగా అతనిలో నాటుకుపోయింది. చేసే పనులవల్లే, మంచితనం వల్లే మనిషిని గౌరవించాలనే జీవిత పాఠాన్ని అతి చిన్న వయసులో నేర్చుకున్నారాయన. దీన్నీ ఎప్పటికీ నమ్ముకున్నారు.

ఇన్ని కష్టాలలో కూడా చదువుకోవడం మానలేదు భైరప్ప. స్కూలులో చదువు కోసం ఎన్ని పనులు చేయాలో అన్నీ చేసారు. హై స్కూల్‌లో కొంత కాలం చదువు ఆపవలసి వచ్చింది. అప్పుడే బొంబాయి వెళ్ళి అక్కడినుండి ఒక సంవత్సరం పాటు దేశాటన చేసి వచ్చారు. ఆ సమయాలలో హోటల్ లో పని చెస్తూ చిన్న చిన్న కూలి పనులు చెసుకుంటూ పొట్ట నింపుకున్నారు. కొన్ని రోజులు సన్యాసులతో కూడా కలిసి తిరిగారు. కాని మళ్ళీ చదువు కోసం తిరిగి వచ్చి కాలేజీలో చేరి విద్యార్థి జీవితం మళ్ళీ మొదలు పెట్టారు. అతని అదృష్టం అతనికి గురువుల రూపంలో కలిసి వచ్చింది. మంచి గురువులను సంపాదించికోగలిగారు. వారే అతని వసతి, ఆహారం గురించి పూనుకుని సహాయం చేసారు. విద్యార్థి రోజుల్లో అతని కున్న ఏకైక ఆనందం చదువు, పుస్తకాలు. గ్రంథాలయాలను చక్కగా ఉపయోగించుకుని ఎన్నో గొప్ప గ్రంథాలను ఆ సమయంలోనే చదవగలిగారు. ఫిలాసఫీ అతనికి నచ్చిన విషయం. ఆ విషయానికి సంబంధించి ఎన్నో గొప్ప గ్రంథాలను ఆయన చిన్నతనంలోనే చదవగలిగారు. భారతీయ పాశ్చాత్య ఫిలాసఫీలను అధ్యయనం చేసారు. పై చదువుకు వెళుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ సౌందర్య శాస్త్రం (Aesthetics) ను ప్రధాన విషయంగా తీసుకున్నారు. అప్పుడే రచన పట్ల వారికి ఆసక్తి కలిగింది. రాయడం మొదలెట్టారు.

ఇతరులతో కలిసి చిన్న గదులలో ఉంటూ వారికి వండి పెడుతూ కొన్ని సార్లు భిక్షాటన చేసుకుంటూ హాస్టల్‌లో ఉచిత భోజన వసతి సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ చదువు సాగించారు భైరప్ప. పాఠ్యపుస్తకాలతో పాటు ఎన్నో ఫిలాసఫీ పుస్తకాలు, భారతీయ ప్రాచీన గ్రంథాలను విపరీతంగా చదివేవారు. తనలోని విజ్ఞాన దాహాన్ని తీర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడేవారు. కాలేజీ డిగ్రీల కోసమో సర్టిఫికేట్ల కోసం మాత్రమే చదివిన విద్యార్ధి కాదు ఆయన. కాలేజీ లో డిబేట్ పోటీలలో వారినీ ఓడించేవారెవ్వరూ  లేనంత ఎత్తుకు స్వయం శక్తితో ఎదిగిన గొప్ప వక్త భైరప్ప. ఎన్నో బహుమానాలు పొందారు. భారతీయ భాషలపై ఆయన విపరీతమైన పట్టు సంపాదించగలిగారు. పి.హెచ్.డి పూర్తి చేసి ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సంపాదించి హుబ్లీ చేరుకున్నారు. ఉపాద్యాయునిగా గుజరాత్, ఢిల్లి, చివరకు మైసూర్లో లోనూ పని చేసారు.

ఈ పుస్తకంలో రచయిత తన కాలేజీ అనుభవాలను రాస్తారు. తాను  విద్యార్ధిగా, ఉపాధ్యాయునిగా ఎదుర్కున్న రాజకీయాలను చెప్పుకొస్తారు. ఆయనకు సహాయం చేసినవారినీ, ఇబ్బంది పెట్టాలని చూసిన వారిని గురించి కూడా చెప్తారు. వీటన్నిటితో పాటు తన కన్న తండ్రి లోభత్వం, స్వార్థం, గురించి ఆయన చెప్పేటప్పుడు చదివేవారికి అలాంటి తండ్రి వల్ల ఆయన పడ్డ కష్టం అర్థం అవుతుంది. తల్లి ఎంతో కష్టపడి, ఊరి జమా లెక్కలు రాస్తూ, తన సొంత రెక్కల సయాయంతో పిల్లలకు తిండి సమకూర్చడానికి పడ్డ తాపత్రయం చెబుతున్నప్పుడు వారి బాధ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. తండ్రి మాత్రం తల్లి సంపాదన పై జీవితాన్ని గడిపేసాడు. కనీసం సొంత పిల్లల పట్ల కూడా మానవత్వంలో ఆయన ఏనాడు ప్రవర్తించలేదు.  కాని ప్రతి విషయంలో తండ్రిగా తన హక్కుకోసం సమస్యలు సృష్టిస్తూనే ఉన్నాడు. ఎన్నో సార్లు ఊరిలో పంచాయితీలు పెట్టి బిడ్డ నుండి డబ్బు వసూలు చేసిన ఘనుడాయన. 

ఇదే కాక రచయితగా కూడా వారు ఎదుర్కున్న రాజకీయ వాతావరణాన్ని గురించి రాసుకున్నారు భైరప్ప. భ్రాహ్మణవాదిగా ఆయనను అందరూ ఎంచి ఇబ్బంది పెట్టిన విధానాన్ని గురించి కూడా చెప్పుకొస్తారు. ఎన్నో సార్లు నవ్య రచయితలు వారిని బాధపెట్టిన సందర్భాలున్నాయి. హిందూ ఫిలాసఫీని అధ్యయనం చెసి, ఎన్నో గ్రంథాలు చదివిన కారణంగా వారిలో హిందూ మతం పట్ల గౌరవం ఉంది. కాని పర్వ, వంశవృక్ష లాంటి పుస్తకాలలో హిందూ మతాన్ని కలుషితం చెసున్న భావజాలాన్ని విమర్శించి బ్రాహ్మణికాన్ని ప్రశ్నిస్తారు కూడా. కమ్యూనిజం పై వారికి ఎప్పుడు నమ్మకం లేదు. దానికి సంబంధించి వారి కారణాలను, నమ్మకాలను, ఆలోచనలను చెప్పడానికి  వారు ఎప్పుడూ వెనుకాడలేదు.

ఈ జీవిత చరిత్రలో వారు సందర్శించిన విదేశాల గురించి కూడా రాసుకొస్తారు. జపాన్ అన్నా జపనీయులన్నా వీరికి ఎంతో గౌరవం. ఆ ప్రజలను,ఆ దేశాన్ని, వారి సంస్కృతిని గొప్పగా చెప్పుకొస్తారు. తన ప్రయాణాలకు సహాయ సహకారాలందించిన అందరి గురించి ఈ పుస్తకంలో చెప్తారు. చివరకు తన రచనలన్నీ ప్రచురించిన గోవిందరావుగారు, వారి సాహిత్య భండార్‌తో తనకున్న అనుబంధాన్నీ గుర్తుచేసుకుంటారు. భైరప్ప గారి నవలలన్నిటిని సాహిత్య భండార్ వారే ప్రచురించారు.

ఒక ఫీనిక్స్ పక్షిగా కాలిపోయిన బూడిద నుండే జన్మించిన వ్యక్తి భైరప్ప. జీవితంలో అత్యంత విషాదాన్ని అనుభవించి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడే స్థితికి చేరుకున్న వీరి జీవిత ప్రయాణం చదివితే వీరి పట్ల అమితమైన గౌరవం కలుగుతుంది. వీరు చూపిన ఓపిక, శక్తి, ఎందరికో స్పూర్తిదాయకం. సమాజాన్ని తనదైన దృష్టితో పరిశీలించిన భైరప్పలో బలమైన ఆదర్శాలు ఏర్పడ్డాయి. తాను నమ్మిన సిద్దాంతాల కోసం తనదైన పద్దతిలో అటు వ్యక్తిగత జీవితంలో, సాహిత్య ప్రపంచంలోనూ అంతులేని పోరాటం చేసిన వ్యక్తి భైరప్ప. ఓపికతో చదవాలి కాని అతి గొప్ప ఆత్మకథగా దీన్ని పరిగణించవచ్చు. వారి భావాలన్నీటితో పుస్తకం ముందుకు సాగడం వలన కొన్ని చోట్ల చదవడం కష్టమనిపిస్తుంది. భైరప్ప ఈ పుస్తకం ద్వారా తన ఆలోచనలన్నీటినీ పాఠకులతో పంచుకునే ప్రయత్నం చెసారు. ఎంతో తాత్వికతతో చేసిన రచన ఇది. అందువలన ఇది చదవడం కొంత కష్టం అనిపించినా ఒక గొప్ప పుస్తకంగా, గొప్ప జీవితంగా భైరప్పగారి అనుభవాలు మనతో ఉండిపోతాయి. చదువుతున్నది అనువాదమే అయినా చాలా అర్థవంతంగా జరిగిన అనువాదం కాబట్టి అనువాదకులను ప్రశంసించకుండా ఉండలేం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here