భూమి నుంచి ప్లూటో దాకా… -15

0
3

అధ్యాయం 40: మళ్ళీ ‘క్యాసిని’కి

అన్ని ఆధునిక స్పేస్ ప్లాట్‌ఫాంల వలె, క్యాసిని కూడా నాల్గవ సహస్రాబ్దిలో ఒక అద్భుతం. భూమి యొక్క లా టెర్‌తో పోల్చితే, ఇది చాలా పెద్దది. ఎందుకంటే భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదైన శనిగ్రహం చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాలంటే ఓ భారీ వేదిక కావాలి. కానీ సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్నందున, ఇక్కడ నుండి వెలుపలి గ్రహాలకు ప్రయాణించే వారి సంఖ్య బాగా తక్కువగా ఉన్నందున క్యాసినిపై రద్దీ ఎక్కువగా ఉండదు, పైగా నక్షత్రాంతర యానం చేసేవారు మరీ తక్కువ, ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. విదేశీయులు టైటాన్, ఎన్‌సెలాడస్ వరకు మాత్రమే వచ్చి వారి వ్యాపారాలు చూసుకుని వెళతారు లేదా సందర్శనాప్రాంతాలు చూసి వెళతారు. ఇతరులు కొంతమంది నక్షత్రాంతర లేదా బహుళ గ్రహాల వ్యాపార సంస్థలను కలిగి ఉన్నారు. కొందరు సాహసికులు, అన్వేషకులు లేదా పరిశోధనా శాస్త్రవేత్తలు తమ సంస్థలచే శనిగ్రహపు ఉపగ్రహాలలో స్వర్ణం, ప్లాటినం లేదా ఇతర ఉపయుక్త అన్యదేశ లోహాలకు మైనింగ్ యొక్క అవకాశాలను అన్వేషించటానికి పంపబడతారు.

శీతలమైన, వాయువులతో నిండిన శనిగ్రహంపై ఎవరూ కాలనీని ఏర్పాటు చేయలేరు, ఈ ప్లాట్‌ఫామ్ తప్ప. కొన్నిసార్లు ‘సైట్ సీయింగ్’ కోసం పర్యాటక బృందాలను గ్రహ ఉపరితలం వరకూ పంపుతుంటారు.

వేర్వేరు ఆకారాలలతో ఉన్న పలు రకాల ప్రయాణీకులతో మేము కలిసిపోయాం. వారు పొడవుగా, లావుగా, పొట్టిగా, సన్నగా ఉన్నారు. వాళ్ళల్లో కొందరి తలలపై యాంటెనాలు ఉన్నాయి, కొందరికి లేవు. కొందరు రెండు తలలతో ఉన్నారు, మరికొందరు కోసుగా ఉన్న చెవులతో ఉన్నారు. ఇంకొంతమంది అస్థిపంజరం లాంటి శరీరాలతో… సమూరా, సయోనిలతో నేను చూసిన అల్ఫా సెంటారీ వృద్ధ తాంత్రికుల వలే ఉన్నారు.

మేము కెఫెటేరియాకి వెళ్లి ఒక టేబుల్ చుట్టూ కూర్చుని మాకు కావల్సిన పదార్థాలు ఆర్డరిచ్చాం. రోబోని ఉచితంగా ఛార్జ్ చేసుకునే వీలు ఉంది.

ఇది గ్రహాంతర లేదా నక్షత్రాంతర లేదా ఇంటర్‌గెలాక్టిక్ ప్రాంతం. ఇక్కడ నిఘా కెమెరాలు మరియు గెలాక్ సెక్యూరిటీ సిబ్బంది కదలికలు ఉన్నాయి.

అంటే… మేము కొద్దిగా సురక్షితం.

లేదా సురక్షితమని నేను భావించాను.

భూమికి తిరిగి ఎలా వెళ్ళాలి అని నెమ్మదిగా చర్చించుకున్నాము.

“ఒక స్పేస్‌షిప్‌ని హైజాక్ చేద్దాం! టికెట్లు కొనడానికి మన దగ్గర డబ్బు లేదు!” అంది డిమిట్రీ.

“ఇటువంటి సురక్షిత ప్రాంతంలో అదెలా సాధ్యం? మనం మన మంత్రశక్తులని ఉపయోగించినప్పటికీ శక్తివంతమైన భద్రతా తాంత్రికులు ఇక్కడ ఉండవచ్చు. అంతే కాకుండా, భూమిపై ఏమి జరుగుతుందో మాకు తెలియదు… భూమిని, చంద్రుడిని ఆక్రమించుకున్నారేమో?మనం తాజా వార్తలు తెలుసుకోవాలి!” అంది ప్రకృతి. మళ్ళీ కాసేపాగి తనే, “నాకు ఇంటి మీద బెంగగా ఉంది, మా నాన్నని చూడాలని ఉంది” అంది.

పర్వాలేదనిపించే ధరలకి మేము బ్రెడ్ రోల్స్, భూమికి చెందిన చేప కూర తిన్నాం. చంద్రుడి నుంచి దిగుమతి చేసుకున్న వైన్ తాగాం. కెఫెటేరియాలో కూర్చుని టీవీ తెరకేసి చూస్తూ ప్రతీ గంటకీ వచ్చే వార్తల కోసం ఎదురుచూస్తున్నాం.

శనిగ్రహపు 12.00 గంటల సమయంలో (ఇక్కడ అనుసరించే స్థానిక సమయం అదే) ప్రసారమయిన వార్తలు చూసి మేము బెదిరిపోయాం.

“టైటాన్‌లో విప్లవం సంభవించింది. రాజు ‘లియోనికస్’ రక్తరహిత తిరుగుబాటు ద్వారా తొలగించబడ్డాడు, అక్కడ ప్రజలు మద్దతు ఇచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది” అని వార్తల్లో చెబుతుండగా, కొత్త నాయకుడు జనరల్ కనురా అనే టైటాన్ సైన్యం యొక్క సైన్యాధ్యక్షుడు మాట్లాడాడు. కనురా యొక్క చిత్రపటం తెర మీదకి వచ్చింది. అతను మానవ హక్కులు, స్వేచ్ఛ, ప్రజాస్వామిక నియంత్రత్వం… తదితరం అంశాల గురించి మాట్లాడాడు. ‘తాంత్రికులు ఎక్కడ? క్లోన్ చేసిన సైన్యం ఎక్కడ?’ నా మనసులో ఎన్నో ప్రశ్నలు… మళ్ళీ అతని మాటలు – “చివరగా నేను కుజ గ్రహంలోని అరుణ భూములకు చెందిన  మా స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్యాయపూరితంగా ప్రజల్ని పాలించిన రాజవంశాన్ని, రాచరికాన్ని అంతం చేయడంలో మాకెంతగానో సహాయపడ్డారు – రాణి సయోనీ, ఆమె తండ్రి చక్రవర్తి సమూరా. మాకు నైతిక మరియు సైద్ధాంతిక మద్దతు అందించిన వారికి…”

తెరమీద మంత్రగత్తె సయోనీ నవ్వుతున్న చిత్రం, గంభీరంగా ఉన్న సమూరా ముఖం ప్రత్యక్షమయ్యాయి. అప్పుడు బహుశా వారి కొత్త జాతీయ పాటతో ఆ ప్రసంగం ముగిసింది.

“ఇక ఇతర గ్రహాల వార్తలు! ఈ వారంలో లాండిస్-2, గనీమీడ్, చంద్రగ్రహంపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు సంభవించాయి. రక్తరహిత పోరాటాలతో ప్రజా విప్లవాలు సంభవించాయి. కొత్త నాయకులందరూ త్వరలో చేపట్టబోయే సంస్కరణల గురించి, నిర్వహించబోయే ఎన్నికల గురించి మాట్లాడారు.

సూర్యుని చుట్టూ ఉన్న గ్రహవ్యవస్థలో సంభవిస్తున్న ఈ మార్పులన్నీ తాంత్రికులకు అనుకూలంగా ఉన్నట్టు సౌర వ్యవస్థ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగా పుకార్లు వినబడుతున్నాయి. పైగా ఇవన్నీ కుజగ్రహపు అరుణభూముల బహిష్కృత మాంత్రికుడు, చాలా కాలం నుంచి అజ్ఞాతంలో ఉన్న సమూరాకు అనుకూలంగా ఉన్నయనేది సుస్పష్టం. ఇప్పుడు సమూరా నేతృత్వంలో అన్ని తాంత్రిక సమూహలు ఒకచోట చేరుతున్నాయనీ, కుజుడిలోని అరుణభూములను తిరిగి చేజిక్కుంచుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మేము కుజ గ్రహంలోని జనరల్ గ్యాని అంగారక్‌తో మాట్లాడాము.”

మా ఊపిరి నిలిచినట్లయ్యింది.

తాము కుజుడి మానవ కాలనీకి చెందినవారమని తెలిపేలా- తల మీద యాంటెనా, మెలి తిరిగిన మీసాలు, ఎర్రబారిన ముఖంతో – జనరల్ గ్యాని అంగారక్ తెర మీద ప్రత్యక్షమయ్యాడు.

“మేము చాలాకాలం క్రితమే ఆ దుష్ట సమూరాని ఓడించాము, అతను పారిపోయాడు. అతనికే శక్తులు లేవు. నిజం. కుజగ్రహంపై అరుణ భూములలో ఉన్న తాంత్రికుల కాలనీ ఉన్నా, మాకు తాంత్రిక రాజు మీరోస్‍తో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి, ఒక వేళ సమూరా మాపై దాడి చేస్తే, మేం అతనికి సరైన గుణపాఠం చెప్పగలం. మేము అతని గురించి గెలాక్టిక్ సెక్యూరిటీకి ఒక నివేదికను పంపించాము. టైటాన్, గనీమీడ్, చంద్రుడిపై  జరిగిన ఘటనలు మాకు బాధ కలిగించాయి, ఇవి రాచరికం నుండి ప్రజాస్వామ్యానికి మారాయి అంటున్నారు, కాని నిజం చెప్పాలంటే ఆ దుష్ట సమూరా ప్రభావంలో ఉన్నాయి. సమూరా, సయోనీ లాంటి ఈ రకమైన తాంత్రికులు రాజుల కంటే ప్రమాదకరమైన వారని మేము హెచ్చరిస్తున్నాము. వారు ప్రజల్ని బానిసలుగా చేస్తారు, ప్రాణాలు తోడేస్తారు. వారికి ఎలాంటి విలువలు ఉండవు, ఉన్నదల్లా అధికార దాహమే. వారు రహస్య మరియు దుష్ట శక్తుల, ఆచారాలు ద్వారా అమరత్వాన్ని కోరుకుంటున్నారు. జాగ్రత్త వహించండి!” చెప్పాడు.

తర్వాత, ఎర్త్ కౌన్సిల్ చైర్మన్, చైనీయుల లక్షణాలుండే చెన్ లీ నుంచి ఇదే విధమైన ప్రకటన వచ్చింది. “మేము, కుజగ్రహంతో కలిసి, సౌర వ్యవస్థలో సమూరా ప్రభావాన్ని తొలగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేం శాస్త్రవిజ్ఞానాన్ని నమ్ముతాం, క్షుద్ర శక్తులని కాదు” అన్నాడు.

అన్ని గ్రహాలు తాంత్రిక సామ్రాజ్యం ప్రభావంలోకి వచ్చాయని స్పష్టమవుతోంది… చాలావరకూ నేనే కారణం!

భూమి, కుజుడు మాత్రమే ఇప్పటికీ రహస్యంగా ఆక్రమించబడలేదు. అయితే సమూరా తన కొత్తగా పొందిన ఆరు అద్భుత వస్తువులతో తప్పకుండా ప్రయత్నిస్తాడు.

“ఏడవ అద్భుత వస్తువు ఉండాలి… కాని ఎక్కడ? నేను దాన్ని అతనికి ఇవ్వను. నేనే తీసుకుంటాను. భూమి, కుజ గ్రహాలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను” హఠాత్తుగా అన్నాను.

“యురేకస్, ఇక నీ ఛార్జింగ్ ఆపు! ఏడవ అద్భుత వస్తువు ఎక్కడ ఉంది?” అంది ప్రకృతి.

యురేక తన చేతిని ఎలక్ట్రిక్ అవుట్లెట్ నుండి తొలగించింది. దాన్లోని అన్ని దీపాలు వెలగసాగాయి. అప్పుడు అది లోహ స్వరంతో మాట్లాడింది.

“అవకాశమే లేదు మాస్టర్! అది బుధగ్రహంలో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు, పైగా విపరీతమైన వేడి, ఆవాసయోగ్యం కాదు. మనం ఒక్కో గ్రహ వ్యవస్థలో మొత్తం ఆరు వస్తువులు కనుగొన్నాము. గెలాక్టిక్ పుస్తకాలు లేదా మాంత్రిక రచనలలో ఎటువంటి ఆధారాలు లేవు” చెప్పింది యురేకస్.

అప్పుడు దాని ఛాతీపై సందేశాన్ని సూచిస్తూ ఒక వెలుగు కనిపించింది. సిగ్నల్స్ ఉన్న స్పేస్ ప్లాట్‌ఫామ్‌పై ఉన్నందువల్ల సందేశాలన్నీ ఇప్పుడు వస్తున్నాయి.

“హనీ అమ్రాపాలి! ఈ మిషన్ రద్దు చేయబడింది! చంద్రుడి అమృతా కాలనీ మాంత్రికులు ఆక్రమించుకొని మన ఏజెంట్లని చంపేశారు. లాండిస్, గనీమీడ్, టైటాన్‌లలో, సమూరా తిరుగుబాట్లకు పథకం వేశాడు. త్వరగా తిరిగి రా! మేము మీకు సహాయం పంపేవరకు క్యాసినిలో వేచి ఉండండి. అప్పటి వరకు ఎలక్ట్రానిక్ రూపంలో డబ్బులు, టికెట్లను పంపిస్తున్నాం.” అని ఉందా సందేశంలో.

టికెట్ వివరాలు అందాయి. చనిపోయిన వాన్ కు జాక్‌కు, చాంద్‌లకు కూడా టికెట్లు చూసేసరికి మాకు కన్నీళ్ళు ఆగలేదు. అయితే వచ్చిన చిక్కల్లా – స్పేస్‌షిప్ మార్గమధ్యంలో ఉండడమే. బాహ్య సౌర వ్యవస్థ నుండి భూమికి మధ్యలో ఎక్కడో ఉందది. శనిగ్రహపు సమయం ప్రకారం మరో 72 గంటల తర్వాతే మేమా స్పేస్‌షిప్ ఎక్కగలిగేది. మేం ఎక్కడున్నామో సరిగ్గ తెలియకపోయేసరికి వారు ఉద్దేశపూర్వకంగా తరువాత తేదీలతో టికెట్లను పంపారు.

అప్పుడు ఇంకో సందేశం… మళ్ళీ ఇంకొకటి.

“ఇప్పుడు క్యాసినిలో మీ రోబో పొజిషనింగ్‌ని గుర్తించాము. కానీ సందేశం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడ్నించి ఇక్కడి రావాలంటే 10 గంటల సమయం పడుతుంది. కాబట్టి మీరు వెనక్కి వచ్చేయండి, న్యూ హోప్ నగరాన్ని చేరుకోండి. మేము మళ్ళీ మాట్లాడతాము. జాగ్రత్త! మేము ఇంత కంటే ఎక్కువ మద్దతు లేదా భద్రత ఇవ్వలేము. ఇది బహిరంగ సందేశం, క్లాసిఫైడ్ చేయబడలేదు ! ఎర్త్ కౌన్సిల్ యొక్క మంత్రులచే ధ్రువీకరించబడిన ఈ టికెట్లతో మీరు తిరిగి రావచ్చు!”

“బావుంది!” అన్నాను. “మొత్తానికి మనకి భూమి నుంచి సహాయం లభించింది. అయితే మనం అక్కడకు వెళ్ళేలోపే భూమిపైనా, కుజుడిపైనా దాడి చేయబోతున్నారని నాకు బలంగా అనిపిస్తోంది. సమూరా, సయోనీ ఆ ఆరు అద్భుత వస్తువులతో ఇప్పటికే ప్రయత్నించారు. వారు ఇప్పటికే చిన్న గ్రహాలపై దాడి చేసి విజయం సాధించారు. ఇప్పుడు నేను ఆ ఏడవ అద్భుత వస్తువుని సాధించి… భూమికి సహాయం చేయాలనుకుంటున్నాను” అన్నాను.

“కానీ ఎలా?” అడిగింది ప్రకృతి నిరాశగా.

“చూస్తుండు! మనసుంటే, మార్గం ఉంటుంది. నేను కల కంటాను. బ్రౌజ్ చేస్తాను. జ్ఞానులను అడుగుతాను. చివరి శక్తివంతమైన వస్తువు కోసం ప్రయత్నిస్తాను…”

మేము తినడం పూర్తి చేసి, డబ్బులు చెల్లించి, లాంజ్ లోకి నడిచాం. మమ్మల్ని భూమికి తీసుకువెళ్ళే స్పేస్‌షిప్ కోసం వేచి చూస్తున్నాం.

మా గత అనుభవాల దృష్ట్యా ఇది అత్యంత ప్రమాదరకరమైన నిరీక్షణ! సమీపంలోని టైటాన్‌లో ఉన్న సయోనీ మమ్మల్ని క్షేమంగా వెళ్ళనిస్తుందని అనుకోడం మూర్ఖత్వం.

మేము సౌకర్యవంతమైన సోఫాలలో వాలాం. నిద్రించడానికి ప్రయత్నించాము.

ప్రకృతి నా పక్కనే ఉంది.

యురేకస్ మెలుకువగా ఉంది, మాకు కాపలాగా ఉంది.

డిమిట్రీ కొన్ని ఫ్యాషన్ వస్తువుల కొనుగోలు కోసం అటూ ఇటూ తిరుగుతోంది.

ఏనిమాయిడ్ అప్పటికే నిద్రపోయాడు, బాగా అలసిపోయాడు.

శనిగ్రహపు నిశీధి గంటలు గడుస్తున్నాయి. అది ఉదయ సంధ్యా లేక సాయంసంధ్యా అనేది తెలియడం లేదు. కానీ రాత్రిని సూచిస్తూ జైవిక అవధులలో దీపాలు మసకబారాయి, అక్కడంతా చీకటిగా మారింది.

నాకూ నిద్రొస్తోంది. నా భుజంపై తల వాల్చి ఎప్పుడో నిద్రలోకి జారుకుంది ప్రకృతి. ఆమె పొడవాటి నల్లని గిరజాల జుట్టు కేశాలు చల్లని గాలికి తేలియాడుతున్నాయి. కాస్త దూరంలో డిమిట్రీ ఏదో పుస్తకం చదువుకుంటూ కనబడింది.

“అస్వాభావికం!” అనుకున్నాను. డిమిట్రీ… ఓ ఆసక్తిగల పాఠకురాలిలా!

ప్రకృతి కేసి చూశాను, నేను కోరుకున్నవన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఇండికా సెంట్రల్‌లో నేను ఆమెతో ఒక శాంతియుత జీవితం గడుపుతూ, బయో వ్యవస్థలపై పరిశోధన చేయడం; బీచ్‌కి వెళ్ళడం, సంగీతం వినడం, కలలు కనడం.

కానీ మేము ఇక్కడ శని గ్రహపు స్పేస్ ప్లాట్‌ఫాం క్యాసినిపై… ఓ వింత లోకంలో…  సౌర వ్యవస్థలో శాంతి లేని సమయంలో…

భూమి మీద యుద్ధ భయం! భూమి మీద, కుజుడి మీద మానవులు అప్రమత్తంగా ఉన్నారు.

నేను నిద్రపోయాను. కలగన్నాను

ఏనిమాయిడ్, యురేకస్ ఇద్దరూ వేదనతో అరిచారు!

“మాస్టర్! జాగ్రత్త… గమనించండి!”… కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

ఆల్ఫా సెంటారి వ్యవస్థకి చెందిన పొడవాటి నల్లని అస్థిపంజర మాంత్రికులు అక్కడ ఉన్నారు.

వారు నవ్వారు. వికటంగా నవ్వారు.

“హనీ, ఓ మానవా! నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది! ఇంకో సుదీర్ఘ ప్రయాణం చేయాలి!” అన్నారు.

నన్ను హిప్నటైజ్ చేశారు. నేను అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. నన్ను లాక్కెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రకృతి క్రింద పడిపోయింది. “మాస్టర్!” అని యురేకస్ అరవడం లీలగా వినిపించింది.

చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. ఒక శవపేటికలో పడుకోబెట్టినట్టుగా ఉంది. ఇది మరణమా? అవి మృత్యువు యొక్క శీతల హస్తాలా?

నన్ను స్తంభింప చేస్తున్నారు. స్తంభింపబడ్డాను. మిగతావాళ్ళ గురించి నాకు తెలియదు.

ఆ తరువాత నేను పూర్తిగా స్పృహ కోల్పోయాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here