Site icon Sanchika

భూలోకమే స్వర్గం నరకం

[శ్రీ కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచించిన ‘భూలోకమే స్వర్గం నరకం’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]లచక్రం క్రమం తప్పకుండానే సవ్యంగానే తిరుగుతోంది. కానీ దురాశ గల కలియుగ మానవుల కోర్కెలు మాత్రం రోజు రోజుకీ విపరీత ధోరణులకు దారి తీస్తున్నాయి. అందరిలాగానే దేవరాజుకి కోర్కెలు, ఆశలు కూడా అధికంగానే ఉన్నాయి. అందుకే అతడు ప్రతీరోజు డబ్బు సంపాదనకే ప్రాధాన్యతనిస్తున్నాడు. దానికి గల కారణాలు కూడా బలంగానే ఉన్నాయి.

దేవరాజుకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వాళ్లను చదివించాడు. మంచి ఉన్నతమైన ఆస్తిపరులను చూచి వైభవంగా పెళ్లిళ్లు కూడా జరిపించాడు. అంతటితో అతని బాధ్యతలు దాదాపు పూర్తి అయ్యాయనే చెప్పాలి.

కానీ దేవరాజుకి మాత్రం ధనవ్యామోహం ఇంకా మిగిలే ఉంది. వందల ఎకరాలు భూములు సంపాయించాడు. అలాగే వెండి, బంగారు ఆభరణాలతో ఇల్లంతా నింపేశాడు. ఇంకా ఈ సంపద తన సంసార జీవితానికి సరిపోదు అనుకున్నాడేమో! అందరి కన్నా నేనే గొప్ప వాణ్ణి కావాలనే ధనదాహం అతనిలో ఎక్కువయింది.

బ్యాంకుల్లో కోట్లాది రూపాయలు ములుగుతున్నాయి. ఇంత డబ్బు సంపాదించిన అతనిలో దానగుణం ఏ కోశాన లేనే లేదు. ఆ లోభత్వంతోనే తిండి కూడా సరిగా తినటం లేదు. పలు వ్యాధులతో ఔషధాలు సేవిస్తున్నాడు. దానికితోడు రాత్రి పడుకుంటే కంటి నిండా నిద్రకూడా పట్టటం లేదు.

ధన సంపాదనలో పడిన భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని గ్రహించింది భార్య సంతోషి. సరైన సమయం చూచుకొని ఒకరోజు “ఏమండీ! ఇన్ని ఆస్తులు సంపాదిస్తున్నారు కదా! ఇవన్నీ మనం జీవించడానికి అవసరమా! హాయిగా జీవించటానికి ఇవన్నీ మనకెందుకండీ? పైగా మనతోపాటు వీటిని వెంటపెట్టుకుని పోతామా ఏమిటి?” అని అంటూ ఆవిడ వంటింట్లోకి వెళ్ళిపోయింది. భార్య సంతోషి మాటలకు విస్తుపోయాడు దేవరాజు,

కానీ భార్య సంధించిన పదునైన బాణంలాంటి ప్రశ్నలు దేవరాజు మస్తిష్కంలో గిరగిర తిరుగుతున్నాయి. అదే తపస్సుకు దారితీసింది.

దేవరాజ్ పరమశివుని వరం కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. చెట్టుక్రింద అతనితోపాటు కొన్ని కాలభైరవులు కూడా అతనికి తోడుగా నిలిచాయి. ఒక్కసారిగా ఆకాశంలో దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి. లోకమంతా చీకటైపోయింది. ఉరుముల మెరుపు మధ్య ఓంకారంతో పరమశివుడు ప్రత్యక్ష మయ్యెను.

“భక్తా! నీ కఠోర తపస్సుకు మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో” అన్నాడు మహాశివుడు.

“స్వామీ! నాకు మరణం లేకుండానూ, అలాగే నేను సంపాదించిన సంపదను, ఆస్తులను, నా సంసారంతోపాటు పరలోకానికి తీసుకెళ్ళేటట్లు వరమును ప్రసాదించు” అని ప్రార్థించాడు దేవరాజ్.

“భక్తా! ఈ భూమి మీద జన్మించినవారు ఎవరైనా మరణించక తప్పదు. అయినా నీవు మరణించకుండా ఉండాలంటే అది బ్రహ్మదేవునికే సాధ్యమైన పని” అని పల్కెను. శివుని మాటలకు దేవరాజుకి కోపం వచ్చింది.

“మహాశివా! వరమిస్తానని మాట తప్పుతావా! పైగా బ్రహ్మదేవుని ప్రార్ధించమంటావా!” అంటూ శివునిపై మండిపడ్డాడు. అతని పరమభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు “తథాస్తు! నీవు కోరుకున్నట్లు వరాన్ని ఇస్తున్నాను” చెప్పి అదృశ్యమయ్యెను.

దేవరాజు మరణించకుండానే తన సంసారంతో పాటు, తన ఆస్తులతో సహా స్వర్గంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడి నుండీ మళ్లీ నరకానికి తీసుకుపోయారు యమభటులు. అటు స్వర్గంలోనూ, ఇటు నరకంలోనూ నూటయాభై సంవత్సరాలకు పైగా సంసారంలో జీవించటం దేవరాజుకి విసుగుపుట్టింది. పైగా తన సంపదను, సంసారాన్ని, కీర్తిని చూచి ఆనందించేవారు ఎవరూ లేరు అక్కడ. నిరంతరం వినోదంతో మొఖం మొత్తింది అతనికి. ఇక కష్టాలు అసలు లేనే లేవు. కానీ నూట యాభై సంవత్సరాల నుండీ జీవిస్తున్నందుకు తన మీద తనకే విసుగుపుట్టింది. భూలోకమే మేలనిపించింది. ఇలాంటి నిర్జీవితం తనకు వద్దనుకున్నాడు.

తాను చేసిన తప్పును తెలుసుకున్న దేవరాజు పశ్చాతాపంతో మళ్లీ పరమశివుని కోసం తపస్సు చేశాడు. “భక్తా! నీకేం వరం కావాలో కోరుకో” అనెను మహాశివుడు.

“పరమేశ్వరా! నన్ను క్షమించు స్వామి. నాకు ఎలాంటి వరములూ అక్కరలేదు. నాకు వెంటనే మరణాన్ని ప్రసాదించు స్వామీ!” అంటూ ప్రాధేయ పడ్డాడు దేవరాజ్!

“భక్తా! ఇప్పటికైనా అర్థం అయ్యింది కదా! సృష్టికి విరుద్ధంగానూ, అధర్మంగానూ కోరికలను కోరుకోకూడదు. అయిననూ నీ భక్తికి మెచ్చాను. నీ మరణం గురించి చింతించకు. అది బ్రహ్మదేవుడు వ్రాసినట్లు నీకు సంభవిస్తుంది. ఇక మరణం గురించి నీవు దిగులు చెందకు. నీవు కోరుకునే మోక్షం కోసం నీవు కొన్ని పనులు చేయాలి. భక్తా! నీవు జన్మిస్తూనే ఆస్తి, ఐశ్వర్యములు తీసుకురాలేదు. అలాంటప్పుడు వాటిని ఈ భూమ్మీదే వదిలివేసి వెళ్ళాలి. అంతటి మహాసంపదను సంసార సుఖాల కోసం ఖర్చుచేయాలి. నీ తదనంతరం ఆస్తిని నీ సంతానానికి ఇవ్వాలి. నీ తాహతును బట్టి దానధర్మాలు, సమాజసేవ విరివిగా చేయాలి. అప్పుడే నీకు మంచి ఆరోగ్యంతో పాటు జన్మరాహిత్యం  లభిస్తుంది” అని తెలిపి పరమశివుడు అదృశ్యమయ్యెను.

అతి తెలివితో కృత్రిమ నరకం తప్పదని గ్రహించాడు. సంతోషినితోపాటు ఆనంద లహరిలో మునిగిపోయాడు దేవరాజ్!

సంసార జీవితంలోనే స్వర్గ సుఖాలు ఉన్నాయి. సంసారజీవితం’తోనే ఈ భూలోకమే స్వర్గం నరకం కలసి ఉన్నాయిని గ్రహించాడు. అప్పటి నుండి దానధర్మాలు చేయటం ప్రారంభించాడు. నిరుపేదలను ఆదుకున్నాడు. నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమం చేయటంతో ప్రజలందరూ దేవరాజ్ క్షేమం కోరుకున్నారు. సేవలో తరిస్తూ, వృద్ధుడైన దేవరాజుకి మోక్షం లభించింది.

Exit mobile version