[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికి, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకీ మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం1: చంద్రుడిలో చీకటివైపు
విశ్వం…
లక్షలాదిగా ఉన్న గెలాక్సీలలో ఇది అద్భుతమైన ప్రకాశంతో, అనంతమైన నక్షత్రాలతోనూ, నక్షత్ర వ్యవస్థలతోనూ నిండి ఉంది.
పాలపుంత!
చూపు సాగినంత మేరకు నిరంతరం వృద్ధి చెందుతున్న తెల్లని ప్రకాశం – లక్షలాది నక్షత్రాలుగా విడిపోయి, ఒక మెరుస్తున్న ప్రకాశవంతమైన ఖగోళ పదార్థంలా నిలిచింది.
సూర్యుడు!
తొమ్మిది గ్రహాల కుటుంబం సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది.
తర్వాత, భూమి కనబడింది. దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చిన్న ఉపగ్రహం… భూమి నుంచి చూస్తే ఎప్పుడూ ఒకే వైపు కనబడే ఉపగ్రహం.
చంద్రుడు!
ఆ తర్వాత కనిపించేది చంద్రుడిలో చీకటి భాగం!
బూడిదరంగు ఇగ్లూలాంటి కట్టడంలో నల్లని ఛాయాచిత్రాల్లా కనిపిస్తున్న పది మనుషుల నీడలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
అది చంద్రుడి చీకటి వైపు. ఆక్సీజన్ తక్కువగా ఉండడం వల్ల – పీడనంతో ఉండేలా లోపలంతా సౌకర్యవంతంగా ఉండేలా లివింగ్ రూమ్, బాత్ రూమ్, రెండు మంచాలు ఏర్పాటు చేసారా ఇంట్లో. ఎందుకోగాని, ఆ ఇంటిలోని లోపలి భాగమంతా నాకు స్పష్టంగా కనిపిస్తోంది.
అంతరిక్షానికి వెలుపల సుదూరాలలో ఉండే ఇతర గ్రహలలోనూ మానవులు ఉండాలంటే ఆక్సీజన్ కావాలి.
వాళ్ళంతా లివింగ్‍రూమ్‌లో ఉన్న ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చున్నారు. ఆ బల్లపైన పెద్ద తెల్లని గోతాం ఉంది.
ఎముకల గూడులా ఉన్న ఓ మనిషి లేచి నిలబడ్డాడు. చేతులలో ఏవో సైగలు చేస్తున్నాడు. అతని కళ్ళు ఎరుపు రంగులో మెరుస్తున్నాయి.
మిగతావాళ్ళు కూడా లేచారు.
పొడుగ్గా ఉన్న మరో ఆకారం ఏవో మంత్రాలను ఉచ్చరిస్తోంది. అయితే ఆ ధ్వనులేవీ నాకు వినబడడం లేదు.
తర్వాత పుర్రెల్లాంటి తలలు, కళ్ళల్లో నిప్పులు, నోట్లో పదునైన కోరల్లాంటి దంతాలతో అందరూ ఒకేసారి మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. నాలో నిలువెల్లా వణుకు.
ఆ గదిలో మెరుపుల్లాంటి కాంతులు వెలువడ్డాయి. నా వెన్నులో చలి మొదలయ్యింది.
విశ్వశక్తిని ఆవాహన చేస్తున్నారు. విశ్వశక్తి… దాన్నే కొందరు దుష్టశక్తి అనీ, మాయ అనీ అంటారు.
వారి హావభావాలు శరీర కదలికలు వేగం పుంజుకున్నాయి. అదిరే పెదాలతో అమితమైన వేగంతో మంత్రోచ్ఛారణ జరుగుతుంటే ధ్వనితీవ్రత పెరిగింది.
ఏదో తెలియని భయాన్ని కలిగించే గుమ్మటం ఆకారంలో ఉన్న ఆ ఇంటి గదిలో మెరుపులు, నిప్పుకణాలు ప్రత్యక్షమవుతుంటే ఒళ్ళు జలదరించింది.
తర్వాత ఆ గోతాంలోని తెల్లని బూడిద గాల్లోకి ఎగిరి సుడిగుండంలా తిరుగుతూ ఓ దట్టని మేఘంలా తయారయ్యేసరికి భయం రెట్టింపయ్యింది. ఆ మేఘం ముడతలు పడుతోంది, చుట్టలుగా చుట్టుకుంటోంది. గదంతా మెరుపులతోను, పొగతోనూ నిండిపోయింది. ఆ తెల్లని బూడిద కణాలు ఘనీభవించి, వాటి లోంచి ఒక పొడవాటి స్త్రీ ఆకారం జీవం పోసుకుంటోంది. ఈ ప్రక్రియ అంతా నన్ను బెదరగొడుతోంది.
పొడవాటి, నల్లటి ఆకారం! నిడుపాటి కేశాలు, మెరుస్తున్న చిన్న కళ్ళు. తెల్లని కోరల్లాంటి దంతాలు, పక్షి ముక్కు, దాని కింద దట్టమైన పెదాలు, దవడలపైన వేలాది ముడుతలు…
ఆ మొండానికి తల అతికించారు, హృదయం అమరింది. ఓ ముసలి స్త్రీలా జారిపోయిన రొమ్ములు ఏర్పడ్డాయి. బలహీనమైన ముంజేతులు, పంజాల్లాంటి అరచేతులు..
ఆపైన పొట్ట, ఎముకలు, తొడ ఎముకలు, జంఘిక, పిక్క ఎముక ఏర్పడ్డాయి. వాటి పైన పొడిబారిన చర్మం అమరింది. ఆ తర్వాత మడతలు పడి.. ఎముకల్లా ఉన్న కాళ్ళు, పాదాలు…
గోతాంలోని తెల్లని బూడిద నుంచి ఓ వృద్ధ స్త్రీ శరీరాన్ని పునఃసృష్టించారు! పునర్జన్మ!
ఆ పది ఆకారాలు తలలు ఊపుతూ మరింత తీవ్రంగా మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. కానీ ఆ ధ్వనులేవీ నా చెవులకు అందడం లేదు.
నాకు కనిపిస్తున్నదల్లా… కొత్తగా ఏర్పడిన ఒక వృద్ధ మహిళ శరీరాకృతి – గుండ్రని బల్ల చుట్టూ ఉన్న నల్లని మానవ ఆకారాల మధ్య సుడులు తిరుగుతోంది. ఆ స్త్రీ ఆకారం చివరగా ఆ బల్లపై ఆగి, స్థిరంగా నిలిచింది.
ఇప్పుడా స్త్రీ రూపానికి జీవం వచ్చింది. చేతులు బారజాపి అక్కడున్న మిగతా ఆకారాలకు అభివాదం చేస్తూ వికటాట్టహాసం చేసిందామె.
నా గుండె దాదాపుగా ఆగిపోయినంత పనైంది. గొంతు బొంగురుపోయింది. గట్టిగా ఏడ్చాను. కాని భయం లోంచి పుట్టిన నా రోదన బయటకి రావడం లేదు. నా శరీరమంతా చెమటతో తడిసిపోయింది. వణికిపోతోంది.
ఆమె దెయ్యం కాదు. చిరపరిచితమైన స్త్రీయే. నాకు తెలిసిన మంత్రగత్తె. భూమి పరిభాషలో “విశ్వశక్తిని ఉపయోగించగలిగే వ్యక్తి“. ఆ రోజు సాయంత్రం విశ్వశక్తిని ఉపయోగించి నా ప్రియసఖి ప్రకృతి వెలువరించిన అత్యంత శక్తిమంతమైన లేజర్ కిరణాల వల్ల మాంటెగోమెరీ స్పేస్ ఎస్కలేటర్‌లో భస్మమైపోయిన దుష్ట రాజకుమారి.
అది ఓ దుష్టశక్తి వికటాట్టహాసం. భయంకర హంతకురాలి భీతిగొలిపే నవ్వు. నా భయం మరింత పెరగడానికి ఇంకో కారణం ఉంది. పొరపాటుగానో, విధివశాత్తో ఆమె తల వెనక్కి తిరిగి ఉంది. చేతులు కాళ్ళు, మిగతా శరీరమంతా మామూలుగా ఉంది. దుష్ట మాంత్రికులు తమ నిగూఢ శక్తులతో పాత సయోనీని పునరుజ్జీవింపజేయడంలో విజయం సాధించినా, ఆమె తలని యథాస్థానంలో ఉంచడంలో మాత్రం విఫలమయ్యారు.
ఈ విషయం నా మనసులోకి రాగానే నా గుండె జారిపోయింది. భయంకరమైన ఓ వాస్తవం గ్రహించిన భావన నాలో కలిగింది.
సయోనీ.. దుష్ట రాజకుమారి…. పరారీలో ఉన్న కుజగ్రహంలోని అరుణ భూముల చక్రవర్తి సమూరా కూతురు… మరణించి కూడా రహస్య ప్రాణుల శక్తుల వల్ల… ఈ చంద్రుడి చీకటి ప్రదేశంలో బూడిద నుంచి తిరిగి ప్రాణం పోసుకుంది!
ఇక ఆ ఆకారాలు మసకబారాయి, వారి ధ్వనులు మెల్లిగా క్షీణించాయి. చంద్రుడి భూభాగం… బిలాలు, శిలలలో పైన దట్టమైన నిశీధిలో లక్షలాదిగా మెరుస్తున్న నక్షత్రాలతో దర్శనమిచ్చింది. మెల్లిగా ఇవన్నీ దూరమై, కేవలం చంద్రుడిలోని చీకటి భాగం మాత్రమే కనిపిస్తోంది.
ఇప్పటికీ నా గొంతునుంచి నిజమైన కేక వెలువడింది. “ఓ…. వద్దు… అలా జరగడానికి వీల్లేదు… అంటూ అరిచాను నిద్రలోనే.
ఇది పీడకలలకే పీడకలలాంటిది. ఇక ముందు జరగబోయే దానికి పూర్వసంకేతం. ఇలాంటివి నాకు ఇప్పటికే అలవాటయ్యాయి.
అధ్యాయం2: ఏడడుగులు
వధువు ఇంట వివాహం జరగడం ఆచారం కాబట్టి మా పెళ్ళి ఆమ్రపాలి గ్రామంలో జరిగింది.
అది నా జీవితంలో ఓ మరపురాని మధురమైన ఘట్టం.
ఒక నెల రోజుల ముందు నుంచే గ్రామమంతటా సన్నాహాలు మొదలయ్యాయి. గ్రామంలో ఏ కుటుంబంలో వివాహం జరిగినా గ్రామస్థులంతా తమ ఇంటి పెళ్ళిలా వేడుక జరుపుకోడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.
నేను యూనివర్సిటీలో వెంటనే చేరలేదు. నా హెచ్.ఓ.డి. శాన్ నాకు ఒక నెల రోజులు జీతంతో కూడిన సెలవు ఇచ్చాడు. పెళ్ళికూతురుకి కొనాల్సిన వస్తువులు, బట్టల కోసం మార్కెట్‌కి వెళ్ళాను.
పెళ్ళికూతురికి, ఆమె తరఫు బంధువలకి ఏమేమి కొనాలో, ఏం కానుకలివ్వాలో వివరాలు చెప్పడానికీ, నాతో పాటు ఉండడానికి నాకంటూ ఎవరూ లేరు.
కాని సంప్రదాయ భారతీయ వివాహానికి ఏమేం కొనాలో, ఏ వస్తువులు అవసరమవుతాయో ఆ సమాచారం మాత్రం నావద్ద ఉంది. పెళ్ళి కూతురు తండ్రికి కొత్తబట్టలు, పెళ్ళి కూతురికి బంగారు నగలు, ఇంటి సామాన్లు, ఫర్చిచర్ మొదలైనవి కానుకలుగా ఇవ్వడానికి కొన్నాను.
అత్యంత ఖరీదైన పట్టుచీర, అందమైన బంగారు నగలు కొనాలనుకున్నాను. నిజానికి వాటిని కొనుగోలు చేయాలంటే భారీ నిధి కావాలి. కాని అదృష్టవశాత్తు నాకు శాన్ వివాహ ఋణం మంజూరు చేయించాడు. ఆరు మాసాల జీతాన్ని యూనివర్సల్ కరెన్సీ యూనిట్లలలో ఇప్పించాడు.
నా విద్యార్థులు, ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలోని నా సహోద్యోగులు, నా సహచరుడు యురేకస్ 7776 ఓ బృందంగా నాతో పాటు పెళ్ళికూతురి ఊరికి తరలివచ్చారు.
అదంతా ఓ కలలా జరిగిపోతోంది. సంతోషకరమైన జ్ఞాపకాలతో రాత్రింబవళ్ళు తొందరగా గడిచిపోతున్నాయి. ఓ అందమైన కల!
ఓ రోజు నేను కస్టమ్ క్లియర్డ్ ఇంటర్ ప్లానెటరీ స్టోర్‍కి వెళ్ళి మొత్తం ఎలెక్ట్రానికల్లీ కంప్యూటరైజ్డ్ స్యూట్ కొనుక్కున్నాను. దాన్ని ధరిస్తే – శరీరానికి ఎంత ఉష్ణోగ్రత కావాలో, బ్లడ్ షుగర్ ఎంత ఉందో తెలిసిపోతుంది. వారం రోజుల తర్వాత తనని తాను శుభ్రం చేసుకుంటుందా స్యూట్.
“దీన్ని చంద్రుడిపై ఉండే అమృతా కాలనీ నుంచి దిగుమతి చేసుకున్నాం” గర్వంగా చెప్పాడా కొట్టు యజమాని. “బయటి వాతావరణాన్ని బట్టి ఈ స్యూటు మీకు వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని ఇస్తుంది. పైగా దీన్ని మీ రోబోకి కనెక్ట్ చేయవచ్చు. సందర్భాన్ని బట్టి అవసరానికి అనుగుణంగా రంగులను, డిజైన్‌ను మార్చుకుంటుందీ స్యూట్” అన్నాడతను.
“వాహ్! ఎంత అద్భుతమైనది. ఇలాంటివి భూమి మీద తయారవవు కదా”
“అవును సర్! ఇది వివాహాల కోసం ప్రత్యేకించినది. దీన్ని నేను మీ వివాహం కోసం అందమైన డిజైన్లు ఉన్న ప్రత్యేకమైన ఎరుపు షేర్వానీలా మారేలా ప్రోగ్రామ్ చేయగలను”
“విలక్షణమైనది!” అనుకున్నాను. “కొత్త సహస్రాబ్దిలోని ఆధునిక అద్భుతాలలో ఒకటి…” అనుకున్నాను.
ఆచారాలు అనాదిగా కొనసాగుతున్నాయి. పెళ్ళిపందిరిని అందంగా అలంకరించడం, విడిది నుంచి కళ్యాణమంటపం వరకూ గుర్రం మీద పెళ్ళికొడుకుని ఊరేగించడం, సంగీతం, నృత్యాలు… ఇప్పటికీ.. ఈ నాలుగో సహస్రాబ్దిలోనూ ఉన్నాయి. నాదస్వర బృందం వాళ్ళు ఎలెక్ట్రానిక్ సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ మంటపానికి నేను ఊరేగింపుగా వెడుతుంటే – ఆకాశంలో లేజర్ కిరణాలతో హోలోగ్రాఫిక్ బొమ్మలను ప్రదర్సించారు.
యురేకస్ లోహ స్వరంతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. “ఓహ్! మాస్టర్! ఇటువంటి పెళ్ళిని నేనెప్పుడూ చూడలేదు. పైగా ఇది మీ పెళ్ళి! అద్భుతం… అసాధారణం! భారతీయ వివాహాలు ఎంతో శోభాయమానంగా జరుగుతాయని ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికా నుంచి తెలుసుకున్నాను” అంది.
సంస్కృత వేద మంత్రాల ఉచ్చారణలతో ప్రకృతిని వేదికపైకి తీసుకువచ్చారు. ఈ మంత్రాలు దుష్ట మాంత్రికులు ఉచ్చరించేవి కావు. పూలతో అలంకరించుకుని దీపాలను పట్టుకున్న అమ్మాయిలు ప్రకృతి చుట్టూ ఉన్నారు.
ప్రకృతి ఎర్రని పట్టుచీర ధరించింది. ఆమె మెడలో మల్లె, తామరపూల దండలు, మెడ నుంచి నడుం వరకూ మెరిసే బంగారు నగలు. చెవులకు మెరుస్తున్న వజ్రపు లోలాకులు. ముక్కుకి ప్రకాశిస్తున్న ఎర్రని వజ్రపు మెక్కెర. జడ నుంచి చెవుల వరకూ బంగారు పాపిడిబిళ్ళ!
ఈ వేడుక నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఉత్తేజాన్ని కలిగించింది. అంతా బాగున్నట్టు అధివాస్తవికంగా తోచింది. మొత్తానికి నాకు కావలసిన సంతోషాన్ని నేను పొందగలిగినట్టు అనిపించింది.
డోలూ సన్నాయి మేళాలతో, బాణాసంచాలతో, లేజర్ కిరణాలు ఆమ్రపాలి ఆకాశంలో విన్యాసాలు చేస్తుండగా మాంగళ్యధారణ చేసి నేనూ ప్రకృతి దంపతులమయ్యాం. వివాహానికి హాజరైన పెద్దలంతా మాపై అక్షింతల ఆశీర్వాదాలు కురిపించారు. కొంతమంది మాపై పూలరెక్కలను జల్లారు.
తన నల్లని కళ్ళలోకి చూస్తూ, ‘ఇవి నా జీవితంలో అపురూపమైన క్షణాలు. ఈ సమయం దివ్యమైనది. నాకు జరిగిన గొప్ప మేలు… నాలాగే స్వాప్నికురాలు… విశ్వశక్తిని ఉపయోగించగల గొప్ప ప్రతిభావంతురాలు… నా రక్త సంబంధీకురాలు… నా లాంటి జన్యువులనే కలిగి ఉన్న ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నా అదృష్టం’ అని అనుకున్నాను.
అందరితో పాటు యురేకస్ కూడా లేచి నిలుచుంది. గ్రామాధికారి మహా ఇప్పుడు నా మావగారు. గ్రామపెద్దలు మమ్మలి ఆశీర్వదించారు. కొందరు మా నాన్నని జ్ఞాపకం చేశారు.
“కానీ, నిజంగా నారా చాలా మంచివాడు” అన్నాడో వృద్ధుడు. “దుష్ట మంత్రాల బారినపడ్డ నా మేనకోడలిని ఒకే ఒక దఫాలో నయం చేశాడు. మంత్రించిన తాయెత్తునిచ్చి ఎల్లప్పుడూ మెడలో ధరించాలని చెప్పాడు” అన్నాడయన.
ఇలా మా వంశం గురించి వినడం ఓ రకంగా బావుంది, మరో రకంగా చూస్తే అస్సలు బాలేదు. మంత్రశక్తులున్న వంశంలో జన్మించడం ఒక ఎత్తు, శక్తులు కలిగి ఉండి కూడా మంచివాడిగా ఉండడం మరో ఎత్తు.
మంత్రోచ్ఛారణ, పుష్పదళాల జల్లు, అక్షింతల వాన మధ్య పవిత్ర అగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు నడవడంతో పెళ్ళి తంతు పూర్తయ్యింది. ఆమె కళ్ళలోకి సూటిగా చూసినప్పుడల్లా నా భాగస్వామి తనేనని స్ఫురించేది. ప్రకృతి… నిజంగానే ప్రకృతిలా అందమైనది. ఆధునిక సహస్రాబ్ది మేధస్సు, శక్తి కలబోసిన సౌందర్యరాశి.
ఓహ్! మా గ్రామ దైవం భైరవుడి సాక్షిగా నేను ఆనందాంబుధిలో తేలియాడసాగాను. అవి నా జీవితంలో నేను అనుభవించిన పారవశ్యపు క్షణాలు!!
అధ్యాయం 3: సందేశం
నా మనసులో తీయని జ్ఞాపకంలా మిగిలిన ఆనందకరమైన క్షణాల గురించి ఎక్కువగా చెప్పను. హోటల్ మ్యాంగో ఆర్చర్డ్‌లో మా గదిని అందంగా అలంకరించారు. రకరకాల పూల తాజాదనం, అగరుబత్తిల పరిమాళం గదంతా వ్యాపించింది. పట్టుచీరలో, నిండైన నగలతో ప్రకృతి దేవతలా ఉంది. మా తొలిరాత్రి ఓ మధురమైన స్వప్నంలా గడిచిపోయింది. భూమి మీద కాలం వేగంగా గడిచిపోతోంది. నాకు గతం గుర్తు రావడం లేదు, వర్తమానంలో ఏం జరుగుతోందో గ్రహింపు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనా లేదు. మనసు మొద్దుబారిపోయినట్టుగా ఉంది.
ఐతే, కాలం మాత్రం తను ఎలా నడవాలో అలాగే నడుస్తుంది. తెల్లారింది. దట్టమైన తెరలను దాటుకుని సూర్యకిరణాలు మా గదిలోకి చొచ్చుకువచ్చాయి. తలుపు తట్టిన చప్పుడైంది. నేను బద్ధకంగా లేచాను, నెమ్మదిగా వెళ్ళి తలుపు తీశాను. అక్కడున్నది మరెవరో కాదు, నా లోహమిత్రుడు.. యురేకస్. ఈ హోటల్లోనే ఉంటోంది కానీ, మా గదిలో కాదు.
“గుడ్ మార్నింగ్ మాస్టర్!” పలకరించింది యురేకస్. దాని యాంటీనాపై ఓ వెండి ట్రే ఉంది. దాని మీద ఓ రాగి కెటిల్, పింగాణీ కప్పులు ఉన్నాయి. వాటిలో వేడి కాఫీ పొగలు కక్కుతోంది. ట్రేలో ఇంకా కొన్ని టోస్ట్‌లు, పళ్ళు ఉన్నాయి. “మీ సమయం బాగా గడిచిందని ఆశిస్తున్నాను” అంది.
“థ్యాంక్యూ యురేకస్! లోపలి రా!”
ప్రకృతి అప్పుడే నిద్ర లేస్తోంది. నల్లని కనులు మెల్లగా తెరుచుకుంటున్నాయి. ఒకటో రెండో మల్లెమాలలు వేలాడుతున్న నీలికురులు భుజాల మీదకి వచ్చాయి. తెల్లని పట్టుచీర ఆమె శరీరంపై వదులుగా ఉంది.
యురేకస్ లోపలికి వచ్చి ఒక టేబుల్ మీద ట్రేని ఉంచింది. “కాఫీ తాగండి! అయితే తొందరగా సిద్ధమవండి. మీకో ముఖ్యమైన సందేశం వచ్చింది. చాలా ముఖ్యమైనది” చెప్పింది.
దాని ఛాతి స్థానంలో లైట్లు వెలిగాయి. ఓ మూలగా ఉన్న నీలి తెరపై రోమన్ అక్షరాలలో ఎరుపు రంగులో ఓ సందేశం ప్రత్యక్షమైంది. దానితో పాటే ఓ చిన్న రంధ్రం తెరుచుకుని ఆ సందేశం యొక్క ప్రింట్ అవుట్ బయటకొచ్చింది.
సువాసనలు వెదజల్లుతున్న రుచికరమైన కాఫీ తాగుతూ తెరమీది సందేశాన్ని కళ్ళతోనే చదివాను.
“సెక్రటరీ జనరల్, ఎర్త్ కౌన్సిల్, నార్త్ అమెరికన్ జోన్ 001 నుంచి హనీ ఆమ్రపాలికి, బయోమెడికల్ ఇంజనీర్, ఇండికా సెంట్రల్.
మీరు వీలైనంత త్వరగా వచ్చి డైరక్టరేట్ ఆఫ్ పిసియుఎఫ్ (విజార్డ్) మానిటరింగ్ సెల్, ఇంకా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంటర్ ప్లానెటరీ కౌంటర్ టెర్రరిజం వద్ద రిపోర్ట్ చేయాలి. ఇది అత్యవసరం. మీ ప్రయాణం ఖర్చులు, వసతి ఖర్చులు మేము భరిస్తాం. బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్,ఇండికా సెంట్రల్‌లో మీ హెచ్.ఓ.డి నుంచి అనుమతి తీసుకున్నాం.
సంతకం. మిస్టర్ లీ.
నాకిదంతా కొత్తగా ఉంది. నేనిప్పుడు బిగ్ లీగ్‍లో ఉన్నట్టా?నార్త్ అమెరికా జోన్… అంటే ఒకప్పటి అమెరికా… అది నాల్గవ సహస్రాబ్దిలో భూమి మీద సూపర్ పవర్. అధికార కేంద్రం. ఇప్పుడు అది బహుళ జాతీయుల ఆలవాలం. ఎర్త్ కౌన్సిల్ లోని సభ్యులందరూ ఉమ్మడిగా అధికారం కలిగి ఉంటారు. అయితే ఈ వ్యవస్థ పనితీరు ఎవరికీ సరిగా తెలియదు.
కౌంటర్ టెర్రరిజం ఏంటి? తీవ్రవాదాన్ని నిలువరించడంలో నా పాత్ర ఏమిటి? తీవ్రవాదులను నిలువరించడంలో నన్నిప్పుడు ఓ నిపుణుడిగా భావిస్తున్నారా? పైగా నేను సైన్యానికి చెందినవాడిని కాదు. అంటే… పోరాడవలసింది గ్రహాంతర దుష్టశక్తులతోనా? నేను 59 నక్షత్రాల హోదా ఉన్న పిసియుఎఫ్‌ని మాత్రమే. వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోడానికి అంగారకుడి మీద, భూమి మీద నేను చేసిన సాహసాలు కారణమై ఉంటాయి. అందుకే రహస్య గూఢచర్యం కోసం నన్ను పిలుస్తున్నారేమో.
ప్రకృతి కేసి చూశాను. కొత్త పెళ్ళికూతురు. అమాయకమైన ముఖంలో అందమైన చిరునవ్వు. దాంపత్య జీవితంపై కోటి ఆశలు!
మరిప్పుడు ఇందులోకి తననీ లాగాలా? ఇంత తొందరగానా?…
కాశ్మీరు లోయలో హనీమూన్ జరుపుకోవాలన్న నా కోరిక, ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్న ఆశ ఇక వదులుకోవల్సిందేనా?
ప్రకృతి నవ్వుతోంది. ఆమె నవ్వులు ఆ మసక చీకటి గదిలో వజ్రపు కాంతులను వెదజల్లుతున్నాయి.
“హనీ, ఆ సందేశాన్నీ నేనూ చదివాను. ఈ మిషన్‍లో నన్నూ చేర్చు. నాలోనూ విశ్వశక్తి ఉంది. వాళ్ళకి చెప్పు. నేను నీతోపాటు ఉండేందుకు అనుమతి తీసుకో” అంది.
జీవితం మారిపోయింది. సెంట్రల్ ఇండికాలో బ్రహ్మచారిగా ఉన్న రోజులు పోయాయి. నల్లని కళ్ళు, అద్భుతమైన శక్తులు ఉన్న ఈ యువతి నా భార్య. నా బాధ్యత.
తననీ, ఆమె తండ్రినీ రక్షించుకోవాలి.
నా భవిష్యత్తు కార్యకలాపాలలో ఆమెకి ప్రమేయం కల్పించాలా? దుష్టశక్తులు అసంఖ్యాకంగా ఉండే చీకటి ప్రాంతాలలోకి ఆమెని తీసుకువెళ్ళాలా? ఈ దుష్టశక్తులను ఎదుర్కునే క్రమంలో ఎర్త్ కౌన్సిల్ చేతిలో నేనొక పావుగా మారడం లేదు కదా?
నేను గెలుస్తానా? సజీవంగా భూమిపైకి తిరిగొస్తానా? నా అనుభవం దృష్ట్యా చూస్తే అది అనుమానస్పదమే.
నేనిలా ఆలోచనల్లో లీనమై ఉండగా… ప్రకృతి కోకిల స్వరంతో పలికింది:
“సందేహించొద్దు హనీ! నేను కూడా వస్తున్నానని వాళ్ళకి చెప్పు. యురేకస్‍కి వాయిస్ మెసేజ్ ఇవ్వు”
“ప్రకృతీ! ఇది చాలా ప్రమాదకరమైనది. సమూరాతో యుద్ధం… మనకే మాత్రం తెలియని శక్తులతో పోరాటం! వీళ్ళతో… ఈ దుష్టశక్తులతో జరిపిన పోరాటంలో మా అమ్మానాన్నలు చనిపోయారు. ఆ స్పేస్ ఎలివేటర్‍లో మన ప్రాణాలు కూడా పోయినంతపనైంది. మనకెందుకు చెప్పు? భూమి మీద విశ్వశక్తి ఉన్నవాళ్ళం మనమేనా? మనకన్నా శక్తిమంతులు, సీనియర్ పిసియుఎఫ్‌లు ఎందరు లేరు? మనమే ఎందుకు?”
యురేకస్ 7776 మా సంభాషణ వింటోంది. దాని ఛాతిపై ఉన్న స్క్రీన్ మీద ఆకుపచ్చ రంగులో ఎర్త్ కౌన్సిల్ నుంచి ఓ సందేశం వచ్చింది. కాసేపు లెట్లు వెలిగి ఆరిపోయాయి.
“మాస్టర్! బహుశ మీరు ఎంపిక చేయబడ్డ వ్యక్తి(Chosen One) అయి ఉంటారు! చెడును అంతం చేయడానికి నియుక్తులైన మంచి పిసియుఎఫ్‍ల కొడుకు మీరు. మేడమ్ కూడా అంతే. ఆమె ఆ దుష్టురాలైన సయోనీని అంతం చేశారు. వీళ్ళ గురించి ప్రాచీన మంత్ర గ్రంథాలలో చెప్పబడింది. అవి రహస్యాలే, అయినా ఎర్త్ కౌన్సిల్‌కి సులభంగా తెలిసాయి” అంటూ చిన్నగా దగ్గి చెప్పడం ఆపింది యురేకస్.
“ఈ కబుర్లన్నీ ఇంతకు ముందు విన్నవే యురేకస్! కథ ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. అమ్మానాన్నలు దుష్టుల చేతిలో చనిపోతారు, వాళ్ళ కొడుకు ఆ దుష్టుల మీద పగ తీర్చుకోడానికి బయల్దేరుతాడు. అతనికి శక్తులు ఉంటాయి. పైగా ఆ పని చేయగలిగే వాడు అతనొక్కడే! ఎవరు నమ్ముతారు ఇవన్నీ? నన్ను ఓ సిపాయిగా లేదా ఓ పావులా లేదా ఓ బలిపశువులా వాడుకుంటున్నారని నాకనిపిస్తోంది. విశేష శక్తులున్న ఓ ఏజంట్… దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వంచే ఆదేశించబడుతున్నాడు…. ఒకవేళ నేను అంగీకరించకపోయినా, నన్ను బలవంతంగా ఒప్పించి, ఆదేశించి ఈ మిషన్ చేపట్టేలా చేస్తారు”.
“ఇదంతా ఓ కల వల్ల…” అంటూ ప్రకృతి ముసిముసిగా నవ్వింది. “కుజగ్రహపు అందమైన రాకుమారి నీ కలలోకి వచ్చి నిన్ను అక్కడికి పిలవడం వల్లే కదా ఇదంతా. అంగారకుడి మీదకి వెళ్ళడం, ఆ అరుణభూములలో తిరగడం..” అంటూ చిలిపిగా నవ్వింది.
“అవును! అది నిజం. సరదాగా అనిపించే ఓ చేదు వాస్తవం! ఆ రాకుమారి చాలా ముసలిది, చెడ్డది. చంపక తప్పనిది. పైగా కుజగ్రహమేమీ ప్రణయభూమి కాదు. పొడిగా, ఎర్రటి శిలలతో ఎప్పుడూ తగువులాడుకునే మనుషులు, రహస్య శక్తులున్న వృద్ధ మాంత్రికులతో నిండి ఉన్న ప్రాంతం!”
“మరి చంద్రుడు…” అంటూ యురేకస్ అందుకుంది. “చంద్రుడిలోని అమృతా కాలనీ అత్యంత అధునాతనమైనది. మొత్తం సౌర వ్యవస్థలోనే గొప్పగా అభివృద్ధి చెందిన కాలనీ. దానిలో ఒకప్పటి అమెరికన్లు, యూరోపియన్లు నివాసం ఉంటున్నారు. ఒక ఆదర్శవాదంతో ఆ కాలనీ అభివృద్ధి చేసుకున్నారు వాళ్ళు. చాలా బావుంటుంది…” చెప్పింది మర్యాదగా.
“నీకెలా తెలుసు? చంద్రుడి గురించి నువ్వు నాకెలా చెప్పగలుగుతున్నావు? రోబోటిక్ పరిధిలోకి రాని ఈ విషయాలు నీకెలా తెలుస్తున్నాయి? ఈ నాన్-సైంటిఫిక్ ఇన్‌ట్యూషన్ నీకెలా అలవడింది?”
“ఎలాగంటే… మాస్టర్! ఈ రోజు వరకు గెలాక్సీకి సంబంధించిన అన్ని వార్తలు తెలుసుకుంటున్నాను. మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోవాలనే కుతూహలంతో – ఎర్త్ కౌన్సిల్ వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్‌ను పరీక్షించాను… లేదు కొద్దిగా హ్యాక్ చేశాను. సమూరా బ్రతికే ఉన్నాడని, పారిపోయి చంద్రుడి అమృతా కాలనీలోనో లేదా సాధారణ మానవులకు నివాసయోగ్యం కాని చంద్రుడి లోని చీకటి ప్రాంతంలోనే దాక్కున్నాడని తెలిసింది. ఈ అంశాన్ని పరిశోధించేందుకు మిమ్మల్ని చంద్రుడి పైకి పంపాలని వాళ్ళు అనుకుంటున్నారని నా అనుమనం! ఇది నిజమయ్యే అవకాశం వందలో అయిదు వంతులు మాత్రమేననుకోండి!”
“ఓహ్! యురేకస్ నువ్వు తెలివైనదానివి”
“ఓహ్! చందమామ పైకా?…. నేను కూడా నీతో వస్తాను…” ప్రకృతి సంతోషంతో అరిచింది. “ఒప్పుకో హనీ… ఒప్పుకో! వస్తున్నామని చెప్పు. మనం కొన్ని రోజులు అక్కడ సంతోషంగా గడపచ్చు…” అంది ఉత్సాహంగా.
ప్రకృతి కేసీ, యురేకస్ కేసీ విస్తుపోయి చూశాను.
ఇంతలో యురేకస్ ఛాతి మీద సందేశం మళ్ళీ ప్రత్యక్ష్యమైంది.
కొన్ని క్షణాల తర్వాత ఆ సందేశం మాయమై అడుగున ఎడమ వైపు “జవాబివ్వండి” అని కనబడింది.
నేను వాయిస్ కమాండ్ ద్వారా జవాబిచ్చాను.
“ఎర్త్ కౌన్సిల్ అధికారులకి…
గౌరవనీయులారా, నార్త్ జోన్‌కి వచ్చి మిమ్మల్ని కలుసుకుని, చర్చించడానికి నేను సిద్ధం. నాతో పాటు నా భార్యని తీసుకురావడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
నమస్కారాలతో
హని ఆమ్రపాలి”.
యురేకస్ యాంత్రికంగా మీటని నొక్కింది. అంతే, సందేశం వెళ్ళిపోయింది.
(ఇంకా ఉంది)