భూమి నుంచి ప్లూటో దాకా… -17

0
2

[box type=’note’ fontsize=’16’] విలువలున్న మానవజాతికీ, క్షుద్రశక్తులున్న మాంత్రికులకీ…. అంటే మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటాన్ని ఒక స్పేస్ ఒపెరా ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ నవలగా అందిస్తున్నారు డా. చిత్తర్వు మధు. తెలుగు సేత: కొల్లూరి సోమ శంకర్. [/box]

అధ్యాయం 45: త్రికాల గ్రంథం

[dropcap]ఇ[/dropcap]క్కడ రాత్రిపగళ్ళు లేవు. కానీ భూమి యొక్క 24 గంటల కాలమానం ప్రకారం మా శారీరక జీవ గడియాల అనుభూతిని లెక్కిస్తే, చాలా రోజులు గడిచిపోయాయి.

క్యూపర్ బెల్ట్‌లో నెప్ట్యూన్ యొక్క శీతల ఉపగ్రహం ట్రైటాన్‌లో పగలు లేదా రాత్రి లేదు.

ఇది ఎల్లప్పుడూ ఉదాసీనంగా, నిర్మానుష్యంగా ఉంటుంది. మేము ఆహారం తీసుకొన్నాం,  రక్షణ సంస్థ అంతా కలయతిరిగాం. టీవీలో వార్తల సారాంశాలను చూశాము, సిబ్బందితో మాట్లాడి మళ్ళీ మా గదులకు తిరిగి వచ్చి పడుకున్నాము.

మూడవ రోజు నుంచి మేం రక్షణ శాఖ వారి క్వార్టర్స్ బయట తిరిగేందుకు అనుమతి లభించింది  – మాకు థర్మల్ స్యూట్లు, ఆక్సిజన్, నావిగేషనల్ కంపాస్, కెమెరాలు అందజేశారు.

నక్షత్రాలతో నిండిన నిశీధిలో వివర్ణమైన ఆకాశం అది. పశ్చిమాన చాలా దూరంలో పేలవంగా సూర్యుడు కనబడుతున్నాడు.  అదే పశ్చిమంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం వలె గోచరిస్తోంది నెప్ట్యూన్. ట్రైటాన్ దానికి వ్యతిరేక దిశలో కదులుతుంది. నెప్ట్యూన్ ప్రసరించే కాంతిలో ఇక్కడి మంచుతో నిండిన శిలలు, కొండలు నీలిరంగుతో మెరుస్తున్నాయి.

పొడవైన ఓ ప్లాటినం వాకింగ్ స్టిక్ సహాయంతో నేనూ రోజూ కొన్ని కిలోమీటర్ల దూరం నడిచేవాణ్ణి. డిజిటల్ కంపాస్ దిశ, స్థానం చూపించేది.

అయితే అండర్‌గ్రౌండ్ బేస్ నుంచి మమ్మని నిరంతరం గమనిస్తూనే ఉండేవారు.

యురేకస్ ఎల్లప్పుడూ నాతోనే ఉంటోంది. దానిలో ఉన్న రహస్య ఫ్రీక్వెన్సీలతో గ్రహాల నుండి సమాచారాన్ని సేకరించగలదు.

“మాస్టర్! మాస్టర్! సమూరాకు అజ్ఞాత ప్రతిఘటనలు ఎదురవుతున్నట్లు ప్రాథమిక నివేదికలు వస్తున్నాయి. నేను ఎర్త్ కౌన్సిల్ నుండి నిగూఢ సందేశాలను పొందాను. వారంతా ఎక్కడో శివారు ప్రాంతాల్లో రహస్యంగా దాక్కున్నారు. వివిధ ప్రదేశాలలో… సహారా ఎడారి, దక్షిణ అమెరికా అరణ్యాల్లో కొందరు, హిమాలయాలలో కొందరు… వీళ్ళంతా ఒకరినొకరు సంప్రదించుకుంటున్నారు, ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ‘రేడియో ఫ్రీడం’ అనే ఒక కోడ్ పదాన్ని వారు నాకు ఇచ్చారు. ఇది వింతగా ఉంది. సమూరా కుజుడిపై అధికారంలోకి వచ్చిన తరువాత, భూమి మరియు చంద్రుడి పతనం సంభవించి 10 సంవత్సరాలు గడిచాయి.”

“అంత సాంకేతికత, అణ్వాయుధాలు ఉన్న భూమిని ఎలా జయించాలో తెలుసుకో!”

 యురేకస్ యుద్ధం వివరాలను నాకు క్లుప్తంగా వివరించింది. ముగింపు ఎల్లప్పుడూ ఒకేలా ఉంది: అత్యున్నత రాజకీయ ప్రదేశాలలో  దేశద్రోహం.

సైన్యంలో నమ్మకద్రోహం – భూమిపై ఉన్న పిసియుఎఫ్‌లకు లేదా తాంత్రికులకు విధేయులుగా ఉన్న సైనికాధికారులు అణు దహనకాండ జరిపి భూమి పర్యావరణానికి ముప్పు కలిగిస్తామని ప్రభుత్వాలను బెదిరించడం – భూమి ఓటమికి ప్రధాన కారణం. ఎర్త్ కౌన్సిల్‌కి తాంత్రిక అనుచరులు లొంగిపొమ్మని లేదా అణ్వాయుధాలను ఎదుర్కోమని ఒక ఆఖరి హెచ్చరిక చేశారు. క్లోన్డ్ సైనికులు కవాతు చేశారు, ఆమ్ల వర్షం కురిపించారు, ఇంకా న్యూ హోప్ సిటీ శివార్లలోని అణ్వాయుధ భాండాగారంపై క్షిపణి దాడి జరిపారు – అత్యంత నిర్దుష్టతతో సుమారు 10 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో నష్టం కలిగించారు.

చెన్ లితో పాటు స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం కలిగిన ఎర్త్ కౌన్సిల్‍లోని ఇతర సభ్యులు – గుర్తు తెలియని స్థలాలకు పారిపోయారు. అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు, ప్రభుత్వాలు లొంగిపోయాయి. భూమితో పోలిస్తే చిన్నగా ఉన్న చంద్రుడి అమృతా కాలనీ చాలా సులువుగా ఓడిపోయింది. వారు కేవలం తమ ప్రభుత్వాన్ని మార్చుకున్నారు మరియు తద్వారా వారికి సలహా ఇచ్చే తాంత్రికుల మండలితో సమారాకు విశ్వసనీయతను ప్రకటించారు. ఇది రక్తరహిత తిరుగుబాటు!

“కుజుడి వివరాలు లేవు!” చెప్పింది యురేకస్. “నేను ఐజి నెట్ కమ్యూనికేషన్స్ నుండి క్రాస్‌టాక్ ద్వారా కొంత సమాచారం పొందాను కాని అవి రెండు సంవత్సరాలు  ఆలస్యంగా ఇక్కడకి వస్తాయి.

 వార్తలు చాలా పాతవి. అయితే సౌరవ్యవస్థలో చాలా భాగాన్ని చేజిక్కించుకున్నది విశ్వశక్తిలో ప్రవీణులైన తాంత్రికులే. ఇప్పుడు దౌత్యంలోనూ రాణిస్తున్నారు. చాలావరకు ఇది రక్తపాతం లేకుండా ప్రభుత్వాల మార్పు, స్వచ్ఛందమైనదిగా అనిపిస్తుంది. రిమోట్ గెలాక్టిక్ కౌన్సిల్ జోక్యాన్ని తిరస్కరించిందని తెలుస్తోంది. సమూరా పర్యాటకుల గ్రహాంతర పర్యటనల కోసం, గెలాక్టిక్ ట్రావెల్ కోసం స్పేస్ ప్లాట్‌ఫ్లామ్‌లను మాత్రం  ఆక్రమించకుండా విడిచిపెట్టాడు. వాటిని గెలాక్టిక్ కౌన్సిల్ నియంత్రణలో ఉంచేందుకు బహుశా అతనికేదో పన్నాగాలు ఉండే ఉంటాయి, అందుకే అది నిశ్శబ్దంగా ఉండిపోయింది. అతను ఒక తెలివైన వ్యక్తి.”

“యురేకస్! నోరుమూసుకో! నువ్వు నా శత్రువుని పొడుగుతున్నావు. అతను దుష్టుడు. అతను విజయం సాధించ కూడడు!” అన్నాను.

 నా స్నేహితుడు, కుజుడి లోని మాంత్రిక కాలనీ‌లో నేను అధికారంలోకి తెచ్చిన వృద్ధ మాంత్రిక పాలకుడైన మీరోస్‌ గురించి, మాంత్రికులను ద్వేషించే మానవ జనరల్ గ్యానీ అంగారక్ గురించి ఆలోచించాను.

కుజుడిపై ఆధిపత్యం ఎలా సాధించగలిగారు? రోబోతో ఇలాంటి చర్చలు అనేక రోజులపాటు జరిపిన తరువాత నేను ఆలోచిస్తూ అలసిపోయాను. ప్రకృతి, డిమిట్రీ వ్యతిరేక దిశలో వెళ్లారు. నీలిరంగు ప్రకాశంతో ఉన్న మంచు తప్ప ఏదీ కనుగొనలేకపోయారు. ఎటు చూసినా హిమమే!

నేను మళ్ళీ కలలు కనడం మొదలుపెట్టాను.

ప్రతి ఉదయం మేము అల్పాహారం కోసం వెళ్ళినప్పుడు ఒక్కోసారి ముగంబ, బెనోత్‌మన్ కలిసేవారు. నాకేసి తీవ్రంగా చూసేవారు, కాని సాధారణంగా నిశ్శబ్దంగా ఉండేవారు.

బహుశా వారు విసుగు చెంది ఉంటారు.

నేను మిలియన్ల మైళ్ళ దూరంలో ఉన్న భూమిని స్వప్నించాను, వెచ్చని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, తోటలో గులాబీలు, నీలి సముద్రం, మధ్యధరా సముద్ర తీరంలోని తరంగాలపై తెల్లటి నురగలు… ఇంకా పారానార్మల్ ఫోర్స్ గురించి నా ఉపన్యాసాలు విన్నప్పుడు ఉత్సాహంగా ముఖాలు పెట్టే నా విద్యార్థులు… కనబడేవారు. కానీ నిర్జనమైన మంచులో క్రూరమైన చలిలో అమానుషమైన ట్రైటాన్ భూభాగంపై రోజూ నడవడం నాకో దినచర్య అయిపోయింది. ఇక్కడ ఏదైనా దొరుకుతుందన్న ఆశ మిగలడం లేదు.

అప్పుడు అది జరిగింది. చివరి అద్భుత వస్తువు ఇక్కడ దాగి ఉందని చాలా ఖచ్చితంగా తెలియకపోతే సీనియర్ మాంత్రికులు నన్ను ట్రైటాన్‌కు పంపించరు.

నేను ఆ రాత్రి నిరుత్సాహపడ్డాను, అందరూ నిద్రించాకా, నేను ఒక్కడినే రాత్రిపూట బయటకు వెళ్ళేందుకు ఆలోచించాను. యురేకస్‌ని కూడా పిలవలేదు. నేను ఒంటరిగా బయల్దేరుతూ, ముగంబకి ఒక సందేశాన్ని పంపాను.

“ఎందుకు?” అడిగాడు. అతని స్వరం నిద్రలో గొణిగినట్టుగా ఉంది. అతను అభ్యంతరం చెప్పలేదు.

“వెళ్ళాలనిపిస్తే, వెళ్ళు. నీ పొజిషనింగ్ సెన్సార్ నాదగ్గరే ఉంది! నీ భ్రమని అనుసరించు! కానీ నాకు భయంకరమైన నిద్ర వస్తోంది…” అన్నాడు

ఈ ఆల్ఫా సెంటారీ జీవులకి రెడ్ వైన్ బాగా నచ్చుతుంది, ఇక్కడది సమృధ్ధిగా నిల్వ ఉంది. ఘనీభవింపజేసిన ఉప్పు చేపలంటే మరింత ఇష్టం! ఈ రోజు వైన్ బాగా ఎక్కువ తాగి ఉంటాడతను.

నేను నక్షత్రాలతో కూడిన చల్లని రాత్రిలోకి వెళ్ళిపోయాను, నేను ఈశాన్య దిశ వైపు వెళ్ళాను.  ఉపచేతన మనస్సుచే మార్గనిర్దేశం చేయబడే నిద్రలో నడిచేవాళ్ళలా అనుభూతి కలిగింది.

నేను అలా నడుస్తూనే ఉన్నాను, కలలు కనే నిద్రాస్థితిలో వెళ్తూనే ఉన్నాను. స్వప్నస్థితిలో కొందరు మానవులు నొప్పితో రోదిస్తున్నట్టుగా ధ్వనించే శబ్దాలు వింటున్నాను. అప్పుడు నేను బూడిదరంగు రంగు గడ్డాలున్న వృద్ధ మానవులను, తలమీద యాంటెనాలు ఉన్న హ్యుమనాయిడ్లని చూశాను. వారు పొడవాటి తెల్లని దుస్తులు ధరించారు, చీకట్లో తెల్లని నీడల వలె కనిపించారు.

నెప్ట్యూన్ ప్రసరించే కాంతి చాలా తక్కువగా ఉంది. భూమి మీద పౌర్ణమి తరువాతి సప్తమి నాటి చంద్రుడి కాంతిలా వుంది.

వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నాకు పలువురి స్వరాలు వినబడుతున్నాయి.

నాకు యుద్ధం యొక్క దృశ్యాలు కనబడుతున్నాయి, గిట్టల చప్పుడు చేస్తున్న గుర్రాలపై సైనికులు వృద్ధులైన గడ్డం గల పురుషులను, స్త్రీలను వెంటాడుతున్నారు, కొన్ని తలలు తెగి నేల మీద పడ్డాయి. మసక కాంతిలో ఎర్రటి రక్తం చీకటి వెలుగులోకి మార్చాయి.

గుర్రాలపై ఉన్న పురుషులు నవ్వుతున్నారు. చంపుతూ నవ్వుతున్నారు, కానీ కాసేపటికే వారు – కుంటుతూ, నొప్పితో బాధపడుతున్న వృద్ధులను వదిలేసి అదృశ్యమయ్యారు.

అప్పుడు మరొక దృశ్యం కనబడింది. మంచుతో నిండిన కొండ వైపు దారితీసే ఇరుకైన మార్గంలో నడిచాను: నాకు ఇరువైపులా మట్టిలో పాతేసిన లేత బూడిద రంగు తలల ఛాయలు కనబడ్డాయి. వారిలో ఏదో అద్భుతమైన, మార్మికమైన కాంతివలయం ఉంది.

విస్మృతిలోనూ నేను భయపడ్డాను. దెయ్యాలా? లేక అభౌతిక రూపాలా? శతాబ్దాల పూర్వం ఖననం చేసిన తాంత్రికులా?

భారీగా ముడతలు పడిన ముఖంతో, పొడవాటి తెల్లని జుట్టుతో, మెరిసే ఎర్రని కళ్ళతో ఓ వృద్ధ మహిళ భారీ ఆకారం నా ముందు ప్రత్యక్షమైంది.

నా మార్గంలో నేను ఆగిపోయాను.

ఆమె గొంతు కీచుగా ఉంది, మాట బలహీనమైన వినబడింది. అయితే వినడానికి తగినంత బిగ్గరగా ఉంది. అది సార్వత్రిక డిజిటల్ భాషలో ఉంది.

“పుత్రా! భూమికి చెందినా నా కుమారా! దక్షిణాసియాకు చెందిన నా బిడ్డా! కుమారా, నువ్వు ఎంపికైన వ్యక్తివి! బిడ్డా… 50 క్రోమోజోమ్‌లతో ఉత్పరివర్తనం చెందినవాడా! నా ఈ పుత్రుడు ఇతరులకు చెడు చేయని గొప్ప తల్లిదండ్రులకు జన్మించాడు!” అందామె.

ఆమె నాతోనో, నా గురించే మాట్లాడుతోందని నాకు తెలుస్తోంది.

“పుత్రా, నీ పేరు నాకు తెలియదు. కానీ రక్తమాంసాలతో ఉన్న నువ్వు క్యూపర్ బెల్ట్‌లోని నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం ట్రైటాన్‌కి వచ్చావు. ఇక్కడి వరకూ రాగలిగి, నన్ను చూడగలిగితే నువ్వు… ఎంపికైన వాడివే! నువ్వు రక్షకుడివి!”

కర్పూరదీపం ఆరిన తర్వాత వెలువడే గుండ్రటి పొగలా ఆమె అదృశ్యమైపోయింది.

పొగ, తెల్లదనం, ఇంకా పరిమళం.

నేను ముందుకు సాగాను. అప్పుడు మరో ఆత్మ అభౌతిక దృశ్యంలా కనిపించింది, ఈసారి ఒక మనిషి ఆకారంలో నా ముందు ప్రత్యక్షమైంది.

“ఓ మానవా! నేరుగా వెళ్ళు. “గెలిలియో” పర్వతాన్ని తవ్వు. భూత భవిష్యత్ వర్తమానాలను తెలిపే త్రికాల గ్రంథం కనుగొంటావు.  నాలుగవ మిలీనియం ముగింపు వరకు భవిష్యత్ జోస్యం రూపంలో చెప్పబడింది. దాన్ని చదువు లేదా నమోదు చెయ్యి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.”

నేను మత్తులో ఉన్నట్టు నడుస్తున్నాను, ఆ ఆత్మ కనిపించకుండా పోయింది.

నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది, అలసటగా ఉంది. ఉన్నట్టుంది నా ముందు గడ్డంతో ఉన్న బలిష్టమైన కండలు తిరిగిన యువకుడి ఆత్మ మంచు సమాధి నుండి పైకి లేచింది. అది భయంతో వణుకుతోంది.

“వారు మమ్మల్నందరినీ చంపారు! కుజగ్రహానికి చెందిన దుష్ట ‘సమూరా’ ఆల్ఫా సెంటారీ స్టార్ యొక్క దిగ్గజ తాంత్రికులతో మమ్మల్ని చంపించాడు. వారు పురుషులనీ, స్త్రీలని, వృద్ధులని, పిల్లలని చంపారు. మమ్మల్ని ఇక్కడే ఖననం చేశారు!

ఓ మానవా! నువ్వు నన్ను చూడగలుగుతుంటే, వెళ్ళి పగ తీర్చుకో! చెడు గెలవకూడదు. దుష్టులు నాశనమైనప్పుడు మాత్రమే మేము ప్రశాంతంగా నిద్రపోతాము!”

ఆ తర్వాత నేను ముందుకుసాగాను. కొండకు చేరేలోపు మరికొన్ని ఆత్మలు లేస్తూ పడుతూనే ఉన్నాయి, ఆ త్రికాల గ్రంథాన్ని సాధించమని నన్ను ప్రార్థించాయి.

చివరికి నేను కొండ వైపు మార్గం ముగింపులో ఉన్న పొడవాటి మంచుతో నిండిన శిఖరానికి గుర్తించాను.

నేను పరిగెడుతూనే ఉన్నాను. మంచును తవ్వడానికి గ్లవుజులు ధరించిన చేతులు తప్ప నా వద్ద ఏమీ లేవు. నా కళ్ళ నుంచి వచ్చే లేజర్ కిరణాలతో మంచుని మండించడానికి ప్రయత్నించాను.

ఓ వింత ప్రాంతంలో ఆ చీకటి రాత్రిలో నేనో పిచ్చివాడిలా మంచుని తవ్వడం, మండించడం చేయసాగాను.

గంటల పాటు నన్ను గమనిస్తున్నారని నాకు తెలుసు, పైగా నేను చాలా విద్యుదయస్కాంత శక్తిని వెలువరించాను. నన్ను గమనిస్తున్న ఆ దుష్ట శక్తులు కూడా నేనక్కడ తవ్వి ఆ వస్తువుని బయటకు తీయాలనే కోరుకుంటున్నాయని నాకు తెలుసు.

మంచు పెళ్ళలు, రాళ్ళ కుప్పలను ఎత్తి పైకి పోస్తున్నాను, చివరిగా గట్టిగా తవ్వినప్పుడు లోహపు ధ్వనిని విన్నాను.

ప్లాటినం లాంటి విలక్షణమైన లోహంతో పొడవుగా, 10 అడుగుల వెడల్పుతో ఒక చతురస్రం ఆకారంలో తయారు చేసిన పెట్టె కనబడింది.

పైగా దాని చుట్టూ నీలి రంగు ప్రకాశం ఉంది.

వెంటనే తెలిసిపోయింది, ఇదే అదని. వృద్ధ మాంత్రికుల సంఘం సుదీర్ఘ కాలం క్రితం దాచిన ఆఖరి అద్భుత వస్తువు ఇదే. గ్రహాల మీద నియంత్రణ కోసం అనంతమైన యుద్ధ కాలంలో మంచి చెడుల మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయో నాకు తెలియదు, నెప్ట్యూన్ యొక్క ఉపగ్రహం ట్రైటాన్‌పై ఈ అద్భుతం ఎలా జరిగిందో నాకు తెలియదు. వారి ఆత్మలు ఎలా క్షీణించాయో నాకు తెలియదు. వారు నన్ను ఇక్కడ కలిసే వరకు ఎన్ని శతాబ్దాల పాటు  కృశించిపోయిన్నారో నాకు తెలియదు.

లేదా నేను ఈ పెట్టెని సాధించే మార్గంలో వారు నాకు తటస్థపడ్డారా?

అలసటగా ఉన్నప్పటికీ దాన్ని చూస్తూ ఉండిపోయాను. అరగంట సేపు కూర్చుని ఉపశమనం పొందాను. తర్వాత పెట్టె మూత తెరిచాను. అది తెరుచుకుంది, అక్కడ తెల్లటి తెరపై నేను ఎరుపు, నీలం రంగులలో ప్రకాశవంతమైన అక్షరాలను గుర్తించాను, ఆ తెర నిస్సందేహంగా నాలుగు కొలమానాలు – లోతు, వెడల్పు, పొడవు మరియు ఎత్తు కలిగి ఉంది. ఎడమ చేతి మూలలో ఎరుపు రంగులో మెరుస్తున్న ఒక మీట ఉంది. దాని మీద నాలుగు పదాలున్నాయి: కాలం. గతం, వర్తమానం, మరియు భవిష్యత్తు.

ఆ తెర మధ్యలో గడ్డం, మీసాలతో, కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్న ఓ వృద్ధ పవిత్రమూర్తి తల ఉంది. అక్షరాలు అక్కడ మెరిసిపోతున్నాయి.

“కాలజ్ఞానాన్ని తెలిపే త్రికాల గ్రంథానికి స్వాగతం” అని చిన్న అక్షరాలలో రాసి ఉంది.

‘క్రీ.శ.2465లో వృద్ధ మాంత్రిక సంఘంచే రూపొందించబడినది. 3999 సంవత్సరం చివరి వరకు… అంతే నాల్గవ సహస్రాబ్ది ముగింపు వరకు – జోస్యాలు, పరిష్కారాలు.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here