Site icon Sanchika

భూమి నుంచి ప్లూటో దాకా… -11

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 28: తేలియాడే శుక్రగ్రహ కాలనీలు -1

[dropcap]స్పే[/dropcap]స్‌షిప్‌లో పగలూ, రాత్రీ ఒకేలా ఉన్నాయి. జారిపోకుండా మంచానికి బెల్ట్‌లు కట్టుకోడం, నిద్రపోవడం. కాలకృత్యాలు తీర్చుకోడం కోసం అడ్డదిడ్డంగా తేలుతూ బాత్‌రూమ్‍కి వెళ్ళడం. చక్రవర్తి సమూరా దయతలచి ఇచ్చిన ఆహారం తీసుకోడం. గడ్డకట్టిన బిస్కట్లు, పాలు, చల్లని మాంసం, యాపిల్స్.. కావాలంటే గ్రావిటీ మీట నొక్కి, కృత్రిమ గురుత్వాకర్షణని ఏర్పరుచుకుని సౌకర్యవంతంగా నడవవచ్చు. ఈ వివరం… తల మీద యాంటినా ఉండి, పదునైన చూపులు కలిగి, శంఖాల్లాంటి చెవులున్న, చిన్ని కళ్ళు, ఇరుకైన లోపలి కనురెప్పలు కల్గి ఉన్న స్టెవార్డ్ ఒకతను చెప్పాడు.

కానీ నేనూ, ప్రకృతి వ్యోమగాముల్లా తేలడాన్ని సాధన చేశాము, ఎందుకంటే అంతరిక్షయానానికి మేము బాగా అలవాటు పడాలనుకున్నాం. ప్రధాన కమాండ్ గదిలో కృత్రిమ గురుత్వాకర్షణ ఉన్నది. అక్కడ ఓ గద్దె మీద కూర్చుని పెద్ద తెరలపై అన్నీ గమనిస్తున్నాడు సమూరా. అతని కుమార్తె యువరాణి సయోని, ఆల్ఫా సెంటారి వ్యవస్థకి చెందిన వింత తాంత్రికులు వ్యూహాల గురించి చర్చించుకున్నారు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే విద్యుచ్ఛక్తిని పొదుపు చేయడానికి అన్ని ప్రయాణీకుల గదులలో కృత్రిమ గురుత్వాకర్షణ ఐచ్ఛికంగానే కల్పించారు.

జరిగినదాని గురించి, భవిష్యత్తు గురించి నేనూ ప్రకృతి ఎడ తెగకుండా మాట్లాడుకున్నాం. ప్రకృతి తండ్రి, గ్రామపెద్ద మహాతో మాట్లాడనిచ్చారు, ఆయనకి ఇదంతా నచ్చలేదు.

“ఆ దుర్మార్గులు నన్ను నా ఇంటి నుండి ఎత్తుకొచ్చి, ఓ అరణ్యంలోకి తీసుకెళ్ళి నా మెడపై కత్తి పెట్టారు! ఇందులో నీ ప్రమేయం ఉందని నేను ఊహిస్తున్నాను. హనీ, నువ్వు కూడా చెడు ఆత్మలు, గ్రహాంతరవాసులతో ఆటలాడుతున్నావు, మీ నాన్నలా! వాళ్ళు 10 రోజుల నన్ను బెదిరించి, నన్ను నా ఇంట్లో వదిలేస్తారు. ఏం జరుగుతోంది? నువ్వు చేస్తున్నదానిని ఆపేయ్. త్వరలో తిరిగి వచ్చేయ్!” అంటూ నామీద అరిచారు మహా, ఐజి నెట్ ఫోన్‌లో. ప్రకృతి తన తండ్రిని సముదాయించేందుకు ప్రయత్నించింది. కానీ ఇదంతా చాలా జటిలమైనది… ఆయనికి వివరించడం కష్టం.

ఈ బ్లాక్‌మెయిల్‍లో అనేక రహస్య విషయాలు ఉన్నాయి: ప్రతీకారం, అంతర్ గ్రహ కుట్ర, సౌర వ్యవస్థ యొక్క గ్రహ కాలనీలను, వనరులను జయించాలనే ఓ వృద్ధ మాంత్రికుడి ఆశయం.

ఎన్నో గంటల పాటు వీటి గురించే సుదీర్ఘంగా యోచించాను.

ఇప్పుడు మాత్రం కేవలం ఆలోచిస్తున్నాను.

ఏ కలలు, ఏ పీడకలలు లేవు. తర్కం, విశ్లేషణ మాత్రమే ఉంది.

సమూరా లాంటి ముదుసలి, తన వికారమైన కుమార్తె సయోనితో కలిసి అరుణభూములను తిరిగి జయించటానికి ఎలా ప్రయత్నిస్తాడు? కొన్ని శక్తులు కలిగిన ఇద్దరు ఆల్ఫా సెంటౌరి మాంత్రికులు మాత్రమే వాళ్ళకి సాయంగా ఉన్నారు. వారి లక్ష్యం అద్భుత వస్తువులను చేజిక్కించుకోడమే.

అయితే వాళ్ళు అన్ని సౌర వ్యవస్థల కాలనీలను జయించగలమని వాదించడం ఎంత హాస్యాస్పదం?

వారు మిగిలిన అద్భుత వస్తువులను స్వాధీనం చేసుకున్నారని అనుకున్నా.. వాళ్ళెలా ముందుకు వెళతారు?

అరుణభూములలోని మాంత్రికులంతా ఇప్పుడు మీరోస్ నియంత్రణలో ఉన్నారు. కుజుడి మానవ కాలనీలో అధ్యక్షుడు కాన్‌స్టంట్‌టైన్, జనరల్ గ్యాని ఎలాగూ సమూరాకి బలీయమైన ప్రత్యర్థులే!

భూమి విషయానికొస్తే ఎర్త్ కౌన్సిల్ పూర్తిగా భూమిని మరియు దాని ప్రజలను, వ్యవస్థలను తన అదుపులో ఉంచుకుంది.

చంద్రుడి, గనీమీడ్‌లోని భూగర్భ కాలనీలలోని నాయకులు తటస్థంగా ఉంటారు లేదా తాంత్రికులకు వ్యతిరేకంగా ఉంటారు.

ఇక శుక్రగ్రహం.. ఇంకా టైటాన్.

మానవ వలసరాజ్యాలకు శుక్రగ్రహం అనుకూలించదు. ఇది 3000 సెంటీగ్రేడ్‌ల పైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది, దానికి మించి వాతావరణంలో 200 మైళ్ళ పైన మందమైన మేఘాలు ఉంటాయి.

అయితే, శుక్రగ్రహ ఆకాశంలో 31 మైళ్ళ ఎత్తున తేలియాడే ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయని నేను బ్రౌజింగ్ ద్వారా తెలుసుకున్నాను, వాటిలో అన్వేషణ, సాహసాలు, పరిశోధన, ఇంకా విలక్షణ జీవనం కోసం అక్కడ స్థిరపడిన గ్రహాంతర సమూహాల కాలనీలు ఉన్నాయి.

ఈ కాలనీలకు సూర్యకాంతి నిరంతరాయంగా లభిస్తుంది, ఇవి శుక్రుడి చుట్టూ ఒక కక్ష్యలో తిరుగుతూంటాయి, సూర్యుడి నుంచి కాంతిని, శుక్రుడి నుండి ఖనిజాల పొందుతాయి. కొన్ని కాలనీలు విచిత్రమైన లోహాల వ్యాపారం, ఎక్సోటిక్ టూరిజం ద్వారా వృద్ధి చెందాయి.

శని గ్రహానికి ఉపగ్రహమైన టైటాన్‌ డిమిట్రీ స్వస్థలం. అక్కడ భూగర్భ కాలనీలు ఉన్నాయి, నీరు పుష్కలంగా లభ్యమవుతుంది.

ఈ రెండు చోట్లా దాచి ఉంచిన అద్భుత వస్తువులను సమూరా సాధించాడనే అనుకుందాం, అప్పుడతను అరుణభూములని తిరిగి ఎలా గెలుస్తాడు? తన మునుపటి కాలనీ అయిన కుజగ్రహాన్నే గెలవలేనప్పుడు మొత్తం సౌరవ్యవస్థని ఎలా ఆక్రమించుకోగలడు?

అతని ప్రణాళికలేమిటో… చాలా జటిలంగా ఉన్నాయి. నా మామూలు మానవ మేధకి అందడం లేదు.

ఈ పాపిష్టి పనిలో నన్ను వాడుకోవాలనుకునే ఈ మూర్ఖత్వం ఎందుకు?

ఈ రకంగా ఆలోచిస్తూ, తప్పించుకోడానికి ప్రణాళిక వేస్తూ.. నేను ప్రకృతి తోనూ, విశ్వసనీయమైన నా రోబో యురేకస్‌తోనూ మిగిలిన ప్రయాణాన్ని గడిపాను.

ఎట్టకేలకు, శుక్రగ్రహాన్ని సమీపించాము.

అధ్యాయం 29: తేలియాడే శుక్రగ్రహ కాలనీలు -2

వీనస్, సౌందర్యదేవత పేరు కలిగిన ఒక ప్రకాశవంతమైన గ్రహం. భూమి నుంచి కనబడే ఈ గ్రహానికి ఉదయపు నక్షత్రం లేదా సాయంత్రపు నక్షత్రం అని కూడా పేర్లు ఉన్నాయి. మానవ సాహిత్యంలో అనేక వేల సంవత్సరాలుగా ప్రేమ, కళల యొక్క దేవతగా అభిమానించబడింది, ఆరాధించబడింది.

…కానీ ఇక్కడ ఎలాంటి ఆవాసాలు లేవు, ఎందుకంటే మానవులు లేదా ఏ ఇతర జీవులుకాని కాలనీలు ఏర్పాటు చేసుకోలేనంతగా ప్రతికూల వాతావరణం ఉంది.

శుక్రగ్రహంపై 3000 సెంటీగ్రేడ్ పైగా ఉన్న అధిక ఉష్ణోగ్రత భయంకరమైనది. గ్రహం ఉపరితలంపై దాదాపు రెండు వందల కిలోమీటర్ల కార్బన్ డయాక్సైడ్ నిండిన ఒక మందపాటి మేఘం ఉంది. ఎప్పటికప్పుడు గ్రహం మీద తుఫానులు వస్తుంటాయి, అగ్నిపర్వతాలు బద్ధలవుతూ ఉంటాయి.

కానీ నవకల్పనకీ, వలసరాజ్య స్థాపనకు బలీయమైన కోరిక ఉన్న మానవులు శుక్రగ్రహపు ఉపరితలానికి యాభై కిలోమీటర్ల ఎత్తులో కాలనీలు ఏర్పరుచుకోడానికి మార్గాలను కనుగొన్నారు. 21వ శతాబ్దంలో లాండిస్ అని పిలవబడే ఒక శాస్త్రవేత్త చేసిన ప్రతిపాదన 28వ శతాబ్దం నాటికి ఆచరణ సాధ్యమైంది.

కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రేట్స్ పుష్కలంగా ఉన్నాయి. సూర్యకాంతి ఉపరితలం పై శక్తి మరియు నీటిని సృష్టించడానికి సహాయపడింది. భూమికి చెందిన ప్రముఖ దేశాలు స్పేస్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించాయి.

చివరగా లెక్కించినప్పుడు, శుక్రుని కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తున్న డజను స్పేస్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అక్కడున్న వాళ్ళంతా ఒకప్పటి అమెరికన్లు, ఇంగ్లీష్, రష్యన్లు మరియు చైనా జాతీయతలకు చెందినవారు. కానీ ఇప్పుడు ఈ కాలనీలు… మిశ్రమ మానవులు, మానవ రూపంలోని రోబోలు, గ్రహాంతరవాసులు, ఇంకా సుదూరపు… వివరాలు తెలియని జీవులచే ఆక్రమించబడ్డాయి. ఈ కాలనీలను ఆక్రమించడం, కోసం, పాలించడం కోసం యుద్ధాలు జరిగాయి, తరచుగా పాలకులు మారుతూండేవారు.

ఇప్పుడు అక్కడ ఒక డజను కాలనీలు ఉన్నాయి, వీటిని పర్యాటక ప్రయోజనాలకి, పరిశోధనలకు, గ్రహాల మధ్య ప్రయాణాలకి, నక్షత్రాల నడిమి ప్రయాణాలకు మజిలీగా ఉపయోగిస్తున్నారు.

ఈ సమాచారం ఇంటర్ గెలాక్టిక్ ఎన్‌సైక్లోపీడియాలో ఉంది, ఇది రోబో యురేకస్ యొక్క హార్డ్ డిస్క్‌లో అందుబాటులో ఉంది.

కొత్త గ్రహాలను, కొత్త నాగరికతలు సందర్శించడమంటే నాకెప్పుడూ ఆసక్తికరమే. అక్కడ ప్రజలు అనుసరించే వింత జీవన మార్గాన్ని తెలుసుకోడం నాకిష్టం. తేలియాడే శుక్రగ్రహ నగరాలకు చెందిన ఈ కాలనీల జనాభా ఎక్కువగా రోబోలు, గ్రహాంతర జాతులు, అతి కొద్దిగా మానవ జాతులలో నిండి ఉంది. రోబోలకు కావలసిన విద్యుచ్ఛక్తిని సూర్యరశ్మి నుండి గ్రహిస్తారు, శుక్రుని వాతావరణంలో అధికంగా ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నుండి వెలికి తీసిన ఆక్సిజన్ ఎక్కువగా మానవులకు అవసరం కావచ్చు.

శుక్రుడి ఉపరితలం ఇప్పటికీ ప్రతికూలమే, ఇంకా మండుతూనే ఉంది. కానీ, దాని ధ్రువపు ప్రాంతాలలో అన్వేషణ, పరిశోధన కోసం రోబోలను దిగుమతి చేసుకునేందుకు చిన్న కాలనీలను నిర్మించడానికి ‘టెర్రాఫార్మింగ్’ చేయబడింది. ఈ కాలనీలకి ప్రధాన ఆర్థిక వనరులు – పర్యాటకం, ఇంకా సమీపంలోని ఆస్టరాయిడ్ బెల్టులోని గనులు.

“అటెన్షన్! అటెన్షన్! మనం వీనస్ ఫ్లోటింగ్ సిటీ ‘ల్యాండిస్- 2’ చేరుతున్నాం. మీ సీట్ బెల్ట్‌లను ధరించండి, నేలకు దిగడానికి సిద్ధంగా ఉండండి!”.

లోహ స్వరంతో ‘లెత్వాల్ రూజ్’ స్పేస్‌షిప్‌లో ఒక ప్రకటన ప్రసారం అయ్యింది.

2013లో జరిగిన ఓ శాస్త్రీయ సమావేశంలో శుక్రగ్రహంపై తేలియాడే నగరం భావనని ప్రతిపాదించిన మూల శాస్త్రవేత్త పేరు లాండిస్.

మేము కిందకి దిగసాగాం, నేను కిటికీ ద్వారా చూడగలిగాను. సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న, తళుకులీనుతున్న భారీగోపురం వంటి ఆకారంలోని నివాసాలు, ల్యాండింగ్ రన్‌వేలు, సౌరశక్తిని సాధించే ప్యానెల్స్ కనిపించాయి. గాలి యొక్క భారీ బుడగలు ఫ్లోటింగ్ సిటీ చుట్టూ తేలియాడుతున్నాయి. బహుశా నగరానికి సరఫరా చేయడం కోసం వాటిని ఆక్సిజన్‌తో నింపారేమో.

“ఇప్పుడు ఏం చేయాలి?” ప్రకృతి అడిగింది. “ఏ వింత వస్తువు ఇక్కడ ఉంది? మన ప్రాణాలను మళ్ళీ పణంగా పెట్టాలా?”

మా సహచరులలో ఒకరు చనిపోయారు, మరొకరు గాయపడ్డారు. డిమిట్రీ ఇంకా ఏనిమోయిడ్ మాత్రమే మిగిలారు. ప్రకృతీ, నేను సజీవంగా ఉన్నందుకు అదృష్టవంతులమే.. రోబో కూడా మాతో ఉంది.

అప్పుడు ఒక పెద్ద కుదుపుతో మా స్పేస్‌‍షిప్ ఎక్కడో నేలను తాకింది.

‘లెత్వాల్ రూజ్’లో క్షణం పాటు చీకటి, కొద్దిసేపు కంపనం కలిగింది, ఆపై ఇంజిన్లు ఆపివేయబడ్డాయి.

“అసలిక్కడ జనాలు ఎలా నివసిస్తున్నారో అర్థం కావడం లేదు, మన స్పేస్‌షిప్‌ని ఇక్కడ ఎలా దిగనిచ్చారు? ఇది ఒక గ్రహ ఉపరితలం కాదు. ఇది ఫ్లోటింగ్ నగరం. దేవుడా!” అంది ప్రకృతి.

“నివసించటానికి కావల్సిన ఆక్సీజన్, నీరు ఎక్కడున్నాయి? ఇక్కడికి ఎలా సరఫరా చేయబడుతున్నాయి?” అన్నాడు ఏనిమాయిడ్. అతను అరుదుగా మాట్లాడుతాడు. ఇప్పుడు అతను నిజంగా ఆశ్చర్యపోయాడు లేదా సంభ్రమానికి లోనయ్యాడు.

“నేను వీనస్ యొక్క ల్యాండిస్ ఫ్లోటింగ్ నగరాల గురించి మాత్రమే విన్నాను. ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. ఇక్కడికి వచ్చిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు…” అంటూ ఎప్పటిలానే తనకి అలవాటైన రీతిలో నవ్వింది డిమిట్రీ.

“ఎలాంటి ఆస్వాదన లేదా శృంగారం లేకుండా వారు ఇక్కడ నివసిస్తున్నారు! ఇలాంటి చోట యంత్రాలు మాత్రమే ఉండగలవని నా అంచనా. హా! హ!” అంది.

అప్పుడు నా మనసుకి మెరుపులా స్ఫురించింది.

“అవును. మానవులు లేదా ఇతర మానవ రూప జీవులు ఇక్కడ ఉండవు. బహుశా ఇది రోబోలచే  నియంత్రించబడుతోందేమో? పరిశోధన లేదా ఇతర కార్యకలాపాలకు మానవ యజమానులచే నియంత్రించబడే రోబోలు. ఆక్సిజన్ అవసరం లేని రోబోలు, ఇక్కడ లభించే సూర్యరశ్మిని శక్తిగా ఉపయోగించుకునే రోబోలు. ఇక్కడ ఉన్న కొద్దిమంది మానవులు కార్బన్ డై ఆక్సైడ్ నుండి సృష్టించబడిన ఆక్సిజన్‌ని వినియోగించుకుంటారు. శుక్రుని ఉపరితలం పై తేలుతున్న బుడగలలో ఆక్సీజన్ నిల్వ ఉండి ఉండవచ్చు.

గత సహస్రాబ్ది నుండి శుక్రునిపై కాలనీలకి విషయంలో పురాతన అంచనాలు ఉన్నాయి.

తాంత్రిక చక్రవర్తి నీచమైన అవసరాలకు ఉపయోగపడే ఏ వస్తువు ఇక్కడ దాచబడి ఉంటుంది? ఏ వృద్ధ మాంత్రికుడు ఇక్కడికొచ్చి దాన్ని ఇక్కడ… ఈ తేలియాడే కాలనీలో దాస్తాడు?

అయితే గతంలో ఉన్నట్టే, విశ్వంలోని కొన్ని పద్ధతులు విచిత్రమైనవి. దుష్టుల బారి నుంచి వాటిని కాపాడటానికి సౌర వ్యవస్థ యొక్క రహస్య స్థలాలలో శక్తివంతమైన అద్భుత వస్తువులను ఎందుకు దాచారనేదాని గురించి పెద్ద వృత్తాంతాన్నే వ్రాయచ్చు… బహుశా అది మరొక కాలానికి చెందిన మరొక కథ కావచ్చు.

“హనీ ఆమ్రపాలి!” సమూరా యొక్క కీచు గొంతు ప్రతిధ్వనించింది. తరువాత తల వెనక్కి తిరిగిన మంత్రగత్తె సయోని గొంతు…

“హనీ నువ్వు క్రిందకి దిగు! నువ్వింకా నాకు పని చేయవలసి ఉంది. అయితే ఇప్పుడు బ్లాక్‌మెయిల్ సమయం ముగిసింది. మీరు నా శక్తులను నేను తిరిగిపొందడానికి, కుజగ్రహంలో నేను కోల్పోయిన రాజ్యాన్నీ, సౌర వ్యవస్థలో కోల్పోయిన గ్రహ కాలనీలను తిరిగి పొందడానికి నేను ఎదుర్కొంటున్న సమస్యలను చూశావు. నా కూతురు చనిపోవడానికి నువ్వే కారణం.. పైగా నా కూతురు ఇప్పుడో వికారమైన జీవిగా మారడానికి నువ్వే కారణం. నాకు చావు లేకపోయినా, ఇప్పుడు ఇలా అస్థిపంజరంలా ఉన్నాను. అందువల్ల నేను గ్రహాంతర సామ్రాజ్యం లేదా విశ్వశక్తిని పునఃస్థాపించటానికి అన్ని మార్గాల ద్వారా వెళ్ళాలి. నాకు ఐదు అద్భుత వస్తువులు లభించాయి. ఇంకా రెండు మాత్రమే మిగిలిపోయాయి. ఇక్కడ వీనస్ యొక్క ల్యాండిస్ -2లో ఒకటి, ఇంకొకటి టైటాన్‌లోనూ ఉంది. ఆ రెండూ సాధించాకా, అప్పుడు నేను అరుణ భూములకు వెళ్లి, కుజగ్రహాన్ని స్వాధీనం చేసుకుంటాను. మాంత్రిక ద్రోహులను, మానవ కాలనీ అధ్యక్షుడు కాన్‌స్టాంట్‌టైన్‌ని ఓడిస్తాను.”

” కానీ” నేను అతని మాటలకి అంతరాయం కలిగించాను.

“నా ప్రభూ, మీరు అడిగినట్లుగా నేను మీకు సేవ చేసాను. నన్ను, నా స్నేహితులను, నా భార్యను విడిచిపెడతానని మీరు వాగ్దానం చేశారు. కానీ ఒకరు చనిపోయారు. దయచేసి మమ్మల్ని వదిలి మీ మానాన మీరు వెళ్ళండి!” అన్నాను.

“తప్పకుండా! ఇక్కడ వీనస్ యొక్క లాండిస్‌లోనూ, టైటాన్‌లో ఉన్న అద్భుత వస్తువులను సాధించడంలో నాకు సాయం చెయ్యి. చాలు. టైటాన్ నుంచి భూమికి వెళ్ళే స్పేస్‌షిప్‌లో మిమ్మల్ని భూమికి పంపేస్తాను. డిమిట్రీని టైటాన్‌లో వదిలేస్తాను. ఏనిమాయిడ్‌ని గనీమీడ్‌కి పంపేస్తాను. కావాలంటే అతను రాబోయే యుద్ధంలో నా సైనికాధికారిగా పనిచేయచ్చు” చెప్పాడు సమూరా.

ఇది ఎప్పటికీ ముగిసేది కాదు. ప్రకృతి కేసి చూశాను.

ప్రకృతి నల్లని నేత్రాలు గంభీరంగా, అభావంగా ఉన్నాయి. ఆమె పెదాలు వణుకుతున్నాయి. టైటానియన్ అందగత్తె డిమిట్రీ చెప్పింది: “మాస్టర్ హనీ! ఒప్పుకోండి! ఏదేమైనా మనం ఇక్కడ్నించి తప్పించుకోలేం. పైగా అద్భుత వస్తువులను గుర్తించడానికి మీరే ‘ఎంపికైన వ్యక్తి’! మేము పాపాత్ములం, వాటిని కనుగొనలేం.”

“ప్రభూ! యువరాణీ! నేను సర్వమానవ స్వేచ్ఛ మరియు సమానత్వం కోరుకుంటాను. అన్ని మానవ విలువలను నిర్మూలించటానికి చేసే యుద్ధంలో నేను మీకు సహాయం చేయలేను. కానీ మీరు నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? విశ్వశక్తినిని సాధనచేసే సాధారణ మానవుడిని నేను. నేనే ఎందుకు? నన్నే ఎందుకు ఎన్నుకున్నారు?” అడిగాను.

“మూర్ఖత్వం! దీనికన్నా చెత్త ఇంకోటి లేదు. విశ్వం మొత్తంలో ‘ఎంపికైన వ్యక్తి’వి నువ్వొక్కడివే కాదు. నువ్వు స్వచ్ఛమైనవాడివి, అమాయకుడివా… నా మొహం… నీ లాంటి వాళ్ళు అన్ని గ్రహాలలోనూ ఉన్నారు. మేం నిన్ను ఎంచుకున్నాం అంతే! అంతకు మించి ఏం లేదు. మీ నాన్న నారా ఆమ్రపాలిని కూడా ఇలాగే ఎంచుకున్నాం, కాని అతనూ నీలాగే మూర్ఖుడు. మాకే విధంగానూ సాయపడలేదు. అతను కూడా స్వచ్ఛమైనవాడూ, అమాయకుడేనా? హ! హ!!” అన్నాడు సమూర గట్టిగా నవ్వుతూ. “ఇప్పుడు నువ్వు మాకు దొరికావు. మాకు సాయం చెయ్యక తప్పదు. ఈ అద్భుత వస్తువులను చూడడానికి నీ జన్యువులు అనువుగా ఉన్నాయి, నీకు ప్రత్యేకమైన ‘కళ్ళు’ ఉన్నాయి. నువ్వు అలా మాత్రమే అనుకో!” చెప్పాడు సమూరా. అతను నా తండ్రిని ఎగతాళి చేసినప్పుడు నా రక్తం మరిగింది.

ఇంతలో అతని స్వరం మారింది. “చూడు హనీ; వైఫల్యాలను గ్రహించు. అవును. భవిష్యవాణి గురించే అంటున్నాను. ఆ జోస్యాలన్నీ నక్షత్రాల యొక్క కదలికలు, గెలాక్సీ స్థానాలు మరియు కల్లోలత్వం తదితర అంశాలపై వృద్ధ మాంత్రికుల అవగాహపై ఆధారపడి ఉంటాయి. నేను సౌర వ్యవస్థను పాలించాను! నేను ఆల్ఫా సెంటారీ సామ్రాజ్యానికి విధేయుడనై ఉంటాను. ఇక్కడ నుంచి పాలపుంతలో ఇతర నక్షత్ర వ్యవస్థల పాలిస్తాను. విశ్వంలో ఇదంతా ఒక విశాలమైన మాంత్రిక సామ్రాజ్యం అవుతుంది. ఈ సామ్రాజ్యం అనంతమైనది, శాశ్వతమైనది. దీని చుట్టుకొలతే ఒక మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. నాకే తెలియని విషయాలు చాలా ఉన్నాయి, అయితే నేను ఉన్నతమైన ఆల్ఫా వ్యవస్థకి ఒక సేవకుడిని. నన్ను ఆపడం మీ వల్ల ఏమవుతుంది?నాతో కలువు. నా తరువాత నువ్వే! నువ్వు ఎవరికీ తక్కువ కాదు!” అన్నాడు సమూరా.

సమూరా రెండు అడుగులు ముందుకు వేశాడు. హఠాత్తుగా తన చేతుల్లోకి ప్రకృతి ముఖాన్ని తీసుకుని, ఆమె కళ్ళలోకి చూశాడు. “ఈ అమ్మాయి నీ రాణి అవుతుంది. నువు వేల నక్షత్రాల స్థాయి విశ్వశక్తిని సాధించి, అమరత్వం పొందుతావు. సౌర వ్యవస్థను పరిరక్షిస్తూ, ఇతర వ్యవస్థలలో మాంత్రిక సామ్రాజ్యాలను సందర్శించడానికి పాలపుంతలోని అన్ని గ్రహాలకు ప్రయాణం చేస్తావు. ఊహించు! ఊహించు! ఎంత సాహసోపేతంగా ఉంటుంది.  భూమికి చెందిన తక్కువస్థాయి మానవులతో మళ్ళీ కలిసిపోవద్దు. వారు విలువలేని అలగాజనం! నాతో కలువు! నాతో కలువు! సగం మనిషి స్థాయి నుండి అత్యంత ఉన్నత నైపుణ్యం కలిగిన పూర్తిస్థాయి మాంత్రికుడిగా ఎదుగు! హనీ ఆమ్రాపాలి, నాలాగే ఎప్పటికీ మరణం లేకుండా ఉండు! కుజగ్రహపు అరుణభూముల నుండి సౌర వ్యవస్థని పాలించే శాశ్వత చక్రవర్తి సమూరాకి ఉప అధికారిగా ఉండు! అరుణభూముల రాజధాని ‘మంత్ర’లో స్థిరనివాసం ఏర్పరుచుకుంటున్నట్టు ఊహించుకో! మనుషులు,  హ్యుమానాయిడ్లు, ఏనిమాయిడ్లు, రోబోలు, ఇంకా ఇతర జీవులు నిన్ను “మహా ప్రభూ” అని సంబోధిస్తూ, నీకు విధేయులుగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో! గెలాక్సీలోని అన్ని సౌకర్యాలు అనుభవిస్తావు….” అన్నాడు.

“అమరత్వమా? మీలా అస్థిపంజరంలానా? లేదా తల వెనుకకు తిరిగి ఉండడమా? ఛీ” అంది ప్రకృతి కోపంగా. ఆమె కళ్ళు ఎర్రగా అయ్యాయి. ముఖంలో క్రోధాగ్ని! “అద్భుత వస్తువులని పొందిన తరువాత కూడా మమ్మల్ని మా మానాన వదలివేస్తారని నమ్మకం ఏంటి? చంద్రునిపైన, గనీమీడ్‌లో కూడా ఇలాగే చెప్పారు. మీరు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు! మీరు వాగ్దానాలు లేదా బెదిరింపులతో ఎల్లప్పుడూ మమ్మల్ని వాడుకుంటున్నారు. లేదు, నా భర్త మీతో కలవడు!” అంది.

 సయోనీ మా వైపు తిరిగింది, భయంకరమైన కేకపెట్టింది.

“నేను మిమ్మల్నిద్దరినీ చంపేస్తాను. పందుల్లారా! మీరు నా జీవితాన్ని పాడుచేశారు. మా నాన్న అధికారాలను దోచుకోవడం ద్వారా ఆయనకి చేటు చేశారు. మా నాన్న మాంత్రిక సామ్రాజ్యం విముక్తి సైన్యంలో చేరి, విశ్వశక్తిని మరింతగా పొందితే, మీరు సౌర వ్యవస్థలో మాత్రమే కాకుండా మొత్తం పాలపుంత గెలాక్సీలోనూ, విశ్వశక్తి ఎక్కడ ఉంటే అక్కడ కూడా  ప్రముఖులుగా చలామణీ అవవచ్చు” అంది.

మేము మౌనంగా ఉండిపోయాం.

విశ్వశక్తి, విశ్వశక్తి! సహస్రాబ్ది యొక్క కొత్త భావన! సాధారణ మానవులకు సాధ్యం కాని పనులను చేయటానికి, భూమిపై నేర్పించబడని విషయాలను సాధ్యం చేస్తుంది. ఇది భూమి మీద నిషేధించబడింది. 21 వ శతాబ్దపు సైన్స్ ఫిక్షన్ సినిమాలలోనూ, వీరగాథలలోనూఈ ‘విశ్వశక్తి’ గురించి ప్రస్తావించారు. నిజంగా ఉందా? అవును, ఉంది. నేను దాన్ని చూశాను, తెలిసో, తెలియకో దాన్ని అనేక సార్లు ప్రయోగించాను.

“సరే, సయోనీ! మేమేం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మీరు మాకు స్వేచ్ఛ ఎప్పుడు ప్రసాదిస్తారు?” అడిగాను.

“ఈ లాండిస్-2 సందర్శన తరువాత! ఇక్కడ దాచబడిన ఆ వస్తువుని గుర్తించి తెచ్చిన తరువాత. టైటాన్‌లో ఉన్న విలువైన చివరి అద్భుత వస్తువును సాధించిన తర్వాత మిమ్మల్ని విడుదల చేస్తాం. మీ జీవితకాలమంతా సరిపోయే సంపదలతో మిమ్మల్ని భూమికి వెళ్ళే స్పేస్‌షిక్ ఎక్కిస్తాం…” చెప్పాడు సమూరా.

పొడగరులైన ఆల్ఫా సెంటారీ గ్రహాంతర మంత్రగాళ్ళు హాల్‌లోకి ప్రవేశించారు.

“మా సంగతేంటి సమూరా! మేం కెప్లర్‌కి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది, ఇందుకు 3 కాంతి సంవత్సరాలు పడుతుంది. ఇదంతా ఎప్పుడు ముగుస్తుంది?” అడిగారు.

“ఓ జ్ఞానులారా! మరో రెండు సౌర వారాల కన్నా తక్కువ సమయంలోనే ఇదంతా పూర్తయిపోతుంది. అంటే 14 సోల్స్ లోపే. నేను మిమ్మల్ని కెప్లర్‌కి రిఫ్రిజిరేటెడ్ స్పేస్‌షిప్‌లో పంపిస్తాను. మీ సేవలు అమూల్యమైనవి. మీరు ఏది కోరుకున్నారో, దాన్ని మీరు పొందుతారు” అన్నాడు సమూరా.

వారు గుర్రుగుర్రుమన్నారు. “అవును! మీరు దాన్ని గెలిచాకా, మాకు భూమిని ఇచ్చేయ్. మేము తిరిగి వద్దామనుకుంటున్నాం. అక్కడే ఉండి, మా చివరి రోజులు గడిపేస్తాం!”

“భూమి మీకు బహుమతిగా ఇస్తాను! ఇది నా మాట!” అని చెబుతూ సమూరా గట్టిగా నవ్వాడు.

నా జీవితంలోనే అత్యంత తీవ్రమైన విస్మయానికి లోనయ్యాను.

మా గ్రహం, మా సొంత భూమి ఈ వింత జీవులకు కానుకా? నాకు అర్థం కాలేదు కానీ, యురేకస్‌ ద్వారా వివరాలు తెలుసుకోవాలి. తన ఉనికికి చాటుతూ, యురేకస్ చిన్నగా శబ్దం చేసింది.

సమూరా నా వైపుకు తిరిగాడు. “ఇక్కడ కొంతమంది మానవ నిర్వాహకులతో ఒక రోబోటిక్ కాలనీ ఉంది. మీరు ముగ్గురు ఇక్కడ దిగి, ఆ అద్భుత వస్తువుని వెతికి తెచ్చి నాకు ఇవ్వాలి. అదేంటో నాకు ఖచ్చితంగా తెలియదు. యూనివర్స్ ఆకారం లాంటి, ప్రతిచోటా ఉన్న అంశాలను నియంత్రించడానికి శక్తి ఉన్న గోళాకారంలో ఉండే ఒక స్ఫటికం కావచ్చు. కానీ ఎక్కడ దాచబడింది? నువ్వు ఎంపికైన వ్యక్తివి! దాన్ని కనుగొనాల్సింది నువ్వే…! కుజుడి పైన ఒలింపస్ పర్వతంలోనూ, భూమి మీద భైరవాలయంలోనూ, చంద్రుడి సౌర ఫలకలా మీదా, గనీమీడ్‌లో రాజు ఫెరియస్ యొక్క భూగర్భ రాజమందిరంలో… నువ్వు సఫలమయ్యావు. నువ్వు సాధించగలవు… ఈ ప్రయత్నాన్ని కొనసాగించు. నీకు తగిన బహుమతి ఇస్తాను.. ఇది నా వాగ్దానం.” అన్నాడు సమూరా.

పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్నాడు సమూరా. ఒక్కోసారి మంచిగా… ఒక్కోసారి క్రూరంగా… ఒక్కోసారి బెదిరిస్తూ.

నేను అతని కళ్ళలోకి చూసినప్పుడు – వాళ్ళు ఆమ్రపాలి గ్రామంలో దక్షిణపు పొలాలలో మా అమ్మానాన్నలని చంపడం గుర్తొస్తుంది. నా మావగారిని, ప్రకృతిని బంధించడం గుర్తొస్తుంది.

ఇప్పుడు అతను  బుజ్జగింపు స్వరంలో మాట్లాడుతున్నాడు. నా జట్టులో ఇద్దరు మృతి చెందారు. అతను కూడా నన్ను చంపేవాడే. ప్రతిసారీ నన్ను అంధకారంలోకి నెట్టడం…. కలలు, బ్లాక్‌మెయిల్, బెదిరింపులు మరియు ఇప్పుడు కానుకలు…

ఉన్నట్టుండి, నేనేం మాట్లాడుతున్నానో తెలియకుండానే… నోరు జారాను.

“అయితే మహా ప్రభువులు నాకు భూమిని కానుకగా ఇస్తారా? నాకా గ్రహం కావాలి. నేను దానిని పాలించాలనుకుంటున్నాను. నా ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఆల్ఫా సెంటారీ మాంత్రికులకు మాట ఇచ్చినట్టే నాకూ…!”

నిశ్శబ్దం. ఒక క్షణం పాటు అక్కడంతా మౌనం.

ముసలి మాంత్రికుడు ముసిముసిగా నవ్వాడు.

అతను తనను తాను సంబాళించుకుని, కిచకిచ స్వరంలో పలికాడు.

“భూమి … భూమి … భూమి… నువ్వింత అత్యాశ ఉన్నవాడివని నాకు తెలియదు… కానీ మొదట నీ కలలో కొచ్చిన రాకుమార్తె కావాలని కోరుకున్నావు, కుజగ్రహంలో ఆమెను వెంబడించావు. తర్వాత టైటాన్‌కి చెందిన ఈ సుందరితో సంబంధం… తర్వాత భూమి మీద నీ బంధువుని ప్రేమించావు, వివాహం చేసుకున్నావు… ఇదంతా చూసి నీకు మగువలంటే మక్కువని; రాజ్యాలు కాదని అనుకున్నాను… కానీ నేను ఇప్పటికే ఈ వివేకులకు భూమిని ఇస్తానని వాగ్దానం చేశాను. వాళ్ళు ఎంచుకున్న భూమిని తప్ప మరే గ్రహమయినా కోరుకో. ఇస్తాను” అన్నాడు సమూరా.

అప్పుడు నేను అతనిని మరింత ఏడిపించాలనుకున్నాను. “సరే అయితే… నాకు మార్స్… కుజగ్రహాన్ని ఇవ్వండి” అన్నాను.

వేల సంవత్సరాల వయసున్న సమూరా ముఖం లక్షలాది ముడుతలు పడింది.

“కు… జ… గ్ర… హ… మా? అక్కడేముంది? ప్రాణవాయువు లేదు. అన్ని డోమ్‌లూ… శిలలు… అరుణభూములు నిరంతరం విశ్వశక్తిని సాధనచేసే వారితో శక్తివంతంగా ఉన్నాయి. మానవ కాలనీ అంతా వింత హ్యుమనాయిడ్లతోనూ, నకిలీ ప్రజాస్వామ్యాన్ని అమలుచేసున్న సైనికులతోనూ, ఇరుకైన మనస్సులున్న వ్యక్తులతోనూ నిండి ఉంది… క్షమించాలి హనీ, ఇది మీకు సరిపోదు. నువ్వు చంద్రుడు లేదా ఏ ఇతర కాలనీనైనా తీసుకొని దానిని అభివృద్ధి చేసుకో” చెప్పాడు సమూరా.

“నాకు దేన్నయినా ఇస్తానని మీరే అన్నారు. మళ్ళీ మనసు మార్చుకుంటున్నారు ప్రభూ! ఇది మీ ప్రవర్తనలో చాలా తరచుగా ఉంటుంది. నేను మిమ్మల్ని నమ్మాలా? కాదు, నేను నమ్మలేను!” నేను ఒక అచేతనావస్థలో మాట్లాడుతున్నాను.

సమూరా నన్ను అపరాధభావంతో చూస్తున్నాడు.

“మీ ప్రణాళికలకి కేంద్రం కుజగ్రహమని తెలుసు సమూరా. నేను మీ మనసును అర్థం చేసుకోగలను. మీరు అరుణభూములను మళ్ళీ ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. కుజుడు మీదే. అక్కడ మళ్ళీ అరుణభూములను, మానవ కాలనీలను మీరు లోబరుచుకుంటారు. గెలాక్సీ యొక్క అన్ని నివాసయోగ్య గ్రహాలను ఆక్రమించుకోవాలన్న మీ లక్ష్యం ఎప్పటికి సాధ్యమవుతుందో ఆ దేవుడికే తెలుసు. వేలాది సంవత్సరాల పడుతుందని నాకు తెలుసు. మీ ఈ సుదీర్ఘ తపనలో నేను చిన్న బంటుగా లేదా భటుడిని… మీరు మోసగాళ్ళు, పేచీకోరు, బ్లాక్‌మెయిలర్!” అన్నాను.

సమూరా నాకేసి కోపంగా చూస్తూ నిప్పుల కిరణాన్ని నావైపు ప్రయోగించాడు. ప్రకృతి “వద్దు… వద్దు!” అని అరిచింది. ఆ కిరణం వచ్చి నా గుండెని తాకింది, నా చర్మం మండిపోయింది. సమూరా నా మీదకి దూకి, ఎముకల్లాంటి చేతులతో నన్ను కొట్టసాగాడు. సయోనీ నా తల మీద, వీపు మీద తన్నింది.

“పంది వెధవా! నేను చెప్పినట్టు చెయ్యి! నీకేదో ఒక గ్రహం ఇస్తాను, కాని … మీకు కుజగ్రహం దక్కదు. మీరు భూమిని కూడా పొందరు. మీరు అంగీకరించకపోతే, మేము ఇక్కడ ఇప్పుడే ప్రకృతిని చంపుతాము. ఆమెని బూడిద చేస్తాం. నిర్జమైన లాండిస్-2 లో నిన్ను ఒంటరిగా వదిలేస్తాం. ఏ భావోద్వేగాలు లేని రోబోలలో గడుపుతూ అనుభవించు! డిమిట్రీని, ఏనిమోయిడ్‌ని కూడా చంపేస్తాం. వాళ్ళని శుక్రగ్రహపు దావానలంలో విసిరేస్తాం!” అన్నాడు సమూరా.

అధ్యాయం 30: లాండిస్-2

ఆ దుష్ట వృద్ధ మాంత్రికుల బెదిరింపులనీ, కేకలనీ, తరువాత ఏం జరిగిందనేదాన్ని నేను వివరించనవసరం లేదు.

ఒక గంట తర్వాత ఒక చిన్న ‘డిసెంట్ వెహికల్’లో నేను, యురేకస్, డిమిట్రీ, ఏనిమాయిడ్‌, ప్రకృతి ఎక్కాం. ఈసారి మాతో ప్రకృతి కూడా వస్తోంది. ఆ వాహనాన్ని ఏనిమాయిడ్ నడిపాడు. జాగ్రత్తగా తేలియాడే కాలనీపై దింపాడు. ఇదే వాహనాన్ని తరువాత మేము ‘లెత్వాల్ రూజ్’ మదర్ షిప్‌కి వెళ్లడానికి ఉపయోగించాలి.

సమూరా మమ్మల్ని ఒక శివారుకి – తేలియాడే కాలనీలో ఓ మూలకి పంపాడు. ఇది నిజంగానే ఒక భారీ మెరిసే లోహపు మిద్దెలా ఉంది. అటూ ఇటూ దాదాపు యాభై మైళ్ళు వ్యాపించి ఉంది. మేము బహుశా ఆ ప్లాట్‌ఫాం చివరి కొసలో ఉన్నామోమో.

మా వాహనం నేల మీద ఆగీ ఆగగానే, దూరంగా కిందకి దిగుతూనే దూరంగా కొన్ని శబ్దాలు వినబడ్డాయి. నేల మీదుగా ఓ వాహన శ్రేణి వస్తోంది, నేలకి ఎగువన చిన్న డ్రోన్‌లు ఎగురుతూ వస్తున్నాయి.

మేము ఆక్సీజన్ మాస్కులు, గ్రావిటీ స్యూట్లు ధరించి క్రిందకి దిగాం. యురేకస్ మాతో పాటు దిగింది. ఇక్కడ మేము విజయం సాధించే అవకాశాలు ఏభై శాతం మాత్రమే అని మాకు తెలుసు. ఎందుకంటే ఏం చేయాలో కూడా సమూరా మాకు చెప్పలేదు. మేము నిజంగా ఏం చేయాలో, ఏది ఆశించాలో, అతను కోరుకున్న వస్తువుని ఎలా కనుగొనాలో ఖచ్చితంగా వివరించలేదు.

ఇది వెర్రితనంగానూ, పరిహాసాస్పదంగా ఉంటుంది. కానీ ఇదే అతని శైలి.

“యురేకస్! వాళ్ళు మనల్ని ఏం చేయ్యబోతున్నారో చెప్పు. నీ లాజిక్, రిమోట్ వ్యూ ఉపయోగించు. అవి కూడా రోబోలే… నీకు బాగా తెలిసి ఉండాలి!” అన్నాను.

అక్కడ గింయుమనే ధ్వనితో గాలి వీస్తోంది. దూరం నుంచి యంత్రాల కంపనం తెలుస్తోంది. తేలియాడే కాలనీ అన్న విషయం మరిచిపోతే, అది మామూలు గ్రహ ఉపరితలంలానే ఉంది. అక్కడి ప్రకృతి దృశ్యాలలో చెట్లు, కొండలు ఉన్నాయి. బహుశా సహజమైన స్థలంలా అనిపించాలని అలా ఏర్పాటు చేశారేమో.

అప్పటిదాకా దూరంగా కనిపించిన రోబోల శ్రేణి… ఇప్పుడు మాకు సమీపంలోకి వచ్చేసింది. ఏకతాళంలో నడిచే సైనికులలానే అవి కూడా వరుసగా నడుస్తూ వస్తున్నాయి.

ఒక స్వరం మూడు భాషలలో పలికింది. అందులో ఒకటి మాత్రమే నాకు అర్థమైంది.

“మీ చేతులు పైకి ఎత్తండి! మీరు అలా చేయకపోతే మిమ్మల్ని లేజర్ తుపాకులతో కాలుస్తాం! స్నేహితులా లేదా శత్రువులా! మీరేవరో తెలియజేయండి!”

నేను మాట్లాడడంలో తడబడ్డాను. యురేకస్ మాట్లాడింది.

“నేను యురేకస్ 7776, మార్స్ యొక్క రెడ్ ప్లెయిన్స్ మోడల్ 3000 మిలీనియమ్ రోబోని. ఈ నా మానవ యజమానులు – హనీ ఆమ్రపాలి, ప్రకృతి ఆమ్రపాలి, టైటాన్‌కి చెందిన డిమిట్రీ పొసయిడన్, గనీమీడ్‌కి చెందిన ఏనిమాయిడ్. మేము స్నేహితులం. శాంతితో మరియు పర్యాటకుల వలె వచ్చాము. ఎటువంటి హాని చేసే ఉద్దేశం మాకు లేదు.”

“హఠాత్తుగా మా కాలనీపైకి ఎక్కడ నుండి ఊడిపడ్డారో నాకు చెప్పండి.”

అది ఓ మానవ స్వరంగా ఉంది. బంగారు రంగు ఉంగరాల పట్టుజరీలాంటి జుట్టుతో ఉన్న పొడవైన ఎర్రటి అందమైన మనిషి రోబోల శ్రేణి నుంచి వెలుపలకి వచ్చాడు.

“నా పేరు హెరోడోటస్. నేను సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ బాధ్యతలు నిర్వహిస్తాను. సరైన పత్రాలు లేదా ఉద్దేశాలు లేకుండా వచ్చిన చొరబాటుదారులను చంపడానికి నేను ఆదేశించాను. మిమ్మల్ని ఇక్కడ ఎవరు దింపి వెళ్ళారు?  రాడార్ పర్యవేక్షణ ద్వారా ఇప్పుడే బయటకు వెళ్ళిన అంతరిక్ష నౌకను మేము గమనించాము. మరియు మీ డిసెంట్ వెహికల్‌ని ఇప్పుడు మా యాంత్రిక రోబోలు చుట్టుముట్టి ఉన్నాయి. నేను ఆదేశిస్తే ఒక్క నిమిషంలో దాన్ని ధ్వంసం చేస్తాయి. నాకు నిజం చెప్పండి. మీరు రక్షించబడతారు. మా వద్ద బ్రెయిన్ మ్యాపింగ్ చేసే యంత్రాలు కూడా ఉన్నాయి!” అన్నాడతను.

యురేకస్ మౌనంగా ఉండిపోయింది.

ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నేనేనని నాకు తెలుసు.

నా జీవితంలో నేను ఎల్లప్పుడూ ఒకే నియమాన్ని అనుసరించాను.

‘విధి మరియు సత్యం మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడితే, ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి. కావాలంటే మీరు మౌనంగా ఉండవచ్చు. కాని అబద్ధం చెప్పకండి, కానీ నిజాన్ని అణచివేయండి, మౌనంగా ఉండిపోవాలి.’

కానీ మీరు ఒక అబద్ధం చెప్పినట్లయితే, ఈ ఆధునిక ప్రపంచంలోని హై-టెక్ గాడ్జెట్లు, కెమెరాలు, బ్రెయిన్ మ్యాపింగ్ మరియు నిఘా కెమెరాల వల్ల తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. పైగా కలల ద్వారా కూడా జ్ఞాన ఒత్తిడి కలిగిస్తారు, నా విషయంలో జరిగినది అదే.

నిజానికే కట్టుబడాలి. అప్పుడు మీరు గెలుస్తారు.

“నేను హనీ ఆమ్రపాలి. భూమి నుండి వచ్చిన బయోమెడికల్ ఇంజనీర్‌ని. నేను కుజగ్రహపు అరుణభూముల చక్రవర్తి సమూరాచే ఆజ్ఞాపించబడ్డాను. నా నియంత్రణలో లేని వివిధ కారణాల వల్ల, నేను ఆయనకు విధేయత చూపుతున్నాను, గ్రహాల కాలనీలలో అద్భుత వస్తువులని పొందాలనే అతని లక్ష్యానికి కట్టుబడి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు నన్ను చంపుతామని, హాని చేస్తామని బెదిరించి ఇక్కడ ఏదో వెతకమని ఆదేశించి ఇక్కడ దింపి వెళ్ళిపోయారు. కానీ అదేంటో నాకు తెలియదు” చెప్పాను.

హెరోడోటస్ శ్రద్ధగా విన్నాడు.

“మాది ప్రశాంతమైన ఆర్బిటల్ కాలనీ. శతాబ్దాలుగా పరిశోధన మరియు వ్యాపారానికి అంకితమయ్యాం. ఇది ఒక అంతర్ గ్రహ మానవ కౌన్సిల్ చేత నిర్వహించబడుతుంది. ఇక్కడ రోబోలు మా ఆదేశాల ప్రకారం నడుచుకుంటాయి. ప్రాణవాయువు మరియు ఆహారం అవసరమయ్యే మానవులకు ఇక్కడ నివసించడం కష్టం. చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఏదో అద్భుత వస్తువు ఉందనో లేదా మంత్రగాళ్ళు ఉన్నారనో నేను అనుకోడం లేదు. ఏమైనప్పటికీ, నేను మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను. కానీ మేము ఈ విషయాన్ని పరిష్కరించే వరకు – అక్రమ ప్రవేశానికి శిక్షగా మీరు మా జైలులో ఉంటారు. మీకు హాని జరగదు. మీరు మా నిబంధనలకు కట్టుబడి ఉండాలి” అన్నాడతను.

మళ్ళీ మూడు భాషలలో ఆదేశాలు! ఇంగ్లీష్, ఒక తెలియని భాష, యూనివర్సల్ డిజిటల్ భాష.

నేను నోరు తెరిచి ఏదైనా చెప్పే లోపుగానే అతను గట్టిగా అరుస్తూ, ఏదో ఆదేశమిచ్చాడు.

రోబో సైనికులు మమ్మల్ని చుట్టుముట్టాయి, ఆయుధాల కోసం మా శరీరాలను వెతుకుంటే డిమిట్రీ నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రకృతి సిగ్గుపడుతూ, ‘ఓహ్, వద్దు వద్దు’ అంది.  వెతకడం పూర్తయ్యాకా, ఒక స్ఫుటమైన ఆదేశం – “వాళ్ళని కన్‌ఫైన్‌మెంట్ సెంటర్‌కి తీసుకెళ్ళండి!”

డిమిట్రీ ‘హియర్ ఐ కమ్ వీనస్ డి మిలో! ఐ సీ థై బ్యూటీఫుల్ గ్లోరీ!’ అంటూ ఓ పాప్ పాటందుకుంది.

డిమిట్రీ ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. నిర్లక్ష్యంగా కనబడుతుంది, అన్నీ తేలికగా తీసుకుంటుంది. కానీ ఆమె ఒక క్షణంలో హింసాత్మకంగా, శక్తివంతంగా మారగలదు.

ప్రకృతి అంది “హనీ, ఇప్పుడు జైలుకు వెళ్ళడానికి సిద్ధమవ్వు. మనం అన్ని రకాల ఖైదులను చూస్తున్నాం. కిడ్నాప్, బ్లాక్‌మెయిల్, స్పేస్‌షిప్‌లో గొడవ, ఇప్పుడు జైలు…”

ఏనిమాయిడ్ ఎలుగుబంటిలా అరిచి, వాళ్ళతో పాటు నడిచాడు.

“ఇదీ మనకు మంచిదే కావచ్చు. స్పేస్‌షిప్‌లో భారరహిత స్థితిలో ప్రయాణం చేసీ చేసీ విసుగ్గా ఉంది. ఇది కొంత మార్పు” అన్నాను.

***

(సశేషం)

Exit mobile version