అధ్యాయం 44: మంచు అడుగున
“అప్పుడే ట్రైటాన్ కూడా సమూరా పాలనలోకొచ్చేసిందా?” నేను ఆశ్చర్యపోయాను.
“నువ్వో మూర్ఖుడివి!” అన్నాడు ముగంబ నా భుజం మీద చెయ్యేసి ముందుకు తోస్తూ.
“సౌర వ్యవస్థ యొక్క గ్రహలన్నీ, ఇంకా రక్షణ వ్యవస్థలు, గ్రహాల స్పేస్‌డ్రోమ్స్, నిఘా వ్యవస్థలు ఇప్పుడు మహాప్రభువు సమూరా అధికారంలో ఉన్నాయి. కానీ ఇంకా ఆఖరి వస్తువు ఇప్పటివరకు కనుగొనబడలేదు. చాలామంది ఎంపికైన వ్యక్తులు దానిని వెతకటానికి నియమించబడ్డారు. ఇప్పుడిది తాంత్రికుల ప్రాంతం! సర్వవ్యాపకమైన విశ్వశక్తిని ప్రయోగించగల శక్తి నీకున్నందుకు ఆనందంగా లేదా?”
అతని కేసి సూటిగా చూశాను. నన్ను నేను నియంత్రించుకుని ఉండకపోతే నా చూపు అతనిని కాల్చేసేదే!
అలా చేయడానికింకా సమయం ఉంది. “చాలామంది ఎంపికైన వ్యక్తులా? అంటే…?” అని అడిగాను.
డిమిట్రీ కిసుక్కుమని నవ్వింది. “అంటే… నువ్వు ఒక్కడివే కాదు అని! అదొక పెద్ద బుకాయింపు అని అర్థం” అంది.
“మానవులనూ, మాంత్రికులను నువ్వు మాత్రమే రక్షించగలననుకోడం నీ మూర్ఖత్వం. 50 లేదా అంతకంటే ఎక్కువ క్రోమోజోములు మరియు జన్యు ఉత్పరివర్తనలు కలిగి ఉన్న డజన్ల కొద్దీ మానవులు హ్యుమనాయిడ్లు ఈ సౌరవ్యవస్థ అంతటా జన్మించారు. ఈ ఉత్పరివర్తనల వల్ల వాళ్ళు – వస్తువులను చూస్తారు, శబ్దాలు వింటారు, గాల్లో ఎగురుతారు… ఒకటేంటి.. ఏవైనా చేయగలరు. ఒక పక్షిలా, ఏనుగులా, ఇంకా డైనోసార్‌లా కూడా మారగలరు. నువ్వు కూడా జన్యుపరివర్తన చేయబడినవాడివి అంతే! ఉత్పరివర్తులకు జన్మించిన ఉత్పరివర్తివి నువ్వు. కొద్దిగా దూరదృష్టి మరియు కొన్ని అద్భుత శక్తులున్నాయి. కీలక సూచనలు చేసే మెదడు…!”
“ఇక అద్భుత వస్తువులు! అవి పుష్కలంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్, అద్భుత వస్తువులు గుర్తించేందుకు, సమూరాకి ఇచ్చేందుకు అందరూ ప్రయత్నించారు. ఆ వస్తువులతో అతను గెలిచాడు. ఆయన పాలిస్తాడు. చివరి… వస్తువు… అది నిజంగా చివరి అద్భుత వస్తువు అయితే.. దాన్ని నువ్వు సాధించి అతనికిచ్చేస్తే, నిన్ను మీ ఊరికి పంపించేస్తాడు. నీకు ఉద్యోగం… సైన్యంలో లేదా మీ సొంత విశ్వవిద్యాలయంలో మంచి ఉద్యోగం లభిస్తుంది.”
బెనోత్‍మన్, ముగంబ ఇద్దరూ కిసుక్కున నవ్వారు.
“నీ గురించి మాకు తగినంతగా వివరించారు. నీ బలాలు మరియు బలహీనతలు అన్నీ మాకు తెలుసు. అవును, మీ ఇండికా సెంట్రల్ ఇంకా ఉంది. నువ్వు మీ శాన్ స్థానంలో డిపార్ట్‌మెంట్ హెడ్ అవుతావు. పాపం శాన్, అతను యుద్ధంలో చనిపోయాడు!”
నేను నివ్వెరపోయాను. నోట మాట రాలేదు. “మా హెచ్.ఓ.డి. శాన్‌కి… ఏమైంది?”
“ఓరి మూర్ఖుడా! భూమి ఆక్రమించబడింది, విశ్వవిద్యాలయాలను శాంతియుతంగా స్వాధీనం చేసుకోబడ్డాయి. కానీ కొంతమంది ప్రతిఘటించారు, మరణించారు. అవును, యూనివర్సిటీల్లో వాళ్ళిప్పుడు 50 క్రోమోజోమ్‌లతో ఉత్పరివర్తులను తయారు చేస్తున్నారు. నీలా శక్తులుండే చాలామందిని తయారుచేస్తున్నారు. వాళ్ళంతా చక్రవర్తికి విధేయతతో ఉంటారు! హా! హా! హ!”
ప్రపంచం, కాదు, ప్రపంచాలు మారాయి. వాళ్ళు ఇప్పుడు మాంత్రికుల పాలనలో ఉన్నారు.
ప్రకృతి నా భుజంపై చేయి వేసింది.
“హనీ! నడు! ఇప్పుడు చేయాల్సిన పని గురించి ఆలోచించు. శాన్ గారి గురించి నేనూ విచారంగా ఉన్నాను!” అంది.
మాకు బరువైన థర్మల్ స్యూట్స్ ఇచ్చారు. ఆక్సీజన్ మాస్క్‌లు ధరించి, వీపున ఆహారం, ఆక్సీజన్ ఉన్న బ్యాక్‌ప్యాక్‍లు వేసుకుని మేం సిద్ధమయ్యాము. ఈ థర్మల్ స్యూట్లు ట్రైటన్ యొక్క -270 డిగ్రీల సెల్సియస్ యొక్క తీవ్రమైన చలి నుండి మమ్మల్ని కాపాడుతాయి.
“ప్రవేశ ద్వారం, ఆర్చ్ వైపు పదండి!” ముగంబ ఆదేశించాడు.
భూగర్భంలో కిందకి, బాగా కిందకి దారితీసే మెట్లున్నాయి, వాటిపై మంచు పేరుకొని ఉంది. మేము దాదాపు వెయ్యి మెట్లు దిగాం. “ఇది ట్రైటన్‌లో రాత్రి సమయం. పైగా ఇక్కడ రాత్రి చాలా సుదీర్ఘం. సూర్యుడికి చాలా దూరంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎస్కలేటర్లకు ఎటువంటి విద్యుచ్ఛక్తి సరఫారా లేదు. అలాగే మిలటరీ కేంద్రాలలో కూడా సిబ్బంది కాస్త విధులను తక్కువగా నిర్వహిస్తున్నారు, సౌరశక్తి లభించక కొద్దిగా పనిచేయదు” చెప్పాడు ముగంబ. అతనికి ఇక్కడంతా బాగా తెలిసినట్లుంది.
ఉన్నట్లుండి మెట్లు ఓ విశాలమైన వసారాలోకి దారితీశాయి, తర్వాత అనేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మేము పెద్ద హాల్లోకి వెళ్ళాము.
ఈ ప్రాంతం నీలంరంగు దీపాలతో ప్రకాశవంతంగా, వెచ్చని ఉంది. మానిటర్లు, స్విచ్‌లు, వెలిగే లైట్లు, వివిధ గ్రహాల సమయాలు సూచించే గడియారాలు ఉన్నాయి. యూనిఫాంలు ధరించిన కొందరు నిశ్శబ్దంగా మానిటర్లను గమనిస్తారు. అక్కడ అనేక ప్యానెల్లు ఉన్నాయి. గోడపై ఒక పెద్ద తెర వాతావరణ పరిస్థితుల నివేదికతో ట్రైటాన్ యొక్క నీలిరంగు వెలుపలి దృశ్యాలను చూపించింది. ఉష్ణోగ్రత -370 డిగ్రీల సెల్సియస్, మంచుతో నిండిన మేఘాలు; గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు.
నేను ఆ మొత్తం రక్షణ వ్యవస్థను పరిశీలించాను. ఎక్కడా నాకు ఏ అద్భుత వస్తువు కనిపించలేదు. గుప్తంగా ఉంచిన అద్భుత వస్తువులను కనుగొనడం అంత సులభం కాదని నేను గుర్తు చేసుకున్నాను.
ముగంబ, బెనోత్‌మన్ మాకు రక్షణ కేంద్రానికి చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కి పరిచయం చేశారు, తొంభై ఏళ్ల వయస్సులో ఉన్న పొడవైన వ్యక్తి అతను. వేలాడుతున్న తెల్లటి గడ్డంతో ఆలీవ్ ఆకుపచ్చ సైనిక దుస్తులతో ఉన్నాడతను.
“నా పేరు డేవిడ్, మిలిటరీ జనరల్‌ని, మీలానే ఓ మాంత్రికుడిని. సమూరాకి వందనం! మనమంతా ఇప్పుడు సమూరా సేవలో ఉన్నాము. రండి! నేను మీ గదులను చూపిస్తాను!” అన్నాడు.
ఈ విధంగా సైనికులు చూపించిన సౌకర్యవంతమైన గదులలో ట్రైటాన్‌పై మా తాత్కాలిక నివాసము ప్రారంభమైంది.
“మీకు కావల్సినంత సమయం తీసుకోండి హనీ! మీ భార్య దాన్ని గుర్తించవచ్చు లేదా డిమిట్రీ కనుగొనవచ్చు, కానీ మీరు దానిని గుర్తించాలి” అన్నారు మా రక్షకులు మగుంబ, బెనోత్‌మన్. “మేము వేచి ఉంటాము, కాని సుదీర్ఘకాలం మాత్రం కాదు. మేము కూడా మా స్వంత వ్యవస్థకు వెళ్ళవలసి వుంటుంది!”
మా గదుల్లోకి వెళ్ళగానే మేం చేసిన మొదటిపని వెచ్చని నీటితో హాయిగా స్నానం చేయడం! నిలవ చేసిన సౌర శక్తి ఈ కేంద్రానికి విద్యుచ్ఛక్తిని, కాంతిని అందజేయడానికి ఉపయోగించబడుతుంది. బ్రౌన్ బ్రెడ్, మాంసం, ఘనీభవించిన పండ్లు మరియు రసాల వంటి భూమికి చెందని, కొన్ని మంచి ఆహార పదార్థాలని వడ్డించారు.
మేము నిద్రపోయే ముందు ప్రకృతిని హత్తుకుని, పెదవులపై ముద్దాడాను.
“ఇది చాలా సుదీర్ఘమైన, బాధాకరమైన ప్రయాణం. ఎన్నో బాధలు పడాల్సి వచ్చింది ప్రకృతి! నన్ను క్షమించు. నా కంటూ నా సొంతవాళ్ళెవరూ లేరు కాని నీకు మీ నాన్న ఉన్నారు, మీ గ్రామం ఉంది” అన్నాను.
“నువ్వు శాన్‌ని కోల్పోయావు! ఇంకా నీ విద్యార్థులను పోగొట్టుకున్నావు. వారు ఏమైపోయారో దేవుడికే తెలుసు. వారు మాంత్రిక ఆచార్యుల దగ్గర విద్యార్థులై, వస్తువులను సృష్టించడం, విశ్వశక్తిని నేర్చుకుంటున్నారేమో! ఇది చాలా చెడ్డది!” అంది.
“ఓ గొప్ప ప్రారంభానికి నిరుత్సాహవంతమైన ముగింపు!” అన్నాను. “నేను శాంతియుత జీవితం కోరుకున్నాను. బోధనని కోరుకున్నాను. కలలు నన్ను వెంటాడాయి. ఘటనల ద్వారా నన్ను లోబర్చుకున్నారు. ఇప్పుడు చూడు, మనం సౌర వ్యవస్థ యొక్క అంచు వద్ద ఉన్నాం!” అన్నాను.
“అయినా ఇప్పటికీ బ్లాక్‍మెయిల్ చేయబడుతున్నాం! ఇలా ఇంకెంత కాలం?” అంది ప్రకృతి.
ఆమె శరీరపు వెచ్చదనం, ఆమె కేశాల పరిమళాన్ని ఆస్వాదిస్తున్న నేను జవాబిచ్చే స్థితిలో లేను.
దాంపత్య సుఖంలో మమ్మల్ని మేం మరచిపోగా, కాలం కరిగిపోయింది.
రెస్ట్ రూమ్‌వైపు వెళుతూ, “వాళ్ళేమైనా కెమెరాలు పెట్టారేమో చూడు!” అని అంది ప్రకృతి నవ్వుతూ.
మా గదిలో ఒక టీవీ ఉంది. ఆన్ చేశాను. రికార్డు చేసిన వార్తలను చూపిస్తోంది.
భూమి యొక్క న్యూ హోప్ సిటీనీ, కుజుడిపై ఉన్న అరుణ భూములను, చంద్రుడిపై ఉన్న అమృతా కాలనీలను మాంత్రిక రాజులు పాలిస్తున్నారు. భూమిలోని దక్షిణ ప్రాంతం నా దేశం ఇప్పుడు అత్యంత పురాతనమైన క్రూరమైన అఘోరాల పాలనలో ఉంది. వారి నాయకుడు జడలుకట్టిన జుట్టుతో, ఒంటినిండా పవిత్ర బూడిదతో వికారంగా ఉన్న ఓ స్వామీజీ. అతను పౌరులనుద్దేశించి ప్రసంగాలు చేశాడు. భూమిని పునర్నిర్మించడం అనే మిషతో వాళ్ళని కొల్లగొట్టుతున్నాడు.
అప్పుడు నేను నిద్రపోయాను. ఇది కలలు లేని ఒక దీర్ఘ నిద్ర.
(సశేషం)