భూమి నుంచి ప్లూటో దాకా… -10

0
3

అధ్యాయం 27: లెత్వాల్ రూజ్-2

స్పేస్‌షిప్ కంపించింది, అదిరింది. తరువాత గట్టిగా గర్జించి గనీమీడ్ సముద్రం నుండి అంతరిక్షంలోకి దూసుకుపోయింది.

నేను, డిమిట్రీ, ఏనిమాయిడ్ చెమటతో పూర్తిగా తడిసిపోయాం. ఒత్తిడి నిండిన పలాయనం వలన, సహచరుడు చాంద్‌ని కోల్పోవడం వలన ఒక రకమైన విభ్రాంతి స్థితిలో క్యాబిన్‌లో నిలబడిపోయాం.

ఈ స్పేస్‌షిప్‌ని ఒక విమానం లాగా ప్రయాణించటానికి అనువుగా రూపొందించారు. మామూలు విమానంలా గాల్లోకి లేచి, దాని రాకెట్లను పేల్చడం ద్వారా స్పేస్‌షిప్‌ని అంతరిక్షంలో నిర్ధారిత పయన పథంలో లేదా ఒక గ్రహం చుట్టూ కక్ష్య లోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియకి ఒక గంట సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రోటోకాల్ నిబంధనల మేరకు మేము సీటు బెల్టులు పెట్టుకుని, ఆక్సీజన్ మాస్కులు ధరించి మా సీట్లలో కూర్చోవాలి.

ఇంతలో సమారా సేవకులు వచ్చారు. మగ నర్సులు మా తడి శరీరాలను తుడిచి, మా వణుకును తగ్గించేందుకు పొడి దుస్తులను ఇచ్చారు. మాకు వేడి చాక్లెట్ పానీయం, వెచ్చని రొట్టె రొట్టెలు మరియు కూరగాయల మసాలా సూప్ ఇచ్చారు.

మా దురవస్థ గురించి ఆలోచిస్తుండగా, అప్పుడు వచ్చాడు సమూరా. ఆ భారరహిత స్థితిలో అతనెలా ఉన్నాడంటే ఓ అస్థిపంజరం మానవరూపంలో దెయ్యంలా తేలుతున్నట్టుగా ఉంది. అతనితో పాటే ఆల్ఫావ్యవస్థకి చెందిన – తలలు సాగినట్టుండే వింత, ముసలి మాంత్రికులు కూడా వచ్చారు.

తర్వాత వచ్చింది ప్రకృతి. ఆమె ముఖం పాలిపోయినట్టుగా ఉంది, మొహంలో ఆదుర్దా ఉంది. ఆమె ఎప్పుడూ ధరించే చీరలకు భిన్నంగా తనిప్పుడు ధరించిన దుస్తులామెకి చాలా బిగుతుగా ఉన్నాయి.

“హనీ!” అంటూ అరిచింది. “నీకేం కాలేదు కదా?”

సమూరా బొంగురుగొంతుతో అరిచాడు.

“ముందు నాకు ఆ మంత్రదండాన్ని ఇవ్వు. అప్పుడే ప్రకృతిని పంపుతాను”

నేను నా పొడవైన వదులుగా ఉండే దుస్తులలో గురుగ్రహపు మంత్రదండాన్ని దాచిపెట్టాను. నా శరీరం యొక్క పై ఉన్న ముందరి దుస్తుల లోపలి నుండి మంత్రదండాన్ని బయటకు తీశాను.

“ఇదిగోండి చక్రవర్తీ! మీ మంత్రదండం! ఇది చాంద్ జీవితాన్ని బలిగొంది, వాన్ కు జాక్‌ని గాయపరిచింది. దీని కోసం మా విశ్వశక్తిలో చాలా భాగం వ్యయమైపోయింది. మేము పునరుత్తేజం పొందేవరకూ ప్రాణంలేనివాళ్ళమే! కనీసం ఒక వారం రోజుల వరకూ మేము ఏ మాయలు ప్రయోగించలేం!” అన్నాను మంత్రదండం అందిస్తూ.

ఎముకలతో ఉన్న పొడవాటి చేతిని ముందుకు చాచి మంత్రదండాన్ని అందుకున్నాడు. భీతావహమైన ఆనందం వ్యక్తమవుతున్న పుర్రె లాంటి ముఖంలోని నోట్లోంచి దంతాలు బయటకి కనిపించేలా చిత్రంగా నవ్వాడు. “హా! హా! హా! అద్భుతమైన గురుగ్రహపు మంత్రదండం! ఇది నాది. దీనితో నేను వస్తువులను సృష్టించగలను. విశ్వశక్తిని సృష్టించగలను. పోరాడగల సైనికులను సృష్టించగలను. తుఫానులు సృష్టిస్తాను, దేన్నయినా ఆపుతాను” అన్నాడు.

“మీరు హాని చేయకూడదు, అమాయకులను చంపకూడదు, లేదా బెదిరించకూడదు. భవిష్యవాణి చెప్పింది!” అన్నాను వినయంగా.

“హ! హా! ఒక మూర్ఖపు షరతు ఎల్లప్పుడూ ఉంటుంది, కాదంటావా? అన్ని అద్భుత వస్తువులను పొందడానికి, ఇది ఒక నియమం. పర్వాలేదు. ఇప్పుడు..” అంటూ ప్రకృతిని నాపైపు తోశాడు. “ఇదిగో మీ ప్రియమైన భార్య! సజీవంగా, ఆరోగ్యంగా ఉంది. ఇంకా భూమి మీద మీ మామ కూడా విడుదలయ్యాడు. నీవు నీ మాట నిలబెట్టుకున్నావు, నేను నా మాట…!” అన్నాడు.

ప్రకృతి పరిగెత్తుకొచ్చి నన్ను హత్తుకుంది. నా బుగ్గల్లో వెచ్చని రక్తం ప్రహహించింది. ఏకకాలంలో నాకు ఆనందం మరియు అసహ్యం కలిగాయి. మంత్రతంత్రాలు, విశ్వశక్తి, దుష్ట తాంత్రికులు… అన్నిటిపై ద్వేషం కలిగింది. ఎర్త్ కౌన్సిల్ తమ పథకంలో భాగంగా నన్నూ, పకృతినీ పావులుగా వాడుకుంటోంది.

‘ఎంపికైన వ్యక్తినా, నా మొహం!’ అనుకున్నాను.

ఒక్క క్షణం ఆలోచించి, బిగ్గరగా చెప్పాను. “నేను ఎంపికైన వ్యక్తిగా ఉండాలనుకోవడం లేదు. ఓ సాధారణ మానవుడిగా, నేను నాలా ఉండాలని, నా సొంత విశ్వవిద్యాలయంలో పనిచేస్తూ, మిగిలిన జీవితంలో ప్రకృతితో హాయిగా బతకాలని కోరుకుంటున్నాను!”

ప్రకృతి కూడా ఏడుస్తోంది. వెక్కిళ్ళ మధ్య చెప్పింది “హనీ! వాళ్ళు చెప్పిన పని పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. నాతో పాటు మా నాన్ననీ కాపాడావు. ఇక నువ్వు ఇటువంటి సాహసాలు చేయడం నాకిష్టం లేదు!” అంది.

మగ నర్సులు గాయపడిన వాన్ కు జాక్‌ని ‘సిక్ బే’ కు తీసుకువెళ్ళి అతనికి చికిత్స చేయసాగారు. అది 21వ శతాబ్దపు ‘స్టార్ వార్స్’ టివి చిత్రాలలో చూపించిన స్టార్‌ఫ్లీట్ వంటి అంతర్ గ్రహ స్టార్‌షిప్ రకానికి చెందిన పెద్ద స్పేస్ షిప్. చాలా పెద్దది కానీ అవసరాన్ని బట్టి చిన్నదిగా లేదా పెద్దగా మారిపోతుంది.

కమాండ్ కాబిన్‌లో పెద్ద మానిటర్లున్నాయి, గాజు కిటికీలున్నాయి. సిబ్బంది, ప్రయాణీకులు, ఇంకా మాలాంటి ఖైదీల కోసం వివిధ రకాలైన గదులు ఉన్న కారిడార్లు ఉన్నాయి

సమారా నా దగ్గరికి వచ్చి, “హనీ, ప్రకృతి – మీకు ప్రయాణీకుల ప్రదేశంలో గది కేటాయించాం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీ స్నేహితులను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు హాయిగా నిద్రపొండి. మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి” అన్నాడు.

“ఇంకానా? ఎందుకు ప్రభూ? దయచేసి మమ్మల్ని భూమికి పంపించండి. మేమిద్దరం బాగా అలసిపోయాము. నేను మిషన్‍ని వదిలేస్తాను!” అంటూ వేడుకొన్నాను.

చక్రవర్తి సమూరా తన నల్లటి దుస్తులతో నిటారుగా నిలిచాడు. పుర్రె లాంటి ముఖాన్ని చిట్లించాడు.

“అవును! నా లక్ష్యం సగం పూర్తయింది. నేను అమృత ఔషధం, వెండి కొవ్వొత్తి, యూనివర్సల్ మిర్రర్, ఇదిగో ఇప్పుడు ఈ మంత్రదండం పొందాను. తదుపరి దశలు వీనస్, టైటాన్‌లపై ఉంటాయి. ఇంకో రెండు వస్తువులు సాధించాలి. అప్పుడు నా కుజగ్రహంలోని అరుణభూములకు తిరిగి వెళ్ళి – ఆ ద్రోహి మీరోస్ నుండి నా రాజ్యాన్ని నేను తిరిగి పొందాలని అనుకుంటున్నాను. ఇవన్నీ అయ్యాకనే మీ సంగతి…. కాని నేను నిన్ను చంపను. అద్భుత వస్తువులను గుర్తించడం కోసం మరియు సౌర వ్యవస్థలోనూ, గెలాక్సీలోనూ మాంత్రికుల రాజ్యం ఏర్పాటు చేసేందుకు ఎంపికైన వ్యక్తికి నువ్వు… హా! హా!” అంటూ తనదైన బొంగురుగొంతుతో నవ్వాడు సమూరా.

“ఆ భవిష్యవాణిని వృద్ధ మాంత్రిక సంఘంలోని ఏ మూర్ఖ దుర్బలుడు రాశాడో నాకు తెలియదు. అసలు వాళ్ళెవరో కూడా తెలియదు. గ్రహాలు కాలనీలుగా మారని కాలంలో వాళ్ళు గ్రహాల చలనాన్ని లెక్కించి ఉంటారు. ఒకానొక ప్రాంతంలో ఒకానొక సమయంలో జన్మించినవాడు మాంత్రికుల గెలాక్టిక్ సామ్రాజ్యాన్ని ఏలుతాడని రాశారు. నా మొహం! దీనంత హాస్యాస్పద విషయం విశ్వంలో మరొకటి లేదు! ఆమ్రపాలి గ్రామంలో ఒక అనాథ అయిన హనీ అమ్రాపాలి, కేవలం 75 నక్షత్రాల స్థాయి శక్తి ఉన్న ఓ సాధారణ బయోమెడికల్ ప్రొఫెసర్ ‘ఎంపికైన వ్యక్తి’ అట! ఎలా? ఇవి భూమి యొక్క గుహలలో లేదా అడవులలోని కుటీరాలలో వేలాది సంవత్సరాలుగా ఖాళీగా కూర్చున్నోళ్ళు ఏవేవో ఊహించి రాసిన భవిష్యవాణి! ఆ కట్టుకథలనే మూర్ఖంగా తరతరాలుగా అందించారు.”

ఒక లోహ స్వరం ఇప్పుడు అభ్యంతరం చెప్పింది “కానీ ప్రభూ, నా మాస్టర్ వస్తువులను సరిగ్గా గుర్తించారు. ప్రస్తుతం విశ్వశక్తి ప్రయోగంలో 1000 నక్షత్రాల స్థాయి పొందారు. ఆయన గాలిలో ఎగరగలరు, నీటి మీద నడవగలరు. ఇవన్నీ జరుగుతున్నాయి!”

“నువ్వు నోరు మూసుకో! నేను అనేక శతాబ్దాల పాటు సౌర వ్యవస్థ యొక్క గ్రహాలను పరిపాలించాను, అయితే ప్రతి గ్రహంలో మాంత్రికుల కాలనీలు మాత్రమే నా అధికారంలో ఉండేవి. నేను పాలపుంత గెలాక్సీలో మూడు వందల కాలనీలను మాత్రమే పాలించాను. ప్రత్యేకమైన కాలనీలు నాపట్ల విధేయతను, విశ్వాసాన్ని చూపాయి, మొత్తం గ్రహాలు కాదు. పాలపుంతలో కూడా కోట్లాది గ్రహాలు మరియు వ్యవస్థలు ఉన్నాయి. రెండువైపులా దాదాపుగా వంద వేల కాంతి సంవత్సరాలు ఉన్నాయి. నేనా 300 రాజ్యాలని  కోల్పోయింది తిరుగుబాటుల వల్లా లేదా రాజకీయ సంక్షోభం, యుద్ధం కారణంగానే. నాకు సౌర వ్యవస్థ అంతటా అభిమానులు, అనుచరులు ఉన్నారు. కాని నేను కుజగ్రహంలోని అరుణభూములలో స్థిరపడ్డాను. నేను  కుజగ్రహపు మానవులను కూడా గెలవలేకపోయాను.

కాబట్టి ఏ ఒక్క వ్యక్తి గెలాక్సీ లేదా సౌర వ్యవస్థలను పాలించడం అసాధ్యం. కానీ ‘మాంత్రిక చక్రవర్తి సమూరా కొత్త సామ్రాజ్యం’ అనే నినాదంతో దీన్ని సుసాధ్యం చేయడం కోసం ప్రయత్నించమని నా అనుచరులను ప్రోత్సహిస్తున్నాను.

నాలాంటి వేల సంవత్సరాల వయస్సున్న తాంత్రికుడికే ఇది కష్టంగా ఉంటే, ఈ అల్ప మానవుడు ఎంపిక చేయబడిన వ్యక్తి ఎలా అవుతాడు? ఈ కట్టుకథ కాస్త నిజం, కాస్త అబద్ధం. కానీ నేను మిమ్మల్ని వీనస్ మీద వదిలివేస్తాను. హనీ, నువ్వు తిరిగి భూమికి వెళ్లి నీ భార్యతో జీవితాన్ని గడపవచ్చు, ఉద్యోగమూ చేసుకోవచ్చు. హా! హా! టైటాన్‍లో నాకు డిమిట్రీ సహాయం చేస్తుంది. అక్కడ ఏ వస్తువు ఉందో నేను మీకు చెప్పలేను. కానీ ఒరే బాబూ – నువ్వెంత మూర్ఖంగా అనిపించినా, సౌర వ్యవస్థలో అన్ని కాలనీలను తిరిగి పొంది, పాలించే నా ప్రయత్నాలలో నాకు ఆటంకం కలిగిస్తావనే నాకనిపిస్తోంది.”

ఈ ముసలి చక్రవర్తి అంత సుదీర్ఘంగా మాట్లాడడం మునుపు నేను చూడలేదు. అతనలా మాట్లాడుతూనే ఉన్నాడు. స్పేస్‌షిప్ ముందుకు పోతూనే ఉంది. తర్వాత మమ్మల్ని మా విశ్రాంతి గదికి వెళ్ళమన్నాడు, మేము వినమ్రంగా ఒప్పుకున్నాం. స్పేస్‌షిప్ ‘లెత్వాల్ రూజ్’ గురుగ్రహపు ఉపగ్రహం గనీమీడ్‌ని విడిచి శుక్రగ్రహం వైపు సాగిపోయింది.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here