అధ్యాయం 43: నెప్ట్యూన్ ఉపగ్రహం ట్రైటాన్
ఇది నెప్ట్యూన్ యొక్క అతిపెద్ద ఉపగ్రహం, కానీ భూమి ఉపగ్రహం చంద్రుని కంటే చిన్నది. -270 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చాలా చల్లగా ఉంటుంది. ఇది దాని మాతృ గ్రహం నెప్ట్యూన్ కక్ష్యకి వక్రగతిలో పరిభ్రమిస్తుంది. ఇది సుమారుగా 2700 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. క్యూపర్ బెల్ట్ యొక్క అనావాస ప్రాంతంలో ఎవరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు.
క్యూపర్ బెల్ట్‌కి ఈ పేరెందుకొచ్చిందంటే, క్యూపర్ అనే వ్యోమగామి 20వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో అనేక గ్రహాలను, గ్రహాల వంటి అనేక ఖగోళ వస్తువులను కనుగొన్నారు. ఇది తోకచుక్కల జన్మస్థలం. ఇది నెమ్మదిగా కదిలే చల్లని గ్రహాలుండే ప్రాంతం. కానీ వీటిలో భారీగా ఖనిజ సంపద ఉంది. సౌరవ్యవస్థకి చివరి పాయింట్‌గానూ, ఆల్ఫా సెంటారీ వ్యవస్థ ప్రవేశద్వారంగానూ ఉంటుందీ బెల్ట్.
భయంకరమైన నల్లటి ఆఫ్రికన్ తాంత్రికులు మమ్మల్నే గమనిస్తున్నందువల్ల మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు.
ముగంబ మధ్యమ స్వరంలో అన్నాడు “హనీ! నీ బాధ్యతలలో ఇదే చివరిది. ఎటువంటి పన్నాగాలు వద్దు! మేమిద్దరం 10,000 నక్షత్ర స్థాయి ఉన్న తాంత్రికులుం అని తెలుసుకోండి. మేము మీ అందరిని ఒక చూపులో చంపుతాము. కాబట్టి మీకేం చెప్పారో దాన్ని అనుసరించండి…!”
మేము ఒకరినొకరం చూసుకున్నాము. అదొక బుకాయింపని నాకు తెలుసు. కానీ వాళ్ళేం కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాను. ప్రకృతితో టెలిపతీ ద్వారా మాట్లాడవచ్చునని నాకు తెలుసు. కానీ టెలిపతీని కూడా ట్యాపింగ్ చేయవచ్చేమో నాకు తెలియదు. డిమిట్రీ, ఏనిమోయిడ్ పోరాడగలరని; యురేకస్ దాని విద్యుత్ చార్జ్ అయిపోయినట్లయితే ఒక గంట సేపు సాయుధ పోరాటం చేయగల సామర్ధ్యం కలిగి ఉందని నాకు తెలుసు.
కానీ నేను ఓ నిర్ణయం తీసేసుకున్నాను.
ఈ అద్భుత వస్తువును నేను వాళ్ళకి అప్పగించను.
మేము తప్పించుకోవాలి. పారిపోవాలి. భూమి గురించి, దాని పోరాటం గురించి తెలుసుకోవాలి.
మూడవ గేట్ వద్ద స్పేస్ షటిల్ కోసం మేము వేచి ఉన్నాం. “కొద్దిసేపు టివి చూసో, లేదా వార్త పత్రికలు చదివో… గడచిన 10 ఏళ్లలో ఏమి జరిగిందో తెలుసుకోవచ్చా?” అని ముగంబను అడిగాను.
ఆ స్పేస్ ప్లాట్‌ఫామ్ నిర్జనంగా, చీకటిగా ఉంది. ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంతంలో మాత్రం అక్కడక్కడా కొన్ని దీపాలు వెలుగుతున్నాయి.
“మీరు ఆ వార్తలను తట్టుకోలేరని నా భయం. అదంతా యుద్ధం, ఆక్రమణల పెద్ద కథ. భూమి ఓడిపోయింది. రెడ్ ప్లెయిన్స్ మాత్రమే ఇంకా ఓడిపోలేదు. ఇంకా కుజుడి మీదున్న మానవ కాలనీని మాత్రమే సమూరా ఆక్రమించుకోవలసి ఉంది. మీ గ్రహం, మీ జోన్‌లోని సంభవించిన మార్పులు తెలుసుకుంటే నివ్వెరపోతారు… వాటి గురించి తర్వాత! ప్రస్తుతం పని చూడు!”
ఈ మాటలు వినగానే మనసు మొద్దుబారిపోయింది. “ఓ ముగంబ! మా టైటాన్ ఎలా ఉంది? నా తండ్రి, నా సోదరుడు ఎలా ఉన్నారు?” వేదనకు గురైన డిమిట్రీ అడిగింది.
బెనోత్‌మన్ నవ్వాడు. “డిమిట్రీ, టైటాన్ మాంత్రికుల పాలనలో సురక్షితంగా ఉంది. పొసయిడన్, జూలియస్ సజీవంగా ఉన్నారు. మిమ్మల్ని, వైద్య బృందాన్ని పర్యవేక్షించాలి కాబట్టి మేము ప్రయాణ సమయంలో సుప్తావస్థలో లేము. మేము ఎప్పటికప్పుడు వార్తలను చూస్తున్నాము. పొసయిడన్ తిరుగుబాటు చేశాడు, జూలియస్ వారి కోసం పనిచేయడానికి సహకరించలేదు. కాబట్టి… “
“అయ్యో! శని దేవుడా!” అంటూ విలపించింది డిమిట్రీ. “అవును… వాళ్ళెపుడూ దుష్టుల కోసం పని చేయరని నాకు తెలుసు” అంది.
“డిమిట్రీ! ఈ ప్రపంచం తాంత్రికులచే పాలించబడుతోంది. మీ తండ్రి మరియు సోదరుడు మాంత్రికులే కదా! వాళ్ళెందుకు చక్రవర్తి కోసం పని చేయరు? సహకరించకపోవడంలో అర్థం లేదు. అందుకే వారు జైలులో ఉన్నారు. కానీ సజీవంగా, సురక్షితంగా ఉన్నారు!”
ఏనిమాయిడ్ గుర్రుమన్నాడు… “గనీమీడ్‌లో కూడా మాంత్రిక చక్రవర్తి గొప్ప పాలన సాగుతోంది. జంతు-మానవ తాంత్రికులందరూ ఉన్నత స్థానాలలో ఉన్నారు. పాలక వర్గంలో ఉన్నారు. ఇకపై హింసించబడడం లేదా అణగదొక్కబడడం జరగదు!”
ఇప్పుడు ప్రకృతి మొదలుపెట్టింది, “మాస్టర్! దయచేసి చెప్పండి! నా తండ్రి గురించి, మా గ్రామం గురించి చెప్పండి! దయచేసి!”
“క్షమించు, నాకు తెలియదు. ముఖ్యంగా భూమి యొక్క సదరన్ జోన్‌లోని గ్రామీణ ప్రాంతాల గురించి ఏ వార్తలు లేవు.”
“నాన్న క్షేమంగా ఉన్నారా? ఆమ్రపాలి సురక్షితమేనా…? “
ట్రైటాన్‌కి వెళ్ళే స్పేస్ షటిల్ బోర్డింగ్ గురించి… ఒక వింత భాషలోనూ, యూనివర్సల్ డిజిటల్ లాంగ్వేజ్‌లోనూ ప్రకటన వెలువడింది.
“కదలండి! నడవండి” అంటూ అరిచాడు ముగంబ. అతని చల్లని చూపు నా చర్మాన్ని కాల్చినంత పని చేసింది. ఇతరులకి కూడా ఇదే అనుభవమై ఉంటుంది.
బెనోత్‌మన్ వార్తాలు ఆసక్తిగా చదువుతాడని తెలుస్తోంది. పైగా అతను తన పాత్ర పట్ల సంతోషంగా ఉన్నట్టు తోస్తోంది.
ఒకప్పుడు మధ్య ఆసియా, దక్షిణాసియా, భారతదేశం అయిన దక్షిణార్థ గోళం – సమూరాకు విధేయత చూపించిన మాంత్రిక శాఖకు చెందిన “అఘోరి మాంత్రిక్ మండల్” పాలనలో ఉన్నాయి.
వాళ్ళకి సమూరా అవన్నీ ఇచ్చేశాడు. ఉత్తరార్థ గోళంలోని న్యూ హోప్ సిటీ, ఇంకా ఒకనాటి అమెరికా మరియు కెనడా భాగాలు; ఉత్తర ఐరోపాలోని కొన్ని భాగాలు; ఒకనాటి యునైటెడ్ కింగ్‌డమ్ మాత్రం కుజగ్రహ మాంత్రిక చక్రవర్తి సమూరా యొక్క ప్రత్యక్ష నియంత్రణలో ఉన్నాయి. ఇప్పుడు అతను న్యూ హోప్ సిటీలోనూ చంద్రుడిపై అమృతా కాలనీలోనూ మూడేసి నెలలు; ఆరు నెలలు కుజుడిపైనా నివసిస్తున్నాడు. ఇదంతా కుజుడి కాలమానం ప్రకారం! ఎందుకంటే అతను ప్రధానంగా మార్షియన్ కాబట్టి!
ఆక్సీజన్, ఆహారం ఉన్న బ్యాక్‌ప్యాక్ వీపుకి తగిలించుకుని, తలకి భారీ మాస్క్ ధరించి నడుస్తూ, అడిగాను – “సయోనీ… ఎలా ఉంది? బాగుందా?”
వెనక్కి తిరిగి ఉన్న తలలో ఎవరైనా 10 సంవత్సరాలు ఎలా జీవిస్తారనేది నా అనుమానం.
ముగంబ గర్జించాడు
“నడు!”
ఈ విషయంలో ఇక సమాచారం రాదని అర్థమైంది.
“ఓయ్ మానవ పంది! నడు! మా యువరాణి గురించి నీకెందుకు? నువ్వు ఆమె సేవకుడివి అంతే. నడు! చేయవలసిన పని చాలా ఉంది!”
మేమంతా అంతరిక్షంలో ప్రయాణించాం. ఎనిమిది గంటల తర్వాత ఇమ్మిగ్రేషన్ భద్రతా సిబ్బంది కాకుండా అతికొద్ది మంది ఇతర సిబ్బందితో, దట్టమైన చీకటి, శీతలమైన ట్రైటాన్ స్పేస్ ప్లాట్‌ఫాంపై దిగాం. ట్రైటాన్ కూడా దట్టమైన మంచుతో నిండి అంటార్కిటికాని పోలి ఉంది. బాగా శిథిలమైన, చాలా బలహీనంగా వేలాడుతున్న సైన్ బోర్డు ఒకటి దర్శనమిచ్చింది.
“ట్రైటాన్ యొక్క భూగర్భ మిలటరీ కేంద్రానికి స్వాగతం – మహాప్రభువు, అంగారక గ్రహానికి చెందిన సమూరా చక్రవర్తి సామ్రాజ్యంలోని రక్షణ మంత్రిత్వశాఖ” అని రాసుంది దాని మీద.