భూమి నుంచి ప్లూటో దాకా… -14

0
45

విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్.

అధ్యాయం 37: టైటాన్‌కి పయనం!

సమూరా లేకపోవడంతో, సయోని బాధ్యతలు తీసుకుంది. ఆమె శక్తివంతురాలైనప్పటికీ, పునరుజ్జీవనం పొందినప్పటికీ, ఆమెని చూడడమంటే ఒక అదో దయనీయమైన దృశ్యం. ఆమె తల సరైన స్థానంలో లేదు. ఆమె ఆహారం ఎలా తింటుంది, ఎలా జీర్ణించుకుంటుంది? తల ఒక దిశలో, శరీరం మరో దిశలో ఉంటే ఆమె ప్రపంచాన్ని ఎలా చూస్తుంది వంటి సందేహాలు నాకు లేవు. అదొక వింత మాయాజాలం! ఆల్ఫా సెంటారి తాంత్రికులచే భయంకరమైన పొరపాటు జరిగింది. కానీ ఆమె తన స్వంత బూడిద నుండి మళ్ళీ సృష్టించబడింది కాబట్టి ఎవరూ ఫిర్యాదు చేయలేరు. తల ఎటుంటేనేం, కనీసం ప్రాణాలతో ఉంది. “డిఎన్‌ఎ అయానిక్ రీకన్‌స్ట్రక్షన్” అనే పద్ధతిలో నక్షత్రాంతర తాంత్రికులు ఆమెని బ్రతికించారని యురేకస్ నాతో రహస్యంగా చెప్పింది.

అటువంటి సాంకేతిక పరిజ్ఞానం సాధారణ జీవ శాస్త్రాలలో కూడా లభిస్తోంది, అయితే అత్యంత వ్యయంతో కూడినది. మిలియన్ యూనివర్సల్ డిజిటల్ యూనిట్లు ఖర్చవుతాయి. బూడిదలో ఉన్న డిఎన్‌ఎ నమూనా నుండి శరీరం సృష్టించబడింది కానీ బాగా నైపుణ్యం అవసరమైన జటిలమైన విషయం ఏంటంటే గుండెకి జీవం పోయడం, దాన్ని స్పందించేలా చూడడం; నిక్షిప్తం చేసుకున్న అన్ని జ్ఞాపకాలను కూడగట్టుకుని మెదడు పనిచేసేలా చూడడం! ఈ ప్రక్రియ చాలా సున్నితమైన మరియు శక్తివంతమైన విద్యుత్ ఛార్జ్‌ని కలిగి ఉంటుంది, ఇది హృదయ స్పందనను క్రియాశీలకం చేస్తుంది. సంస్కరించబడిన మెదడును ఖచ్చితమైన సూచనలతో  సక్రియం చేస్తుంది.

ఆల్ఫా తాంత్రికులు సయోనిని పునర్జీవితురాలిని చేయడానికి అత్యంత శక్తివంతమైన విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించారనేది సుస్పష్టం. చంద్రుడి చీకటివైపున తుపాను రేగిన కాలంలో ఈ ప్రక్రియని అమలుచేసి ఉంటారు. సయోనిని పునఃసృష్టించడం – 2వ సహస్రాబ్ది లోని 19వ శతాబ్దం నాటి నవలలో ‘ఫ్రాంకెన్‌స్టెయిన్’ పునరుజ్జీవనంలా ఉండదు. “ఎందుకంటే”, అంటూ ఒక రోబోలో అరుదుగా కనబడే ఉత్సాహంతో చెప్పింది యురేకస్, “పునర్నిర్మించిన జీవి యొక్క జీవన కాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. సయోని ఒక సంవత్సరంలో లేదా అంతకుమించి కొద్ది రోజులలో చనిపోతుంది. ఆమె కుజగ్రహంపై నివసించినందున, అది అక్కడి సంవత్సర కాలం భూమి మీద దాదాపుగా 700 రోజులకి సమానం. అయానిక్ రీకన్‌స్ట్రక్షన్ పద్ధతిలో సజీవులైన మృతులు – ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం జీవించిన దాఖలాలు లేవు. అంతరిక్ష పరిభాషలో ఒక ఏడాది అంటే ఆ గ్రహం సూర్యుని చుట్టూ తిరిగేంత కాలమనే అనుకోవాలి.”

సమూరాని అధికారంలోకి తీసుకురావడానికి, అన్ని సౌర వ్యవస్థల కాలనీలకు, ఆపై గెలాక్సీ లోని ఇతర ఆవాస గ్రహాలకు చక్రవర్తి కావాలనే అతని కలని సాకారం చేయడానికి సయోని అన్ని పద్ధతుల ద్వారా ప్రయత్నిస్తుందని అర్థమైంది.

ప్రయాణం సుదీర్ఘమైనది. సౌర వ్యవస్థలో జనావాసం ఉన్న టైటాన్‌లోని ఓ కాలనీకి వెళ్తున్నామని స్పష్టమైంది. ఈ సుదీర్ఘ యాత్ర – ఆలోచించుకోడానికి, ఏం జరుగుతుందో గ్రహించడానికి నాకు సమయాన్ని ఇచ్చింది.

ఇప్పుడు నమూనా స్పష్టమైనది. సమూరా ఒకదాని తర్వాత మరొకటిగా అధికారాల్ని సాధిస్తాడు. అతనికి మరణం లేదు, శాశ్వతంగా ఉంటాడు. అతని కేంద్రం – అరుణ భూములు – కానీ అవి అతని నియంత్రణలో లేవు. అయితే అతను ఏడు అద్భుత వస్తువులు పొందిన తరువాత మళ్ళీ ప్రయత్నిస్తాడు. అతను శాశ్వతమైనవాడు కాబట్టి అతనికి బోలెడు సమయం ఉంటుంది.

కానీ భూమిని, కుజ చంద్రగ్రహాలపై ఉన్న మానవ కాలనీలని ఎలా జయిస్తాడు?

గత సంఘటనలను బట్టి చూస్తే అతనికి – తాంత్రిక శక్తులున్న అనుచరులు అన్ని గ్రహాలలోను ఉన్నారు. వాళ్ళంతా అతనికి గుడ్డిగా విధేయులుగా ఉంటారు. వీళ్ళు ప్రతిచోటా… ప్రభుత్వంలోనూ, సైన్యంలోనూ, ఇమ్మిగ్రేషన్ వంటి ఉన్నత స్థానాల్లోనూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, వారు తిరుగుబాటు చేసి, ఈ కాలనీలలో అధికారం కైవశం చేసుకోడానికి సమూరాకి సహాయం చేస్తారు. అతని ఆధ్వర్యంలో మాంత్రికుల ద్వారా ప్రభుత్వాలు, రక్షణ దళాలు, ఇంకా ఇతర అన్ని విభాగాలు అతని ఆధీనంలోకి వస్తాయి.

మూర్ఖంగా అనిపించవచ్చు, లాండిస్-2లో జరిగినది చిన్న ఘటనే కావచ్చు కానీ నిజంగా జరిగిన ఒక దృష్టాంతం.

ప్రకృతికీ, నాకు కలిపి ఒక బంకర్, డిమిట్రీ, ఏనిమోయిడ్‌కు మరో బంకర్ ఇచ్చారు.

మేమంతా స్పేస్‌షిప్‌లో తేలుతూ, మధ్యాహ్నం రాత్రి భోజన సమయంలో కలుసుకుంటున్నాం.

“ఘనత వహించిన మీ ఎర్త్ కౌన్సిల్ మాస్టర్స్ ఎక్కడున్నారు? వాళ్ళు మనల్ని కాపాడటం లేదు! మనల్ని ఈ పనికి నియమించిన గ్రహాంతర భద్రత అధికారులు; ఎర్త్ కౌన్సిల్ అధికారులు ఎక్కడున్నారు? వాళ్ళేమీ చేయలేరా? మనం వాళ్ళకి ఒక సంకేతం లేదా ఎస్.ఓ.ఎస్.ను పంపించలేమా?” అడిగింది డిమిట్రీ.

“మేడం! సందేశాలను పంపగలిగే నా సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింది. బయటకు వెళ్ళే సందేశాలని వారు నిలిపివేస్తున్నారు. నేను నా మాస్టర్‌కి కూడా ఎలాంటి సందేశమూ పంపలేను అందుకే నేరుగా మాట్లాడుతున్నాను. భద్రత అధికారులు; ఎర్త్ కౌన్సిల్ అధికారులు మనమేం చేస్తున్నామో గమనిస్తున్నారు. అయితే మన మిషన్ మొదటి నుంచి రహస్యమైనదే కదా…” అంది యురేకస్.

“అవునా! అంటే ఏం జరిగినా వాళ్ళే గెలుస్తారన్న మాట! వారు మనల్ని కాపాడలేనప్పుడు మనకేం ప్రయోజనం? గనీమీడ్ మీద లేదా లాండిస్-2 పైన మనకి సహకరించడానికి ఏ గ్రహాంతర లేదా ఎర్త్ కౌన్సిల్ ఏజెంట్లు లేరు. మనంతట మనం విజయం సాధిస్తామో లేక మనంతట మనం మరణిస్తామో అని చూస్తారా?” కోపంగా అంది డిమిట్రీ.

“ఇద్దరు నిజంగానే మరణించారు” అన్నాను.

“ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. బ్లాక్‌మెయిల్, కుట్ర, రహస్యం, రాజకీయాలు… మనమేమో చదరంగం ఆటలో బంటుల్లా ఆడాం. ప్రభుత్వాలేమో – గత శతాబ్దాలలోని తీవ్రవాదుల వంటి ఈ మాంత్రికుల గురించి తమ పౌరులకేమీ తెలియకూడదనుకుంటాయి. వాళ్ళకి గుప్త, శక్తివంతులైన ప్రచ్ఛన్న అనుచరులు ఉంటారు.”

స్పేస్‌షిప్ గోడపై తగిలించిన టివి తెరలపై 24 గంటల ఛానల్లో వార్తలు చూశాము. అంతరిక్షంలో రాత్రి పగలు ఉండవు. ఆకలి, నిద్ర మరియు మెలకువని సూచించే జీవ గడియారం మాత్రమే ఉంటుంది. వార్తలు చూస్తూ మేమంతా ఒకరినొకరం విస్మయంగా చూసుకున్నాం.

గెలాక్టిక్ న్యూస్ క్యాప్సుల్‌లో – సౌరవ్యవస్థలోని వివిధ గ్రహాల మధ్య పరస్పర సహకారంతో ఆర్థిక వ్యవస్థ ఎలా వర్ధిల్లుతోందో చెప్పారు. మధ్యలో ఏదో మామూలు విషయాలన్నట్టుగా భూమి మీద జరిగిన ఓ దోపిడి గురించి, చంద్రునిపై విద్యుత్ తుఫానులు వంటి సాధారణ అంశాలను ప్రస్తావించారు. చంద్రుడి కక్ష్య లోనూ, గనీమీడ్‌లోను పవర్ స్టేషన్లు నాశనమవడం లేదా లాండిస్-2 యొక్క తేలియాడే కాలనీలో పేలుళ్లు, హత్యల గురించి చెప్పనేలేదు.

“దీనికంతటికీ కారణం నేనే. నేనసలు ఈ రహస్య ఆపరేషన్‌లో ప్రవేశించకుండా ఉండాల్సింది. ఎంపికైన వ్యక్తా… నా మొహం! ఇప్పుడు అంతరిక్షంలో మనల్ని బంధించిన వారి నుంచి ఎలా తప్పించుకోడం?” అన్నాను ఓడిపోయినట్లుగా.

మూడవ రోజున, లెత్వాల్ రూజ్ ప్రధాన కమాండ్ సెంటర్‌లో సమావేశానికి మమ్మల్ని పిలిచారు. అది విస్తృత వృత్తాకార ప్రాంతం. లోపల మానిటరింగ్ పానెల్స్, రాడార్ తెరలు ఉన్నాయి. గాజు అద్దాల గుండా ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి.

టేబుల్ వద్ద తల మాకు కనిపించేలా వెనక్కి తిరిగి కూర్చుంది సయోని.

“హనీ!” అంటూ ఆమె గట్టిగా కేకపెట్టింది. “మనం ఈ ఆపరేషన్ చివరి రెండు దశలకి చేరుకున్నాము. మనం టైటాన్‌ని సమీపిస్తున్నాం. నా తండ్రి, చక్రవర్తి సమూరా నా ద్వారా ఆదేశాలు జారీ చేస్తాడు. నీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మాకు కావలసిన దాన్ని గుర్తించు. అంతేకాకుండా, నువ్వు టైటాన్ స్థానికురాలైన డిమిట్రీని వెంట తీసుకువెళ్ళు. టైటాన్‌లో ఆమె తన తండ్రి, సోదరుడు ఉన్నారు, ఆమెకి సొంత ఇల్లు ఉంది. టైటాన్‌కి వెళ్ళడానికి మీకు వీసాలు, ఇతర పత్రాలను ఇస్తాము. ఈసారి మీరు పర్యాటకులవలె చట్టబద్ధంగా వెళ్ళవచ్చు. రెండు శనిగ్రహపు రోజులలోగా నువ్వా వస్తువుని తెచ్చివ్వాలి. పరుగులు తీయద్దు, అది నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తునడానికి అది సూచన. అయినా మా జాగ్రత్త కోసం ప్రకృతిని బందీగా ఉంచుకోవలాని నిశ్చయించాను” అంది.

“అయ్యో, వద్దు!” అన్నాను నేను అరుస్తూ.

అలా అరుస్తుంటే ఒకటో రెండో మెరుపులు నా కళ్ళ లోంచి బయటకు వచ్చాయి.

“నా భార్యను మీకు బందీగా ఇవ్వడం కంటే ఇక్కడే నేను మీతో పోరాడి చనిపోతాను. వద్దు! వద్దు! వద్దు! ఆమె నాతో రావాలి లేదా నేను అసలు వెళ్ళనే వెళ్ళను!” అన్నాను.

నిశ్శబ్దం.

సయోని నా నిజాయితీని అర్థం చేసుకున్నట్లుంది.

“అయితే ఏనిమాయిడ్‌ని ఉంచండి! నువ్వు తిరిగి వస్తావన్న నమ్మకం ఏమిటి?”

“వద్దు! ఏనిమాయిడ్ వద్దు. అతను మా నావిగేటర్. అతను విశ్వంలో ఏ వాహన్నానైనా నావిగేట్ చేయగలడు. అతను నా స్నేహితుడు. నేను అతనిని కోల్పోలేను. మీరు మమ్మల్ని నమ్మకతప్పదు లేదా మేము వెళ్లలేము” చెప్పాను.

“అవును! అవును! మేము మా మాస్టర్‌కి మద్దతు తెలుపుతున్నాం! బెదిరిస్తే మేము వెళ్ళం!” అంది ప్రకృతి.

డిమిట్రీ నవ్వింది. “అవును. మేము అంగీకరిస్తున్నాం. ఇకపై మీ దుష్టకార్యాలలో మీకు సాయపడం. మమ్మల్ని మా ఇళ్ళకి పంపేయండి” అంది.

దెయ్యంలా నవ్వింది సయోని. ఆమె పక్కన ఉన్న పొడవాటి అస్థిపంజరాల్లాంటి ఆల్ఫా సెంటారి తాంత్రికులు కూడా విచిత్రంగా, ఎగతాళిగా నవ్వారు.

స్పేస్‌షిప్ గోడపై మాకు ఎదురుగా ఉన్న తెర ఒక్కసారిగా జీవం పోసుకుంది. తెర మీద మొదట చెదురుముదురుగా ఉన్న చిత్రం క్రమంగా స్పష్టంగా కనిపించసాగింది. అందులోని వ్యక్తుల ఆకారాలు, నేపథ్యం రూఢిగా తెలుస్తున్నాయి.

“అయ్యో! వద్దు!” అరిచింది డిమిట్రీ భయంతో.

గడ్డంతో, ముడతలు పడిన ముఖంతో ఉన్న పొసయిడన్‌ని తెరపై చూసి గుర్తించగలిగాను. ఇనుప గొలుసులతో కట్టుబడి, తీవ్రమైన నొప్పితో చాలా బాధ పడుతున్నాడు. అతని పక్కన గిరజాల జుట్టు, తలపై యాంటెన్నాలతో ఎరుపు రంగులో ఉన్న ఒక పొడవాటి యువకుడు ఉన్నాడు. కానీ అతని కళ్ళు మూసుకుని ఉన్నాయి. అతను డిమిట్రీ యొక్క అంధ సోదరుడు జూలియస్ అని పోల్చుకున్నాను.

అస్థిపంజరాల్లా ఉన్న గడ్డం వ్యక్తులిద్దరు చేతులలో మెరుస్తున్న కత్తులతో ప్రత్యక్షమయ్యారు. కత్తులని పొసయిడన్‌, జూలియస్‌ల మెడలపై ఉంచగానే, అవి ఎరుపు రంగు లేజర్‌లా మారాయి.

ఆపుకోలేని వికటాట్టహాసాల మధ్య, దెయ్యంలా భీకరంగా ఉన్న సయోని అడిగింది “ఇప్పుడేమంటారు? వెళ్తామంటరా? వెళ్ళం అంటారా?”

ఈ మంత్రగత్తె మరణాన్ని ఎంతలా కోరుకున్నాను? చనిపోయినా మళ్ళీ బ్రతికి వచ్చింది. పునర్జన్మ పొందిన ఈ దుష్టురాలిని ఎలా నాశనం చేయాలి?

దిగ్భ్రాంతికి గురై ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉన్న తరువాత, “సరే అను హనీ! నాకీ ప్రపంచంలో ఉన్నది వాళ్ళిద్దరే. వాళ్ళని నేనెంతగానో ప్రేమిస్తాను!” అంది డిమిట్రీ.

చేసేదేం లేక “సరే” అన్నాను. ఓ కొత్త గ్రహానికి మరొక యాత్రకి అంగీకరించాను. టైటాన్ నిజానికి శనిగ్రహానికి ఉపగ్రహం. టైటాన్‌లో మానవులుండే భూగర్భ కాలనీ ఇప్పుడు మా గమ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here