భూమి నుంచి ప్లూటో దాకా… -11

0
3

అధ్యాయం 30: లాండిస్-2

ఆ దుష్ట వృద్ధ మాంత్రికుల బెదిరింపులనీ, కేకలనీ, తరువాత ఏం జరిగిందనేదాన్ని నేను వివరించనవసరం లేదు.

ఒక గంట తర్వాత ఒక చిన్న ‘డిసెంట్ వెహికల్’లో నేను, యురేకస్, డిమిట్రీ, ఏనిమాయిడ్‌, ప్రకృతి ఎక్కాం. ఈసారి మాతో ప్రకృతి కూడా వస్తోంది. ఆ వాహనాన్ని ఏనిమాయిడ్ నడిపాడు. జాగ్రత్తగా తేలియాడే కాలనీపై దింపాడు. ఇదే వాహనాన్ని తరువాత మేము ‘లెత్వాల్ రూజ్’ మదర్ షిప్‌కి వెళ్లడానికి ఉపయోగించాలి.

సమూరా మమ్మల్ని ఒక శివారుకి – తేలియాడే కాలనీలో ఓ మూలకి పంపాడు. ఇది నిజంగానే ఒక భారీ మెరిసే లోహపు మిద్దెలా ఉంది. అటూ ఇటూ దాదాపు యాభై మైళ్ళు వ్యాపించి ఉంది. మేము బహుశా ఆ ప్లాట్‌ఫాం చివరి కొసలో ఉన్నామోమో.

మా వాహనం నేల మీద ఆగీ ఆగగానే, దూరంగా కిందకి దిగుతూనే దూరంగా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. నేల మీదుగా ఓ వాహన శ్రేణి వస్తోంది, నేలకి ఎగువన చిన్న డ్రోన్‌లు ఎగురుతూ వస్తున్నాయి.

మేము ఆక్సీజన్ మాస్కులు, గ్రావిటీ స్యూట్లు ధరించి క్రిందకి దిగాం. యురేకస్ మాతో పాటు దిగింది. ఇక్కడ మేము విజయం సాధించే అవకాశాలు ఏభై శాతం మాత్రమే అని మాకు తెలుసు. ఎందుకంటే ఏం చేయాలో కూడా సమూరా మాకు చెప్పలేదు. మేము నిజంగా ఏం చేయాలో, ఏది ఆశించాలో, అతను కోరుకున్న వస్తువుని ఎలా కనుగొనాలో ఖచ్చితంగా వివరించలేదు.

ఇది వెర్రితనంగానూ, పరిహాసాస్పదంగా ఉంటుంది. కానీ ఇదే అతని శైలి.

“యురేకస్! వాళ్ళు మనల్ని ఏం చేయ్యబోతున్నారో చెప్పు. నీ లాజిక్, రిమోట్ వ్యూ ఉపయోగించు. అవి కూడా రోబోలే… నీకు బాగా తెలిసి ఉండాలి!” అన్నాను.

అక్కడ గింయుమనే ధ్వనితో గాలి వీస్తోంది. దూరం నుంచి యంత్రాల కంపనం తెలుస్తోంది. తేలియాడే కాలనీ అన్న విషయం మరిచిపోతే, అది మామూలు గ్రహ ఉపరితలంలానే ఉంది. అక్కడి ప్రకృతి దృశ్యాలలో చెట్లు, కొండలు ఉన్నాయి. బహుశా సహజమైన స్థలంలా అనిపించాలని అలా ఏర్పాటు చేశారేమో.

అప్పటిదాకా దూరంగా కనిపించిన రోబోల శ్రేణి… ఇప్పుడు మాకు సమీపంలోకి వచ్చేసింది. ఏకతాళంలో నడిచే సైనికులలానే అవి కూడా వరుసగా నడుస్తూ వస్తున్నాయి.

ఒక స్వరం మూడు భాషలలో పలికింది. అందులో ఒకటి మాత్రమే నాకు అర్థమైంది.

“మీ చేతులు పైకి ఎత్తండి! మీరు అలా చేయకపోతే మిమ్మల్ని లేజర్ తుపాకులతో కాలుస్తాం! స్నేహితులా లేదా శత్రువులా! మీరేవరో తెలియజేయండి!”

నేను మాట్లాడడంలో తడబడ్డాను. యురేకస్ మాట్లాడింది.

“నేను యురేకస్ 7776, మార్స్ యొక్క రెడ్ ప్లెయిన్స్ మోడల్ 3000 మిలీనియమ్ రోబోని. ఈ నా మానవ యజమానులు – హనీ ఆమ్రపాలి, ప్రకృతి ఆమ్రపాలి, టైటాన్‌కి చెందిన డిమిట్రీ పొసయిడన్, గనీమీడ్‌కి చెందిన ఏనిమాయిడ్. మేము స్నేహితులం. శాంతితో మరియు పర్యాటకుల వలె వచ్చాము. ఎటువంటి హాని చేసే ఉద్దేశం మాకు లేదు.”

“హఠాత్తుగా మా కాలనీపైకి ఎక్కడ నుండి ఊడిపడ్డారో నాకు చెప్పండి.”

అది ఓ మానవ స్వరంగా ఉంది. బంగారు రంగు ఉంగరాల పట్టుజరీలాంటి జుట్టుతో ఉన్న పొడవైన ఎర్రటి అందమైన మనిషి రోబోల శ్రేణి నుంచి వెలుపలకి వచ్చాడు.

“నా పేరు హెరోడోటస్. నేను సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ బాధ్యతలు నిర్వహిస్తాను. సరైన పత్రాలు లేదా ఉద్దేశాలు లేకుండా వచ్చిన చొరబాటుదారులను చంపడానికి నేను ఆదేశించాను. మిమ్మల్ని ఇక్కడ ఎవరు దింపి వెళ్ళారు?  రాడార్ పర్యవేక్షణ ద్వారా ఇప్పుడే బయటకు వెళ్ళిన అంతరిక్ష నౌకను మేము గమనించాము. మరియు మీ డిసెంట్ వెహికల్‌ని ఇప్పుడు మా యాంత్రిక రోబోలు చుట్టుముట్టి ఉన్నాయి. నేను ఆదేశిస్తే ఒక్క నిమిషంలో దాన్ని ధ్వంసం చేస్తాయి. నాకు నిజం చెప్పండి. మీరు రక్షించబడతారు. మా వద్ద బ్రెయిన్ మ్యాపింగ్ చేసే యంత్రాలు కూడా ఉన్నాయి!” అన్నాడతను.

యురేకస్ మౌనంగా ఉండిపోయింది.

ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేనేనని నాకు తెలుసు.

నా జీవితంలో నేను ఎల్లప్పుడూ ఒకే నియమాన్ని అనుసరించాను.

‘విధి మరియు సత్యం మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడితే, ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. కావాలంటే మీరు మౌనంగా ఉండవచ్చు. కాని అబద్ధం చెప్పకండి, కానీ నిజాన్ని అణచివేయండి, మౌనంగా ఉండిపోవాలి.’

కానీ మీరు ఒక అబద్ధం చెప్పినట్లయితే, ఈ ఆధునిక ప్రపంచంలోని హై-టెక్ గాడ్జెట్లు, కెమెరాలు, బ్రెయిన్ మ్యాపింగ్ మరియు నిఘా కెమెరాల వల్ల తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. పైగా కలల ద్వారా కూడా జ్ఞాన ఒత్తిడి కలిగిస్తారు, నా విషయంలో జరిగినది అదే.

నిజానికే కట్టుబడాలి. అప్పుడు మీరు గెలుస్తారు.

“నేను హనీ ఆమ్రపాలి. భూమి నుండి వచ్చిన బయోమెడికల్ ఇంజనీర్‌ని. నేను కుజగ్రహపు అరుణభూముల చక్రవర్తి సమూరాచే ఆజ్ఞాపించబడ్డాను. నా నియంత్రణలో లేని వివిధ కారణాల వల్ల, నేను ఆయనకు విధేయత చూపుతున్నాను, గ్రహాల కాలనీలలో అద్భుత వస్తువులని పొందాలనే అతని లక్ష్యానికి కట్టుబడి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు నన్ను చంపుతామని, హాని చేస్తామని బెదిరించి ఇక్కడ ఏదో వెతకమని ఆదేశించి ఇక్కడ దింపి వెళ్ళిపోయారు. కానీ అదేంటో నాకు తెలియదు” చెప్పాను.

హెరోడోటస్ శ్రద్ధగా విన్నాడు.

“మాది ప్రశాంతమైన ఆర్బిటల్ కాలనీ. శతాబ్దాలుగా పరిశోధన మరియు వ్యాపారానికి అంకితమయ్యాం. ఇది ఒక అంతర్ గ్రహ మానవ కౌన్సిల్ చేత నిర్వహించబడుతుంది. ఇక్కడ రోబోలు మా ఆదేశాల ప్రకారం నడుచుకుంటాయి. ప్రాణవాయువు మరియు ఆహారం అవసరమయ్యే మానవులకు ఇక్కడ నివసించడం కష్టం. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఏదో అద్భుత వస్తువు ఉందనో లేదా మంత్రగాళ్ళు ఉన్నారనో నేను అనుకోడం లేదు. ఏమైనప్పటికీ, నేను మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. కానీ మేము ఈ విషయాన్ని పరిష్కరించే వరకు – అక్రమ ప్రవేశానికి శిక్షగా మీరు మా జైలులో ఉంటారు. మీకు హాని జరగదు. మీరు మా నిబంధనలకు కట్టుబడి ఉండాలి” అన్నాడతను.

మళ్ళీ మూడు భాషలలో ఆదేశాలు! ఇంగ్లీష్, ఒక తెలియని భాష, యూనివర్సల్ డిజిటల్ భాష.

నేను నోరు తెరిచి ఏదైనా చెప్పే లోపుగానే అతను గట్టిగా అరుస్తూ, ఏదో ఆదేశమిచ్చాడు.

రోబో సైనికులు మమ్మల్ని చుట్టుముట్టాయి, ఆయుధాల కోసం మా శరీరాలను వెతుకుంటే డిమిట్రీ నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రకృతి సిగ్గుపడుతూ, ‘ఓహ్, వద్దు వద్దు’ అంది.  వెతకడం పూర్తయ్యాకా, ఒక స్ఫుటమైన ఆదేశం – “వాళ్ళని కన్‌ఫైన్‌మెంట్ సెంటర్‌కి తీసుకెళ్ళండి!”

డిమిట్రీ ‘హియర్ ఐ కమ్ వీనస్ డి మిలో! ఐ సీ థై బ్యూటీఫుల్ గ్లోరీ!’ అంటూ ఓ పాప్ పాటందుకుంది.

డిమిట్రీ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. నిర్లక్ష్యంగా కనబడుతుంది, అన్నీ తేలికగా తీసుకుంటుంది. కానీ ఆమె ఒక క్షణంలో హింసాత్మకంగా, శక్తివంతంగా మారగలదు.

ప్రకృతి అంది “హనీ, ఇప్పుడు జైలుకు వెళ్ళడానికి సిద్ధమవ్వు. మనం అన్ని రకాల ఖైదులను చూస్తున్నాం. కిడ్నాప్, బ్లాక్‌మెయిల్, స్పేస్‌షిప్‌లో గొడవ, ఇప్పుడు జైలు…”

ఏనిమాయిడ్ ఎలుగుబంటిలా అరిచి, వాళ్ళతో పాటు నడిచాడు.

“ఇదీ మనకు మంచిదే కావచ్చు. స్పేస్‌షిప్‌లో భారరహిత స్థితిలో ప్రయాణం చేసీ చేసీ విసుగ్గా ఉంది. ఇది కొంత మార్పు” అన్నాను.

***

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here