అధ్యాయం 33: పలాయానం
అర్ధరాత్రి దాటింది. నేను మా గది తలుపుపై దృష్టి పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించాను.
తాగి, సూక్ష్మరూపంలోకి మారిపోయేందుకు మా వద్ద ఏ పానీయాలు లేవు లేదా తిని అదృశ్యరూపంలోకి మారే చూర్ణాలు లేవు.
తలుపులు తెరిచి, అతి తక్కువ రేడియేషన్‌తో బయటికి వెళ్ళడమే ఏకైక మార్గం. పరుగు తీయాలి. వాళ్ళు గుర్తిస్తే ఆటంకాను సృష్టించడం ద్వారా పట్టుబడకుండా ఉండండి.
నా మనసులో ఆ స్పేస్ కాలనీ నిర్మాణ ప్రణాళిక ఉంది, ఇన్‌ఫ్రా రెడ్ ఛాయాచిత్రాలను అందించినందుకు యురేకస్‌కి ధన్యవాదాలు చెప్పుకోవాలి.
నేను ఏకాగ్రతని నిలిపి, లాక్ చేయబడిన ప్రదేశంలో ఒక రంధ్రం చేసాను. అదృష్టం కొద్దీ లాకింగ్ యంత్రాంగం డిజిటల్ పద్ధతి లోది. పాస్‍కోడ్ లేకుండా దానిని చేరుకుని, తెరవాలని అనుకున్నాను. రంధ్రం గుండా నేను నా చేతిని బయటపెట్టి నాబ్‌ని గుండ్రంగా తిప్పాను, తలుపు తెరుచుకుంది.
రాత్రిపూట సంచరించే పిల్లిలా చప్పుడు కాకుండా రహస్యంగా పరిగెత్తాను, చుట్టూ చూశాను.
అది పొడవైన కారిడార్. దీపాలు మసకగా వెలుగుతున్నాయి.
నా వెనకే ప్రకృతి, నా పక్క గదుల్లోంచి డిమిట్రీ, ఏనిమోయిడ్ రావడం విన్నాను.
మరో తలుపు వద్దకి చేరేంత వరకు మునివేళ్ళపై పరిగెత్తాను.
మళ్ళీ నేను దృష్టి కేంద్రీకరించి ఆ తలుపులో ఒక రంధ్రం చేశాను, నా చేతిని బయటపెట్టి తాళం తీశాను.
అప్పుడు దూరంగా… రాత్రిళ్ళు కూసే గుడ్లగూబ కూతలా ధ్వనించే సైరన్ వినిపించింది.
మేం తప్పించుకున్నట్లు వాళ్ళకి తెలిసిపోయినట్లుంది.
కొద్దిగా ముందుకెళ్తే ఒక పెద్ద నడిమి హాల్‌లో భద్రతా దళాలు ఉన్న ప్రాంతం కనబడింది. జైలు సముదాయం ఒక పెద్ద హోటల్ యొక్క రిసెప్షన్ ప్రదేశం లాంటిది కాదు. లాండిస్-2 యొక్క నలుగురు భద్రతా సిబ్బంది మానిటర్‌ని చూస్తున్నారు, ఇంకో ఇద్దరు స్పేస్ ఏజ్ లేజర్ తుపాకీలతో భవనం నిష్క్రమణ ద్వారం వద్ద నిలుచుని ఉన్నారు. ఆ తుపాకులు భూమి మీద ‘మిలీనియం రూజ్’ తుపాకుల వంటివి.
వారు మొదట మమ్మల్ని చూచినప్పుడు, వారి ముఖాలు అభావంగా ఉన్నాయి. కొన్ని క్షణాలలో వాస్తవం గ్రహించి, విస్మయ్యానికి లోనయ్యారు. వెంటనే మాపై తుపాకీలు గురిపెట్టారు. ఇక గుడ్లగూబల ధ్వనిలాంటి కూతలతో సైరన్లు మోగ్రించారు. మా అందరి ముఖాలపై లైట్లు వేశారు.
నేను భయపడుతున్నాను. నా శరీరమంతా వణికిపోతోంది. నా వెనుక బిగ్గరగా పటపటమంటూ యురేకస్ యొక్క లోహ అడుగులు వినగలరు.
“మాస్టర్! వాళ్ళ దృష్టి మళ్లించండి! అగ్ని లేదా పేలుడుని సృష్టించండి! చేయండి. మీరు చేయగలరు!”
నా ముందు ఎర్రని నిప్పుబంతి ప్రత్యక్షమై భారీ విస్ఫోటం జరిగింది. అక్కడున్న గార్డులు అరిచి కేకలు పెట్టారు, పారిపోయారు.
మంటలు భద్రతా ప్రాంతమంతా వ్యాపించాయి, దీపాలు ఆరిపోయేసరికి గార్డులు భయపడి అక్కడ్నించి పరిగెత్తారు. ఎలక్ట్రానిక్ టర్బులెన్స్ లేదా మంటలు – సర్క్యూట్లను నాశనం చేసాయేమో నాకు తెలియదు.
కానీ అప్పటికే నా శక్తి క్షీణించింది.
డిమిట్రీ నన్ను లాగింది.
“పరిగెత్తు! హనీ పరిగెత్తు! బయటకి!”
“హనీ, బాగా చేసావు. ఇప్పుడు పరిగెత్తు!” అంది ప్రకృతి.
నా పాదాలు నాకు సహకరించడం లేదు. విశ్వశక్తి ప్రయోగంతో నాలో సత్తువ తగ్గిపోతోంది. కానీ నేను పరిగెత్తాలి.
కాలం సుదీర్ఘంగా అనిపిస్తోంది. మేమంతా భద్రతా ప్రాంతం వెలుపల మార్గంలో నెమ్మదిగా పరిగెత్తుతున్నాం. నేను వెనక్కి తిరిగి చూస్తే, ఆ ప్రాంతమంతా మంటలతో నిండిపోయింది.
సైరన్లు, రకరకాల వెర్రి గ్రహాంతర ధ్వనుల సైరన్లు మోగుతున్నాయి. వాహనాలు వేగంగా వస్తున్న శబ్దాలు.
నేను సగం శక్తి పుంజుకున్నాను.
“డిమిట్రీ! నువ్వు ముందు నడు! నీకు ప్రణాళిక తెలుసుగా” అన్నాను
యురేకస్ తన లోహ స్వరంలో అరుస్తూ….
“స్పేస్ కాలనీ యొక్క ప్రధాన కమాండ్ సెంటర్‌కి వెళ్ళాలి… మన వెనుక ప్రాంతానికి మరో వైపుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిగెత్తండి. మనం దానిని స్వాధీనం చేసుకోవాలి” అంది.
మేము పరిగెత్తాం, ఖాళీగా ఉన్న కారిడార్లలో మా అడుగుల సవ్వడి వంద సార్లు ప్రతిధ్వనించింది.
కమాండ్ సెంటర్. లాండిస్-2 యొక్క మస్తిష్కం లాంటి ఒక పెద్ద కేంద్రం.
“రోబోటిక్ సైనికులు ఎక్కడ ఉన్నారు?” నేను ఆశ్చర్యపోయాను. “రక్షణ వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇది ఎలా పని చేస్తుంది?”
నా మెదడులో లాండిస్ మ్యాప్ ఉంది. నేను యురేకస్ తెరపై దాన్ని అధ్యయనం చేసాను. రిసెప్షన్ ప్రాంతం, నివాస ప్రాంతాలు, పాలనా యంత్రాంగం, కమాండ్ పోస్ట్, అంతరిక్ష నౌకల ల్యాండింగ్ ప్రదేశం, డబ్బు దాచి ఉంచిన బ్యాంకులు, రవాణా సముదాయం, స్పేస్‌షిప్స్ నిలిచి ఉండే స్పేస్ ప్లాట్‌ఫాంలకు ఇరువైపులా రన్ వేలు. ఇప్పుడు మేము కమాండ్ పోస్ట్ వైపు పరిగెత్తుతున్నాం.
నా ‘గుడ్డి నమ్మకం’ లేదా అంచనా ఏంటంటే – అక్కడ మనుషులు చాలా తక్కువగా ఉన్నారు, మహా అయితే ఒక డజను మంది మాత్రమే ఉండవచ్చు. కంప్యూటరీకరించబడిన ఈ కేంద్రీకృత కమాండ్ పోస్ట్ నుండి నియంత్రించబడిన రోబోలను కలిగిన అన్ని వ్యవస్థలను ఆదేశిస్తారు. ఇలా ఎందుకంటే, తక్కువ మనుషులు ఉంటే వాళ్ళకి కావలసిన ఆక్సీజన్, ఆహారం లేదా నీరు వంటి జీవసంబంధమైన అవసరాలు తక్కువగా ఉంటాయి. హుమనాయిడ్లకూ, రోబోలకూ విద్యుత్ శక్తి మాత్రమే చాలు, పైగా అవి ప్రోగ్రామ్ చేయబడినవి. అంతరిక్ష నౌకలను రోబోటిక్ పైలట్లు, రోబోటిక్ వ్యవస్థలు నడుపుతాయి.
కాబట్టి, కమాండ్ పోస్ట్ వద్ద ఉండే మానవులను లొంగదీసుకుని, సెంట్రల్ కంప్యూటరైజ్డ్ కమాండ్‌ని స్తంభింపజేస్తే, లాండిస్-2 మా నియంత్రణలోకి వస్తుంది.
అన్ని జీవుల మాదిరిగానే, ఈ మానవులని కూడా మా ‘విశ్వశక్తి’ తో చుట్టుముట్టవచ్చు, వారి వ్యవస్థలను మా విశ్వశక్తి ద్వారా కనీసం కొంచెం సేపైనా నిలిపివేయగలం. రోబోటిక్ కాలనీలో పనిచేసే డజను మందో లేదా ఇంకా ఎక్కువగా ఉన్న ఆ ‘హ్యుమన్ మాస్టర్’ లను నేను అశక్తులను చేస్తే గాని నేను కొన్ని గంటలపాటు లాండిస్ -2 ని ఆపలేను. మమ్మల్ని ప్రశ్నించిన ‘హెరోడోటస్’ ఒక హ్యుమనాయిడ్. యురేకస్ అతనిని పరీక్షించి, నిర్ధారించింది.
కాసేపటికి కమాండ్ పోస్ట్ కనపడింది. అది ఒక పెద్ద గాజు భవనం. అలంకరించబడిన ముఖభాగంలోని తలుపులు మూసివేయబడి ఉన్నాయి. ఎరుపు, నీలిరంగు లైట్లు మెరుస్తున్నాయి.
మేము ఆగాము. ఒకరినొకరం చూసుకున్నాము.
“రోబోలు కూడా నిద్రపోతాయా?” ఆలోచిస్తూ, నేను పైకే అనేశాను. “భద్రతా రోబోలు ఏవి, వాటి యజమానులు ఎక్కడ ఉన్నారు?”
“రాత్రి కోసం రీబూట్ చేసుకుంటున్నాయేమో” అంది డిమిట్రీ నవ్వుతూ.
“జాగ్రత్త హనీ! ఎప్పుడైనా ప్రమాదం రావచ్చు” అంది ప్రకృతి.
యురేకస్ లోహ శబ్దాలు చేసింది.
ఏనిమాయిడ్ కూత పెట్టాడు.
అకస్మాత్తుగా మా మీదకి లేజర్ బులెట్లు దూసుకువచ్చాయి. అవి నా చర్మాన్ని నిప్పురవ్వల్లా మండించాయి.
అరుణ భూములలోని యొక్క లోగోస్ వద్ద నేర్చుకున్న ఒక మంత్రాన్ని నా శక్తినంతా ఉపయోగించి ఉచ్చరించాను.
“Couvrezmoi avec l’eau!” ఫ్రెంచి భాషలో మంత్రాన్ని చదివాను.
“నన్ను నీటితో కప్పండి!”అని ఆ మంత్రసారం. కొద్ది క్షణాలలోనే మా చుట్టూ వాన కురుస్తూ బుల్లెట్ల నిప్పుని ఆర్పేస్తోంది.
“పరిగెత్తండి! భవనంలోకి దూసుకుపొండి” అన్నాను. కమాండ్ పోస్టుల తలుపులను తెరిచేందుకు మా అందరి దృష్టిని దాని మీదే నిలపాలని నా సహచరులను ఆదేశించాను.
ప్రకృతి పూర్తిగా కమలిపోయింది. భారతీయ స్థానిక భాషలో గట్టిగా అరుస్తోంది.
డిమిట్రీ ఆడపులిలా కళ్ళ నుంచి మెరుపులను తెప్పిస్తూ, చేతులను ఊపుతోంది.
బొచ్చుతో ఉన్న పెద్ద గొరిల్లాలా ఏనిమాయిడ్ తలుపు మీద కొడుతున్నాడు.
మా చుట్టూ వాన కురుస్తూ నిప్పురవ్వల నుంచి కాపాడుతోంది. బుల్లెట్లను తిరగ్గొడుతోంది. ఆ దృశ్యం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ మా శక్తి మాత్రం హరించుకుపోతోంది.
అప్పుడు గట్టిగా చప్పుడు చేస్తూ తలుపులు తెరుచుకున్నాయి.
మేము లోపలకి పరిగెత్తాం.
“సౌర ఫలకలను నుండి విద్యుత్ సరఫరా అవుతోంది. దాన్ని నాశనం చేద్దాం. అప్పుడు మనం వాటిని నిశ్చలంగా మార్చేయచ్చు” అంది ప్రకృతి.
కానీ డజన్ల కొద్దీ రోబో-సైనికులు కారిడార్లలో వేచి ఉన్నాయి, లేజర్ తుపాకీలతో మాపై కాల్పులు జరిపాయి, మేము తప్పించుకుంటూ పరిగెత్తాం.
ఇప్పుడు భవనం లోపల వర్షం లేదు, మాకు రక్షణ లేదు.
“ప్రకృతీ… వెళ్ళి పవర్ స్టేషన్ ఎక్కడుందో వెతకు, దాన్ని బద్దలుకొట్టు. డిమిట్రీ, నీ కళ్ళ నుండి విశ్వశక్తి కిరణాలతో రోబోలపై దాడి చేయ్, నీతో యురేకస్‌ని తీసుకెళ్ళు. ఏనిమాయిడ్, నువ్వు డిమిట్రీకి సాయం చేయ్” అంటూ అరిచి చెప్పాను.
“నేను ఈ స్థలం యొక్క కమాండర్ కోసం వెతుకుతాను, ఆ వస్తువు కోసం శోధిస్తాను” చెప్పాను.
వారు ఎలా పోరాడతారు? నాకేదీ సూచన లేదు. మా చుట్టు లేజర్ బుల్లెట్లు దూసుకువస్తున్నాయి. యురేకస్ – డిమిట్రీని, ఏనిమాయిడ్‌ని కాపాడడానికి ఎలక్ట్రానిక్ కర్టెన్లను సృష్టించే క్రమంలో శబ్దం చేస్తోంది. ప్రకృతి అడవి అమ్మాయిలా మోకాళ్లపై పాకుతూ, నక్కి నక్కి చీకటి కారిడార్ల నుంచి మాయమైంది.
డజనుమంది రోబో సైనికులు నాపై కాల్పులు జరిపారు. కానీ బులెట్లు నాకు తగలేదు… యురేకస్ ఏర్పర్చిన ఎలక్ట్రానిక్ వికర్షక ‘కర్టెన్’ నన్ను కాపాడింది. యురేకస్‌కి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
“మాస్టర్! ఇది కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నేను ఛార్జింగ్ చేసుకోవాలి” అంది యురేకస్.
నాకు తెలుసు. నేను చేయాల్సిన పని చేయడానికి ఒక గంట మాత్రమే ఉంది.
ఎలక్ట్రానిక్ తెర నాకు రక్షణ కల్పిస్తుండగా ముందుకు పరిగెత్తాను. రోబో యురేకస్ నా వెనుకే వస్తూ నాకు మార్గదర్శనం చేస్తోంది.
తర్వాత పది నిమిషాలలో అక్కడంతా నిశ్శబ్దం వ్యాపించింది.
చీకటి అలముకుంది.
దూరంగా పెద్ద చప్పుడుతో ఒక ట్రాన్స్‌ఫార్మర్ బద్దలైంది, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రోబో-సెక్యూరిటీ సైనికులు ఎక్కడవాళ్ళక్కడ నిలిచిపోయారు.
వాటి కళ్ళు నెమ్మదిగా మసకబారడం చూశాను. వాళ్ళ కళ్ళు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు… ఇలా రంగులు మారుతో నల్ల రంగులోకి వచ్చేసాయి.
“హుర్రే” అని అరిచాను. లోహ మిశ్రమంతో తయారైన ఆ నిశ్శబ్ద కారిడార్లో నా స్వరం ప్రతిధ్వనించింది.
“ప్రకృతీ! నువ్వు సాధించావు. పవర్ స్టేషన్ బద్దలుకొట్టావ్!” అన్నాను
“అవును … అవును!” అని దూరం నుంచి ప్రకృతి గొంతు వినపడింది.
“నేను ప్రధాన సౌర శక్తి పానెల్‌ని కాల్చివేశాను. నేను నా చేతులతో బద్దలుకొట్టాను!” మళ్ళీ చెప్పింది ప్రకృతి.
నిశ్శబ్దం.
ఈ రోబోలకు ఎటువంటి బ్యాకప్ శక్తి ఉన్నట్టు లేదు లేదా అవి కాసేపు నిలిచిపోయాయేమో. ప్రత్యామ్నాయ విద్యుత్ శక్తితో త్వరలోనే వారు తిరిగి రావచ్చు.
“అవి సచేతనమయ్యే లోపే పరుగెత్తండి!” నా వెనుక నుంచి డిమిట్రీ అరిచింది.
యురేకస్ తన ఎలక్ట్రానిక్ కర్టెన్‌ని ఉపసంహరించి, నా ముందు వెలుగును ప్రసరింపజేస్తుండగా నేను ముందుకు పరిగెత్తాను.
ఆ చీకట్లోనే మేం పదిహేను నిముషాల పాటు గదులు, కారిడార్లు వెతికాం. ఒక మూల నుంచి ప్రకృతి కూడా వచ్చి మాతో చేరింది. వెతకసాగింది. ఆమె ఉత్సాహంగా ఉన్నప్పటికీ, బాగా అలసిపోయింది, బలహీనంగా ఉంది.
“శభాష్! ప్రకృతీ! నువ్వు గొప్ప పని చేసావు! ఇక్కడి ఉన్నతాధికారుల కోసం వెదుకుదాం!” అన్నాను.
అటు తరువాత మేము దానిని కనుగొన్నాము.
అనేక సౌర ఫలకాలు, కంప్యూటర్లు మరియు రోబోటిక్ సైనికులతో ఉన్న ఒక పెద్ద హాల్. దాని మధ్యలో ఒక ఉన్నత వేదిక, దాని మీద ఉన్న కుర్చీలు… కానీ అన్నీ నిశ్చలంగా! ఇప్పటికీ రోబో-సైనికులు మాకు తుపాకీలను గురిపెట్టే ఉంచారు, కానీ కాల్పులు జరపడంలేదు. వాళ్ళ కళ్ళలో జీవం లేదు. నల్లని దుస్తులు ధరించి కుర్చీల్లో కూర్చున్న మనుషులు మాకేసి అభావంగా చూస్తున్నారు. వాళ్ళూ నిశ్చలంగా ఉన్నారు, కళ్ళలో జీవం లేదు.
“విద్యుత్ సరఫరా లేకపోతే, రోబోలు, హ్యుమనాయిడ్ కమాండర్లు, సైనికులు – అన్నీ శక్తిహీనమై పోయాయి. ఎంత హస్యస్పదం! ఎప్పటికి వాళ్ళు కార్యకలాపాలను తిరిగి చేపట్టగలరు? ఈ ప్రదేశాన్ని నియంత్రిస్తున్న మానవ ఉన్నతాధికారులు ఎక్కడ ఉన్నారు?” అన్నాను.
ప్రకృతి ఇప్పుడు నా పక్కన ఉంది. ఆమె సంతోషంగా ఉంది. “నేను కంట్రోల్ ప్యానెల్ స్టేషన్‌ని చాలా సులభంగా కనుగొన్నాను. అది ప్రధాన ద్వారం ఎడమవైపున రెండు కారిడార్ల అవతల ఉంది. సౌరఫలకాలు పైకప్పు మీద ఉంటే, మానిటర్లు, స్విచ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు అన్నీ నేలమాళిగలో ఉన్నాయి. నేను వాటిని చూసి భైరవస్వామిని తలచుకున్నాను అంతే. క్షణాల్లో అక్కడ విధ్వంసం జరిగిపోయింది” అంది.
యురేకస్ లోహపు ధ్వనులతో ప్రవేశించింది.
లోబరుచుకునే చూపులతో డిమిట్రీ చుట్టూ చూసింది. “హనీ! మీరు మళ్ళీ సాధించారు. ఇక ఆ వస్తువుని పొందితే మనం ఇక్కడ్నించి వెళ్ళిపోవచ్చు! మీరు, ఎంపికైన వ్యక్తి! కళ్ళు తెరిచి ఎక్కడో ఒక ప్రకాశం కోసం శోధించండి” అంది డిమిట్రీ.
నిజంగా నాకు చాలా ఉపశమనం కలిగింది. చుట్టూ చూడటం మొదలుపెట్టాను.
కంట్రోల్ పానెల్ వెలుపల ఒక వైపున గాజు ఆలమారాలు ఉన్నాయి. వాటిల్లో జ్ఞాపక చిహ్నాలు, కళాఖండాలు, ట్రోఫీలు దాచబడి ఉంటాయి. దాని మీద “లాండిస్ -2, ది ఇండిపెండెంట్ ఫ్లోటింగ్ రోబోట్ కాలనీ ఆఫ్ వీనస్” అని ఆంగ్లంలో వ్రాసి ఉంది.
అప్పుడు నాకది కనిపించింది.
నీలం మరియు బంగారు రంగు క్రిస్టల్స్‌తో చేసిన గోళాకారము వంటి పెద్ద గ్లోబ్. ఇది చుట్టూ నీలీ, పసుపు పచ్చ రంగు కాంతులను వెదజల్లుతోంది. ఒక వెండి స్టాండ్‌పై అమర్చిన ఆ గ్లోబ్ ఫుట్‌బాల్ యొక్క పరిమాణంలో ఉంది. మరియు దాని ఉపరితలం వేలాది ఎరుపు, నీలం, పసుపు, తెలుపు చుక్కలతో మెరిసిపోతోంది.
“అదిగో అక్కడ ఉంది!” అని అరుస్తూ, “ఒక గోళం!… దాని చుట్టూ అద్భుతమైన కాంతివలయం ఉంది” అన్నాను.
ప్రకృతి, డిమిట్రీ, ఏనిమోయిడ్ గట్టిగా నవ్వారు. “ఓహ్! అది ఎక్కడ ఉంది? అది ఏంటి?ఈ మసక చీకటిలో మేమేమీ చూడలేము” అన్నారు.
“కంట్రోల్ స్టేజ్ యొక్క కుడి వైపు గాజు అల్మరాలో ఉంది! ఆ ప్రకాశించే గోళాన్ని చూడండి!” అన్నాను.
“ఓహ్! ఏమీ కనిపించడం లేదు! మేము దాన్ని చూడలేము!” వారు ఒకేస్వరంలో చెప్పారు.
యురేకస్ తన లోహ స్వరంతో పలికింది.
“నాకూ కనిపించడం లేదు. కానీ నా డేటాబేస్‌లో ఉన్న ‘స్పియర్ ఆఫ్ యూనివర్స్’ అదే అవుతుంది. విశ్వంలో ఏ ప్రదేశాన్నయినా గుర్తించగల గోళం. బహుశా కొంత సమాచారం ఇవ్వగలదు… మాస్టర్! మీరు ఎంపికైన వ్యక్తి! మీరు మాత్రమే చూడగలరు!” అంది.
“ఓహ్! ఎంపికైన వ్యక్తి! నేను కూడా దాన్ని ఇప్పటివరకు సరిగ్గా చూడలేదు. మా ఆతిథ్యానికి మెచ్చి ఏ సందర్శకులో కానుకగా ఇచ్చిన ఒక సాధారణ గ్లోబ్ అని తప్పుగా అనుకున్నాను. అనిశ్చిత స్థితి ఇప్పుడు ముగిసింది! ఇది మాయ. విశ్వశక్తి అని పిలువబడింది! ఇది ఉంది! వుంది! ఓహ్, దేవీ వీనస్! దీని గురించి మాకు తెలియదు, లేదా ఈ విద్య మాకు రాదు!” అంటూ ఓ గంభీరమైన కంఠం మా వెనుక నుంచి పలికింది.
మేమంతా ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూసాం.
(సశేషం)