[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]
అధ్యాయం 39: “మెర్!”
[dropcap]ఉ[/dropcap]దయం కోసం ఎక్కువసేపు వేచి చూడలేకపోయాను. కృత్రిమ కాంతి, కృత్రిమ గురుత్వాకర్షణతో ఉండే ఒక భూగర్భ కాలనీలో సూర్యోదయం ఎలా జరుగుతుంది? ఎవరైనా నిద్ర-మెలకువ చక్రం యొక్క జీవసంబంధమైన లయలతో నిద్రించాల్సిందే, జీవసంబంధమైన మేల్కొలుపుతో నిద్ర లేవాల్సిందే… మేలటోనిన్ వంటి హార్మోన్ల సంకేతాలతో అలారంతో మేల్కొనాల్సిందే. అవును, టైటాన్‌లో పగలు భూమి మీద 16 రోజులు. మేము తిరగడానికి ఒక రోవర్‌ని అద్దెకు తీసుకున్నాం. మా వద్ద ధ్రువీకృత పత్రాలు ఉండడడంతో ఎవరూ ప్రశ్నించలేదు.
మూసిఉండే ఈ వాహనాన్ని టైటాన్ యొక్క భూగర్భంలోని పాముమెలికల వీధుల గుండా, ఇరువైపులా నివాసాలున్న దారి ద్వారా ఏనిమాయిడ్ నేర్పుగా నడిపాడు. ఇక్కడి నివాసాల ప్రవేశమార్గాలను భూగర్భ గోడలలో నిర్మించారు. చాలా రోవర్లు తిరుగుతున్నాయి, కొంతమంది మాత్రమే నడుస్తూ కనపడ్డారు.
ఒక గంట ప్రయాణం తర్వాత, మేము క్రమంగా మళ్లీ భూఉపరితలానికి చేరుకున్నాము. ఒక డెడ్-ఎండ్ వద్ద ఉన్న భవనం సమీపంలో మా వాహనాన్ని ఆపి ఇరుకైన, చప్టా వంటి కాలిమార్గం ద్వారా, ఉపరితలం పైకి నడవసాగాం.
“అదిగో! లా మెర్!” అని ఉత్సాహంగా అరిచింది డిమిట్రీ. అంటే సముద్రం అని అర్థం. “మా ఇల్లు ఇక్కడికి దగ్గరే!” అంది.
అది చూడాల్సిన ప్రదేశం. తరంగాలతో కూడిన ముదురు రంగు సముద్రపు నీరు; సముద్రపు ఉత్తర దిక్కున వలయాలతో కూడిన శనిగ్రహం – ఆకాశంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకున్నాయి. తూర్పున ఆకాశంలో సుదూరంగా సూర్యుడు కనిపిస్తున్నాడు. సూర్యుడు సన్నని కాంతితో ఒక చిన్న వివర్ణమైన వెండినాణెంలా ఉన్నాడు.
ఈ ప్రాంతం సముద్రం సమీపంలో ఉంది, కానీ పూర్తిగా టైటాన్ ఎగువ ఉపరితలం కాదు. “మా తాంత్రికుల, మంత్రగత్తె కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మేమిక్కడ మా వృత్తిని సాధన చేస్తుంటాం” చెప్పింది డిమిట్రీ. ఆమె చెప్పేది నిజమే, సముద్రతీరంలో కొండలకు పైకి వాలినట్లుగా ఉన్న కోటల్లాంటి ఇళ్ళను నేను గుర్తుపట్టాను.
సుమారు 30 నుండి 40 కోటలు ఒకే వరుసలో ఉన్నాయి. డిమిట్రీ నా చెయ్యి పట్టుకుంది.
“పొగ గొట్టాల నుండి పొగ వస్తున్న నాలుగవ భవనాన్ని చూడండి. అదే మా ఇల్లు. వాళ్ళు దేన్నో తగలబెట్టారు లేదా దహనం చేస్తున్నారు!” అంది.
“దాడికి ప్రణాళిక తయారుచేద్దాం!” అన్నాను. “ముందు నువ్వు, ప్రకృతి వెళ్ళి వాళ్ళ దృష్టి మళ్ళించాలి. నేను ఇనుపగొలుసులని తప్పించి నీ తండ్రిని, సోదరుణ్ణి బయటకు తెస్తాను. ముందు మీరు వెళ్ళండి!” అన్నాను.
దృష్టి సాగినంత మేర నారింజ రంగులో ఉన్న ఆకాశం… వాతావరణంలో మీథేన్ నిండి ఉంది… ‘మెర్ నార్డ్’ (ఉత్తర సముద్రం) నల్ల రంగులో ఉంది, శనిగ్రహం ఆకర్షణ వల్ల అలలు పెరుగుతున్నాయి, విరుగుతున్నాయి. ఆ ప్రదేశం భీతి కొల్పుతోంది.
డిమిట్రీ, ప్రకృతి పొసయిడన్ కుటుంబం నివసిస్తున్న కోట వైపు నెమ్మదిగా భూమిలోని అడవి పిల్లుల వలె వెళ్ళారు.
కాసేపటికి వారు కనుమరుగయ్యారు.
మేము వేచి ఉన్నాం, ఎంతో కాలం గడిచినట్లుంది.
అప్పుడు ఆ ఇంటి సమీపంలో గొప్ప ధ్వనితో విస్ఫోటనం జరిగి, పెద్ద పెద్ద నిప్పు ముద్దలు బయటకొచ్చాయి. వాటితో పాటు గాలి… దుమ్ము కూడా.
వెంటనే అలజడి… భారీకాయులైన ఏడు అడుగుల సముద్రరాక్షసులు బయటికొచ్చారు.
వాళ్ళు నలుగురున్నారు. మొదట నిప్పు ముద్దని విస్మయంతో చూశారు. ఇద్దరేమో సముద్రం వైపు పరుగెత్తారు… నీటిని తేవడానికో లేదా తప్పించుకునే ఉద్దేశమో…
“యో! హో!” అన్నాను. “ఏనిమాయిడ్! పరిగెత్తు! లోపలికి వెళ్దాం! యురేకస్, మమ్మల్ని అనుసరించు!”
మేమా ఇంట్లోకి రహస్యంగా వెళ్ళాము. ప్రకృతీ, డిమిట్రీ విశ్వశక్తితో ఆటంకాలు సృష్టించి కాపలాగా
ఉన్న గార్డులందరి దృష్టిని మళ్లించారు.
మేము కోట యొక్క పెద్ద ఇనుప ద్వారం గుండా లోపలికి వెళ్ళాం. తాళం వేయకపోవడంతో తలుపును తోసుకుని ప్రధాన గదిలోకి వెళ్ళాం.
హాలులోని ఫర్నిచర్ అంతా… సోఫా సెట్స్, టేబుల్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. విండో కర్టెన్లు గాలికి ఎగురుతున్నాయి.
మొదటి అంతస్తుకు చేరుకునేందుకు మేము మెట్లవైపు పరిగెత్తాం.
అక్కడ అతిథులకు చాలా పెద్ద స్థలం ఉంది, మధ్యలో ఒక పెద్ద చెక్క బల్ల ఉంది. దానిపై పొసయిడన్‌ని తలక్రిందులుగా వేలాడదీశారు. అతను ఎగశ్వాస తీస్తున్నాడు. పైకప్పు పైకి నుండి ఇనుప తీగలతో తలక్రిందులుగా వేలాడదీశారు.
“ఏనిమాయిడ్! జూలియస్ ఎక్కడున్నాడో చూడు” అన్నాను అరుస్తూ. నేను తాళ్ళ మీద దృష్టి కేంద్రీకరించి నా చూపులతో వాటిని కాల్చివేసాను. డిమిట్రీ తండ్రిని ఇంతలా హింసించి మరణం అంచులదాకా తెచ్చినందుకు నాకు కోపం వచ్చింది.
తాళ్ళు తెగిపోగానే పొసయిడన్ గట్టిగా చప్పుడు చేస్తూ నేలకొరిగాడు. నేను అతన్ని పట్టుకోడానికి ప్రయత్నించాను.
అదృష్టవశాత్తు అతను బ్రతికే ఉన్నాడు, శ్వాస తీసుకుంటున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు.
“హనీ ధన్యవాదాలు! నీళ్ళు… నీళ్ళు…” అని బలహీనంగా అన్నాడు.
నీళ్ళు తేవడానికి వంటింటివైపు పరిగెత్తుతుండగా “అతనిక్కడ ఉన్నాడు” అని ఓ గదిలోంచి ఏనిమాయిడ్ స్వరం వినిపించింది.
వంటింట్లో ఉన్న నీటి కూజాని, గ్లాసులని తీసుకుని బయటకు వస్తూ, కుంటుతున్న జూలియస్ – ఏనిమాయిడ్, యురేకస్‌ల సాయంతో రావడం చూశాను.
పొసయిడన్‌కీ, జూలియస్‌కి తాగడానికి నీళ్ళిచ్చాను. వాళ్ళని బాగా హింసించడంతో వాళ్ళ శరీరాల నుంచి రక్తం కారుతోంది. ఇంతలో మళ్ళీ గందరగోళం వినిపించింది.
ఆ రాక్షసులు వెనక్కి వస్తున్నారు. వాళ్ళు వేగంగా పరిగెత్తుతూ మెట్లు ఎక్కుతున్న ధ్వని వినిపిస్తోంది.
మా మంత్రగత్తెలు వరండాలో సృష్టించిన మంటలు పెరుగుతూ తగ్గుతూ ప్రకాశిస్తున్నాయి. నాకు చిరపరిచితమైన ప్రకృతి స్వరం ఈసారి ఆమె మాతృభాషలో వినిపించింది. “రుక్ జావ్” అంటోంది.
డిమిట్రీ వందల నక్షత్రాల స్థాయి ఉన్న మంత్రగత్తె అని నాకు తెలుసు, ఇక ప్రకృతిదీ, నాదీ ఒకే రక్తం, ఒకే జన్యువులు… నాకున్నంత శక్తి తనకీ ఉంది.
మూలుగులు, బలహీనమైన కేకలు వినపడ్డాయి. సముద్ర రాక్షసులని నిలువరిస్తున్న మా మంత్రగత్తెల అరుపులు వినబడ్డాయి.
పొసయిడన్ లేచి నిలబడ్డాడు. అతనిప్పుడు పూర్తి స్పృహలో ఉన్నాడు.
జూలియస్ డిమిట్రీ యొక్క అంధ సోదరుడు. రోమన్‌ల తరహా ముక్కు, కళ్ళు, గిరజాల జుట్టు, ఎరుపు రంగు చర్మంతో, తలపై యాంటినాలతో అందంగా ఉంటాడు. “ఓహ్! నా ఒళ్ళంతా నొప్పులు… వాళ్ళు నన్ను బాగా బాధపెట్టారు!” అన్నాడు ఏడుస్తూ.
“అలమారాలో ఏవైనా మాత్రలు ఉంటే తెస్తాను, నీ గాయాలకు పట్టీలు వేస్తాను” చెప్పింది యురేకస్.
కిటికీలోంచి కనబడుతున్న సముద్రం కేసి చూశాను.
టైటాన్‌లో ఒక పగలంటే, భూమి మీద సుమారు 15 రోజులు. ఆకాశం నారింజ రంగులో ఉంది. శని వలయాలు సగానికిపైగా ఆకాశాన్ని కమ్మేసాయి. మీథేన్ నిండిన ‘మెర్’ నీళ్ళు ముదురు రంగులో ఉన్నాయి.
కానీ సముద్రంలో ఒక చోట నీటిలోపల ఒక నీలంరంగు భారీ ‘కాంతి వలయం’ కనబడింది.
అది ఓ దీర్ఘ చతురస్రాకారపు భారీ పెట్టె. దానికి మెట్లు, తలుపులు ఉన్నాయి, ఉపరితలంపై చాలా క్లిష్టమైన నాబ్‌లు, బటన్‍లు, ట్యూబ్‍లు ఉన్నాయి.
అది పెద్దది, చలా పెద్దది. ఇరువైపులా దాదాపు 100 మీటర్ల వెడల్పు ఉంటుంది.
తలుపులున్న పెద్ద పెట్టెలా సముద్రంపై తేలుతోంది.
మరియు దాని లైట్లు అకస్మాత్తుగా ప్రకాశించింది.
“దేవుడా, ఎంటది?” అన్నాను.
“ఏమిటి?” అన్నాడు ఏనిమాయిడ్.
“సముద్రంకేసి చూడు!” చెప్పాను.
“‘ది మెర్’. ముదురు రంగు నీళ్ళు… మీథేన్ అని అనుకుంటున్నాను… “
“అది కాదు, పెద్ద నల్లటి బాక్స్ చూడు!”
మా మహిళలు, సముద్ర రాక్షసుల మధ్య పోరాటపు ధ్వనులు వినిపిస్తున్నా నా మనస్సు నాకు కనబడిన ఆ వస్తువు మీదే ఉంది!
“అంటే ఇదే ఆ వస్తువు!” అన్నాను. నాకు మాత్రమే కనబడుతోంది. ఇక్కడ ఉంది. బహుశా ఆ సముద్ర రాక్షసులు కూడా దాన్ని గుర్తించడం ప్రయత్నిస్తుండవచ్చు. దాన్ని గుర్తించడానికి ఆ సముద్ర రాక్షసులను ముందుగానే పంపినట్లుంది సయోని. కావచ్చు.
పొసయిడన్ ఇప్పుడు కిటికీ దగ్గరకి వచ్చాడు.
“హనీ! నువ్వు ఎంపికైన వ్యక్తివి! ఆ డూప్లికేటర్‌ను నువ్వు చూడగలిగితే, నిజంగానే నువ్వు ఎంపికైన వ్యక్తివి! అది మెర్‌లో ఉందని నాకు తెలుసు. కానీ నేను దానిని గుర్తించలేకపోయాను. వాళ్ళు నన్ను హింసించారు. కాని నేను చూడలేకపోయాను, దాని గురించి నేనేమీ చెప్పలేకపోయాను!” అన్నాడు.
“డూప్లికేటరా? అంటే ఏమిటి? “
“దుష్ట తాంత్రికులు సమూరా, సయోని ఎల్లప్పుడూ కోరుకున్న ఒక పరికరం” అన్నాడు.
ఇంతలో యురేకస్ అక్కడికి వచ్చింది. “నేను మీ గాయాలకు మందు వేస్తున్నాను మాస్టర్ పొసయిడన్, జూలియస్‌కి డ్రెస్సింగ్ చేస్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. ఔషధం తీసుకోండి” అంది.
దాని ట్రేలో గ్లాసులలో నీళ్ళు, మాత్రలు, బ్యాండేజ్ పదార్థాలు ఉన్నాయి.
“పడగ్గదిలోని మందుల అలమారలో ఇవి దొరికాయి” చెప్పింది యురేకస్.
ప్రాంగణంలోని శబ్దాలు ఆగిపోయాయి. పరుగులు తీసున్న అడుగుల చప్పుడు వినిపించింది.
కాసేపటికి తీవ్రత తగ్గి, మొత్తానికి ఆగిపోయింది.
నలుగురు సముద్ర రాక్షసులు పారిపోయారు.
“లేదా వాళ్ళని ఉపసంహరించారా?” అడిగింది యురేకస్.
“ఎన్‌సైక్లోపీడియా గెలాక్టికాలోని తాంత్రిక కథనాలను వెతికితే, ఇది కూడా ఒక అద్భుత వస్తువని తెలిసింది. గంటల పాటు ఈ డూప్లికేటర్ వేలాది క్లోన్డ్ రోబో సైనికులను సృష్టించగలదు. ఇది మీథేన్ నిండిన సముద్రం నుండి కార్బన్, నత్రజని, సోడియం మరియు ఇతర పరమాణువులు ఉపయోగించి క్లోన్డ్ రోబోలను రూపొందిస్తుంది” చెప్పింది యురేకస్.
నేను విస్తుపోయాను. నేను భయపడినట్లుగానే జరుగుతోంది. వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటిగా నా సహాయంతో అద్భుత వస్తువులని సేకరిస్తున్నారు. కమ్యూనికేషన్లు, అపరిమిత శక్తులు, అణుశక్తి పాటవం, ఇప్పుడు యుద్ధానికి క్లోన్డ్ రోబోటిక్ సైనికులు…
పైగా ప్రతి మానవ కాలనీలో వాళ్ళకి రహస్య అనుచరులు ఉన్నారు. ఇప్పుడు ఆరవ వస్తువు దొరికింది.
నా మెదడులో వందలాది ఉరుముల ధ్వని ఒక్కసారి వినిపించినట్లయింది.
టెలీపతీతో సంభాషించడమనేది మాంత్రికుల శక్తులలో ఒకటి.
నేను ఇప్పటివరకు అరుదుగా ఆ సంభాషణను ఉపయోగించాను.
ఇంతలో ఎవరో నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు నా మెదడుకు తెలుస్తోంది.
“హ్…. ని… హ…. ని…! హనీ…!” అది సయోని యొక్క భీతిగొలిపే స్వరం… ఆకాశం నుంచో లేదా మరేదే దూరప్రాంతం నుంచో నా తలలో వినబడుతోంది.
“హనీ, కుజుడు నిన్ను అనుగ్రహించు గాక! నీకు డూప్లికేటర్ కనిపించింది. నువ్వు అక్కడే ఉండు! కాసేపటిలో మేము అక్కడ దిగుతాం. టైటాన్‌ని స్వాధీనం చేసుకోడం కొన్ని గంటల్లో పూర్తవుతుంది. నీ సహాయానికి ధన్యవాదాలు. ఎందుకంటే నువ్వు ఎంపికైన వ్యక్తివి! అక్కడే ఉండు! మీకెలాంటి హాని కలగదు.”
ఎంత అకస్మాత్తుగా వచ్చిందో, అంతే అకస్మాత్తుగా పోయింది నా తల నొప్పి.
ప్రకృతి, డిమిట్రీ ఆ గదిలోకి వచ్చారు.
ప్రకృతి నా వైపు రాగా, డిమిట్రీ తన తండ్రి దగ్గరికి, రోదిస్తున్న తమ్ముడి దగ్గరికి వెళ్ళింది.
పెద్ద దీర్ఘచతురస్రాకారపు డూప్లికేటర్ సముద్రంలో మెరుస్తోంది. బయట ఇరుకైన దారిలో ఏదో అలజడి వినిపిస్తోంది.
నేను ఎవరికీ ఏమీ చెప్పలేకపోయాను. సందేశం నా మనసులోనే ఉంది.
మేమంతా విశ్రాంతిగా కూర్చుని మిఠాయిలు తింటూ పాలు కాఫీ, సూప్ వంటి వేడి పానీయాలు తీసుకుంటూ కాలం గడిపాం. అంతా బాగుందన్నట్టుగా నటించినా, కొద్ది గంటలలో ఏం జరగబోతోందో నాకు తెలుసు.
సమూరా యొక్క రహస్య ఏజెంట్లు – డూప్లికేటర్ నుంచి క్లోన్డ్ రోబో సైనికులను బయటకు పంపుతారు, టైటాన్ రాజు కొన్ని గంటల్లో తొలగించబడతాడు.
***
తర్వాతి సంఘటనలు తరువాత ఒకదాని తర్వాత ఒకటి వేగంగా జరిగిపోయాయి. పొసయిడన్‌కీ, జూలియస్‌కీ మందులు ఇవ్వడం, వారి గాయాలకు పట్టీలు వేయడం జరిగింది. మేము డిమిట్రీ ఇంటిలో ఆహారం తీసుకున్నాము. మమ్మల్ని బెదిరించేందుకు సయోని పంపిన సముద్ర రాక్షసుల ద్వారా వారు అనేక టైటాన్ గంటలపాటు హింసించబడ్డారని తెలుస్తోంది.
ఒక గంటలోనే, లివింగ్‌రూమ్‌లో ఒక బల్లపై ఉన్న టీవీలో ‘పరాయి గ్రహవాసులు’ రాజభవనంపై దాడి చేశారనీ, పౌరులందరూ ఇళ్ళలోనే ఉండవలసిందని చెబుతూ టైటాన్‍లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మేము బయటకి వెళ్ళనక్కర్లేదు, పొసయిడన్‌నీ మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్ళనవసరం లేదని నిర్ణయించుకున్నాము. భవనం ముందరి సముద్రంలో డూప్లికేటర్ బెదిరిస్తున్నట్టుగా ప్రకాశిస్తోంది. దాని సమీపంలో ఒక ఓడ ఆగి ఉండడం తెలుస్తోంది, బహుశా క్లోన్డ్ సైనికులను తీసుకువెళ్ళేందుకేమో.
టైటాన్ ఆకాశంపై నిలిచి ఉన్న లెత్వాల్ రూజ్‌లో ఉన్న మంత్రగత్తెకి యురేకస్ ఫ్రీకెన్సీ అందుతోంది. “సందేశం!” అంది యురేకస్.
“ధన్యవాదాలు హనీ! మేం నీ నుంచి ఏం ఆశించామో దానిని నువ్వు చేశావు. నువ్వు ఎంపికైన వ్యక్తివి! మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. టైటాన్‌ని ఆ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది” అని సందేశం పంపింది సయోని.
నేను ఊహించినట్టే, చీకటి శక్తులు గెలవడానికి నేను మళ్ళీ సహాయం చేశాను. నాకు కోపంగా ఉంది, నిరాశగానూ ఉంది.
ప్రకృతి సోఫాలో కూర్చుని టీవీ చూస్తోంది. డిమిట్రీ మాకు తన ఇంటిని చూపిస్తోంది. టైటాన్‌లో తన కుటుంబం గురించి, టైటాన్ జీవితం గురించి చెప్తుండగా… టీవీలో వార్తలు ఆకర్షించాయి, పరాయి గ్రహస్థుల దాడి కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు రాజు.
ఆకాశంలో విమానాల నుంచీ పేలుస్తున్న తూటాల చప్పుడూ, రాకెట్లు ఎగురుతున్న ధ్వనులు వినపడుతున్నాయి. హఠాత్తుగా ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. విద్యుత్ సరఫరా కోసం ఒక జెనరేటర్ ఉంది. అత్యవసర పరిస్థితిలో వాడడం కోసం దాన్ని ఆన్ చేశాం. రేడియోలో యుద్ధకాలపు సంగీతం వస్తోంది.
అదృష్టవశాత్తూ ఇంట్లో తగినంత ఆహారం మరియు నీరు ఉన్నాయి.
సముద్రంలో యంత్రం నుంచి తయారైన రోబోటిక్ సైనికులు వీధిల్లో గుంపులుగా తిరుగుతున్నారు. క్లోన్‌లను వేగంగా తయారుచేయడానికి ఏదో ఒకవిధంగా మీథేన్‍నీ, ఇతర ఆర్గానిక్స్‌నీ ఉపయోగించినట్లు అనిపించింది.
ఇది ఒక నమ్మలేనంత విచిత్రమైన విషయం. మా ఇండికా సెంట్రల్ బయోమెడికల్ డిపార్ట్‌మెంట్‍కి ఆశ్చర్యం కలిగించే విషయం!
దాని గురించి ఆలోచిస్తుంటే… శాన్, ఎర్త్ కౌన్సిల్ బృందం గుర్తొచ్చారు. మాకు ఈ బాధ్యత అప్పజెప్పాక, వారు మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మలి కాపాడలేదు. మా తంటాలు మమ్మల్ని పడమన్నట్టు విడిచిపెట్టారు. ఇది బాగా తెలిసిన దృష్టాంతమవుతోంది. లేదా వారు నిస్సహాయంగా ఉన్నారా? భూమి మీద మరియు చంద్రునిపై కొన్ని తిరుగుబాట్లు జరుగుతున్నాయేమో ఎవరికి తెలుసు?
సమూరా ఒక్కో గ్రహాన్ని చేజిక్కించుకుంటున్నాడని అనిపిస్తోంది. నా కళ్ళ ముందే చిన్న ఉపగ్రహమైన లాండిస్‌ను జయించాడు. ఇప్పుడు సయోని క్లోన్డ్ సైనికులతో టైటాన్‌పై పట్టు సాధిస్తోంది.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆగిపోయిన టీవీ అర్ధరాత్రి అవుతుండగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడినప్పుడు మళ్ళీ జీవం పోసుకుంది. కుజగ్రహపు సంగీతం వినిపిస్తోంది. తరువాత నల్లదుస్తులు ధరించిన పొడవాటి కేశాలతో ఉన్న బాలికలు ‘గాడ్ ఆఫ్ వార్ మార్స్’ అనే దేవుని పాటలు పాడారు. ప్రార్థనలు చేశారు.
అర్ధరాత్రి అవుతుండగా ఎర్రని ప్రకాశించే కళ్ళతో, తలపై ఒక యాంటెన్నాతో పొడవాటి గడ్డం, నల్లని దుస్తులు ధరించిన వ్యక్తి టీవీలో కనబడ్డాడు.
“టైటాన్ పౌరులారా! సౌర వ్యవస్థ యొక్క మాంత్రిక సోదరుల శుభాకాంక్షలు. మహనీయ చక్రవర్తి సమూరా యొక్క అనుచరుల శుభాకాంక్షలు. దుష్టుడు, స్వార్థపరుడు, మిమ్మల్ని సరిగ్గా సేవించక, తాను మాత్రం సంపదను పోగుచేసుకున్న మీ రాజు ఇప్పుడు పదవినుంచి తొలగించబడ్డాడు. మంత్రులు కూడా హతమార్చబడ్డారు లేదా పలాయనంలో ఉన్నారు.
ఇప్పుడు, మీరు సమూరా సామ్రాజ్యంలో ఉన్నారు, కుజగ్రహపు అరుణ భూముల చక్రవర్తి పాలనలో ఉన్నారు. భయపడకండి! మీరు శాంతియుతమైన సురక్షిత జీవితం మరియు ఆనందం కలిగి ఉంటారు. మీ ఇళ్లలోనే ఉండండి! మీరు ఏం చేయాలో త్వరలోనే చెప్తాం” అన్నాడతను.
రాత్రి అంతా ఇదే పదే పదే చెప్పబడింది.
సయోని నుండి నాకెలాంటి సందేశమూ రాలేదు. ఈసారి వాళ్ళకి నేను అద్భుత వస్తువుని ఇవ్వలేదనేది స్పష్టం! వాళ్ళే తీసుకున్నారు, ఉపయోగించారు.
మా మేల్కొలుపు చక్రం ప్రారంభమయ్యే వరకు దీర్ఘాలోచన చేశాను. తర్వాత చెప్పాను:
“కుదరదు! మనం పారిపోవాలి! తదుపరి అద్భుత వస్తువుని పొందడానికి ప్రయత్నించాలి, అప్పుడు భూమిలో మన మాస్టర్స్‌ని లేదా ఇంటర్ ప్లానెటరీ సెక్యూరిటీ కౌన్సిల్‌ని సంప్రదించాలి. అసలేం జరుగుతుంది? ఒకటి తర్వాత ఒకటిగా, గ్రహ కాలనీలని చాలా సులభమైన మరియు అశాస్త్రీయ పద్ధతిలో తాంత్రిక దళాలు చేజిక్కించుకుంటున్నాయి. భూమి, చంద్రుడు మరియు అంగారక గ్రహంపై ఏమి జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళూ ఓడిపోయారా లేక నన్ను మర్చిపోయారా? పారిపోదాం!”
***
టైటాన్‌పై సుదీర్ఘ పగలు ముగిసి, బహుశా రాత్రి అవుతున్నట్టుంది… ఆకాశంలో నారింజ రంగు అదృశ్యమై మెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. లేదా అర్ధరాత్రి రోబోటిక్ సైన్యం రాజధానిని స్వాధీనం చేసుకున్న కారణంగా ఏర్పడిన విద్యుత్ వైఫల్యమేమో. భూగర్భ నగరంలోని ఇరుకైన వీధులలోనూ వాలుగోడల ఇళ్ళలోనూ ఎక్కడా వెలుగు లేదు. అప్పుడప్పుడు తుపాకీ కాల్పుల శబ్దం తప్ప, అంతా నిశ్శబ్దంగా ఉంది.
మేం నలుగురం – నేను, ప్రకృతి, డిమిట్రీ, ఏనిమాయిడ్ – మా రోబోతో సహా రోవర్‌లో ఎక్కి నగరంలోకి వెళ్ళాము. ఎలా తప్పించుకోవచ్చో మాకు తెలియలేదు. పొసయిడన్, జూలియస్ వాళ్ళ ఇంటిలోనే ఉన్నారు. మాతో వస్తామంటే, నేను వద్దన్నాను.
“పొసయిడన్… నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు. మీ ఇద్దరికీ ఇంకా చికిత్స అవసరం. మేము ఆమెకు డూప్లికేటర్‌ని ఇచ్చేశాం కాబట్టి వారు మీకు హాని చేయరు. విశ్రాంతి తీసుకోండి. ఇతర తాంత్రికుల వలె కొంచెం తగ్గి ఉండండి. మాతో ప్రయాణం ప్రమాదకరం” చెప్పాను నేను.
చీకటి వీధులను, గృహాలను చూశాను. రాజ భవనానికి, మంత్రుల నివాసానికి, ప్రధాన పరిపాలాన ప్రాంతాలకు దారితీసే మార్గాలను హఠాత్తుగా మూసివేయడం చూశాను. డజన్ల కొద్దీ లోహచర్మపు రోబోలు వీధి నుంచి రాజభవనం వైపు కవాతు చేస్తుండడంతో అది పూర్తిగా నిండిపోయింది. ప్రభుత్వాన్ని ఆక్రమించిన సైనిక దళాలలో బహుశా వీళ్ళదే ఆఖరి పటాలం కావచ్చు.
“సందేశం!” అంది యురేకస్. దాని ఛాతీపై ఉన్న తెర మెరిసింది. మొదట యూనివర్శల్ డిజిటల్ లాంగ్వేజ్‌లో అక్షరాలు కనబడ్దాయి. తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుతున్న సయోని ముఖం కనబడింది.
“హనీ! మీరంతా తప్పించుకోవటానికి ప్రయత్నించవద్దు! మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. వెళ్లవద్దు! ప్యాలెస్‌కి రండి! రాజుని చంపేశాం, టైటాన్ యొక్క రాణిగా రేపు నాకు పట్టాభిషేకం జరుగుతుంది. వచ్చి చూడండి!” అంది.
“మీరు ఎక్కడికి వెళ్ళినా మేం మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాం. పైగా, మీరు ఎలా వెళ్తారు? చంద్రగ్రహం మా వశమైంది. సమూరా యొక్క సన్నిహిత మిత్రుడు, చంద్రుడిలోని భూగర్భ కాలనీ యొక్క మాంత్రిక సమూహం నేత కార్కోటాకస్ ఇప్పుడు చంద్రుడికి అధిపతి. త్వరలో భూమి కూడా మాదవుతుంది. కుజగ్రహంలోని అరుణభూములు మా తుది గమ్యం. నేను స్వయంగా మీరోస్ కళ్ళను పెకిలించి చంపుతాను!
సరేనా! ఓ ఎంపికైన వ్యక్తీ! నువ్వు మాకు సహాయం చేసావు. వచ్చి సమూరా దళాలతో చేరు! మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది! “
ఆ సందేశాన్ని చదువుతుంటే నాకళ్ళ వెంట నీళ్ళు కారాయి. విస్తుపోయి మేము రోవర్‌ని ఆపేసినా అదే సందేశం పదే పదే వినిపించింది.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి. అటువంటి మానవ విలువలన్న సౌర వ్యవస్థ కాలనీలు అన్నీ ఒక్కొక్కటిగా పతనమవుతున్నాయి. భూమి మరియు అంగారక గ్రహం కూడా ఓడినట్లయితే, వాళ్ళ గెలుపు పరిపూర్ణమవుతుంది.
ఎప్పుడూ లేనిది డిమిట్రీ వెక్కి వెక్కి ఏడవసాగింది. “నా మాతృదేశం… దుష్టుల వశమైంది. మేము ఇప్పుడు ఈ వింతజీవులకు బానిసలం!” అంది.
ఏనిమాయిడ్ ఆందోళన చెందాడు. “గనీమీడ్ పరిస్థితి ఏమిటో? అదీ వాళ్ళ చేతికి చిక్కిందా? అయితే నేను తిరిగి వెళ్లను” అన్నాడు.
ప్రకృతి కూడా భావోద్వేగంతో ఉంది! “మనం భూమిని కాపాడాలి. దాని విలువల కోసమైనా మనం భూమిని రక్షించాలి. శత్రువులతో పోరాడడానికి భూమి మీద అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తాను! భూమి శక్తివంతమైనది భూగ్రహవాసులు తెలివైనవాళ్ళు” అంది.
“సరే, కుజగ్రహంలో కాన్‌స్టాన్‌టైన్, జనరల్ గ్యాని మాటేమిటి… వారు తప్పకుండా అడ్డుకుంటారు… రహస్య మాంత్రికుల ఏజెంట్లు, అద్భుత శక్తులలో రకరకాల ఆయుధాలు సృష్టించే ఈ దుష్టమాంత్రికులు వాళ్ళని లోబర్చుకోకుండా ఉంటే… వారు తప్పకుండా ఎదిరిస్తారు… సమూరా, సయోని ధూర్తులు. కపటులు. నిగూఢ అనుచరలను కలిగి ఉన్నారు” చెప్పాను.
“డార్క్ అవుట్‌పోస్ట్స్” అంది డిమిట్రీ. “ప్రతి గ్రహంలోనూ స్లీపర్ సెల్స్, రహస్య ఏజెంట్లు, అంకితభావమున్న మాంత్రికులు ఉన్నారు. ఇది బయటకి సాయంలా కనిపించే అంతర్గత విప్లవం. ఈ సౌర వ్యవస్థను ఆక్రమించుకోడానికి సమూరా చేసేదిదే. అతను రిమోట్ కంట్రోల్ తోనూ, అద్భుత వస్తువులతోనూ, ఉన్నత హోదాలలో ఉన్న మోసపూరిత అనుచరులతోనూ ఇది సాధిస్తాడు” అంది.
“అవును! మనం అవన్నీ చూశాము! అతనికి కెప్లర్ యొక్క ఆల్ఫా సెంటారి మాంత్రికులు సాయం చేస్తున్నారని ఇప్పుడు మనకు తెలుసు. ఆ ఆఖరి అద్భుత వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలియదు. నేను ఎంపికైన వ్యక్తిని అయినా కూడా వారికి నేనా ఆ వస్తువుని ఇవ్వను. నేను దుష్టులకు సహాయం చేయను. నేను మంచివాళ్ళకే సహాయం చేస్తాను.
ప్రయత్నిద్దాం! మనం పారిపోతే, వారు మనల్ని వెంబడిస్తారు. కానీ ప్రయత్నిద్దాం! ఎర్త్ కౌన్సిల్ చైర్మన్‌ని, మిలిటరీ సంప్రదించడానికి ప్రయత్నించండి… వాళ్ళకి చెప్పండి…” అన్నాను.
మేము రోవర్‌ని స్టార్ట్ చేశాం, ఎగ్జిట్ దిశగా దానిని నడిపించాము.
నా ప్రణాళిక ఉపరితలం వరకు వెళ్ళడం. ఆపై స్పేస్ డ్రోమ్‌కి వెళ్ళడం. విశ్వశక్తితో ఒక వ్యోమనౌకని హైజాక్ చేయగలిగితే, భూమికి వెళ్లవచ్చు.
“ఇది సాధ్యమేనా? సాధ్యమే. కష్టాల్లో మనకి కావలసింది ధైర్యం! మేమందరం శక్తివంతమైన మాంత్రికులం. మేము భూమి యొక్క సభ్యోక్తి పదం ‘పిసియుఎఫ్’ను ఇక్కడ ఉపయోగించనవసరం లేదు. మాంత్రికులను ఏకాంతంగా ఉంచి భూమి తప్పు చేసింది, వారి గురించి ఏవరికీ తెలియకూడదనుకోడం పెద్ద తప్పిదం!
నేను ఒక తాంత్రికుడిని. వారి దృక్పథంలోనూ. పత్రాలలోనూ అద్భుత వస్తువులను గుర్తించడానికి ఎంపికైనవాడిని.
నేను ఎంపికైనవాడినైతే, దుష్ట నేరస్థులతో పోరాడతాను! “
ఇలా నేను మనసులో అనుకున్నాను.
“అట్లే అగు గాక” అన్నారు ప్రకృతి, డిమిట్రీ.
“ఎలా?” ఆశ్చర్యంగా అడిగాను.
“టెలీపతీ!” అన్నారు వాళ్ళు నవ్వుతూ.
***
అది ముదురు నారింజ ఆకాశంతో 16 భూమి రోజులకి సమానమైన టైటాన్ రోజులో సంధ్యాసమయం. భూగర్భ కాలనీలో చెలరేగిన యుద్ధాన్ని మేము దాదాపుగా తప్పించుకున్నాం, టైటాన్ ఉపరితలానికి వచ్చేశాం.
“స్పేస్‌డ్రోంకి వెళ్దాం. టైటాన్ పొజిషనింగ్ సిస్టమ్ ఏదైనా ఉంటే, ఆన్ చేయండి. దారి గుర్తించండి! “
“సరే! సరే! మాస్టర్!” అన్నాడు ఏనిమాయిడ్. అదంతా మంచుతో నిండిన బిలాలు లేని మైదాన ప్రాంతం. మా వాహనం కిటికీ నుంచి చూస్తుంటే దూరంగా కొండలు, సముద్రం వేగంగా వెనక్కిపోతున్నాయి. ఇక్కడ రాతి ఉపరితలం లేదు, కానీ బయట అడుగుపెడితే, మీథేన్ నిండిన ఈ వాతావరణం ఐదు నిమిషాల్లో మనల్ని చంపేస్తుంది. ఆక్సిజన్ మాస్క్ ధరించడం తప్పనిసరి. గురుత్వాకర్షణ ఒక సమస్యగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ గాలిలో తేలవచ్చు. మా వద్ద ఆక్సీజన్ మాస్క్‌లున్నాయి, బ్యాక్‌ప్యాక్‌లో సిలిండర్లున్నాయి. అయితే మేము రోవర్ నుండి బయటకు వెళ్లవలసిన అవసరం లేదని అనుకున్నాను. అయితే ఈ చిన్న వాహనంలో ఇంధనం అయిపోతే మాత్రం తప్పదు, దిగాల్సి వస్తుంది.
డిమిట్రీకి ఫోన్ వచ్చింది. “హాయ్ నాన్నా!” అంది. పొసయిడన్, ఆమె తండ్రి తన గెలాక్సీ ఫోన్ నుంచి ఆమెతో మాట్లాడుతున్నాడు.
“మీరా! అలాగే. అలాగే. నేను అతనికి చెప్తాను. మేమలాగే చేస్తాం. అతని పేరు ఏమిటి? సరేనా?” అంటోంది ఫోన్‌లో డిమిట్రీ. వాళ్ళ సంభాషణ ముగిసింది.
అప్పుడు ఆమె నాతో… “నాన్న టెర్మినల్‌కి వెళ్ళే దగ్గరిదారి చెప్పాడు. కోఆర్డినేట్స్ ఇచ్చాడు. స్పేస్‌డ్రోమ్‌లో మంత్రగాళ్ళ సంతతికి చెందిన ఒక వ్యక్తి మనకు సాయం చేస్తాడు. క్యాసినికి వెళ్ళే స్పేస్ షటిల్‌కు టికెట్లు ఇప్పించడంలో మనకు సహాయం చేస్తాడు. క్యాసిని నుండి, భూమికి వెళ్ళేందుకు మనమే ఏదో ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. హైజాక్ లేదా విశ్వశక్తిని ఉపయోగించాలి రావచ్చు… క్యాసిని మీద నాకు తెలిసినతను ఉన్నాడు, కానీ అతను డ్యూటీలో ఉంటాడో లేదో నాకు తెలియదు” అని అంది.
“దగ్గరి దారిలో వెళ్దాము” అన్నాను.
“పొసయిడన్ ఇచ్చిన కోఆర్డినేట్లు ఫీడ్ చేశాను. మరో అరగంటకి సరిపోయే ఇంధనం ఉంది. మనం ముప్పై నిమిషాల్లో అక్కడ ఉండాలి” అన్నాడు ఏనిమాయిడ్.
నేను రోజు, రాత్రి, గంటలు, నిమిషాలు మరియు మైళ్ళ అంచనా వేయడానికి ‘సాపేక్షత’ శాస్త్రవేత్తని కాదు. టైటాన్ పై దూరం – శని మీద, శని సూర్యుని చుట్టూ చేసే భ్రమణంపై ఆధారపడి ఉంటుంది. నేను రోవర్ యంత్రాలను, యురేకస్ యొక్క యంత్రాలను అనుసరించాను. ప్రతి గ్రహం వేర్వేరు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం వేళలని కలిగి ఉంటుంది, పగలు, రాత్రి, సంవత్సరం… అన్నీ దాని వేగం ప్రకారం వేర్వేరుగా ఉంటుంది. ఇదంతా నాకెలా తెలుస్తుంది?
కాసేపట్లో టైటాన్ స్పేస్‌డ్రోమ్ యొక్క కట్టడం కనబడింది, శనిగ్రహం యొక్క స్పేస్ ప్లాట్‌ఫాం క్యాసిని నుండి అంతరిక్ష నౌకలు వచ్చిపోతుంటాయి.
ప్రవేశ ద్వారం వద్ద నేను నీలి రంగు కాంతివలయం ఉన్న వ్యక్తిని చూశాను. నలుగురు సెక్యూరిటీ గార్డులు లేజర్ తుపాకీలతో నిలబడ్డారు.
విశ్వశక్తిని ప్రయోగించేగలిగే వాళ్ళు ఈ స్పేస్‌డ్రోమ్‌ని తమ ఆధీనంలోకి తీసుకుని దానికి కాపలా కాస్తున్నారన్న మాట.
“ఎలా! వాళ్ళు మనల్ని కాల్చేస్తారు. లోపలికి వెళ్ళడం ఎలా?” అన్నాను ఆత్రుతతో. నా మనస్సు కూడా ఆలోచనలల కోసం శోధిస్తోంది.
అదృశ్య రూపం?
వాళ్ళకి తెలిసిపోతుంది. వారు కూడా తాంత్రికులు. మా చుట్టూ చాలా నీలం కాంతి ఉంటుంది.
“వాళ్ళ దృష్టి మళ్ళించే ఆటంకాలను సృష్టించండి!” అంది యురేకస్.
“నేను చేస్తాను. అప్పుడు మనము చప్పుడు కాకుండా లోపలికి ప్రవేశించవచ్చు” అంది ప్రకృతి.
“రోవర్ ఆపు” ఏనిమాయిడ్‌ని ఆదేశించాను.”ఆక్సిజన్ మాస్క్‌లు, స్యూట్లు ధరించండి. నేను చెప్పగానే క్రిందకి దూకి, లోపలికి పరిగెత్తండి!” అన్నాను.
స్పేస్‌డ్రోమ్‌కి తూర్పున వంద గజాల దూరంలో పెద్ద నీలం రంగు మెరుపు మెరిసింది. అప్పుడు అనేక తలలతో ఉన్న అందమైన పాము ఆకారం తోకపై నిలబడి ఉన్నట్టు కనబడింది. తలపాగాలు ధరించిన ఇద్దరు పొడవాటి మానవులు చిన్న వాయు సంగీత వాయిద్యంతోనూ, డప్పులతోనూ దాన్ని ఆడిస్తున్నారు. మంత్రముగ్ధులను చేస్తున్న ఆ సంగీతానికి తగినట్టుగా పాము పడగలను ఆడిస్తోంది, అప్పుడప్పుడు పన్నెండుకి పైగా ఉన్న దాని పడగలలోని నోట్లోంచి నుండి విషపూరిత లాలాజలము బయటకొస్తోంది.
నీలిరంగు కాంతితో ఉన్న ఆ నలుగురు సైనికిలు ఆ వింత దృశ్యాన్ని చూడడానికి సహజంగానే అటువైపు పరిగెత్తారు.
ప్రకృతి రహస్యమైన గొంతులో మాట్లాడుతూ అంది:
“దాన్ని నేనే సృష్టించాను. ఇప్పుడు మీరు అన్ని తలుపులు దాటుకుని లోపలకి వెళ్ళిపొండి! నేను హోలోగ్రామ్‌ని సృష్టించాలి కాబట్టి, ఆఖరున వస్తాను.”
మేము లోపలికి పరిగెత్తాం. నాకు ప్రకృతి గురించి ఆందోళనగా ఉంది. అందుకే మా ఏకైక పలాయన మార్గం అయిన స్పేస్‌డ్రోమ్ యొక్క చల్లని, కాంతివంతమైన ఆక్సిజనేటెడ్ లాబీలోకి ప్రవేశించగానే వెనక్కి తిరిగి చూశాను.
ఎర్ర చీరలో ఉన్న ప్రకృతి ఏదో ఉచ్చరించింది. ఇప్పుడు చుట్టూ 100 గజాల దూరంలో బాగా అలంకరించిన ఎద్దు నృత్యం చేస్తూ కనబడింది. భారతీయ గ్రామీణుల వంటి ఇద్దరు వ్యక్తులు డప్పు కొడుతూ దాన్ని ఆడిస్తున్నారు.
అప్పుడు ప్రకృతి లోపలికి వేగంగా పరుగెత్తుకొచ్చి, నన్ను హత్తుకుంది.
“వారు త్వరలోనే తెలుసుకుంటారు. ఇప్పుడు పరిగెత్తండి!” అంది.
ఒక టికెట్ కౌంటర్ వద్ద తలపై రెండు యాంటెనాలతో, శరీరంపై బూడిదరంగు కేశాలున్న కండలు తిరిగిన వృద్ధుడొకరు మాకు సాయం చేస్తుండగా మేం మా ఆక్సీజన్ మాస్కులను, స్యూట్లను తొలగించాం. ఆ కౌంటర్ పేరు యూనివర్సల్ డిజిటల్ లాంగ్వేజ్‌లోనూ, టైటానీస్ లిపిలోను “లాస్ట్ మినిట్ బుకింగ్ టు ఫారినర్స్ – టైటాన్ టు క్యాసిని నెంబర్ 0019” అని బోర్డు మీద రాసి ఉంది.
డిమిట్రీ మాకు దారిచూపింది, ఆయనతో టైటానీస్ భాషలో వేగంగా మాట్లాడింది.
ఆ మనిషి ఆశ్చర్యపోయాడు కానీ తనను తాను నియంత్రించుకున్నాడు.
క్షణాల్లో మాకు టిక్కెట్లు వచ్చాయి. “ఐదు నిమిషాల్లో 27వ గేట్ దగ్గరికి వెళ్ళండి. షటిల్ బయల్దేరబోతోంది… క్రెడిట్ కార్డులతో చెల్లిస్తారా?” అన్నాడతను.
డిమిట్రీ నవ్వింది. “అంకుల్! మా నాన్న పొసయిడన్ మీకు డబ్బు చెల్లిస్తాడు” అని ఆయనకి చెప్పి, “పదండి… హనీ! గేట్ 27 వద్దకి పరిగెత్తండి!” అని మాతో అంది.
తికమకకి గురైన ఆ టికెట్ విక్రేత ఇలా చెప్పాడు “ఇదిగో, ఆ యంత్రం కోసం కూడా ఈ టికెట్‌ని తీసుకోండి. దానికి చెల్లించాలి. మీకు శుభం కలుగుగాక. అమ్మాయీ జాగ్రత్త! మీరు ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తోంది. మంచికి కాలం కాదు!” అన్నాడతను.
“ధన్యవాదాలు అంకుల్ మార్కస్” అంది డిమిట్రీ.
త్వరలోనే గేట్ 27 కి చేరుకున్నాము, మా టిక్కెట్లను ఫ్లాష్ చేసి, స్పేస్ షటిల్‌లోకి ప్రవేశించాం.
మేము మా సీట్లలో కూర్చోగానే తెల్ల దుస్తులలో ఉన్న టైటానీస్ స్టెవార్డ్ వచ్చాడు. “మీరు విదేశీయులు! క్యాసిని వద్ద తనిఖీ కోసం మీ పాస్‌పోర్ట్‌లు, వీసాలను సిద్ధంగా ఉంచుకోండి” అన్నాడు.
“సిద్ధంగానే ఉన్నాయి” అన్నాను.
“భూమి నుంచి అనుకుంటా” అని మాతో అని, అతను డిమిట్రీకి కనుసైగ చేశాడు. టైటానీస్ శుభాకాంక్షలతో పలకరించాడు.
డిమిట్రీ అతనికి పలకరించి, తమ భాషలో వేగంగా మాట్లాడింది.
“తప్పకుండా!” అన్నాడతను. కొన్ని క్షణాల్లో అతను ఒక ట్రేలో పళ్ళరసాలు, బిస్కెట్లు పెట్టుకుని వచ్చాడు.
“బాన్ అప్పెటిట్!” అంటూ నవ్వాడు. “నాకు భూమి అన్నా, దాని సంస్కృతి అన్నా బాగా ఇష్టం. మంచి మనుషులు” చెప్పాడు.
షటిల్ దాని ఎనిమిది గంటల ప్రయాణం కోసం, ఇంకా డాకింగ్ కోసం క్యాసిని స్పేస్ ప్లాట్‌ఫాం దిశగా ఆకాశంలోకి ఎగిరింది.
“భైరవస్వామీ, నీకు కృతజ్ఞతలు” అని, “హమ్మయ్య” అని ప్రకృతితో అన్నాను.
ఆమె నవ్వింది “పాము, గంగిరెద్దులాట ఎలా ఉన్నాయి?” అడిగింది.
“అద్భుతం! ఆమ్రపాలిలో లాగానే! ఈ రోజు నీవల్లే….” అన్నాను.