అధ్యాయం 32: కార్యాచరణ ప్రణాళికలు
ఎంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ జైలు జైలే. రాత్రయ్యింది. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు సలహాల కోసం నేను యురేకస్‌పై ఆధారపడ్డాను. అదృష్టవశాత్తూ యురేకస్‌ని నాతో పాటు ఉంచుకోడానికి అనుమతించారు, దాన్ని చార్జింగ్ చేసుకునే వీలు కల్పించారు. కానీ మమ్మల్ని వాళ్ళు అనుక్షణం గమనిస్తున్నారనీ, నిరంతరం మాపై కన్నేసి ఉంచారనే భావన నాలో కలుగుతోంది.
అయినప్పటికీ అన్నీ తెలిసిన రోబోతో చర్చించడం తప్ప వేరే మార్గం కన్పించడం లేదు.
“యురేకస్! మేము విశ్వశక్తిని ఉపయోగించి జైలు నుండి బయటపడచ్చా? ఇబ్బందులేమైనా ఉన్నాయా?” అని అడిగాను.
“ఇబ్బందులు 90 నుండి 100 శాతం ఉన్నాయి. మీరు మాట్లాడే ప్రతి పదం, మీరు చేసే ప్రతీ పనిని వాళ్ళు గమనిస్తున్నారు. మీరు విశ్వశక్తిని ఉపయోగిస్తే, వారు అణుశక్తి ద్వారా దానిని అదుపు చేస్తారు. రక్షణ కోసం వీళ్ళ దగ్గర అత్యంత అధునాతన సౌర శక్తి వ్యవస్థలు, ఇంకా లేజర్ ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయి. విశ్వశక్తి గొప్పదే కాని దానితో సమానమైన శక్తివంతమైన అణ్వాయుధాలతో నాశనం చేయబడుతుంది.”
“కానీ అంతస్స్ఫోటనంతోనూ, అణుధార్మికతతోనూ వాళ్ళూ నాశనమయ్యే ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళు దానిని ఎలా ఉపయోగించగలరు?” అని అడిగాను. “అంతరిక్షంలో తేలియాడే ఒక కాలనీకి ఇది ప్రమాదకరంగా ఉంటుంది.”
“అవును మాస్టర్! మీరు చెప్పినది నిజమే. ఇక్కడ విశ్వశక్తిని సాధన చేసేవారెవరూ లేరు. వారు తమ భద్రత గురించి అనుమానంగా ఉన్నారు. కాబట్టి వారు మీ విశ్వశక్తికి సిద్ధాంతపరంగా ఏకైక విరుగుడు అని అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు. కానీ విశ్వశక్తిని ఉపయోగిస్తే త్వరలోనే మీరు శక్తిని కోల్పోతారు. అప్పుడు ఎక్కడికి వెళతారు? ఎలా తప్పించుకుంటారు?”
“నేను కుజగ్రహంలో చేసినట్టుగా సూక్ష్మరూపం ధరించి, కుజగ్రహంలో వెదికినట్టు ఇక్కడ కూడా ఆ వస్తువు కోసం వెతకచ్చా? నేను అదృశ్యరూపం ధరించి ఇక్కడ్నించి బయటపడవచ్చా? నేను ఎలాగైనా వెతకాలి” అన్నాను.
యురేకస్ ఈ అవకాశాలను పరిశీలిస్తోందనడానికి గుర్తుగా చిన్న శబ్దాలు వినపడ్డాయి.
“1. అదృశ్య రూపం – కేవలం మూడు గంటలే పనిచేస్తుంది. చాలా విద్యుదయస్కాంత కల్లోలం ఏర్పాడుతుంది. మీరు మామూలు రూపానికి తిరిగి వచ్చినప్పుడు పట్టుబడే అవకాశం ఏభై శాతం. మూడు గంటల సమయం ముగిసే సరికి పారిపోవడానికి మీరు తప్పనిసరిగా స్పేస్‌షిప్ కలిగి ఉండాలి!
- సూక్ష్మరూపం … విద్యుదయస్కాంత కల్లోలం ఏర్పడుతుంది, కానీ తక్కువ స్థాయిలో. సూక్ష్మరూపంలో మీరు ఒక రోజు గడపవచ్చు, కానీ మీరు తిరిగి వచ్చినప్పుడు ఆరు గంటల పాటు విశ్రాంతి తీసుకుని శక్తిని తిరిగి పొందాల్సి ఉంటుంది, పైగా తప్పించుకోవడానికి మళ్లీ అంతరిక్ష నౌక కావాలి. పట్టుబడే ప్రమాదం 25% మాత్రమే. కానీ మీరు ఎక్కడని వెతుకుతారు?
- మీరు ప్రస్తుత ఆకారంలోనే తప్పించుకుని, నన్ను తీసుకువెళితే, నేను మీకు మార్గనిర్దేశం చేయవచ్చు. నేను జైలు యొక్క ఇన్‌ఫ్రారెడ్ ఫొటో మ్యాప్‌ని తీసుకున్నాను. బయట అవసరమైనప్పుడు మీరు విశ్వశక్తిని ఉపయోగించుకోవచ్చు. సాధారణ స్థితికి తిరిగి రావచ్చు. ఈ పద్ధతిలో మీరు రెండు వీనస్ రోజులు వెతకచ్చు. ఒక ప్రదేశంలో విద్యుదయస్కాంత కల్లోలాన్ని సృష్టించి వారి దృష్టిని మళ్ళించడం ద్వారా వాటిని గందరగోళానికి గురి చేయవచ్చు. అవసరమైతే మీరు అదృశ్య రూపం ధరించో, సూక్షరూపం ధరించో, గాలిలో ఎగరడమో లేదా మహాకాయం ధరించడం వంటి బహుళ ఎంపికలను ఉపయోగించవచ్చు. ఈ విధంగా అన్వేషిస్తే, మీకా వస్తువు లభించవచ్చు. మీరు ఎంపిక చేసిన వ్యక్తి కాబట్టి మీకు దొరుకుతుంది. కానీ తప్పించుకుని స్పేస్‌షిప్‌ని చేరుకోడం ఎలా?” అంటూ వివరంగా చెప్పింది యురేకస్.
“తగిన వాహనాన్ని హైజాక్ చేయమని ఏనిమాయిడ్‌నో డిమిట్రీనో అడగాలని అనుకుంటున్నాను. మనం ఈ ప్లాట్‌ఫాం కన్నా పైకి అంతరిక్షంలోకి చేరితే, సమూరాను పిలవచ్చు. ఏనిమాయిడ్ స్పేస్‌షిప్‍లను బాగా నడుపుతాడు. డిమిట్రీ విశ్వశక్తినీ, తన మేధస్సుని ఉపయోగించవచ్చు. మేము టెలీపతీ ద్వారా భావప్రసారం చేయాలి… ఎందుకంటే విశ్వశక్తిని ఉపయోగిస్తే, దొరికిపోయే అవకాశాలు ఎక్కువ… కానీ ఈ విధంగా చేస్తే మనకి అన్నీ లభిస్తాయి. అప్పుడప్పుడూ విశ్వశక్తిని ఉపయోగించుకునే ఒక బృందంగా పనిచేయాలి, తప్పించుకునే వాహనాన్ని సాధించి దాన్ని ఉపయోగించుకోవాలి. మనిద్దరం ఆ వస్తువు కోసం వెతుకుదాం… “
“ఈ ఆలోచన ఉత్తమం. వ్యక్తి పని కంటే జట్టు పని బాగుంటుంది. సమాచార ప్రసారం మాత్రమే మనకున్న ఇబ్బంది”
“కానీ ఇదొక్కటే మనకున్న మార్గం. భోజన సమయంలో మనం అందరం సమావేశమవుదాం.”
మేము వేర్వేరు గదులలో ఉన్నాము కాని భోజనం కోసం భోజనశాలకి తీసుకువెళతారు. ప్రణాళికగా నేను అనుకున్న ప్రతిదీ వ్రాసి డిమిట్రీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా దగ్గర టిస్యూ పేపర్ మాత్రమే ఉంది, కానీ రాయడానికి పనికొచ్చే పరికరం ఏదీ లేదు. నేను దానితో మాట్లాడిన నా ప్రణాళికను రికార్డు చేయమని యురేకస్‌ని అడిగాను, యురేకస్ చేటిలో అమర్చిన లేజర్ ప్రింటర్ ద్వారా మా ప్రణాళికని టిస్యూ పేపర్‌పై ముద్రించాను.
అవి యూనివర్సల్ డిజిటల్ భాషలో చిన్న నల్లటి ముదురు ప్రింట్ అక్షరాలు. డిమిట్రీ వాటిని అర్థం చేసుకోగలదు.
తర్వాత మేమందరం అన్ని భోజన సమయంలో కలుసుకున్నాం.
గార్డులు వచ్చి భోజన గదిలో మాకు ఒక టేబుల్ వేసి రొట్టె, సలాడ్, పాలు, భక్ష్యాలు, పండ్లతో వీలైనంత మంచి భోజనాన్ని ఏర్పాటు చేశారు.
అప్పుడు నేనా కాగితాన్ని డిమిట్రీకి రహస్యంగా అందించాను, ఆమె తలూపింది.
ప్రకృతి హిందీలో మాట్లాడుతూ, “విశ్వం యొక్క ఈ భాగంలో ఆహారం అద్భుతంగా ఉంది. నాకు నిద్రొస్తోంది. రండి వెళ్లి, పడుకుందాం” అంది.
చిన్న మానిటర్ కెమెరాలు మాపై నిఘా ఉంచాయని మాకు తెలుసు. మా కదలికలను, వ్యక్తీక్రణలను నిరంతరం గమనిస్తున్నారు. ఇదంతా మాకు బాగా తెలుసు.
తేలియాడే కాలనీ లాండిస్-2 లోని ఆ జైలులో రాత్రయ్యింది. మా గదుల్లోని పడకలపైకి చేరాం.